అతని మూర్తిలో ఏవో భావాలూ, ఏదో తీక్షత, ఏమో నమ్రత ప్రత్యక్షమవుతూ ఉంటవి.అతని కళ్ళు చిన్నవీ కావు; పెద్దవి కావు; కనుబొమ్మలకు దిగువగా లూతుగా ఉంటవి. అయినా వాటి మూర్తి మాత్రం అతి అందమైన తామర పువురేకలు, కనురెప్ప వెంట్రుకలు చాలా పొడుగు. కళ్ళలోని నీలిపాపలు స్పస్టమైన వర్ణము కలవి. ఆ కంటి పాపల్లో ఏవో వెలుగులు ఎప్పుడూ నాత్యమాడుతూంటవి. ఆ కళ్ళ ముందర ఎవ్వరూ అబద్దాలు చెప్పలేరు. అసత్యము ఆలోచింపలేరు. అతని చూపుల యెదుట నా హృదయం నగ్నమూర్తి అయిపోతూంటుంది.
త్యాగతి ఎప్పుడూ మాట్లాడడు. మాట్లాడాడా రెండు ఎత్తయిన కొండల మధ్యనుంచి ప్రవహించే మహానదుల గంభీరద్వనిలా ఉంటుంది.రాత్రి పన్నెండు గంటలకు నిశ్శబ్దంలో వినవడే సముద్ర ఘోషలా ఉంటుంది '' సెల్లో '' వాద్యం మందరం తీగలా ఉంటుంది. ఏ సంభాషణలలో నన్నా అతడు ఒక్క మాట చెప్పితే ఇంకెవ్వరూ జవాబు చెప్పలేరు. అందరూ నిరుత్తరులై పోవలసిందే. త్యాగతి అంటే నాకు భయం, భక్తి కూడాను.
త్యాగతికి ఏ విధమైన ఉద్యోగమూ లేదు, కాని గొప్ప శిల్పీ, చిత్రకారుడూ. నాకూ, అతనికీ అడయారులో ప్రథమపరిచయం కలిగింది. అతని మూర్తిలోంచి ఏదో సమ్మోహన శక్తి నన్నాకర్షించింది. మా పరిచయం గాఢమై స్నేహంగా పరిణమించింది. సుర్యుడన్నా కాలం విషయంలో అశ్రద్దగా ఉంటాడేమో కాని త్యాగతి రోజూ సరిగా, సాయంత్రం అయిదు గంటలకి మా యింటికి వచ్చేవాడు.
త్యాగతికి ముప్పది సంవత్సరముల వయస్సు ఉంటుంది.ఖద్దరు తప్ప యితర దుస్తులు ఎప్పుడూ ధరించడు. ఆ దుస్తులు ఎప్పుడూ అందంగా కుట్టబడి ఉంటవి. అవి ఎంతో శుభ్రముగా ఉంటవి. త్యాగతి ఎప్పుడూ ఏదో అతిసున్నితమైన సువాసనా ద్రవ్యాన్ని ఉపయోగిస్తాడు. వేసవికాలంలో వట్టివేళ్ళ అత్తరు, వానాకాలంలో మల్లి అత్తరు, శరత్కాలంలో కేతకి, శీతాకాలంలో హేన్నా, వసంతంలో గులాబి అత్తరు వాడేవాడు. ఏనుగు తల చెక్కిన చక్కని పొన్నుకఱ్ఱ అతని చేతిలో ఎప్పుడూ ఉంటుంది.
త్యాగతికి నా రహస్యాలన్నీ చెప్పబుద్దివేస్తుంది; కాని ఏమీ చెప్పలేను.నా జీవితంలో ఎప్పుడైనా ఏ ఉపద్రమయినా సంభవిస్తే త్యాగతి పట్టుకొమ్మ కాగలడనే విపరీత ధైర్యం నన్నావవరించి ఉంటుంది, ఎందు కమ్మా నీకీ ధైర్యం అంటే అందుకు జవాబు చెప్పలేను.
6
ఈ నలుగురు స్నేహితులూ కొంచము హేచ్చుతగ్గుగా రోజూ మా యింటికి చేరుతూ ఉంటారు. అయిదుగురం కలసి సినిమాలకి పోతూ ఉంటాము. లేదా మా కారుమీదో మనోహర ప్రకృతి నాట్య ప్రదేశాలకి విహారార్దము వెడుతూంటాము.
