ఆ అనుభవం వాళ్లిద్దరి పరిచయాన్ని సరికొత్త మలుపు తిప్పింది.
టీ.వీ. ప్రోగ్రామ్ ల కన్నా అందులో వచ్చే పాత సినిమాలకన్నా ఆ తరువాత భరణితో నడవడమే ఎంతో బావుంది ఇందుమతికి.
సినిమా అయిపోయాక ఇద్దరూ కలిసి నడుస్తూ ఎన్నో కబుర్లు చెప్పుకునేవారు. ఒకరి మనసు మరొకరి ముందు పరుచుకునేవాళ్ళు. అయినా ఆ కాసింత టైమ్ ఒక సెకనులా తోచేది. అందుకే సాయంకాలాలు, చీకట్ల లోకానికి నల్లటిచీరను చుట్టబట్టే సమయాల్లో ఊపిబయటున్న అంకాళమ్మ రావిచెట్టుకింద కలుసుకునేవాళ్ళు. ఇప్పుడు ఇందుమతి వెళుతున్నది అక్కడికే.
"ఎవరూ?" పక్కనుంచి వచ్చిన వ్యక్తి పలకరిస్తే ఠక్కుని ఆగిపోయింది.
ఎవరా అని పరిశీలనగా చూసింది. అతను రామదాసు. తన తల్లి శతరూప పనిచేసే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనే అతనూ పనిచేస్తుంటాడు.
"నేను- ఇందుమతిని"
"నువ్వా అమ్మా- ఇంతరాత్రి ఎక్కడికి?" అని అడిగాడు.
ఏం చెప్పాలో తోచలేదు ఆమెకి. అబద్ధం చెప్పడం ఎంత కష్టమో అప్పుడు తెలిసింది. "చిన్నపనిలే" అని అక్కణ్ణుంచి వడివడిగా నడిచింది.
అంకాళమ్మ రావిచెట్టు దగ్గర పడింది.
ఆమె వెళ్ళగానే భరణి ఎదురొచ్చాడు. చొరవతో చేయి పట్టుకోబోయాడు. ఆమె సుతారంగా చేయి పక్కకు తీసుకుని అతనికి అందకుండా జాగ్రత్తపడింది. అతని స్పర్శ తగిలితే మాటలు ఎక్కడికో పారిపోతాయి. తన నోరు పెగలదు. అందుకే అతనికి చేయి ఇవ్వకుండా తప్పించుకుంది. రావిచెట్టు చప్టామీద ఇద్దరూ కూర్చున్నారు.
సన్నటి చలి ఇద్దర్నీ మరీ దగ్గరికి జరపడానికి ప్రయత్నిస్తోంది.
"ఇంత ఆలస్యం అయిందేం?" అతను ఆమె కళ్ళల్లోకి తన చూపును తోస్తూ ప్రశ్నించాడు.
"మగవాడివి- అందులోనూ ఒంటరివాడివి. ఎప్పుడనుకుంటే అప్పుడు ఒంటికి రెక్కలు కట్టేసుకుని ఇక్కడికి వాలిపోవచ్చు. మరినేనూ- ఆడపిల్లని, అమ్మనీ, అమ్మమ్మనీ తప్పించుకొని దొంగతనంగా ఇంత దూరం రావాలి. ఎంత కష్టమో ఆలోచించు"
"నిజమేగానీ- ఇక్కడ నీకోసం నిముషాలని జపమాలలా తిప్పుతూ తపస్సు చేయడం నాకూ కష్టమే" అని అతను ఆమె భుజం మీద చేయి వేశాడు.
వెచ్చటి ఉన్ని దుప్పటిని కప్పుకున్నట్టు అనిపించింది ఆమెకి. అతను ఆమెను తనవైపుకు తిప్పుకోబోయాడు. అతను తప్పిన డైరెక్షన్ లో ఆమె తిరిగి వుంటే ఆమె ఎద అతని ఛాతీకి నొక్కుకుని వుండేది. ఇది గ్రహించే ఆమె తిరగకుండా తన శరీరాన్ని నిలదొక్కుకుంది.
"ముందు ఏమైనా మాట్లాడు" అంది భుజంమీదున్న అతని చేతిని తీసేస్తూ.
"ఇంత అందాన్ని పక్కన పెట్టుకుని ఏం చేతకాని వాడిలా చేతులు ముడుచుక్కూర్చోవడం నావల్ల కావడంలేదు"
"ఏం చేద్దాం- ఆ మూడు ముళ్ళూ పడేవరకు మనిద్దరం స్నేహితులం. ఆ తరువాత భార్యాభర్తలం.
అప్పుడు నీ ఇష్టం. ప్రతి రాత్రినీ శివరాత్రి చేయమన్నా నాకు అభ్యంతరం లేదు"
"మరి ఆ మూడుముళ్ళూ ఎప్పుడు వేసెయ్యమంటావ్?"
"దానికి టైమ్ రావాలిగా. మన ప్రేమ విషయం చెప్పి అమ్మ ఏం అంటుందో చూడాలి" అంది ఇందుమతి.
"అమ్మను అమ్మమ్మను అడిగితే వాళ్ళు ఖచ్చితంగా వద్దంటారు"
"మరి ఏం చేయడం?"
"శుభ్రంగా లేచిపోవడమే"
"తన బతుక్కీ అర్థం నేనేనని అనుకునే అమ్మ ఏమైపోతుంది అప్పుడు? బాధ భరించలేక చచ్చిపోతే?"
"ఇదేమన్నా సినిమానా? టీ.వీ.లోని ప్రాయోజిత సీరియల్లా అలా జరగడానికి. కూతురు లేచిపోతే గుండె పగిలి చచ్చిపోదులే. ఏదో రెండు రోజులు బాధగా వుంటుంది. తరువాత దానంతట అదే సర్దుకుంటుంది. కాబట్టి అనవసర భయాలు పెట్టుకోకు. ఇక నా వల్లకాదు. ఇధ్దరం వెళ్ళిపోదాం."
అతను మళ్ళీ భుజంమీద చేయి వేశాడు.
ఆమె అభ్యంతరం చెప్పలేదు. అదే అరుదుగా అతని చేయి మరింత కిందకు దిగి ఆమె ఎత్తయిన గుండ్రటి ఎదమీద పియానో నొక్కులను ప్రాక్టీసు చేస్తోంది. ఆమె డీప్ ఆలోచనల్లో పడిపోవడం వల్ల పట్టించుకోలేకపోయింది.
"నువ్వు ఎన్నైనా చెప్పు. అమ్మకు చెప్పకుండా....." అని ఆగింది. అలా పూర్తిగా ఊహించుకోవడానికైనా ఆమెకి ఏదోగా వుంది.