"శంకూ ఇలాంటి పనిచేశాడా?" ఇంటర్ అప్పారావు నమ్మశక్యం కానట్టు గొణిగాడు.
నిజానికి దూరంగా నిలబడ్డ శంకూకి యిక్కడ జరుగుతున్నదేమిటో బొత్తిగా తెలీదు.
సరిగ్గా ఆ సమయంలో రవి పెత్తనం తీసుకుని రెండు అంగల్లో శంకూని సమీపించి చేయి పట్టుకున్నాడు.
"ఏమిటలా తెల్లమొహం వేసుకుని చూస్తున్నావు.....వచ్చి జవాబు చెప్పు" రజనీ దగ్గరికి లాక్కొచ్చాడు.
అప్పుడు తెలిసింది రజనీకి శంకూ ఎవరో.
"అందరూ చూస్తుండగానే అమాంతం కాలరుపట్టుకుని "ఏం.....నేనికక్డికి సరాసరి ఎలా వచ్చానని ఆశ్చర్యంగా వుందా?.....వచ్చి నీ అసలు బ్రతుకేమిటో బయటపెట్టానని కోపమొస్తుందా?....చెప్పు....నా కడుపులో పెరిగే నీ పాపానికి....."
"....నువ్వంటూన్నదేమిటో నాకస్సలు అర్ధంకావడం లేదు" నీరుగారి పోతూ గొణుగుతున్నాడు. "అసలు నువ్వు..."
"ఎవరూ అని అడుగుతావని తెలుసు....నీ మొహం నేనెప్పుడూ చూడనేలేదని అంటావనీ తెలుసు....నీకు దణ్ణం పెడతాను శంకూ....నాకు అన్యాయం చేయకు....నలుగురిలో తలొంచుకునే పరిస్థితి నాకు కలిగించకు. అమ్మానాన్నలకి జవాబెలా చెప్పను చెప్పు శంకూ.... నాకు అన్యాయం చేయనని అందరిముందు చెప్పు....నేను ఏ నుయ్యో గొయ్యో చూసుకోకూడదూ అంటే...."
రవి ఆమెను సంభాళిస్తూ అన్నాడు__ "మేమంతా ఉన్నాంగా మీకేం భయంలేదు....అలాంటి అఘాయిత్యం చేసుకోనక్కర్లేదు....నా మాట వినండి....."
అదిగో అప్పుడే చూసింది సావేరి బిక్కమొహం వేసుకుని నిలబడ్డ శంకూని__
అందరూ చూస్తుండగానే అతడ్ని చేరుకుంది.
ఏం జరగబోతున్నదీ శంకూ వూహించేలోగానే చాచి చెంపమీద కొట్టింది.
చేయని నేరానికి అందరిముందూ దోషిలా నిలబడిన శంకూ సావేరి నుంచి ఇలాంటి తొందరపాటును ఊహించకపోవడంతో నిర్విన్నుడై పోయాడు.
అందరూ ఉత్కంఠగా చూస్తున్నారు.
"సా....వే....రీ.....నువ్వు...." అప్రతిభుడౌతూనే అన్నాడు శంకూ.
"అసహ్యం వేస్తూంది శంకూ!"
"కానీ నేను....."
"తప్పు చేశావని కాదు. చేయలేవనీ చేయవనీ నాకు తెలుసు. కానీ చేయని తప్పుని అంగీకరిస్తున్నట్టు నిలబడటమూ తప్పే. అందుకే.....అందుకే నువ్వంటే...." సావేరి గొంతు పూడుకుపోయింది.
ఇలాంటి మలుపులు వూహించలేని రవి ఎంత నిశ్చేష్టుడయ్యాడూ అంటే స్నేహితులందరి ముందూ తల తీసినంత పనైంది.
"ఆగు!"
శంకూ అరిచింది ముందుకు రాబోయిన రవిని చూసి కాదు, వచ్చిన పని పూర్తయిన ఉత్సాహంతో వెళ్ళబోతున్న రజనిని చేరుకుంటూ.
"ఎవర్నువ్వు?"
రజని తొట్రుపడింది శంకూ అడ్డం నిలబడగానే.
"నీకూ నాకూ ఎక్కడ పరిచయం?"
"......"
"నిన్ను నేను పెళ్ళిచేసుకుంటానని మోసం చేశానా?"
"....."
"నీ కడుపులో నా బిడ్డ పెరుగుతున్నాడా?"
ఏ ప్రశ్నకీ ఆమె దగ్గర జవాబు లేకపోవడంతో పైగా అందరి ముందూ దోషిని నిలబడటానికి ప్రిపేరై లేకపోవడంతో ఆమె అతడ్ని దాటుకుని ముందు కెళ్ళబోయింది.
"చెప్పు....ఎందుకిలా చేశావు....?" ఇదంతా ఏమిటో ఇంకా జీర్ణించుకోలేకపోతున్న శంకూ ఈసారి కోపంగా కాదు అర్ధింపుగా అడిగాడు. అవమానించబడటానికి అలవాటుపడిన వాడాయె.....అంతకుమించి ఎలా నిగ్గదీయగలడని.