ఆరోజు '' గార్బో '' నర్తకి నటించిన '' క్వీన్ క్రిస్టినా '' చిత్రాన్ని చూస్తున్నాం. ఇద్దరు ఐటు ఇద్దరు అటు మధ్య నేను, నా కుడివేపున కల్పమూర్తి, ఎడమవేపున తీర్ధమిత్రుడు. కల్పమూర్తి ప్రక్కన నిశాపతి వున్నాడు, తీర్ధమిత్రుని ప్రక్కన త్యాగతి వున్నాడు. మంచుతెరల మధ్య హోటలులో చిక్కుపడిపోయిన క్రిస్టినా రాణి అఖండ ప్రణయ సముద్రంలో పడిపోయింది. ఆ ప్రణయం యొక్క విచిత్ర స్థితి అభినయించదగినది ఒక్క గార్భోయే!
ఆమె ప్రణయం చూచి, తీర్ధమిత్రుని రక్తము వుప్పోంగి పోయింది. తీర్ధమిత్రుడు నా ఎడం చెవిదగ్గర పెదవి పెట్టి అన్నాడు: '' దేవీ! మా జీవితానికి మహారాజ్ఞిని. లక్ష్మీని హృదయంలో మాత్రమే ధరించాడు విష్ణువు. శివుడు పార్వతిని అర్ధదేహంలో దాచుకున్నాడు.తన సరస్వతిని బ్రహ్మ నాలుక మీద మాత్రమే నాట్యమాడిస్తున్నాడు. కాని నిన్ను నేను నా జీవిత సర్వసము నింపుకొని పులకరించి భువనాలు నిండిపోతాను.''
''పిచ్చిమాటలు మాట్లాడక చిత్రం సరిగా చూడవయ్యా '' అని విసుగుగా అన్నాను.
తీర్థమిత్రుడు మళ్ళీ నాచెవిలో ''ఎన్నాళ్ళిల్లాగా ఒంటిగా వుంటావు? రాణీ క్రిస్టినా కూడా, తనకూ తన జీవితానికీ ఏమీ అడ్డం రానివ్వలేదు, చూడూ?''
''స్స్''
ఇంక కొంతసేపటికి కల్పమూర్తి నెమ్మదిగా నా చెయ్యి పట్టుకున్నాడు.
'' ఎం మెత్తగా, నున్నగా ఉంది ! ఎంత అందంగా ఉంది ! '' అన్నాడతను.
'' మూర్తీ ! మీ రెవ్వరూ నన్ను కథ చూడనివ్వరేమిటి ? ''
నా హస్తతలం అతని యెడమ చేతిలో ఒక్క నిమేషం ఇమిడి వుంది.
ప్రణయ కల్పనలు, కాంక్షాపూరిత అస్పష్టవాక్యాలు, నిగూఢతా నిబిడమైన వ్యంగ్యకలాపాలు, పుంఖానుపుంఖాలుగా నన్ను ముంచివేయగా నిశాపతి కారు నడుపుతూన్న నా పక్క కూర్చున్నాడు.
'' నువ్వెవరవు ? మహాగాయకుని గాఢరాగానివి, నా గొంతుకలో మిన్నే రురవడై బంగారు ఝురులతో ప్రవహించి పోదువుగాని; నా హృదయంలోని మూర్చనల తాళాలకు ధిమి దిమింకిత నృత్యం సలుపుదువు గాని. ''
'' క్రిస్టినా చూచి అందరికీ మతిపోయినట్లుంది '' అన్నాను నెమ్మదిగా. కానీ సౌస్టవములై , మేలిమి బంగారు చ్చాయలతో మిలమిలలాడుతూ ఉన్న వక్షోజాల వెనక దాగి ఉన్న నా యువతీ హృదయమ్ నిర్వచింపలేని ఆనందంతో వివశత్వం పొందింది.
ఎవరి ఇళ్లకడ వారిని దింపి, నేనూ, త్యాగతీ మా ఇంటికి చేరుకున్నాం. కారును షెడ్డులో పెట్టి ఇద్దరం ఇంట్లోకి వచ్చాం. సిగరెట్టు తీసి వెలిగించి పొగ వదులుతూ నాపక్క మౌనాలంకారుడై నడచి వస్తూన్న శర్వరీభూషణుని చూడగానే, నా మెదడులోని మత్తులు పటాపంచలైనాయి. ఆటలాడి అలసట పడిన చిన్న సిసువునై పోయాను. ఉస్సురని నిట్టూర్పు అప్రయత్నంగా నా హృదయంలో నుంచి వచ్చింది. కొంచెం తూలి ముందుకు పడబోయాను, తల్లి చెయ్యిలాంటి చేతిని నా వీపున ఆనించాడు త్యాగతి.