"ఈ మధ్యే బావవచ్చాడు ఆఫీసుకి! మీకూ తెలుసుగా! అతనూ, అక్కా విడాకులు తీసుకున్నారంట! అందుకని నేను తనని వివాహం చేసుకోవాలిట! నేను నిరాకరించాను. గాయపడ్డమనసుతో వెళ్ళిపోయాడతను! ఇదీ జరిగింది! ఇప్పుడు మీరే చెప్పండి! ఇంకే ముఖంపెట్టుకుని మిమ్మల్ని వివాహం చేసుకోమంటారు? మనిద్దరం ఆనందంగా ఎలా జీవితం గడపగలుగుతాము? దయచేసి ఏ కళంకమూలేని మరో అమ్మాయిని చేసుకోండి!
చంద్రం నిశ్చేష్టుడయి ఆమెమాటలు వింటూండిపోయాడు. అతని మనసంతా మొద్దుబారిపోయినట్లుంది. తను ఎన్నో ఆశలుపెట్టుకున్నాడు నాగమణిమీద. ఆమె తనను వివాహంచేసుకోడానికి తప్పకవప్పుకుంటుందనీ, ఇద్దరూ కలిసి తమకుటుంబాన్ని ఆదుకోవచ్చనీ ఎన్నో అనుకున్నాడు. అవన్నీ క్షణంలో ఇలాతల్లక్రిందులయిపోతాయనుకోలేదు.
"ఇంకవెళదామా చంద్రంగారూ?" టైమ్ చూసుకుంటూ అడిగిందామె.
"పదండి!" లేచి నిలబడుతూ అన్నాడతను. ఇద్దరూ బస్ లో ఆమె ఇంటికి చేరుకున్నారు.
"గుడ్ నైట్ నాగమణిగారూ!" బయటనుంచే అని తన ఇంటివేపు వెళ్ళిపోయాడతను. నాగమణిమనసులో ప్రశాంతత చోటుచేసుకుంది. ఇంక చంద్రం తన జోలికి రాడు. అసలు తనకెవరూ అక్కర్లేదు. ఒంటరిగా జీవితం గడిపేయడం అసాధ్యమేమీకాదు. చంద్రం ఆ రాత్రంతా నిద్రలేకుండానే గడిపాడు. ఆలోచిస్తున్న కొద్దీ హృదయం బరువెక్కిపోతోంది.
తననునాగమణి ప్రేమించలేదు. అయితే ఆమె సాన్నిధ్యాన్ని కోరుకుంటున్నాడు. ఆమెతో వివాహం కాకపోతే తనను చుట్టుకున్నదరిద్రంనుంచి జీవితాంతం కోలుకోనేలేడు. తనను వివాహం చేసుకోవడానికి అంతటి సంస్కారం సహకారం ఉన్న యువతి దొరకడం అసంభవం! తనలాంటి గర్భదరిద్రుడిని, కుచేల కుటుంబంగలవాడినీ చేసుకుని తమకున్న సుఖాలన్నీ వదులుకోడానికి ఏ ఉద్యోగస్తురాలు వప్పుకుంటుంది? కానీ శీలం పోగొట్టుకున్న నాగమణి తనెలాచేసుకుంటాడు? అందుకు తన మనసెలా అంగీకరిస్తుంది?
ఏం? ఎందుకు చేసుకోకూడదు? ఒకవేళ నాగమణి తన శీలం పోగొట్టుకున్న విషయం తన దగ్గర దాచి ఉంటే తనామె వివాహం చేసుకునేవాడు కాదూ? ఎలాంటి అరమరికలూ లేకుండా సంసారం చేసుకునే వాళ్ళుకాదూ? అయినా నాగమణి చేసిన పనికి పశ్చాత్తాపపడుతోంది గదా! మరోసారి ఆమె బావ మొఖం చూడకూడదని కోరుకుంటోందికదా! అంతగా అతనంటే అయిష్టత చూపుత్న్ది కదా! మరి అలాంటి అమాయకురాలిని తనెందుకు వివాహం చేసుకోకూడదు? వివాహానికి ముందు మరో స్త్టీతో సంపర్కం పెట్టుకున్నమగాళ్ళెంతమందిలేరు?
