Previous Page Next Page 
హ్యూమరాలజీ-1 పేజి 39

                                 


    
                                     పబ్లిసిటీ ప్రహసనం

              
    
    గుప్తులనాటి కాలాన్ని స్వర్ణయుగమన్నారు చరిత్ర రాసిన రచయితలు. అలాగే ప్రస్తుత కాలాన్ని "ప్రకటనలు లేక పబ్లిసిటీ యుగం"గా మనం మొఖవాటం లేకుండా చెప్పుకోవచ్చు. రచయితలు రాసేయవచ్చు. మరికొంతకాలంపోతే ఈ వ్యాపారప్రకటనలు ఏ పద్దతి కొస్తాయో ఎవరయినా తేలిగ్గా ఊహించుకోవచ్చు.
    ఆనాడు మన నిర్భయ్ నగర్ కాలనీ లైఫ్ ఇదిగో ఇలా వుంటుంది! ఇక చదవండి!
    నేనూ, శాయీరామ్, రంగారెడ్డి, జనార్ధన్ కలిసి ఆఫీస్ కెళ్ళడానికి బయల్దేరి బస్ స్టాప్ దగ్గరకొచ్చాము. అక్కడ రష్ చాలా ఎక్కువగా ఉంది.
    "అబ్బ! రష్ బాగా ఉంటే?" అన్నాడు శాయీరామ్.
    అనటమే ఆలస్యం ఓ వ్యక్తి మా వెనుక నుంచి సర్రున ముందుకి దూసుకొచ్చాడు. "అవున్సార్! ఎక్కడ చూచినా రష్! ఎటు చూచినా రష్! రైళ్ళల్లో బస్సుల్లో, షిప్పుల్లో, విమానాల్లో, రోడ్లమీద, ఆఫీసుల్లోనూ, అంతా రష్! అన్నీ రష్! అంచేత మీరూ నేడే వాడండి రష్! కమ్మని కమనీయమయిన కూల్ డ్రింక్ పౌడర్ రష్! రొటీన్లకూ, ప్రోటీన్లకూ తెగ తాగండి రష్! పౌడర్ తో చేసిన పానీయం! ఒక పాకెట్ రష్ పౌడర్- ఎనిమిది బిందెల నీళ్ళను కమ్మని రసమయ రసంగా మార్చేస్తుంది. ఆరొందల మందికి సరిపోతుంది. ఎవరికి సార్ కూల్ డ్రింక్ పౌడర్" అంటూ తన బాగ్ లో నుంచి రష్ పాకెట్లు తీసి మాకివ్వబోయాడతను.
    "మాకొద్దు నాయనా!" అన్నాడు రంగారెడ్డి షాక్ నుంచి తేరుకుని.
    "అదేమిటి సార్! రష్ బాగా ఉందే అని మీరనుకోవటం నేను వినలేదనుకున్నారా?" అతనిని వదిలించుకునేసరికి పావుగంట పట్టింది. ఇంతలో మా మధ్యకు ఏదో జంతువు దూరినట్లనిపించింది.
    ఆ జంతువుని చూసి రంగారెడ్డి కెవ్వున కేకవేసి అవతలివేపుకి ఒక్కగెంతు గెంతాడు. ఆ గెంతుకి అక్కడ నిలబడ్డ ఓ ముసలాయన అటువేపు నిలబడ్డ ఇద్దరు స్త్రీలమీద పడ్డాడు. వాళ్ళు కింద చతికిల బడుతూ ఇంకొకాయన కాళ్ళుతొక్కారు. ఆ కాళ్ళ ఓనరు "నాయనోయ్! నా కాళ్ళు పచ్చడి అయిపోయాయ్ దేవుడో" అంటూ ఆ లావుపాటావిడను బూతులు తిట్టసాగాడు.
    ఈ చైన్ రియాక్షన్ ఓపక్క జరుగుతూండగానే నేనూ, శాయీరామ్ కలసి మా మధ్యకొచ్చిన ఆ జంతువేమిటా అని పరీక్షగా చూశాము.
    రంగురంగుల బొచ్చులో నుంచి తెలుగు అక్షరాలు స్పష్టంగా కనబడుతున్నాయ్. "అత్తమొగుడే నా మొగుడు! నేడే చూడండి! అద్భుతమైన సెంటిమెంటల్ చిత్రం! పధ్నాలుగు థియేటర్లలో నేడే విడుదల!" అని రాసి ఉంది.
    ఆ జంతువు తోకమీద తారాగణం పేర్లున్నాయి.
    ఆ జంతువు నెమ్మదిగా మా దగ్గరకొచ్చి తోకాడించాకగానీ మాకు తెలీలేదు అది కుక్క అని. ఏ జంతువో ఓ పట్టాన తెలీటంలేదు. మనిషి మోఖంలా ఉంది కానీ, దాని మొఖానికి కూడా రంగులు పూసి ఈ రంగులతో ఆ సినిమాలోని హీరో మొఖం కనిపించేటట్లు చేశారు. అంచేత మేము కొంచెం కన్ ఫ్యూజ్ అయ్యాము.
    "ఇది కుక్కరా!" అన్నాడు జనార్ధన్ రంగారెడ్డికి ధైర్యం చెప్తూ.
