Previous Page Next Page 
క్లైమాక్స్ పేజి 40

"హరీన్ గారూ.......ఈ న్యూస్ విన్నారా?"
"ఏమిటి?"
"రఘుపతిగారి భార్య తీస్తున్న సొంత చిత్రంలో కిశోర్ హీరోగా బుక్కయ్యాడు!"
నిర్విన్నుడయ్యాడు హరీన్. ఆ తర్వాత నెమ్మదిగా అన్నాడు - "అ ఆఫర్ మొదట నాకే ఇచ్చారు. కధ బాగులేదనీ, మరో సబ్జెక్టుని చూడమనీ చెప్పాను. కానీ వాళ్ళకీ ఆ కధే బాగా నచ్చింది. అందువల్ల........."
అదోలా నవ్వాడు ధనుంజయ్ "మిస్టర్ హరీన్! అసలు వాళ్ళు తియ్యబోయే కధ అదికానేకాదు. వాళ్ళు ఫైనలైజ్ చేసుకున్న సబ్జెక్టు ఒక పొలిటికల్ సెటైర్. వాళ్ళంతట వాళ్ళే మిమ్మల్ని వదిలించుకున్నట్లు ఎవరికీ అనిపించకుండా, మీచేతే ఫార్మల్ గా కాదనిపించుకోవడానికి గాను ఆ పరమ పాత చింతకాయపచ్చడి కధ వినిపించారు మీకు."
"ఇంపాజిబుల్ ........రఘుపతిగారి భార్య అలాంటి మనషి కాదు!" అన్నాడు హరీన్.
"ఆమె అలాంటి మనిషి కాకపోవచ్చును. కానీ ఆమె చుట్టూ చేరి ఉన్నవి దుష్టగ్రహాలు. వాటి ప్రభావం నుంచి తప్పించుకోవడం ఆమె శక్యం కాదు."
తల తిరిగిపోతోంది హరీన్ కి.
తనని అధఃపాతాళానికి తోక్కేసేందుకు చాలా సిన్సియర్ గా ప్రయత్నిస్తున్నారు ఎవరో!
వాళ్ళు ప్లే చేస్తున్న ఈ పాలిటిక్స్ ముందు ఇందాజాల మహేంద్రజాలాలు పిల్లటలాగా కనబడతాయేమో!
రఘుపతి గారి భార్యకే బ్రెయిన్ వాష్ చేసి తనపట్ల ఆమెకి వైముఖ్యం కలిగించగలిగారంటే......
ఇండస్ట్రి మొత్తాన్ని తనకి వ్యతిరేకంగా మార్చగల సామర్ధ్యం కూడా ఉండే ఉంటుంది తన ప్రత్యర్దులకి.
నౌ! వాట్ టూ డూ?
కరుణ గొంతు సవరించుకుని, "కొద్దిగా కాఫీ పెట్టి ఇవ్వానా?" అని ఆరాటంగా అడిగేవరకు, ఆలోచనల్లో మునిగిపోయి ఉన్నాడు అతను.
కరుణ గొంతు వినబడగానే ఉలిక్కిపడి చూశాడు హరీన్. జర్నలిస్టు ధనుంజయ్ ఎప్పుడో వెళ్ళిపోయాడు. తనకి ఎదురుగా కరుణ నిలబడి ఉంది. ఆదుర్దా కనబడుతోంది ఆమె మోహంలో.
అన్యమనస్కంగానే తల ఉపాడు హరీన్.
కాఫీ పెట్టి ఇచ్చింది కరుణ. తాగి మళ్ళీ దీర్ఘాలోచనలో పడిపోయాడు హరీన్.
అతని ఆలోచనలకు అంతరాయం కలిగించడం ఇష్టం లేక, మౌనంగా వెళ్ళిపోయి, వంట ప్రయత్నం మొదలెట్టింది కరుణ.
వంట పూర్తీ చేసింది గానీ, హరీన్ ని భోజనానికి లెమ్మని పిలిచే సాహసం చెయ్యలేకపోయింది కరుణ. తను కూడా మెతుకు నోటపెట్టకుండా, దూరంగా కూచుని, అతన్ని గమనిస్తూ ఉండిపోయింది.
శిలావిగ్రహంలా నిశ్చలంగా అలాగే కూర్చుని ఉన్నాడు హరీన్.
అర్ధరాత్రి దాటాక అతనిలో ఒక్కసారిగా చలనం వచ్చింది.
"కరుణా!" అన్నాడు హటాత్తుగా , పెద్దగా.
"ఏమిటి?" అంది కరుణ సంభ్రమంగా లేచి నిలబడుతూ.
"కరుణా......నేనే సొంతంగా ఒక పిక్చరు తీస్తాను! అది తప్ప వేరే మార్గం లేదు!" అన్నాడు హరీన్.
చిత్రంగా అతనివైపు చూస్తూ ఉండిపోయింది కరుణ.