మరివారందరూ ఎలాంటి సమస్యలూ లేకుండా సుఖంగానే జీవితాలు గడపడం లేదూ? వారిని వారి భార్యలు క్షమించడం న్యాయమయితే తను నాగమణిని క్షమించి వివాహం చేసుకోవడం ఎందుకున్యాయం కాదు? అసలు వీటన్నిటికన్నా ముఖ్యమయినది తనకు తక్షణ ఆర్ధిక సహాయం. నాగమణిని చేసుకుంటేనేగాని తనకి ఆర్ధిక బాధలు తప్పవు. అవును! తనున్నపరిస్థితుల్లో ఎన్నో విషయాల్లో రాజీపడాల్సిందే. చూసీ చూడనట్లు ఊరుకోవాల్సిందే! తనలాంటి దురదృష్టవంతుడికి అలాంటి పట్టింపులుండకూడదు. పరిస్థితుల ప్రాబల్యంవల్ల తను ఎన్ని తప్పులు చేయడం లేదు?
ఓ కాంట్రాక్టర్ కాగితం అర్జంటుగా టైపుచేసినందుకు వందరూపాయలు తీసుకున్నాడు తను. ఆ వందరూపాయలూ ఆ సమయంలో అందకపోయినట్లయితే తన చెల్లాయిపరీక్షకు కూర్చునేందుకు వీలుండేది కాదు. తన తండ్రికి జబ్బుగా ఉన్న సమయంలో డాక్టర్ రాసిచ్చిన మందులకు డబ్బులేక మెడికల్ షాపుల్లో ఆ మందులన్నీ తీసుకుని యాభయ్ రూపాయల కాగితం ఇచ్చినట్లు అబద్దమాడాడు. దానివల్ల షాపు వాడికీ తనకూ పెద్దయుద్ధం జరిగింది. జనం పోగయ్యారు సాధారణంగా అలాంటి పరిస్థితుల్లో బీదవాడి మీదే ప్రజలకు సానుభూతి కలుగుతుందని తనకు తెలుసు. అందరూ తనమాటే నమ్మారు. తన యాభైరూపాయలు ఇచ్చే ఉంటాడనీ, షాపువాడే అబద్దమాడుతున్నాడనే నిర్ణయించుకున్నాడు. చివరకు ఆ గొడవ భరించలేక, అందరి అభిప్రాయానికీ తల ఒగ్గి షాపువాడు ఆ మందుల డబ్బుపోనూ మిగతా చిల్లర ఇచ్చేశాడు.
ఆ మందులు వాడకం వల్ల తన తండ్రి జబ్బు తాత్కాలికంగానైనా తగ్గింది. బస్ లలో అనేకసార్లు టిక్కెట్టు తీసుకున్నట్లు బుకాయించాడు తీసుకోకపోయినా ఆపావలా మిగుల్చుకుంటేనే మర్నాడు ఆఫీస్ లో లంచ్ టైమ్ లో 'టీ; తాగేందుకు వీలుంటుంది. ఇలా అనుక్షణం ఎన్ని విషయాల్లో నీతీ నియమాలువదులుకోవడంలేదు తను?అవి ఎంతగా అలవాటయిపోయాయంటే ఇప్పుడవి నీతి లేనిపనులు అనిపించడంలేదు. అవన్నీ చాలా సహజమైనపనులుగా నీతి వంతమైన చర్యలుగా కనబడుతున్నాయ్.
అలాగే ఇప్పుడు నాగమణితో వివాహం కూడా! కొద్దిరోజులు ఆమెతో జీవితంగడిపాక ఆమెకున్న ఆ ఒక్కలోటుకూడా కనిపించదు. ముసుగుపడిపోతుంది దానికి. చాలా సేపటికి చంద్రం ఆలోచనలు ఓ కొలిక్కివచ్చాయ్. తను నాగమణిని వివాహం చేసుకుంటాడు. అంతే! అందులో తప్పేమీ కనిపించడంలేదు తనకి. అతను కళ్ళు మూయకుండానే పూర్తిగా తెల్లారిపోయింది. లేచి త్వరగా తయారయిహడావుడిగా నాగమణి ఇంటివేపు నడిచాడతను. ఆమె అప్పుడే మొఖం కడుక్కుని టవల్ తో మొఖం తుడుచుకుంటూంది. అతన్ని చూసి చకితురాలయింది.