"ఎప్పుడూ నిన్ను చూడనేలేదే! ఏ అవసరం కోసం ఇలా అబద్దమాడావు?" అప్పటికి శంకూని సమర్ధించే జూనియర్స్ అతడ్ని చేరి ఉద్రేకంగా అన్నారు.
"ఇలా మర్యాదగా అడిగి లాభంలేదు శంకూ! దీన్ని పట్టుకుని పోలీసులకి అప్పచెబితేగాని అసలు సంగతి బయటపడదు"
ఇరకాటంలో పడిపోయిన రజనికిప్పుడు నిప్పులమీద నిలబడినట్టుంది ఒక పథకంలో చిన్న సన్నివేశంలో నటించాలనివస్తే ఇదేమిటి యిలాంటి మలుపు తిరిగింది.
"కమాన్" ఎప్పుడు వచ్చాడో అక్కడికి సురేంద్ర ఆమె చేతిని పట్టుకోబోయాడు "నడు పోలీస్ స్టేషన్ కి...."
"అవును.....పోలీసులకి అప్పచెప్పాలి" చాలామంది విద్యార్ధులు సమర్ధింపుగా అరిచారు.
"వద్దు....ఆమెని వెళ్ళనివ్వండి...."శంకూ జోక్యం చేసుకున్నాడు.
విస్తుపోయి చూశారంతా.
"శంకూ...." సురేంద్ర మరేదో అనబోయాడు.
"ప్లీజ్...సురెంద్రా" అర్ధోక్తిగా వారించాడు శంకూ.
రజని నడుస్తూంది....నడుస్తూనే సన్నగా ప్రకంపిస్తూంది...నాలుగు గోడల మధ్య శృంగారంలో అసాధారమైన మెళకువల్ని ప్రదర్శించగల తెగువున్న రజని ఇక్కడ చాలా జుగుప్సాకరమైన స్థితిలో కూరుకుపోయినట్టు కుంచించుకు పోతూనే నడుస్తూంది.
ఆమె ముప్పై అడుగుల దూరం నడిచిందో లేదో ఆమెను సమీపించిన శంకూ మృదువుగా పిలిచాడు "రజనీగారూ!"
క్షణం ఆగింది నిర్లిప్తంగా చూస్తూ....
"మిమ్మల్ని 'గారూ' అని సంబోధించడంలో నా ఉద్దేశ్యం ఆడవాళ్ళపై నాకు చ్జాలా గౌరవం అని నిరూపించుకోమనికి కాదు. తప్పు ఒప్పుల్నీ, మంచిచెడుల్నీ నిర్ధారించగలిగే తెలివితేటలు నాకు లేవు. మీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి నాన్నెవరో మీ మాటే నిజమైతే మీలో నాకు కనిపించింది అమ్మ మాత్రమే....బహుశా నాకు తెలియకుండానే రాలిపోయిన అమ్మ కూడా ఒకనాడు ఇలాగే సంఘం ముందు దోషిగా నిలబడి వుంటుంది అనిపించింది. కాబట్టే మిమ్మల్ని సగౌరవంగా పంపించాలనుకున్నది శలవ్."
కనుకొసలనుంచి రాలిపడబోయిన ఓ నీటి బొట్టును ఆపాలని ప్రయత్నించలేదు రజని.
మసకబారుతున్న కళ్ళలో నుంచి చూసింది వెళుతున్న శంకూని. మనసు సంద్రాన ప్రతిబింబించిన నిర్మల చంద్రుడే అనిపించాడో లేక సావేరి గుండె గుడిలో నిలవాల్సిన అరుదైన దేవుడే కనిపించాడో శపించాలని వచ్చిన రజని మారిన మనసుతో ముందుకు నడిచింది.
అందరూ చూస్తూ వున్నారు. తల వంచుకుని క్లాసు వేపు వెళుతున్న శంకూని....
కానీ ఓటమిని జీర్ణించుకోలేని ఉక్రోషంతో రవి మాత్రం ఇంత జరిగిన తర్వాత కూడా ఊరుకోలేకపోయాడు.
"తెలివైన బాలుడివిరా శంకూ....కాబట్టే తెలివిగా దూరం తీసుకెళ్ళి నచ్చజెప్పి మరీ పంపావు!"
"రవీ...." సురేంద్ర జోక్యం చేసుకోబోయాడు.
"యస్ మిస్టర్ సురేంద్రా! ఒకవేళ ఆమె నిజంగా మోసగత్తే అయితే పోలీసులకి అప్పచెప్పొచ్చుగా... ఎందుకు మీ అందర్నీ వారించాడు. మొత్తం వ్యవహారం బయటపడుతుందనేగా" తార్కికంగా మరో విశ్లేషణకి సిద్దపడబోతుంటే ఎవరో నవ్వినట్టనిపించి పక్కకి తిరిగాడు రవి.
సావేరి నిలబడి వుంది చాలా సమీపంలో.
అదికాదు!
కోపాన్ని పంటి బిగువున నిభాయించుకుంటూ శంకూ మాటలలో చెప్పని ఔన్నత్యాన్ని కళ్ళనీటి పొరలతో అక్కడందరికీ అర్ధమయ్యేట్టు చాలా విజయగర్వంతో నవ్వుతూంది.