విజ్ఞత రిస్ట్ వాచీ చూసుకుంది. "ఇంకో పావుగంటలో మా ఫాదర్ దగ్గరకు బయల్దేరదాం" అంది.
మరో పది నిమిషాలు గడిచాయి. ఆ హోటల్ పై భాగంలో కూడా రెస్టారెంట్ సెక్షనుంది. పైనుంచి మెట్లు దిగి వస్తోన్న యువతీ యువకులని చూసి రాజాచంద్ర ఉలిక్కిపడ్డాడు.
అతని మొహంలోని మార్పుని గమనించి విజ్ఞత అటుకేసి చూసింది.
"ఆ అమ్మాయి..."
"వినూత్న... షీ ఈజ్ మై డాటర్."
"అతను?"
"తెలీదు ఎప్పుడూ చూడలేదు."
కానీ విజ్ఞత అతన్ని గుర్తుపట్టింది. పేరయితే తెలీదుగానీ రెండు, మూడుసార్లు తనని వెంటాడిన యువకుడతను. వినూత్న అతనితో కలసి తిరిగుతూ ఉండడం ఆమె కేమిటోలా అనిపించింది. కాని బయటికేమీ వ్యాఖ్యానించలేదు.
ఒకటి, రెండు సందర్భాలలో పిల్లల గురించి రాజాచంద్ర మాటల్లో ఆందోళన, అతనిలో కలవరపాటు కలగటం ఆమె గమనించింది. కాని అతను తమతట తాను చెప్పకుండా తాను జోక్యం చేసుకోవటం సమంజసం కాదని ఊరుకుంది.
కాసేపున్నాక ఇద్దరూ బయటికొచ్చి కారెక్కారు. విజ్ఞత అతని పక్కన కూర్చుంది.
సరిగ్గా కారు కదలబోతున్న సమయానికి షాపింగ్ కోసం ఎదురుగా ఉన్న కాంప్లెక్స్ లోకి వెళ్ళిన వినూత్న ధర్మేంద్ర బయటికొచ్చారు. ఇద్దరి దృష్టీ వాళ్ళమీద పడింది.
వినూత్నకా అమ్మాయి మొహం సరిగ్గా కనిపించలేదు. కాని తండ్రి పక్కన ఎవరో అపరిచిత అమ్మాయి కారులో తిరుగుతూ...
ఆమె మనసంతా అదోలా అయింది.
ధర్మేంద్ర విజ్ఞతను గుర్తుపట్టాడు. తానాలో ఎవరయితే యౌవన భగభగలు రేపి అందకుండా తప్పించుకుందో ఆ పొగరుబోతు పిల్ల...
ఈ వయసులో కూడా మీ ఫాదర్ గర్ల్ ఫ్రెండ్స్ తో తిరుగుతూ డ్యాషింగ్ గా ఉన్నందుకు మెచ్చుకోవాలి" అన్నాడు.
తన తండ్రిని గురించి అతనలా మాట్లాడం ఆమెకు బాధ కలిగింది. అయినా బయటికేమీ అనలేకపోయింది.
"ఆ అమ్మాయి."
"నాకు తెలుసు హి ఈజ్ ఎ వెరీ బాడ్ గర్ల్ మీ ఫాదర్ ని అలాంటి అమ్మాయి పక్కన చూడటం... నేను చాలా హర్ట్ అయాను" అన్నాడు ధర్మేంద్ర.
* * *
రాజాచంద్ర, విజ్ఞత రమణప్రసాద్ గారి ఆఫీస్ ముందు కారు దిగారు.
"రండి" అని ఆమె రాజాచంద్రను లోపలకు తీసుకెళ్ళింది.
"నాన్నగారూ! నేను చెబుతుంటానే ఈయన..." అంటూ రాజాచంద్రను తండ్రికి పరిచయం చేసింది.
