ఉదయంలేచి తన ఆలోచనలు కార్యరూపంలోపెట్టి మొదటి ప్రయత్నంగా పూజా.... డాడీని కాఫీకి రమ్మను" అంది ఉదయంలేచి డ్రైనింగ్ టేబిల్ దగ్గిర పాలగ్లాసు అందుకోబోతున్న పూజతో. పూజ గతుక్కుమన్నట్టు చూసింది. నెల రోజులకి ఇలాంటి సంఘటన ఎదురవలేదేమో తల్లి అలా అనటంతో ఏం చెయ్యాలో తోచనట్టు అలా నిలబడి పోయింది కిందపెదవి కొరుక్కుంటూ. అర్చన వంటింట్లోంచి బయటకువస్తూ పూజ అలాగే నిలబడి వుండటం చూసి "పూజా వినపడదు కదా డాడిని పిలుచుకురా, కాఫీ చల్లారిపోయింది." అంది మళ్ళీ పూజ తల్లివైపు అదోలా చూసింది. "నీవే పిలు" అంటూ గబగబ బాత్ రూంలోకి వెళ్ళి తలుపు మూసుకుంది. మొదటి ప్రయత్నం ఫలించకపోవటంతో నిస్సహాయంగా చూస్తూనిలబడిపోయింది అర్చన.
మరో ప్రయత్నంగా టిఫిను టేబిల్ మీద పెట్టి "పూజా టిఫినుకురా డాడీని కూడా పిలుచుకురా" అంది స్కూలు డ్రస్ వేసుకుని గబగబ బ్రేక్ ఫాస్ట్ తినడానికి వస్తున్నప్పుడు ఆ మాటకి వున్నచోటే ఆగిపోయింది. "ఏమిటే వినపడలేదా డాడీనిపిలు" అంది పూజ మొహం చిట్లించిచూసింది. అంతలోనే రాజేష్ అడుగుల చప్పుడు వెనకనించి వినబడి "వస్తున్నారు" అంటూ వచ్చి తన సీట్లో కూర్చుని తినడం ఆరంభించింది. రాజేష్ ఏమిటన్నట్లు చూశాడు కోపంగా చూస్తున్న అర్చనని అర్చన ఏంలేదన్నట్టు తల ఆడించింది కూతురి వంక కోపంగా చూస్తూ.
ఆరోజంతా ఎన్నిసార్లు పూజచేత రాజేష్ ని పిలిపించాలని, మాట్లాడించాలన్నా ప్రయత్నం ఫలించలేదు. ఆ రోజు సాయంత్రమే రాజేష్ ఆఫీసునుంచి యింటికివచ్చి ఆ రోజు ఫస్టుతారీఖు అవటంవల్ల తెచ్చినడబ్బు అర్చనకి యివ్వలన్న ఉద్దేశంతో డ్రాయింగు రూమ్ లో కూర్చుని హోం వర్కు చేసుకుంటున్న పూజని చూసి "పూజా మమ్మీని పిలు అమ్మా" అన్నాడు బెడ్ రూంలోకివెళ్లి వంటింట్లోవున్న అర్చనకి వినబడినా పూజ వచ్చి పిలుస్తుందో లేదో చూడాలన్న ఆలోచనతో బయటికి రాలేదు.
పూజ తప్పదన్నట్టుగా లేచి వంటింట్లోకి తొంగిచూసి "పిలుస్తున్నారు" అంది నెమ్మదిగా. అర్చన అర్ధం ఐనా కానట్టు ఆశ్చర్యంగా చూసి-ఎవరూ అంది పూజ ఒకక్షణం పెదవి కొరుక్కుని "అంకుల్" అంది టక్కున వెనక్కి తిరిగి వెళ్లిపోతూ కూతురి చూపు, మొండి వైఖరి అర్చనకి విపరీతంగా కోపం తెప్పించింది. "పూజా యిలారా" గట్టిగా అరిచినట్టే పిలిచింది-పూజ వెనక్కి తిరిగి వంటింట్లోకి వచ్చి ఏమిటన్నట్లు చూసింది తల్లి వంక. "అంకుల్ ఎవరు"-అంది. అర్చన ఏ అంకుల్ వచ్చారు తెలియనట్టే అడిగింది. పూజ జవాబుకి తడబడి అదే.....అదే రాజేష్ అంకుల్ అంది. "రాజేష్ అంకులేమిటి డాడి అనలేవు....." కఠినంగా అంది. పూజ జవాబు చెప్పకుండా తల్లి వంక మిన్గేస్తున్నట్టు పెద్ద పెద్ద కళ్ళు మరింత పెద్దవి చేసి చూసింది. "ఏమిటా చూపు......చెప్పింది అర్ధం కాలేదా......రాజేష్ నీకు అంకుల్ అవరు డాడి అవుతారు డాడి అని పిలవాలి తెలిసిందా...." అంది. పూజ మరోసారి పెదవి కొరుక్కుని తల ఎగిరేసి జవాబివ్వకుండా వెనక్కు వెళ్ళి టేబిల్ ముందు కూర్చుని హోంవర్కు చేసుకోసాగింది. పూజ కోపంగా బయటికి రాబోయేంతలో అపుడే వచ్చి విన్న రాజేష్ కళ్ళతో వారించి ఆపాడు.
ఆ రాత్రి నిద్రపోయేముందు పూజతో కొంచెం మాట్లాడాలని నిర్ణయించుకుంది అర్చన. పూజ మనసులోని సంగతేంటో తెల్సుకోవాలని నిశ్చయించుకుంది. నైట్ గౌన్ తొడుక్కుని ఉన్నప్పుడు దగ్గిరికి వెళ్లి వెనక నుంచి బొత్తాలు పెట్టింది అర్చన పూజ కాస్త వింతగాచూసింది. "పూజా నీకేమయిందే....అసలు యిక్కడికి వచ్చిందగ్గరనుంచి అదోలా వుంటున్నావు....అసలు మాట్లాడవేమిటి.....ఎందుకలా తయారయ్యావు అని ఆశ్చర్యంగా వుంది నాకు" అంది సౌమ్యంగా పూజ జుత్తు సవరిస్తూ.
పూజ తల్లివంక మళ్ళీ అదే చూపు- "నీ మనసులో అసలు ఏముందే నాకు అంతుబట్టడంలేదు. నీకు యిక్కడ బాగాలేదా! ఎందుకలా వుంటుంన్నావు?"పూజ చప్పున తల ఆడించింది.....అంతలోనే ఆ పిల్ల కళ్ళల్లో నీరు చిమ్మింది"
"నాకు ఇక్కడ బాగులేదు.....మమ్మీ నేను తాతగారి దగ్గిరికి వెళ్ళిపోతాను" ఆశగా చూస్తూ అంది.
"ఎందుకు బాగా లేదు.....కారణం చెప్పు. నీకేం తక్కువయింది తల్లి దగ్గిరకంటే ఎవరికైనా తాతగారి దగ్గిర బాగుంటుందా-" కళ్ళల్లో బాధ, కోపం తొంగి చూశాయి.