"ఏమిటి యింత ప్రొద్దున్నే ఈ దండయాత్ర?" అడిగింది నవ్వుతూ.
"రాత్రంతా మీరు చెప్పిన విషయంగురించి ఆలోచించాను నాగమణిగారూ! మనం వివాహం చేసుకోవడంలో అనౌచిత్యమేమీ నాకు కనిపించడంలేదు. మీ బావ బలవంతంవల్ల మీరు తప్పుచేశానన్నారు. దానికి పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం ఏముంటుందీ? ఇక నా విషయమంటారా? నేను ఇరుక్కున్న బాధలనుంచి నాకు విముక్తి కావాలంటే మన వివాహం జరగాలి. అంటే నాకోసం మిమ్మల్ని వివాహం చేసుకుంటున్నాను. మీకోసం త్యాగం చేయడంలేదు. మిమ్మల్ని ఉద్దరించాలనీ కాదు. మరి ఇప్పుడు మీ అభిప్రాయం ఏమిటో చెప్పండి....."
నాగమణికి అతని మాటలు నమ్మబుద్దికావడం లేదు.
అతని లాంటి అమాయకురాలు, కపటం లేని మనుషులు ఎక్కడయినా ఉంటారా? అతను సహృదయంతో మనసు విప్పి తనను వివాహం చేసుకోమని అడుగుతూంటే తనెందుకు నిరాకరించాలి? తనకెందుకు నమ్మకం ఉండడతనిమీద! అతని సరసన తనకేప్రమాదమూ ఉండదు. తన జీవితం సాఫీగా, ఎలాంటి ఒడిదుడుకులూ లేకుండా గడిచిపోతుంది. అతనిక్కావలసిందల్లా తను ఆర్ధికంగా అతనికి సహాయపడటం! అందుకు తనకేమీ అభ్యంతరంకూడా లేదు. తను ఉద్యోగం చేస్తోందెవరికోసం? తన సంపాదనఎవరి కోసం! అదంతా తన వివాహం కోసమే తన తండ్రి చేసిన ఏర్పాటు! కట్నాలిచ్చే స్థోమత పోయాక ఇంతకంటే గత్యంతరం కనిపించలేదాయనకి.
"నాగమణిగారూ! ఏమిటింకా ఆలోచిస్తున్నారు!" దీన్మగా అడిగాడతను."
"ఏమీలేదు! ఎందుకో ఇదంతా నిజమన్ననమ్మకం కలగడంలేదు. మీరు నాకో విషయం చెప్పండి! మీరు బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకుంటున్నారా?"
"మిమ్మల్ని వివాహం చేసుకోవాలన్నకోరిక ఎప్పటినుంచో ఉంది నాగమణిగారూ అయితే మీరు అంగీకరిస్తారో లేదోనని ఇన్నాళ్ళు తటపటాయించాను. ఎందుకంటే ఇంతకుముందు రెండుసార్లు అలానిరాకరించబడ్డాను. అఫ్ కోర్స్ అవి పెద్దాళ్ళు ఏర్పాటు చేసిన సంబంధాలనుకోండి! అందుకే ఈసారి నేనే నా వివాహం గురించి ప్రయత్నం ప్రారంభించాను....." అప్పుడే అక్కడ కొచ్చిన భవానివారిద్దరి మాటలూ అర్ధంకాక.
"ఏమిటిదేనిగురించి మీరు మాట్లాడుతోంది?" అనడిగిందిఆశ్చర్యంగా.
"మాగురించే భవానిగారూ! నేను నాగమణి వివాహం చేసుకోబోతున్నాం".
"ఈజిట్!" మరింత ఆశ్చర్యపోతూ నాగమణి వేపు చూసిందామె.
నాగమణి సిగ్గుపడింది.
"నాదగ్గరే దాచారన్నమాట చివరకు!" నాగమణి దగ్గరకు నడిచి చిరుకోపంతో అందామె.
