"ఎందుకు?" అంది కరుణ ఆశ్చర్యంగా.
"మనం లోయలో పడిపోయినప్పుడు నేను సూపర్ హీరోని. అనుకోకుండా ఇప్పుడు ప్లాప్ హీరోని అయిపోయాను కరుణా - నీకు పెద్ద అండగా నిలవగలననుకున్నాను నేను. కానీ ఇవాళ నేను చాలా మామూలు మనిషిగా మారిపోయాను కరుణా!"
"అవేం మాటలు!" అంది కరుణ ఆర్ద్రంగా. "హరీన్.....నాకు కుప్పలు తెప్పలుగా డబ్బులు అవారంలేదు. మీలా అభిమానం చూపే వ్యక్తీ అండచాలు నాకు!"
తదేకంగా ఆమెవైపు చూశాడు హరీన్. తర్వాత నెమ్మదిగా అన్నాడు - "నాకూ అంతే కరుణా!"
కొద్దిసేపు మౌనం.
తర్వాత మళ్ళీ హరీన్ అన్నాడు.
"పిక్చర్స్ లో నా స్తానం పడిపోయినందుకు నేను విచారించడం లేదు కరుణా! నా తండ్రి తాలూకు లక్షల ఆస్తిని ఎడంకాలితో తన్నేసి వచ్చిన రకాన్ని నేను, చిన్నప్పటినుంచి కూడా స్వతంత్రంగా బతికినవాడిని."
చెవులప్పగించి అతని మాటలు వింటోంది కరుణ.
"ఇప్పుడు జీవితంలో ఇది ఇంకో కొత్త అధ్యాయం అనుకుంటాను కరుణా! దీన్ని కొత్త చాలెంజ్ గా తీసుకుంటాను నేను."
"కరుణా.......నాకు ఏమీ అక్కర్లేదు. నీలాంటి మంచిమనుషుల తోడు ఉంటే చాలు. అసాధ్యాన్ని నేను సుసాధ్యం చేసేస్తాను కరుణా!"
అప్రయత్నంగా అతని చేతిని తన చేతితో మృదువుగా ఒత్తింది కరుణ.
31
చలనచిత్రరంగంలో తనకి "గాడ్ ఫాదర్" లాంటి వాడయిన రఘుపతి గారి ఇంటికి వెళ్ళాడు హరీన్.
ఆరోజున రఘుపతిగారి పెద్దఖర్మ. రఘుపతి బంధువులూ, సినీ ఇండస్ట్రిలోని ప్రముఖలూ ఎంతోమంది వచ్చారు. రఘుపతి భార్య పట్ల సానుభూతి ప్రకటించారు. ఎంతోమంది ఎన్నోరకాలయిన వాగ్దానాలు చేశారు.
అందరూ వెళ్ళిపోయేదాకా ఉండి తర్వాత రఘుపతి గారి భార్య దగ్గరికి నెమ్మదిగా వెళ్ళాడు హరీన్.
అతన్ని చూడగానే మళ్ళీ దుఃఖం ముంచుకొచ్చింది ఆమెకి.
"ఊరుకో అమ్మా......ఊరుకో" అన్నాడు హరీన్ ఆమెని ఓదారుస్తూ. కానీ ఆ మాటలు అంటున్నప్పుడు అతని గొంతుకూడా రుద్దమయింది.
ఒక అరగంట తర్వాత తనని తాను సంభాళించుకోగలిగింది ఆమె. మెల్లిగా అన్నది హరీన్ తో "హరీన్........మనవాళ్ళందరూ చేసిన వాగ్దానాలు విన్నావు కదా!"
"విన్నానమ్మా! అందరూ కలిసి ప్రతిఫలం ఏమీ ఆశించకుండా ఒక పిక్చరు తీసి నీకు ఉచితంగా ఇస్తామన్నారు"
తలపంకించి అంది ఆమె. "ఆ పిక్చరులో హీరోవి నువ్వే హరీన్!"
మృదువుగా అన్నాడు హరీన్. "ఆ సంగతి ప్రత్యేకంగా చెప్పాలా అమ్మా! ఇది నా సంస్థ! ఇది నా ఇల్లు! నేను మీ వాడిని. మన సొంత పిక్చరులో నేను యాక్ట్ చెయ్యకపోతే మరెవరు చేస్తారు!"
ఆప్యాయంగా అతనివైపు చూసి అంది ఆమె.
"పిక్చరుకు రఘుకుల తిలక్ గారే డైరెక్టరు. అయన బాల్స్ డేట్స్ ఇస్తామన్నారు మనకి. సబ్జెక్టు కూడా ఒకటి రెండు రోజుల్లో ఫైనలైజ్ అవుతుంది. అవగానే నీతో చెబుతాను."
ప్రారంభించబోయే కొత్త ప్రాజెక్టుని గురించి చెబుతుంటే, ఆమె దుఃఖం కొంచెం మరుగునపడినట్లు గమనించాడు హరీన్. అవును........పోయినవాళ్ళతో బాటు, మనమూ పోలేం బాధనుంచి దృష్టిని మళ్ళించడానికి మరో వ్యాపకం ఏదన్నా ఉండాలి. ఆమె వెంటనే కొత్త పిక్చరు మొదలెట్టడం చాలా మంచిది. అన్ని విధాలా!
