Previous Page Next Page 
న్యాయానికి అటూ-ఇటూ పేజి 39

   

    "ఇక్కడ చుట్టుప్రక్కల ఇళ్ళు లేవా?"
   
    "ఉన్నాయి. కాని ఆమె పెద్ద వాళ్ళ పేర్లేమీ తెలీదు. యెలా వాకబు చేస్తాం?"
   
    "నిజమే. ఆ రోజు ఆమె సిస్టర్ని కూడా చూశావు కదా. అటూ ఇటూ చూస్తూ పోనియ్యి అశోక్! వాళ్ళెక్కడైనా కనిపిస్తారేమో!"
   
    మరో పదినిముషాలు గడిచాయి.
   
    "ఇక్కడా కనబడలేదు జూలీ!"
   
    "సరే తిరిగి పోనియ్ అశోక్, మనం వెళ్ళిపోదాం."
   
    అశోక్ కారు వెనక్కి త్రిప్పాడు.
   
    అక్కడ వీస్తున్న గాలి, ఊహిస్తున్న వాతావరణం యిదివరకు వచ్చిన ప్రదేశం యిది కాదూ అని ఆమెకు చెప్పినట్లయింది. ఎలా తెలిసిందంటే....? అదంతే కొన్ని విషయాలు యెవరూ చెప్పకుండానే అర్ధమవుతూ వుంటాయి.
   
    కాని వేరేచోటుకు తీసుకొచ్చి అబద్దం చెప్పవలసిన అవసరమేమిటో జూలీకి అర్ధంకాలేదు.
   
                                      18
   
    పి. డబ్ల్యు ఫోర్ గా డాక్టర్ మాలతి విచారణ మొదలయింది.

    ప్రదీప్ ఛీఫ్ ఎగ్జామినేషన్ ప్రారంభించాడు.
   
    వృత్తీ వగైరా పరిచయాలకు సంబంధించిన ప్రశ్నలన్నీ పూర్తయినాయి.
   
    "చూడండి, మీరెన్నాళ్ళబట్టి ప్రాక్టీస్ చేస్తున్నారు?"
   
    "అయిదేళ్ళబట్టి."
   
    "ఎక్కువ ఏ విభాగంలో ప్రాక్టీస్ చేస్తుంటారు?"
   
    "గైనకాలజీ అండ్ ఆబ్ స్ట్రిటిక్స్ లో."
   
    "అంటే స్త్రీలకు సంబంధించిన కేసులూ, కాన్పులకు సంబంధించిన కేసులూ చూస్తూ వుంటారు. అవునా?"
   
    "అవును."
   
    "మీకు నర్సింగ్ హోం వుంది కదూ?"
   
    "ఉంది."
   
    "మీ దగ్గరకు సాధారణ కేసులు కాకుండా సీరియస్ కేసులుకూడా వస్తూ వుంటాయా?"
   
    "అవును."
   
    "వేళకాని వేళ... అంటే రాత్రివేళ కూడా కొన్ని కేసులు వస్తూవుంటాయి."
   
    "అవును."
   
    "అలా వేళకాని వేళల కేసులు, ఎందుకు వస్తూ వుంటాయంటారు?"
   
    "ఎమర్జన్సీ అయితే డాక్టరు ప్రాణాలు కాపాడతాడనే ఉద్దేశంతో వస్తారు."
   
    "అటువంటి సమయాలలో మీరెలా రియాక్ట్ అవుతారు?"
   
    "నా దగ్గరకు వచ్చినది ఒక మనిషి అనీ, తనకి ప్రాణం, మనస్సు, స్పందన, ఆలోచన అన్నీ వుంటాయనీ, నామీద యెంతో ఆశపెట్టుకుని వచ్చిన వ్యక్తిపట్ల బాధ్యతగా ప్రవర్తించకపోతే వాళ్ళ జీవితాలు నరకతుల్యంగా మారిపోతాయన్న సత్యమెరిగి ప్రవర్తిస్తాను."
   
    "ఒక డాక్టరుగా మీ దగ్గరకు వచ్చిన పేషెంట్ పట్ల అతి జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం వుందని ఒప్పుకుంటారు."
   
    "అవును."
   
    "మీ దగ్గరకు వచ్చింది ఒక జీవి అనీ, ఆ జీవికో జీవితచరిత్ర వుందనీ వప్పుకుంటారు?"
   
    "అవును."
   
    "ఏ పరిస్థితులవల్ల కానీ, అంటే యింట్లో జరిగిన గృహకలహాలవల్ల కానీ, వంట్లో ఆరోగ్యం సరిగ్గా లేకగాని లేక ఇంకేదైనా కారణాలవల్ల కానీ మనస్సు సరిగ్గా లేకపోతే కేసు చూసేటప్పుడు ఏకాగ్రత కుదరకపోతే ఆ డాక్టరేమి చెయ్యాలి?"
   
