Previous Page
Next Page
నెత్తుటిబొట్టు పేజి 3
చివరకు కడుపును చీల్చుకుని, రక్తాన్ని త్రోడుకుని కేర్ మంటూ బయటపడ్డాడు శిశువు.
"బ్లేడేదయినా వుందా ?" అని అడుగుతోంది మంత్రసాని.
ప్రజ్ఞ ఇల్లంతా వెదికి కష్టంమీద ఓ పాత బ్లేడు తీసుకువచ్చింది.
మంత్రసాని ప్రేగు కోసింది.
"అక్కయా !" అని పిలిచింది ప్రజ్ఞ.
అరుంధతి కదలలేదు.
"అక్కయ్యా !" అని పెదవులు కంపిస్తూండగా, చాలా భయంగా పిలిచింది మళ్ళీ. అరుంధతి పలకలేదు.
2
ఇదే నిమిషంలో...
తల్లుల గర్భాశయాలను చించుకుని, చీల్చుకుని భూమ్మీదకు చొచ్చుకు వస్తోన్న శిశువులు.
తల్లుల గర్భాల్లోంచి బయట పడ్డాక, ఒకే ఒక నిమిషం మాత్రం బ్రతికి ప్రాణాలు విడుస్తున్న శిశువులు...
తల్లుల గర్భాల్లోంచి చచ్చిపుడుతున్న శిశువులు...
తల్లుల గర్భాల్లోంచి వెలువడి, ఆ తల్లుల మరణానికి కారణమావుతోన్న శిశువులు...
ఇదే నిమిషంలో...
భార్యలు ప్రసవ వేదనలో వుంటే పరస్త్రీలతో శృంగారంలో మునిగితేలి కామాగ్ని తీర్చుకుంటున్న పురుషులు.
రేపోమాపో కనడానికి సిద్ధంగా వున్న భార్యలతో కక్కుర్తిపడే పురుషులు.
భార్యలతో కామాన్ని తీర్చుకుంటూ పరస్త్రీలను మనసులో వుంచుకుని మానసిక వ్యభిచారం చేస్తోన్న పురుషులు.
భార్యలు పుట్టింటికి వెడితే, పని మనుషులతో సరాగాలు సాగిస్తోన్న పురుషులు.
ఇదే నిమిషంలో...
రజస్వల అంటే అర్ధం తెలీక, రజస్వలయి కొన్ని రోజులయినా గడవక ముందే దారుణంగా రేప్ చెయ్యబడుతున్న అమాయక ఆడపిల్లలు...
పద్నాలుగేళ్ళయినా నిండకముందే తెలీని తప్పుకు గురయి, గర్భవతులై, ఆ గర్భాన్ని విచ్చిత్తి చేసుకునే విషాద ప్రయత్నంలో అభాగినులైన ఆడపిల్లలు...
అలా విచ్చిత్తి చేసుకోలేక, చేతకాక, విధిలేక, క్రూరంగా ఆత్మహత్యలు చేసుకుంటూన్న ఆడపిల్లలు...
నాలుగురోజుల పరిచయాన్నే ప్రేమనుకుని, తెలివి తక్కువగా జీవితాన్ని అంతం చేసుకుంటోన్న ఆడపిల్లలు...
ఇదే నిమిషంలో...
క్లబ్బుల్లో, హాయిగా ఇళ్ళల్లో పేకాటలో మునిగి వందలూ, వేలూ, లక్షలూ ఎవరి అంతస్తును బట్టి వారు పోగొట్టుకుంటూన్న వ్యసనపరులు...
సీసాలు ఖాళీ చేసి, గ్లాసులకి త్ర్రాగి పిచ్చి మత్తులోకి జారిపోతూ అదే స్వర్ణమనుకుంటోన్న పిపాసువులు.
ఇదే నిమిషంలో...
నలుపును తెలుపుగా మార్చుకునే దొంగ వ్యాపారస్తులు.
పగలు హత్యతో అంతం చేసే కసాయివాళ్ళు...
డబ్బు సంపాదనకు దొంగతనమే సాధనమనుకునే అసలు దొంగలు.
ఇదే నిమిషంలో...
పరిష్కారంలేని సమస్యలతో నిద్రపట్టక మత్తుబిళ్ళలతో మభ్య పరుచుకుంటూన్న ఇన్ సామ్ నియా పేషెంట్స్.
అర్ధంలేని అహంకారాలతో, మూర్కత్వపు మైకాలతో వికారపు నిర్ణయాలు తీసుకుంటున్న భార్యాభర్తలు...
ఇదే నిమిషంలో...
క్యాన్సర్ తో కుళ్ళుతూ చివరి క్షణాలు అనుభవిస్తోన్న నిర్భాగ్యులు.
గుండె జబ్బులు కాటేసి నిద్రలోనే దీర్ఘ నిద్రలకి జారుకుంటోన్న అభాగ్యులు.
ఇదే నిమిషంలో...
డబ్బుతో సుఖాన్ని కొనుక్కుని, దాంతో పాటు ఖరీదైన రోగాల్ని కూడా కొనుక్కుంటున్న వేలమంది మామూలు వాళ్ళు.
కృత్రిమంగా దాహం తీర్చి మామూళ్ళకు పోగా మిగిలిన డబ్బుతో సంతృప్తిపడి, అలిసిపోయిన శరీరాలను మురికి ప్రక్కలమీద జారవేస్తోన్న మందభాగినులూ...
ఇదే నిమిషంలో...
స్మశానంలో అగ్ని జ్వాలలమధ్య బూడిదగా మారుతోన్న శవాలూ...
Previous Page
Next Page