Previous Page Next Page 
అగ్ని పరీక్ష పేజి 40

   
                                             8
    
    పూజలో మానసిక సంఘర్షణ ఏమిటో అర్చనకి, రాజేష్ కి తెలియదు. ఆ మనసులో జరుగుతున్న అలజడి వారెరుగరు - ఆమె మనసులో యిలాంటి ఆలోచనలు చోటు చేసుకుంటాయని గాని, రూపు దిద్దుకుంటాయని గాని వారు కలలో కూడా ఊహించకపోవటంతో.....యింట్లో ఏడేళ్ళ పిల్లని ఏ తల్లితండ్రి ఎలా చిన్నపిల్లలా తీసుకుని ఆ పిల్లకేదో తెలుస్తుందని ఎలా అనుకోరో రాజేష్ అర్చన కూడా అలాగే అనుకున్నారు.
    పూజ రోజు రోజుకీ ఎలా మూడీగా తయారవుతుందన్నదీ అర్చన గుర్తించడానికి నెల రోజులు పైనే పట్టింది. మొదట్లో కొత్త, అలవాటు పడ్తుంది అనుకుంది. యిక్కడ అలవాటు లేక అలా వుంది అని కొన్నాళ్ళు సరిపుచ్చుకుంది. రాజేష్ దగ్గిర కొత్త చేస్తుంది నాల్గు రోజులు పోతే సర్దుకుపోతుంది అని నమ్మింది. అర్చన కంటే కూడా రాజేష్ పూజ ముభావన, మూడీనెస్ గుర్తించాడు - అర్చనతో చాలాసార్లు 'పూజ ఏమిటి బొత్తిగా మాట్లాడదు. చిన్నప్పటినుంచి అంతేనా' అన్నాడు ఒకసారి, వచ్చిన వారం రోజులకి.
    "ఏమో యీ మూడేళ్ళలో యిలా మారిందేమో గాని మొదట్లో వసపిట్టలా వాగేది. శలవులకి నేను వెళ్ళినప్పుడు కూడా అలా వున్న నాల్గు రోజుల్లో తెగకబుర్లు చెప్పేది - యిప్పుడెందుకు మరి యిలా తయారయిందో" అర్చన సందిగ్ధంగా అంది.
    "అర్చనా.....పూజకి నేను డాడీ అవడం యిష్టం వున్నట్టు లేదు. చిన్న పిల్లేకాని తన అయిష్టత ఎంతల చూపిస్తుందో అనిపిస్తుంది నాకు ఆ మొహం చూసినప్పుడల్లా. ఆ కళ్ళల్లో తిరస్కారం కనిపించుతూంది నాకు......నేనెంత ప్రయత్నించినా, మాట్లాడినా నా వంక చూడదు మాట్లాడదు......ఊ ఆ....అంటుంది జవాబుగా.....పూజని ఎలా మాలిమిచేసుకోవాలో నాకర్ధం కావడంలేదు......ఆ పిల్ల మొహం చూసినప్పుడల్లా నేను గిల్టీగా, ఎంబ్రాసింగ్ గా ఫీలవుతున్నాను....." ఒకరోజు రాత్రి అన్నాడు.
    అతని మాటల్లో సత్యం ఆమెకీ తట్టినా రాజేష్ మనసు కష్టపెట్టడం యిష్టం లేక. "బాగుంది నీవెందుకు ఫీలవడం.....చిన్నతనం అవడంవల్ల దానికి ఏదో యిదంతా అర్ధంకాక యీ డాడీ ఎవరు అనుకుంటూంది గాబోలు - కాస్త జ్ఞానం వచ్చాక విడమర్చి చెపుతాను.....నాలుగు రోజులు పోతే అదే అర్ధం చేసుకుంటుంది" తేలిగ్గా అన్నట్టుంది అతన్ని నమ్మించటానికి -'ఏమో....పూజ ధోరణి నాకు అంతుబట్టడంలేదు. వచ్చి పదిహేను రోజులయింది ఒక రోజు నాతో మాట్లాడలేదు -అడిగితే తప్పదన్నట్టు ఊ....ఆ అంటూ తల ఆడిస్తుంది. పూజ వచ్చాక నేను అభిషేక్ ని ఎత్తుకుంటే, ఆడిస్తుంటే ఎలా చూస్తుందో తెలుసా తన మొహం చూస్తే....అభిషేక్ ని ముద్దు చెయ్యాలన్నా నాకేదోలా వుంది. తను పరాయిదన్నట్లు, అభిషేక్ నా వాడన్నట్టు ఆ పసిపిల్ల మనసులో ఏ అసూయ వస్తుందోనని భయంగా వుంది" రాజేష్ నిజాయితీగా అన్నాడు.