సెలవు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు హరీన్. ఆ తర్వాత రెండు రోజుల పాటు పరిశ్రమలో చాలామందిని కలిశాడు. ఎవరితో మాట్లాడుతున్నా కూడా, అతనికి కలిగింది ఒకే ఫీలింగు!
తనని తప్పించుకోవడానికి చూస్తున్నారు అందరూ. అవాయిడ్ చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారు.
ఎందుకని? ఎందుకేమిటి - ప్లాప్ హీరో తను ఇప్పుడు!
అంతర్జాతీయ మహానటుడు మార్లిన్ బ్రాండో ఒకసారి చెప్పిన విషయం గుర్తొచ్చింది హరీన్ కి. "విజయం సాధిస్తే నీరాజనాలు పడుతుంది ఈ సినీప్రపంచం. అపజయం పొందితే, చర్మవ్యాధి వచ్చినవాడిని చూసినట్లు అతిహీనంగా చూస్తుంది!" ఎంత నిజం అది!
రెండు రోజుల తర్వాత మళ్ళీ రఘుపతిగారి ఇంటికి వెళ్ళాడు హరీన్.
"సబ్జెక్టు రెడీ అయినట్లేనా అమ్మా!" అన్నాడు రఘుపతి గారి భార్యతో.
"స్క్రిప్టు కూడా రెడీ అయింది హరీన్!" అని లోపలికి వెళ్ళి, ఒక ఫైలు తెచ్చి ఇచ్చింది ఆమె.
చదవడం మొదలెట్టాడు హరీన్. చదువుతుంటే అతని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి.
అ ఫైలు లో ఉన్న కధ తను నటించిన ఒక సిల్వర్ జూబ్లిలీ హిట్ పిక్చరు కధే.
అవే ఇన్సిడెంట్స్ ఉన్నాయి దీనిలో.
దాదాపు అవే డైలాగులు.
అచ్చం అలాంటి పాటలే. అవే లోకేషన్లు అవే మారువేషాలు, అవే జోకులు.
కానీ అంతకు మించిన విషయం మరొకటి ఉంది.
ఒక చిత్రం విజయవంతం అయితే మళ్ళీ దాదాపు అదే పక్కిలో వరుసగా మరికొన్ని సినిమాలు తీసెయ్యడం ఇండస్ట్రిలో రివాజు.
దెబ్బతిన్న ప్రోడ్యుసర్లు కొంతమందిని అడుకోబోయి, ముందు వెనుకలు ఆలోచించకుండా తను ఒప్పేసుకున్న నాలుగు చిత్రాలూ దాదాపు ఇదే మూస కధతో తయారయ్యాయి.
ఇలాంటి కధతో వచ్చిన మొదటిసినిమా సిల్వర్ జూబిలీ అయితే, మిగతా బాలుగు ఈ నెలలో రిలీజయి మట్టికొట్టుకుపోయాయి.
తనని సూపర్ ప్లాప్ హీరోని చేసింది ఈ నాలుగు సినిమాలే.
మళ్ళీ అలాంటి కధతోనే మరో సినిమా తీస్తే!
ఇట్ విల్ బీ షీర్ నాన్సెన్స్!
సంకోచంగా అన్నాడు హరీన్ "అమ్మా........ఈ సలహా ఎవరు ఇచ్చారు మీకు?"
వెంటనే ఆమె కళ్ళలో కొద్దిగా తీవ్రత చోటు చేసుకుంది. "ఇంకొకరి సలహా నాకెందుకు? ఇది నా ఆలోచనే!" అంది.
"ఈ పిక్చరు అడదమ్మా!"
"అశుభాలు పలుకుతున్నావా హరీన్?"
తలవంచుకున్నాడు హరీన్. ఈ ఇండస్ట్రిలో సెంటిమెంట్లు, మూడనమ్మకాలు చాలా ఎక్కువ.
"కాదమ్మా...........మీమీద అభిమానంతో జాగ్రత్తపడమని హెచ్చరిస్తున్నాను."
కటువుగా అంది ఆమె. "హరీన్! నీకు ఇష్టం లేకపోతే సూటిగా చెప్పు. ఈ డొంక తిరిగుడు మాటలు వద్దు"
ఈటేల్లా నాటుకుంటున్న ఆ మాటలకు విలవిల్లాడి పోయింది హరీన్ మనసు.
"అమ్మా!" అన్నాడు వివ్వాలంగా.
"ఇంక నువ్వు వెళ్ళు! నాకు చాలా పనులు ఉన్నాయి" అని విసవిస లోపలికి వెళ్ళిపోయింది ఆమె.
హతాశుడై ఇంటికి తిరిగివచ్చాడు హరీన్.
అతను ఇంటికి చేరేసరికి, సెన్సేషనల్ జర్నలిస్టు ధనుంజయ్ అక్కడే అతనికోసం కాచుకు కూచుని ఉన్నాడు. హరీన్ ని చూడగానే ఉద్విగ్నంగా ఒక వార్త చెప్పాడు అతను.