    "ఎమర్జన్సీ కాకపోతే డెసిషన్ తీసుకునేందుకు వాయిదా వెయ్యాలి. ఎమర్జన్సీ అయితే, తాను సరిగ్గా చూడలేని పరిస్థితిలో వుంటే నేను యింకో సమర్ధుడైన డాక్టర్ కి రిఫర్ చెయ్యాలి."
   
    "అలా చెయ్యకుండా ఓవర్ కాన్ఫిడెన్స్ తోగాని, హడావుడిగా గాని, నిర్లక్ష్యంతోగాని డాక్టరు కేసు ట్రీట్ చెయ్యవచ్చునా?"
   
    "చెయ్యకూడదు."
   
    "అలా చేస్తే దాన్నేమిటంటారు?"
   
    "డాక్టర్ నెగ్లిజెన్స్ అంటారు."
   
    "మీరు కూడా ఒక డాక్టరు. ఒకవేళ తోటి డాక్టరు ఏ పరిస్థితుల వల్ల కానీ అలా నెగ్లిజెన్స్ తో ప్రరర్తించటాన్ని మీరు సమర్ధిస్తారా?"
   
    "సమర్ధించను."
   
    "రాధ కేసుగురించి మీకు తెలుసా?"
   
    "తెలుసు."
   
    "ఎలా తెలుసు?"
   
    "పేపర్లన్నింటిలో రావటంవల్ల ఆ కేసుకు చాలా ప్రాచుర్యం ఏర్పడింది. ఒక డాక్టరుగా కలిగిన ఉత్కంఠత వల్లనే వెళ్ళి.... నే వెళ్ళి" ఆమె గొంతు కొంచెం వణికింది.
   
    నిజం చెప్పటానికి వచ్చినవారు కూడా కేసు బలంకోసం న్యాయస్థానాల్లో కొన్ని అబద్దాలు చెప్పక తప్పదు.
   
    "నే వెళ్ళి.... పరిచయం చేసుకున్నాను."
   
    "రాధతో మాట్లాడారా?"

    "మాట్లాడాను."
   
    "రెండుకళ్ళు పోగొట్టుకుని బంగారంవంటి భవిష్యత్తు అంధకార బంధుమైపోయిన ఆ చిన్నారిపాపని చూస్తే ఏమనిపించింది?"
   
    మాలతి కళ్ళు చెమ్మగిల్లినాయి.
   
    "ఆమెకు ఆ ఆపరేషన్ చేసిన డాక్టర్ కొంచెం జాగ్రత్త వహించివుంటే అభమూ, శుభమూ తెలీని ఆ పాపజీవితం చీకటిమయమై వుండేది కాదు గదా అనుకున్నాను."
   
    "ఒక డాక్టరుగా, ఎన్నో రోగులతో పరిచయమున్న డాక్టరుగా రాధకు రెండుకళ్ళూ పోవడంలో తప్పెవరిదని మీరు భావిస్తున్నారు?"
   
    "ముమ్మాటికీ ఆపరేషన్ చేసిన డాక్టరుదే అని భావిస్తున్నాను."
   
    ఛీఫ్ ఎగ్జామినేషన్ పూర్తయింది.
   
    ప్రతాపరావు క్రాస్ ఎగ్జామినేషన్ మొదలుపెట్టాడు.
   
    "మీకు సాక్ష్యం చెప్పటానికి సమన్స్ వస్తే వచ్చారా? మీ అంతట మీరే వచ్చారా?"
   
    మాలతి కొంచెం తడబడింది. ప్రదీప్ తనకు ముందుగానే చెప్పిన సమాచారం గుర్తుతెచ్చుకుని "సమన్స్ వస్తే వచ్చా" అన్నది.
   
    మేజిస్ట్రేట్ గారు రాసుకుంటున్నారు.
   
    "మీరు, లాయర్ ప్రదీప్ గారు బాగా స్నేహితులూ, కాలేజీలో చదివేరోజుల్లో క్లాస్ మేట్సూ అనుకుంటాను."
   
    మాలతి కాదనటానికి అవకాశం లేకపోయింది.
   
    "పరిచయం వుంది" అంది.
   
    "మీ కజిన్ ఒకతను-డాక్టరు విదేశాలనుంచి తిరిగి వచ్చిన సందర్భంలో ఏర్పాటయిన పార్టీకి ప్రదీప్ గారు వచ్చారా?"
   
    "ఊళ్ళోని లాయర్లూ, డాక్టర్లూ చాలామంది వచ్చారు. వాళ్ళతోబాటు ప్రదీప్ గారు కూడా వచ్చి వుండవచ్చు."
   
    "సరిగ్గా చెప్పండి. మిగతావారి విషయం నేనడగటంలేదు. ప్రదీప్ గారు వచ్చారా? లేదా?"
   
    "వచ్చారు."

 Previous Page Next Page