'' హేమూ ! క్రిస్టినా కథ ఎవరినైనా తలక్రిందులు చేస్తుంది. కొంచెం పళ్ళరసం తాగి ఏ ఆలోచనా లేకుండా పడుకొని నిద్రపో. సుడిగుండంలో దూకడం మొదట్లో ఆటగానే ఉంటుంది. ''
నా కేదో భయం వేసింది. త్యాగతి భుజంమీద చెయ్యివేసి ఒక నిమిషం కదలకుండా నుంచున్నాను. త్యాగతి మౌనమే అత్యంత శమనమయింది.
ఇంట్లోకి వెళ్ళగానే సాత్కుడి బత్తాయిపండ్లు కోసి, రసం పిండి, వడబోసి, అందులో ద్రాక్షాసవం అరఔన్సు వేసి త్రాగమని నా చేతికిచ్చాడు త్యాగతి. నాకు కొంచం సత్తువ వచింది. మనస్సును ఏదో నిర్వచింపలేని ఆనదము ఆవహించినది.
'' నేను బట్టలు మార్చుకు వస్తాను. పదినిమిషాలు ఉండవూ? '' అని అంటూ లోపలికి పరుగెత్తాను.
నేను మళ్ళీ తిరిగి వచ్చెటప్పటికి నీలిపచ్చని ఎలక్ట్రిక్ దీపపు వెలుతురులో హాలులో పటమటిగోడకు వేళ్ళాడుతూన్న, తాను రచించిన నా చిత్రాన్ని చూస్తూ నిల్చుని ఉన్నాడు. తెల్లటి పట్టులాగున్నూ, మోకాళ్ళవరకు జీరాడుతూ ఉన్న తెల్లటి పట్టుచొక్కా తొడుక్కొని, తెల్లటి వల్లెతో గుమ్మం దగ్గర నుంచుని అతన్ని చూస్తున్నాను.
'' ఆ డ్రెస్సు నీ కందం అన్న ధరించి వచ్చావు? ''
నేను రావడం అతనికి తెలియదనే అనుకున్నాను. నాకు ఆశ్చర్యం వేసింది.
'' ఇది పంజాబీ డ్రెస్సు.''
'' పంజాబ్ వాళ్ళకి పంజాబు డ్రెస్సు అందం.''
'' ఒకరికి అందమైనవి ఇంకొకరికి అందం కాకూడదా?''
'' అందం అనేది వస్తుసంభందాన్ని బట్టి వుంటుంది.''
'' ఆ సంబంధమే మనమూ చూపించకూడదా ?''
'' అన్ని సంబంధాలు మనము చుపించగలమా? వాతావరణం ?''
'' నువ్వూ భోజనానికి వస్తావన్నాను తెలుసునా?''
'' మంచిది'' అని అక్కడ ఉన్న ఓ సోఫామీద కూర్చున్నాడు. సిగరెట్టు ఆష్ ట్రేలో ఆర్పివేశాడు.
ఆ మర్నాడు త్యాగతి తప్ప మేమంతా టెన్నిస్ ఆడుకుంటున్నాము. కల్పమూర్తీ, నేనూ ఓ పక్కని ఉన్నాం. నిసాపతీ, తిర్ధమిత్రుడూ ఓ పక్కని ఉన్నారు. చెట్టుక్రింద క్యాంపు కుర్చిమీద కూర్చుని చెట్లఆకులు చూస్తూ త్యాగతి ఏ లోకాల్లోనో విహారం చేస్తున్నాడు. అతనివి చూచీ చూడని చూపులు. నిశాపతి కళ్ళతో నన్ను కబళిస్తున్నాడు. కల్పమూర్తి అక్షులతో అర్చిస్తున్నాడు. తీర్ధమిత్రుని దృష్టులు నా నిర్మల సౌందర్య స్నాతాలై సానందమ త్తత తాలుస్తున్నవి. త్యాగతి చూపులో ఏమీ గోచరించడం లేదు. అవి అపహాస్యం చేస్తున్నవో, అత్యంత పరశత్వం చెందుతున్నవో!
టెన్నిస్ అయాక అందరం వచ్చి త్యాగతి పక్కనే కుర్చీలమీద చతికిలపడ్డాం. మా సేవవకుడు అందరికీ పానీయాలు తెచ్చి అందించాడు.
తీర్దమిత్రుడు : స్త్రీ పురుషులు కలసి పాశ్చాత్య దేశాలలో టెన్నిస్ మొదలైన ఆట లాడడం,నృత్యం సల్పడం అవీ చేస్తుంటారే, పూర్వ కాలంలో మన దేశంలో యిలాంటి ఆచారాలేవన్నా ఉండేవా? ఏమీ కనపడవు.