రమణప్రసాద్ గారికి ఏభై ఏళ్ళుంటాయి. మనిషి చాలా గంభీరంగా, హుందాగా ఉన్నాడు.
"కూర్చోండి" అన్నాడు చాలా మర్యాదగా.
"అమ్మాయ్ మీ గురించి చాలాసార్లు చెప్పింది నేనే వచ్చి మిమ్మల్ని కలుసుకుందామనుకున్నాను. పనుల తొందరలో రాలేకపోయాను."
"ఫరవాలేదులెండి విజ్ఞతతో పరిచయం నాకు తమాషాగా జరిగింది. అప్పట్నుంచీ మీతో పరిచయం చేసుకోవాలన్న అభిలాష నాలో ఏర్పడింది" అన్నాడు రాజాచంద్ర.
విజ్ఞత ఏదో పనిమీద వెళ్ళినట్లు బయటికెళ్ళింది. గదిలో ఇద్దరే కూర్చున్నారు.
రమణప్రసాద్ కూల్ డ్రింక్స్ తెప్పించాడు.
రాజాచంద్ర మధ్య మధ్య అతనివంక పరిశీలనగా చూస్తున్నాడు.
తాను యూనివర్శిటీలో చదివే రోజుల్లోగాని, గతంలోగానీ అతన్నెప్పుడైనా చూశాడా? జ్ఞాపకం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. గుర్తు రావటంలేదు.
"మీరు ఆంధ్రా యూనివర్శిటీలో ఎప్పుడయినా చదివారా?" అనడిగాడు.
"ఏం?"
"నేను చదివాను నేను చడువుకునే రోజుల్లో మిమ్మల్ని చూసినట్లుగా గుర్తుంటే..."
రమణప్రసాద్ నవ్వాడు. "నా ఎడ్యుకేషనంతా బాంబేలో అయింది. తర్వాత విశాఖపట్నం కేసి వచ్చాను గానీ అంతకుముందెపుడూ మిమ్మల్ని చూడలేదు" అన్నాడు.
తన ఆలోచనలు ఎటు దారితీస్తున్నాయో.... తనమీద తనకే అసహ్య మేస్తుంది.
ఒక మనిషి పరిస్థితుల ప్రాబల్యాన్ని బట్టి ఎలా మృగంలా తయారవుతాడో అనటానికి తన ప్రవర్తనే తార్కాణం.
"మీకు విజ్ఞత ఒక్కతే కూతురనుకుంటాను" అన్నాడు.
"అవును."
"స్ట్రేంజ్! అలా ఒక్కరే పుట్టి ఆగిపోవటం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది."
రమణప్రసాద్ నవ్వాడు. "నాకు విజ్ఞతలాంటి ఒక్క కూతురు చాలు. అందుకే అలా జరిగి ఉంటుంది."
"అన్నట్లు రేపాదివారం కదా రేపు సాయంత్రం ఫ్రీగా ఉంటారు కదా."
"ఉంటాను ఏం?"
"మా ఇంటికి రావటానికి వీలుంటుందేమోనని."
"సర్టెన్లీ అన్నాడు రమణప్రసాద్ నిజానికి రాజాచంద్ర చాలా అవకతవకగా మాట్లాడాడు. రమణప్రసాద్ కాకుండా ఇంకో మనిషైతే తప్పకుండా చిరాకుపడి ఉండేవాడు. కాని అతనికి మాత్రం రాజాచంద్ర మీద సదభిప్రాయమే కలిగింది.
* * *
రాత్రి పదిగంటలు దాటింది. రాజాచంద్ర, విశారద ఇద్దరూ కలిసి డిన్నర్ తీసుకున్నారు. మామూలుగా భోజనం చేసేటప్పుడు సీరియస్ గా ఉండకుండా చాలా ప్లెజంట్ గా మాట్లాడుకునేవారు. కాని ఇవేళ ఇద్దరూ ముభావంగానే ఉన్నారు.