    "అవునవును! ఇది కుక్కే! ఊరకుక్క ఈ మధ్య సినిమా కంపెనీవాళ్ళు కుక్కలూ, పందుల మీదే రంగులేసి కొత్త పిక్చర్ల పబ్లిసిటీ ఇస్తున్నారు" అంటూ చెప్పాడో స్టూడెంట్!
    ఇంతలో ఓ సిగరెట్ కంపెనీ వాన్ వచ్చి ఆ బస్ స్టాప్ దగ్గర ఆగింది.
    "మినిష్టర్ సిగరెట్లనే వాడండి! అయిదు సంవత్సరాల పాటుకాలుతూండే ఏకైక సిగరెట్లు మినిష్టర్ సిగరెట్లు! థారాళమయిన పొగకి నేడే వాడండి! మినిష్టర్ సిగరెట్లు!" ఇలా ఆ వాన్ అంతా బొమ్మలతో పాటు రాసి ఉంది.
    ఆ వాన్ లోని వాళ్ళు దిగి మమ్మల్ని సిగరెట్లు ఎక్కడ కొనమంటారోనని మేము బాగా వెనక్కి జరిగి నిలబడ్డాము. వాళ్ళు మా అందరికీ శాంపుల్ సిగరెట్లు ఇచ్చి, వాళ్ళే లైటర్ తో అంటించి "ఈ మినిష్టర్ సిగరెట్లు మీకెందుకు అంత బాగా నచ్చినయ్?" అనడిగారు.
    "నచ్చాయని ఎవడన్నాడు?" అని నేనంటూండగానే మైక్ నాముందు నుంచి లాగేసి రంగారెడ్డి ముందుంచారు. "మిగతా అన్ని సిగరెట్ల కంటే దీని రుచి అద్భుతం' అని చెప్పండి సార్ అంటూ వందనోటు గిఫ్టుగా ఇచ్చారు. అంతే! రంగారెడ్డి ఆ మినిష్టర్ సిగరెట్లను అరగంట పొగిడాడు. నిజానికి రంగారెడ్డి సిగరెట్లు తాగటం అదే మొదటిసారి! మరి కాసేపటికి ఆ వాన్ వెళ్ళిపోయింది. కానీ ఈసారి అప్పడాల వ్యాన్ వచ్చింది.
    "ముద్ద ముద్దకీ మధ్య అప్పడం! మనిషి మనిషికీ మధ్య అప్పడం! నేడే వాడండి జుబేగా వారి అప్పడాలు! మనిషి శరీరం పెరుగుదలకూ- ఆరోగ్యానికీ అవసరమైన ఇరవై ఎనిమిది రకాల ఖనిజాలతో తయారు చేయబడినాయ్ జుబేగా కంపెనీ వారి అప్పడాలూ!" ఆ వాన్ కూడా వెళ్ళిపోయింది గానీ- ఇంకా మా సెక్రటరియట్ బస్ రాక పోయేసరికి చిరాకు పుట్టుకొచ్చింది. "థూ! ఒక్క బస్ కూడా టైమ్ కి రాడు" అన్నాడు రంగారెడ్డి 'అనటం ఆలస్యం మా పక్కన నిలబడ్డ వ్యక్తి తన చేతి కర్రను ఒక మూడు కాళ్ళ టేబుల్ బాగా మార్చి, తన చేతిలో ఉన్న సూట్ కేస్ ని దానిమీద ఉంచి ఓపెన్ చేశాడు. లోపలన్నీ వాచీలు. "ఎవరికి సార్! కైలాస్ వాచీలు! టైమ్ పీస్ లలు! ఏ బస్సు ఎంతలేటో గంటలు, రోజుల్తో సహా చెప్పే సూపర్ వాచీలు! ఒకటికొంటే ఒకటి ఫ్రీ సార్-" అతికష్టం మీద అతన్నుంచి తప్పించుకుంటున్నారందరూ- ఆ విషయం గట్టిగా అందామంటే మళ్ళీ ఆ "టైమ్ సెట్టర్" కంపెనీ తాలూకు పార్ట్ టైమ్ పెద్దమనిషి ఎక్కడ చుట్టుముడతాడోనని భయం!
    కాని ఆ విషయం పట్టించుకోకుండా శాయీరామ్ మాత్రం "ఇవాళ ఒక్క సెక్రటేరియట్ బస్ కూడా రావటంలేదేమిటి?" అన్నాడు చిరాకుగా.
    మా పక్కనున్న చెమ్కీటోపీ సాయిబాబుగారు నవ్వారు.
    "ఇప్పుడే గదండీ- సెక్రటేరియట్ బస్ లు రెండు వెళ్ళాయ్!" అన్నాడతను. మేము ఉలిక్కిపడ్డాము.
    "సెక్రటేరియట్ బస్ లు వెళ్ళాయా?"
    "అవునూ!"
    "మ్మెఉ ఇక్కడ నిలబడి అరగంటవుతోంది! మాకే బస్సూ కనిపించలేదే!"
    "ఇప్పుడే మీ కళ్ళముందే రెండు బస్సులు వెళ్ళాయి కదండీ!"
    "ఇప్పుడు వెళ్ళినవి రెండు అప్పడాల కంపెనీ వాన్ లు! వాటినే చూసి నవ్వు బస్ అనుకున్నావేమో!" అంటూ తిరగబడ్డాడు రంగారెడ్డి.
    సాయిబాబుగారు రంగారెడ్డిని చాలా జాలిగా చూశారు.
    "అవి అప్పడాల కంపెనీ వాన్ లు కాదు నాయనా! ఆర్టీసీ వారి సిటీబస్ లు!"

 Previous Page Next Page