నిశాపతి : పాశ్చ్యాత్య స్త్రీలు పురుషులు జంటగా సంగీతం పాడుతుంటారు. మన దేశాల్లో ఎక్కడ?
కల్పమూర్తి : పాశ్చ్యాత్య దేశాల్లో స్త్రీ పురుషులు ఎక్కువ తక్కువలను చదువును బట్టి ఏర్పరచలేదు !
తీర్ధమిత్రుడు : ధనాన్ని బట్టా ?
నిశాపతి : వారికుండే తెలివితేటల్ని బట్టి.
నేను : ఎవరి ఉలుకు వారు బయట వేసుకుంటున్నారు.
త్యాగతి : (మౌనం)
కల్పమూర్తి : పాశ్చ్యాత్య దేశాలు మనకి వరవడా?
నేను : వారివల్ల మనం నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయిగా!
త్యాగతి : (మౌనంతో సిగరెట్టుపొగ వదులుతున్నాడు.)
తీర్ధమిత్రుడు : మనలో లక్షలోట్లు ఉన్నప్పుడు యితరులు ఏర్పరచిన రాజబాటను సరిగ్గా నడిస్తే మనజీవితం సునాయాసముగా అవుతుంది.
నిశాపతి : మనదగ్గర మాత్రం వాళ్ళు నేర్చుకోవలసినవి లేవా ?
తీర్ధమిత్రుడు : ఒకటో రెండో మంచి సంగతులు కొన్ని నేర్చుకొనే ఉన్నారు.
కల్పమూర్తి : ఏమిటా ఒకటో రెండో ?
తీర్ధమిత్రుడు : కొద్దిగా వేదాంతం, అత్తరువులు గిత్తరువులు ఉపయోగించడం....
నేను : అయితే మనదేశం ప్రపంచానికి ఏమీ యివ్వలేదంటావా?
త్యాగతి : (మౌనంతో సిగరెట్టు ఆర్పి, సిగరెట్టు బూడిద గిన్నెలో వేశాడు.)
తీర్ధమిత్రుడు: అనారోగ్యాలు , చాతబడులు , దెయ్యాలు , దేవతలు , భయాలు నేర్చుకోమన్నావా ?
నేను : నీ వాదమంతా మనదేశం మీద అసహ్యత, పరదేశాలమీద భక్తితో బయలుదేరినవే కానీ,న్యాయాన్యాయ విచారణ దృష్టితో బయలుదేరింది కాదు.
త్యాగతి : ఒకదేసానికీ, ఒకదేసానికీ,సమానసంబందం కలిగి వుంటే, వారి ఆచారాలు కొన్ని వీరికీ, వీరి ఆచారాలు కొన్ని వారికీ వస్తాయి. అందులో కొన్ని చాలా అందంగానూ, కొన్ని చాలా అసహ్యంగానూ కనపడతాయి. బానిసలకీ, ప్రభువులకీ సంబంధంలో, బానిసలకి ప్రబువుల ఆచారాలు బాగున్నట్లు కనబడ్డం సహజం.
అందరూ మౌనం.
8
మర్నాడు పొద్దున్నే నేను నిద్రలేచి, మొహం కడుక్కుని, యివతలికి వచ్చేటప్పటికి తీర్ధమిత్రుడు తయారు. కాఫీ పుచ్చుకొని తోటలోకి షికారు వెళ్ళాం. మా యిద్దరి చుట్టూ దక్షిణపుతోట, నందనవనానికి పాఠాలు నేర్పే సోబగులాడి. ఆ వనదేవత మమ్మల్ని కౌగిలిస్తోంది. ఆ పువ్వుల సువాసనకు నాకు వివశత్వం కలిగిస్తున్నది. నా యౌవనం సాఫల్యానికై చేతులు చాస్తున్నది. రంగువేయని ఎఱ్ఱని నా పెదవుల్లో అమృతాలు ఆస్వాదనకై పరెవళ్ళు త్రోక్కినవి. నా మనసులో కల్పమూర్తి పూజా నయనాలతో మోకరించినాడు. నా హృదయంలో నిశాపతి సంగీతం సురభిళమై ప్రత్యక్షమైంది. ఎక్కడో మబ్బుల వెనకాల శర్వరీభూషణుని మౌనము తారకాకాంతై మినుకు మినుకు మన్నది. ఎదుట తీర్ధమిత్రుడు.