    అతని మాటల్లో సిన్సియారిటీకి, తనది కాని కూతురి కోసం ఎంత సహృదయతతో అతను ఆలోచిస్తున్నాడో అర్ధం అయ్యేసరికి ఆమె మనసు ఆర్ద్రమయింది ప్రేమగా అతని జుట్టు సవరిస్తూ, "సారీ రాజేష్, ఈ పెళ్లి చేసుకుని నావల్ల నీవీ ప్రాబ్లమ్స్ ఎదుర్కోవలసి వచ్చింది ఏదో చిన్నపిల్ల అనుకున్నాను గాని.....దీని వల్ల యిన్ని ప్రాబ్లమ్స్ వుంటాయనుకోలేదు. నేను చేసిన పొరపాటు దాన్ని అక్కడ వదలడం.....దానికి కాస్త జ్ఞానం వచ్చేసరికి తండ్రి వస్తూ పోతూండటం, దీన్ని చేరదీయడంతో తండ్రి చాలా మంచివాడు..... తల్లి తండ్రి మధ్యలో నీవు విలన్ లా దీనికి కనిపించి అలా వుంటుందేమోనని పిస్తుంది. చిన్నప్పుడే తీసుకొచ్చేస్తే తండ్రి తెలియకపోతే నిన్నే తండ్రి అనుకునేదేమో. ఈ వ్యవహారం యింత దూరం వెళుతుందని అనుకోలేదు నేను" విచలితురాలై అంది. "నన్ను చేసుకున్నందుకు నీకేం సుఖం లేదు."
    "ఛా....ఛా నా ఉద్దేశం అదికాదు అర్చనా. పూజని ఎలా నమ్మించాలి. ఎలా మెప్పించాలన్నదే నా తాపత్రయం తప్ప యింకేం కాదు. ఏం చేస్తే పూజ నన్ను తండ్రిగా అంగీకరిస్తుందా అన్నది నాకర్ధం కావడం లేదు..."
    "రెండు తగలనిస్తే దారికి వస్తుంది - ఏదో చిన్నపిల్ల అదే అలవాటు పడుతుందిలే అని ఆలోచిస్తుంటే మరీ మొండితనం ఎక్కువైంది" కోపంగా అంది.
    "నీపిచ్చి గాని కొట్టి తిట్టి దారికి తీసుకురాగలమనుకోవడం వెర్రి.....బలవంతంగా ఏ పువ్వునీ వికసించచెయ్యలేం -చూద్దాం కొన్నాళ్ళు పోతే సర్దుకుంటుందేమో....నీవనవసరంగా కేకలు వేస్తే యింకా తన మనసులో ద్వేషం ఎక్కువవుతుంది" అన్నాడు.
    "నీతోనే కాదు నాతోను అసలు మాటలాడ్డంలేదు రాజేష్. పరాయి యింటిలో వుంటున్నట్టు అంటీ ముట్టనట్టు వుంటూంది. మనకంటే కాస్త సునీత వాళ్ళింట్లో ఉన్నప్పుడే నయం, తన్మయతో కలిసినప్పుడు మాట్లాడుతుంది. యిక్కడికి రాగానే షెల్ లోకి ముడుచుకున్నట్టు అయిపోతూంది. నీవంటే పైవాడివి అనుకుంటే కన్నతల్లితో నాతోనూ అలాగే వుంది. రాజేష్ - స్నానం చేయిస్తానంటే నే పోసుకుంటానంటుంది. తల దువ్వుతాను అంటే నాకు వచ్చునంటుంది -హోమ్ వర్కులో కూడా నా హెల్ప్ తీసుకోడంలేదు. నెలరోజులైంది ఇంకా కొత్తనుకోడానికి" అర్చన బాధగా అంది. "నీవు కొంచెం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్టు పూజనీ నమ్మించాలి అర్చనా. తనపట్ల నీ ప్రేమ అది యిదివరకులాగే వుంది అన్న అభిప్రాయం కల్గించి చూడు దరికి వస్తుందేమో." ఇంకో మగాడికి కన్న కూతురిపట్ల యింత శ్రద్దాసక్తులతో ఆలోచించి చర్చిస్తున్న రాజేష్ పట్ల ఆమె అభిమానం, గౌరవం మెట్టు మెట్టుకి మరింత పెరగసాగింది అర్చనకి. అదే ఇంకో మొగుడైతే తన భార్య యింకొకరికి కన్నకూతురిని యింట్లో పెట్టుకోడానికే రాద్దాంతం చేస్తారు. పెంచినా ఎంత హీనంగా చూస్తారనే కథలు వింది. తనెంత అదృష్టవంతురాలు! యిలాంటి భర్తని పొందగలగటం తన భాగ్యం - ఇంత ఉత్తముడిని తండ్రిగా అంగీకరించని పూజపట్ల కోపం పొంగింది. అతని మంచితనం గుర్తించలేని ఇలాంటి సహృదయుడి తండ్రి ప్రేమని అందుకోలేని దౌర్భాగ్యురాలేం పూజ అనుకుంది. రేపటినుంచి తను అదే మారుతుందిలే అనుకోకుండా గట్టిగా పూజ రాజేష్ ని అంగీకరించేలా ప్రయత్నించాలి. పూజలో అపోహలు తొలగింపచెయ్యాలి అనుకుంది.
    
                                          *    *    *

 Previous Page Next Page