అవును: నిజం ఇది 1940వ సంవత్సరం, నాగరికమైన రోజలు. మానవస్వభావం గత ఏడెనిమిది వేల సంవత్సరాలనుంచి తెలివిమీరింది. సభ్యత్వం అలవరచుకుంది. అయినా, ఈ 1940లో భార్యలను భర్తలు పెడుతున్న పాట్లు తక్కువ లేదుకదా! మాటలాడితే "మారోమేఖ్" అన్న భర్తలున్నారు. ఇట్టే అంటే కొట్టి చంపేవారున్నారు. అంతా అయిన తరువాత పోతూపోతూ ఆడదాన్ని ఒక గదిలో పెట్టి తలుపు తాళం వేసుకుపోయే ఉద్యోగులున్నారు. అయ్యగారు ఆఫీసునుంచి వచ్చిన తరువాతనే అమ్మగారికి విముక్తి. పరాయి మనిషితో మాట్లాడినంత మాత్రాన పాపిష్టిదానా అని పడతిట్టిన పెద్ద మనుష్యులున్నారు.
ఈ నాజూకు రోజులలోనే ఇలా వుంది కదా! పూర్వం ఎలా వుండేదో కొంచెం ఆలోచించండి. అప్పుడు ఈ హక్కును ఎంత నిర్దాక్షిణ్యంగా ఉపయోగించి వుంటారో కొంచెం ఊహించండి. ఆస్తి అంటే ఎంత అధికారం చెలాయించేవారో పోల్చుకోండి. అందులోనూ పురుషుడికి స్త్రీ గాని, స్త్రీకి పురుషుడు గాని సాధారణమైన బందోబస్తు. పైవారు ఇరుపొంతలా చేరకూడదు. ఇతరుల ఈగ అయినా ఈ ఆస్తి మీద వాలకూడదు. మగవాడయినా అంతే. ఆడదయినా అంతే.
పక్షులలోను గూడా ఈ గుమం కనబడుతుంది. ఆడపక్షి గుడ్లు పెట్టి పిల్లలని చేస్తూ ఉంటే, మగపక్షి పారాఠలాయిస్తుంటుంది. ఇంకొక పిట్టని దగ్గరకు రానీయదు. హోరాహోరీగా పోరాడుతుంది. ప్రాణం అయినా కానదు ఇది. నాది, నా ఆస్తి అన్న జ్ఞానమే దానికి. ఇందులో ఒక్క విశేషం. ఆ సమయంలో ఈ ఆడపిట్టకు సంగమవాంఛ ఉండదు. అయినా ఇంకొక పక్షిని- తన జాతిదే అయినా- దగ్గరకు రానీయదు. ఇంకొక పిట్ట ఎంత అపాయకరం కాకపోయినా, చేరనీయదు.
మనుష్యులకు అలాంటి బుద్ధి ఉందంటే తప్పా! ఈ బుద్ధి అంతకు పూర్వం ఉండేది: ఇప్పుడూ ఉంది. ఇకముందు గూడా ఉంటుంది.
చూడండి ఒక మోటు సామెత ఉంది. "ముద్ర ముద్రలాగే వుంది, ముగ్గురు బిడ్డలను కన్నది" అంటారు. ఇది గడుసుతనమో, దొంగతెలివో తెలియజేసే సామెత. ఈ ముద్ర ఏమిటో, ఎక్కడిదో ఊహించటం కష్టమయిన పనికాదు. సందర్భంబట్టి చూస్తే సులభంగా బోధపడుతుంది. ఆ ముద్ర ఒక ఆడదానికి వేసిన సంగమ నిరోధనం అని చెప్పాలి కదా! ఆయమ్మ సీలుసీలులాగే వుంచింది; చెయ్యవలసిన పనులన్నీ చేసేసింది. సంతానప్రాప్తిని పొందింది. ఎంత గడుసు మనిషో! పాపం! ముద్ర వేసినవాడు ఎంత మోసపోయాడు!
సంగమవాంఛ లేనప్పుడు పక్షులే అంత పకడ్దారీగా వున్నప్పుడు, ఆ వాంఛ వున్న మనుష్యుల విషయం ఎంత జాగ్రత్త పడాలి! ఎన్ని విధాల నిరోధనం సాధించడానికి ఉపాయాలు వచ్చినా, లాభం లేకుండా పోతూవుండేది. ఉపాయానికి తగిన మాయోపాయం కనబడేది. మనుష్యులు విసిగిపోయారంటే తప్పా? ఆఖరికి "అన్యధా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ" అని తాళాలు వెయ్యడం మొదలు పెట్టారు. మొదట అవయవాలకే రంధ్రాలు పొడిచి (తమ్మంట్లకు కన్నాలు పొడిచినట్లు) తాళం వేసేవారు. అది చాలా కష్టంగా వుందని మరికొన్నాళ్ళకు బెల్టులతో సహా ఇనపకచ్చలు కట్టించడం ఆరంభించారు.
వీటి ఉపయోగం అంతా వివాహం అయిన
తరువాతనే - ఆ రోజులలో అయినా
భర్తలుండే భార్యలను మనువు
పంపించేవారు
ఈ స్త్రీ నా సొత్తు, ఈ మగాడు నా ఆస్తి, అనుకొన్నప్పుడే కొంత హక్కూ కొంత అధికారమూ వస్తుంది. దాన్ని చెలాయించడానికే చూస్తాము.
ఈ అధికారం, ఆ హక్కు ఎప్పుడు కలిగింది? జంతువులలో గాని, పక్షులలో గాని ఇలాంటిది ఉందా? అంటే, ఉందనే చెప్పాలి. జంతువుల గర్బధారణ సమయములోనూ, పక్షులు గుడ్లు పొదిగి పిల్లలు చేయించినప్పుడూ ఇలాంటి అధికారం కొంత కనబడుతుంటుంది. ఆ సమయాలలో మగపిట్ట మరొక పిట్టను తన పెంటి దగ్గరకు రానీయదు. పెద్దజాతి కోతులలో జంట కూడిన తరువాత ఈలాంటి అధికారమూ, హక్కూ కనబడుతుంటుంది.
అనేక అనాగరిక (ఇది మనం వారికి పెట్టిన పేరులెండి) జాతులలో ఈ హక్కు మొదటినుంచీ వచ్చినది కాదు. జత కూడిన తరువాతనో, పెళ్ళి అంటూ ఒకటి అయిన తరువాతనో కలుగుతుంది. నా సొత్తు ఇతరులు వినియోగించకూడదు అన్న బుద్ధి వివాహం తరువాతనే కనబడుతుంది.
ఈ జాతులలో పెళ్ళి కాకముందు విచ్చలవిడిగా-అంటే స్వేచ్ఛగా తిరుగవచ్చును. స్త్రీ గాని, పురుషుడుగాని, అంతేగాదు కొన్ని జాతులలో అలా స్వేచ్ఛగా తిరగాలి విధిగా. అప్పుడు స్త్రీకి ఒక్క పురుషుడు అన్న నియమం లేదు. ఎవ్వరికీ ఈ ప్రవర్తన కోపకారణం కాదు.