                                                                32
ఆశ్చర్యంగా చూస్తున్న కరుణతో అన్నాడు హరీన్.
"అవును కరుణా! నిజంగా నేనే సినిమా తీస్తాను. నేను సినిమా తీస్తానంటే , ఎవరో ఒకరు డబ్బు పెట్టడానికి ముందుకు వస్తారు. ఇంత సంపాదించినా నేను డబ్బేమీ దాచలేదు కరుణా! వాళ్ళకోసం, వీళ్ళకోసం వచ్చింది వచ్చినట్లు ఖర్చుపెట్టాను.
ఒకవేళ, ఎవరూ మన పిక్చరుకి ఫైనాన్స్ చేయడానికి ముందుకు రాకపోయినా, ప్రస్తుతం నా దగ్గర అయిడులక్షలు ఉన్నాయి కరుణా! బంగాళా, కారు అమ్మేసి ఇంకో పదిహేను లక్షలు తేగలను నేను.
పదిహేను లక్షలతో సలక్షణమైన సినిమా తియ్యవచ్చు ఎవరైనా సరైన అవగాహనా, ప్లానింగ్ ఉంటే, ఇంకా మాట్లాడితే, అంతకు సగం ఖర్చు పెట్టె తియ్యొచ్చు సినిమా!"
ఆ మాటలన్నీ హరీన్ కరుణ విని అర్ధం చేసుకోవాలని చెబుతున్నట్లు అనిపించడంలేదు. స్వగతంలా, ఉరికే పైకి ఆలోచిస్తున్నట్లు మాట్లాడుతున్నాడు.
జస్ట్ లౌడ్ ధింకింగ్! అంతే!
"కొద్ది సంవత్సరాల క్రితం కొంతమంది కుర్రాళ్ళు కలిసి తమిళంలో ఒక సినిమా తీశారు కరుణా. దానిపేరు 'ఒరుతలైరాగం ' అందులో హీరోయిన్ మన తెలుగంమాయే! రూప. అయితే దానిని కొనడానికి ఎవరూ ముందుకురాలేదు. అప్పుడు వాళ్ళు తమంతట తామే ఒకే ఒక్క ప్రింటు తీసి, తమంతటతామే ఒక దియేటర్ లో రిలీజ్ చేశారు.
అద్భుతంగా ఇందాన్నారు ప్రేక్షకులు.
మెల్లిమెల్లిగా టాక్ అందుకుంది. జనం విరగబడ్డారు. ఆ తాకిడికి తట్టుకోలేక, నలభై ప్రింట్లు తీసి, అనేక దియేటర్లలో రిలీజ్ చెయ్యవలసి వచ్చింది ఆ సినిమాని. చివరికి పోలీసులు కూడా టిక్కెట్లకోసం రికమెండేషన్లు తెచ్చుకోవలసిన కటకట ఏర్పడింది.
అది భారీ చిత్రం కాదు. కోట్లు ఖర్చు పెట్టలేదు దానికి.
అయినా ఎందుకంత బాగా ఆడింది ఆ సినిమా!
ఎందుకంటే, వేసవిలో పిల్లతెమ్మెరలా ఆ చిత్రంలో ఉన్న నవ్యత.
ఎప్పటికప్పుడు ఏదో కొత్తదనం చూపకపోతే ప్రేక్షకులు ఆదరించరు."
అతని ఆలోచనలకు అడ్డం రాకుండా మౌనంగా వింటోంది కరుణ.
చెప్పుకుపోతూనే ఉన్నాడు హరీన్.
"ఏ చిత్రానికయినా మూలాధారం. మంచికద లేదా కధ అంత గొప్పది కాకపోయి, ఆ కధకు ఇచ్చే మంచి ట్రీట్ మెంటు.
కానీ, స్పీడుయుగంలో కొట్టుకుపోతున్నాం మనం. కధని గురించి బాగా ఆలోచించే వ్యవధి లేదు. హిట్టయిన ఓ సబ్జెక్టుని పట్టుకుని దాన్ని అటూ ఇటూ తిప్పి వంద సినిమాలు తీస్తున్నాం మనం. కొత్త రకం ట్రీట్ మెంట్ గురించి ఆలోచించే టైం లేదు. ముహూర్తం నాడు కొబ్బరికాయ కొట్టెయ్యడం, నాలుగు పాటలతో, నాలుగు ఫైట్లతో రీళ్ళు తీసెయ్యడం, డబ్బాల్లోకి ఎక్కిచేయ్యడం అవుతోంది సినిమా నిర్మాణం అంటే!
మరి ఆ డబ్బాలు రాత్రికిరాత్రే తిరిగి వచ్చేస్తున్నాయంటే, ఆశ్చర్యం ఏముంది? అందులో ప్రేక్షకుల తప్పేముంది?
రాసి ప్రకారం చూస్తే మన చిత్రాల సమాఖ్య ప్రపంచంలో మొత్తం మీద నిర్మించబడే చిత్రాలలో మొదటిమూడు స్థానాలలో ఉంటోంది.
కానీ వాసి?
వాసి లేకుండా ఇంత నాసిరకంగా ఎందుకు ఉంటున్నాయి మన చిత్రాలు?
మంచి చిత్రాలు తీస్తే మన ప్రేక్షకులు ఆదరించరని భయమా?
కానీ మంచి చిత్రాలని మన ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉన్నారే! దానికి శతకోటి రుజువులు ఉన్నాయే!
కోట్లు ఖర్చు పెడుతున్నా మంచి చిత్రాలు ఎందుకు తియ్యలేక పోతున్నాం మనం?
అసలు కోట్లు ఖర్చు పెట్టడం వల్లనే మంచి చిత్రాలు తియ్యలేకపోతున్నామా? తెలుగు నిర్మాతలకి డబ్బుకి కొదవలేకపోవడమే మరో విధంగా శాపంగా పరిణమించిందా?
ఎందుకంటే, డబ్బు ఉన్నకొద్ది ధారాళంగా ఖర్చు పెట్టాలనిపిస్తోంది. మనకి ఉన్న మార్కెట్ పరిమితం. ప్రాంతీయ భాషా చిత్రాలు మనవి.

 Previous Page Next Page