Previous Page Next Page 
సంధ్యాకళ్యాణం పేజి 4

   
    "ఇదిగో, చూడు, బాగా ఆకలేస్తున్న వాడికి ముందు అన్నం పెడితే ఏం చేస్తాడు? ఆవురావురుమని తినేస్తాడు. అన్నం దొరకదనుకో! కళ్ళు మూసుకు పడుకొంటాడు. నీ స్థితీ అంతే. మనసులో రేగే కోరికలకి అవకాశాన్ని కలిగించకు, దారులన్నీ మూసెయ్యి! అదే ఎగిరి ఎగిరి కళ్ళు మూసుకు పడి ఉంటుంది."

    "నా వల్ల కాదనిపిస్తూందత్తా!"

    "ఎందుకు కాదే? పెద్దత్త చచ్చిపోయి ఏడాది కాలేదు! నేనింకా నీ కళ్ళముందే ఉన్నాను. మా జీవితాలకి ఏమైనా మచ్చలున్నాయా?"

    చచ్చిపోయిన పెద్దత్త, కళ్ళెదురుగా ఉన్న యీ మేనత్త ఇద్దరూ బాలవితంతువులే. వివాహితులై, పదేళ్ళకే వితంతువులై శాశ్వతంగా పుట్టింట్లో ఉండిపోయారు. చాలా నిగ్రహంగా భగవన్నామ సంకీర్తనంలో కాలం వెళ్ళబుచ్చుకొని పోయింది పెద్దత్త. ఇప్పుడీ చిన్నావిడా అక్కగారి అడుగు జాడల్లోనే ఉంది.

    ఆత్మనిగ్రహానికీ, జీవితంలో ఏ మచ్చా లేకుండా ఉండడానికి వీళ్ళని ఉదాహరణగా చెప్పుకొంటారు ఊళ్ళో జనం.
    కాని, ఏ రుచీ తెలియనివాళ్ళు వాళ్ళు!

    భర్తతో రెండు సంవత్సరాలు సంసార సుఖం అనుభవించింది తను. తను వాళ్ళలా ఎలా ఉండగలదు? యీ కోరికలు చేసే సందడిని ఎలా తట్టుకోగలదు? రుక్మిణికి ఇదే చింత రాత్రింబవళ్ళు.

    "నా వల్లకాదని అధైర్యపడకు! దొడ్లో పువ్వులున్నాయి! కోసుకొచ్చి మాలలుకట్టి దేవుళ్ళపటాలకు, విగ్రహాలకీ వెయ్యి! నా కెన్నో భక్తి పాటలు వచ్చుకదా, అవన్నీ వ్రాసుకొని నేర్చుకున్నావంటే పాడుకొంటూ బోలెడంత కాలక్షేపం చేయొచ్చు. కొంచెం బండి భక్తిమార్గంలో పడిందా, నువ్వు ఈ వ్యామోహాలనన్నిటినీ జయించినట్టే లెఖ్ఖ!" హితోపదేసం చేసింది మేనత్త సుభద్రమ్మ.

                        *        *        *

    ఆంజనేయులు పొలం నుండి వచ్చాడు ఇంటికి. ఇంట్లోకి వస్తూ ఇంటి, ముందుతోటలో చెట్ల చాటున మోహన్ రావుతో మాట్లాడుతున్న రుక్మిణిని చూశాడు. అతడి మనసులో ఏమిటో భగ్గుమన్నట్టుగా అయింది. చెల్లెలు పసుపుకుంకుమలు పోగొట్టుకొని ఇంటికి రావడమే పెద్ద బాధంటే, ఆమె తప్పటగులు వేసి ఇంటికి చెడ్డపేరు తెస్తే ఇంకెంతబాధ?

    ఆంజనేయులు సరాసరి ఇంట్లోకి వచ్చాడు. "అత్తా!"

    మేనల్లుడి గావుకేకకి అదిరిపోతూ బయటికి వచ్చింది సుభద్రమ్మ.

    "ఇంట్లో పెద్దమనిషిని ఉండి ఎందుకు? ఇంట్లో ఏం భాగోతం జరుగుతుందో చూచుకోవద్దా?"

    "ఏం జరిగిందిరా?"

    "అది మోహన్ రావుతో మాట్లాడుతూంది తోటలో. వాడితో దీనికి ఏం మాటలు? ఇలా నా కళ్ళబడటం మూడోసారి."

    "నా మందలింపులు ఇదివరకే అయ్యాయి! అది నాలాగా, మీ పెద్దత్తలాగా ఈ ఇంటి మర్యాదలు చూసేట్టుగాలేదు! దాని తరహా మాకు భిన్నంగా ఉంది! నువ్వే ఓ సారి చెప్పి చూడు!"

    "నేను రంగంలోకి దిగితే నా స్వరూపం శాంతంగా ఉండదు. గందరగోళం అయిపోతుంది వ్యవహారం. అది నా వరకూ వచ్చేంతగా సృతిమించలేదని నా ఉద్దేశ్యం! మీ ఆడవాళ్ళే సరిచేస్తే బాగుంటుంది!" అనేసి ఆంజనేయులు మేడమీదికి వెళ్ళిపోయాడు.

    సుభద్రమ్మ తోటలోకి వచ్చింది. "రుక్మిణీ, ఏం చేస్తున్నావిక్కడ?"

    "ఈయనతో మాట్లాడుతున్నానత్తయ్యా!"

    "అతడితో నీకేం మాటలొచ్చాయి? ఇంట్లోకి రా!" గదమాయింపుగా పిలిచింది.

    "అతడితో మాట్లాడినంత మాత్రాన ఏం పోయిందత్తా?"

    "పరాయి మగాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం ఏమిటీ అంటే మాట్లాడితే ఏం పోయిందత్తా అంటా ఏమిటే? చివరికి ఈ ఇంటి పరువుని ఏం చేయాలనుకొంటున్నావు?"

    "నాకు నీలాగా, పెద్దత్తలాగా నిర్వికారంగా జీవించడం చేతకావడంలేదత్తా! తోడుకోసం నా మనసు ఆరాటపడిపోతూంది. నేను మోహన్ రావుని చేసుకోవాలనుకొంటున్నాను."

 Previous Page Next Page