Previous Page Next Page 

   
    "పెళ్ళి చేసుకోవాలనుకొంటున్నావా?" ఆవిడ నెత్తిన పిడుగుపడ్డట్టుగా నిర్గాంతపోయింది.

    "నిగ్రహం లేనప్పుడు పెళ్లాడితే తప్పా?"

    "నీ గురించే నువ్వు ఆలోచించడం తప్ప, ఈ కుటుంబం పరువు గురించి ఏమైనా ఆలోచించావా? ఈ ఇంట్లో ఏ ఆడదైనా మళ్ళీ పెళ్ళి చేసుకోవడం ఎప్పుడైనా జరిగిందా?"

    "ఇప్పుడు నావల్ల జరుగుతుంది. కోరికలు నిగ్రహించుకోలేక చిల్లర వేషాలు వేసేకంటే పెళ్ళి చేసుకొని సంసారం చేయడం నా మనసుకు సలక్షణంగా కనిపిస్తూంది. నువ్వూ ఆడదానివేగా? నన్నర్థం చేసుకో! అన్నయ్యకు నచ్చజెప్పు." నిబ్బరంగా అంది రుక్మిణి.

    "ఎంత సిగ్గులేదే నీకు? నిగ్రహం లేదని చెబుతున్నావు. అంత క్రొవ్వు పట్టిందా నీ ఒళ్ళు?" అసహ్యంతో, కోపంతో ఛీత్కారం చేసిందావిడ.

    "కేవలం ఈ శరీరంకోసమే చేసుకోవడంలేదు. మీలాగా మ్రోడులా జీవించడం నాకిష్టంలేదు. నాకో తోడుకావాలి. నా బ్రతుక్కు అర్దం చెప్పేందుకు పిల్లలు కావాలి. నీకొచ్చింది నిరర్ధకమైన పేరు తప్ప, నువ్వెంత పోగొట్టుకొన్నావో నువ్వెప్పుడైనా ఆలోచించావా? పూజల్లో, భజనల్లో నీకేం దొరికింది?"

    ఈ ప్రశ్న ఎప్పుడూ వేసుకోలేదు సుభద్రమ్మ. ఇప్పుడు వేసుకొంటే జవాబు ఏం వస్తుంది? కట్టలు త్రెంచుకొనే కోరికలను అదుపు చేయడంలో ఎప్పటికప్పుడు భయంకరమైన యుద్ధం చేసి తను పొందింది ఏమిటి? 'మనిషంటే ఆవిడ. నిప్పులా జీవించింది.' అన్న ప్రశంస. ఇంకేముంది?

    ఏదో పొందడమేనా ముఖ్యం?

    తన నిష్కళంక చరిత్ర చాలదా తను తృప్తిగా కళ్ళు మూయడానికి?

    కోరికలన్ని అడుగంటి, వయసు ముగ్గినపండులా అయినప్పుడు ఈ తృప్తి చాలుననిపిస్తూంది గాని, వయసు వరదపొంగులా ఉన్నప్పుడు?

    ప్రస్తుతం ఆ వరద పొంగులో, ఆ నరకంలో ఉన్న మేనకోడల్ని ఏమని విమర్శించగలదు? అలాగని సంప్రదాయానికి విరుద్ధంగా వెడుతున్న ఆ పిల్లను సమర్ధించనూ లేకపోతూంది.

    "వాడితో మాట్లాడవద్దని మందలించావా, లేదా?" మేడ దిగుతూ అడిగాడు ఆంజనేయులు.

    "అతడిని పెళ్ళిచేసుకు వెళ్ళిపోతుందట, ఇంకేం మందలించమంటావయ్యా?"

    ఆంజనేయులు నిలువుగా భగ్గుమన్నట్టుగా అయ్యాడు. పెద్ద పెద్ద అంగలువేసుకొంటూ వెళ్ళాడు రుక్మిణి గదిలోకి.

    "ఒక్కటే మాట! నువ్వు వాడిని పెళ్ళి చేసుకు వెళ్ళిపోయేట్టయితే ఈ క్షణమే ఇంట్లోంచి బయటికి నడువు! లేదంటే, కలలోకూడా వాడి ఊసుగానీ, మళ్ళీ పెళ్ళి ఆలోచనగానీ ఎత్తకుండా ఉండిపోతానని మాటివ్వు నాకు."

    మోహన్ తను పెళ్ళి చేసుకోవాలనుకొన్నారు గాని ఇంత హఠాత్తుగా ఎలా? మోహన్ కి ఒక మేనత్త ఉందట. తల్లీతండ్రీ చిన్నప్పుడేపోతే ఆవిడే తీసుకువచ్చి పెంచిందట. ఆవిడను ఇంకా ఒప్పించలేదు ఈ పెళ్ళికి. ఆవిణ్ణి ఒప్పించే ప్రయత్నంలోనే ఉన్నాడతడు. అటువైపు గ్రీన్ సిగ్నల్ పడకుండా తను ఇంట్లోంచి బయటికి నడిచి ఏం చేయాలి?

    "కొంచెం నిదానించురా, ఆంజనేయులూ! ఎలాగో నచ్చజెప్పి నెమ్మదిగా దాన్ని మనందారికి తెచ్చుకోవాలి. గుట్టుగా మన ఇంటి మర్యాద కాపాడుకోవాలిగాని, అలా ఉన్న పళంగా వీధిలోకి తరిమేస్తే ఎలా?" సుభద్రమ్మ నచ్చజెప్పబోయింది.

    "ఇహ ఇంటి పరువు నిలుస్తుందని నాకేం అనిపించడంలేదు, అత్తా! నాఇంటి పరువు తీయదలిచిన మనిషి, నా ఇంట్లోక్షణంకూడా ఉండనక్కరలేదు."

    అన్నగారు కాస్తకూడా అభిమానం లేకుండా అంత ఖచ్చితంగా చెబుతూంటే ఆ ఇంట్లో నిలువడం ఇంక మర్యాదగా అనిపించలేదు రుక్మిణికి. ఉన్నది ఉన్నట్టుగా బయటికి నడిచింది.

    ఈ గోలంతా వింటూ బయట నిలబడి ఉన్నాడు మోహన్. రుక్మిణి బయటికి రాగానే మౌనంగా ఆమెచెయ్యి అందుకొని గేటు దాటాడు.

    "మోహన్, ఇప్పుడు నన్నెక్కడికి తీసుకువెడతావు?" పాలిపోయిన ముఖంతో అడిగింది రుక్మిణి.

    "ఇంకెక్కడికి? మా ఇంటికే."

    "మీ మేనత్త....."

 Previous Page Next Page