"ఇందులోదాచిందేమీలేదు. అసలు మేము ఈ విషయం మాట్లాడుకొన్నది నిన్న సాయంత్రమే నిన్నటివరకూ నాకసలు ఆ అభిప్రాయమే లేదు. ఇవాళ ఇప్పుడు చంద్రంగారు వచ్చేకే నిర్ణయమయింది!" భవానీకి చెప్పింది నాగమణి.
"సరే! నేనిప్పుడు మిమ్మల్నేమీ తప్పుపట్టటంలేదులే! ఎనీవే! కంగ్రాచ్యులేషన్స్ మీ ఇద్దరికీ!"
"థాంక్యూ భవానిగారూ! అయితే మీరు ఓ విషయం గుర్తుంచుకోవాలి! మేము వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నాక ఆ విషయం ప్రప్రథమంగా తెలిసింది మీకే! అంచేత నిష్టూరం వేయకండి!" అన్నాడు చంద్రం.
భవాని నవ్వేసింది. "మరి నేవెళతాను నాగమణిగారూ! ఆఫీసుకి టైమవుతోంది......" ఆనందంతో హాడావుడిగా తన ఇంటివేపు నడిచాడతను.
నాగమణి అతను వెళ్ళిపోయాక చాలాసేపు చంద్రంగురించే ఆలోచిస్తుండిపోయింది. తన విషయం ని కూడా అతనెలా అంగీకరించాడో అర్ధం కావడంలేదు. ఇంతటి విశాల హృదయంగలవారు ఉంటారని పుస్తకాల్లో చదవడమేగాని నిజంగా కనబడితే నమ్మబుద్దికావడంలేదు. అతను చెప్పినట్లు తనను వివాహం చేసుకోడానికి అంగీకరించడంలో అతని స్వార్ధం ఎక్కువ వుంటే వుండవచ్చు. అయినా ఇదీ ఒక విధంగా త్యాగంలాంటిదే. తననుచేసుకోవడం ఏమాత్రం బాధాకరంగా లేదు. కానీ తనకుమాత్రం గిల్టీగా ఉంది. చంద్రంలాంటిమనిషి తననుతను పవిత్రంగా అర్పణచేసుకొనే అదృష్టం తనకి లేదు. దీనికంతటికీ కారణం శ్రీనివాసరావ్! అతనిపేరే ఏవగింపు కలిగించిందామెకి.
* * * * * *
ఆలోచిస్తున్న కొద్దీ చంద్రకాంత్ మనసు హేమవేపు మరింతగా మొగ్గసాగింది. తన మనసులో ఏనాడో ఆమె మీద ఏర్పడ్డ ప్రేమయే మాత్రం తగ్గలేదు. ఆమెకు వివాహం అయాక ఆమె తనదయితే బావుండునన్న ఆలోచనను దూరం చేసుకున్నాడు గానీ ఇప్పుడు మళ్ళీ ఆమెమీద అనురాగం పొంగి పొరలసాగింది. ఆమెను ఇప్పుడు వివాహంచేసుకోడానికి తనకేం అడ్డుందీ? ఇప్పుడు తననికాదనేవారెవ్వరు? కాదన్న తను లక్ష్యపెట్టాల్సిణ అవసరమేముందీ? ఆమె అంగీకరించాలేగాని తన జీవితం ధన్యమయిపోదూ? తమ సంసారం స్వర్గతుల్యంగా ఉండదూ?
కానీ తన కోర్కెను హేమ అంగీకరిస్తూందా? వైవాహికవ్యవస్థ మీదే ఏవగింపు కలిగిన ఆమె మళ్ళీ తనతో ఆ జీవితం ప్రారంభించడానికి వప్పుకుంటుందా? ఏమో! అవకాశం లభించినప్పుడు హేమతో అన్నీ నింపాదిగా మాట్లాడాలి. తరచుగా ఏదొక వంకమీద ఆ ఊరు రావడం ఒకటి రెండురోజులపాటు వాళ్ళింట్లోనే ఉండటం మామూలయిపోయిందతనికి. అతనిసహచర్యం ఆమెకుకూడా ఆనందంగానే ఉంది. మగాడి లోపాలనుమనస్ఫూర్తిగా అంగీకరించగలవ్యక్తి అతనొక్కడేకనిపించాడామెకి అందువల్ల అతనిమీద ప్రత్యేక అభిమానం ఏర్పడింది.