Previous Page Next Page 
భారతి పేజి 3

    ఆమె విచారాన్ని  లెక్కచేయనట్లు  చిరునవ్వు  ముఖంతో  చకచక అడుగులు వేస్తూంది మల్లిక.

    "కూడదనుకున్న  పని చేయించావు  నాతో. అసలు రేపట్నుంచి రాను  దానితో  కుదిరిపోతుంది తిక్క.

    "ఎవరిది? నాదా?"

    "కాదు. నాదే!"

    అలా గడిచిపోయిందా  రోజు. తరువాత  ఆనాటి సంఘటన. ఆ బెదురు చూపుల యువకుడు అప్పుడప్పుడూ  భారతికి గుర్తువచ్చినా, పెనుభూతంవంటి  మరో సమస్య  తన జీవితాన్ని పట్టి వేధిస్తూ వుండటాన  ఆ విషయానికి  ప్రాధాన్యం ఇచ్చి  ఆలోచించలేక  పోయింది. అసలీ  ప్రపంచానికే  దూరమై పోసాగింది. ఏకాంతాన్ని  వరించి, శూన్యంలోకి  చూస్తూ రోజులు గడపసాగింది.

    ఇప్పుడు  హఠాత్తుగా  వచ్చి  దుమారం  రేపేసింది  మల్లిక.

    తుఫానులు  దాచుకున్న స్తబ్దతవంటి ముసుగులోంచి  హటాత్తుగా ఇవతలకు  వచ్చిపడి మళ్ళీ ఒకసారి  మల్లిక భుజం గుంజి "చెప్పు. ఆనాటి సంఘటనను  ఎందుకు  జ్ఞప్తికి  తెస్తున్నావు. ఎవరా గంగాధరం?" అంది కస్సుమని లేస్తూ.

    "నీ క్కాబోయే  మామగారు! అలనాడు  మనకు  కారు డాష్ ఇవ్వబోయిన  పిల్లవాడి తండ్రి."

    భారతి కళ్ళప్పగించి  చూస్తూంది  స్నేహితురాలి వంక. తెలియని  ప్రపంచాలను  చుట్టుముడుతున్నాయామె  ఆలోచనలు.

    "జమీందారు కాకపోయినా, కుబేరుడి వంటి సుబేదారట. 'నువ్వు కంటపడ్డాక, నిన్ను తప్ప అన్యుల  పరిణయమాడనని  భీష్మించుకు కూర్చుంటే  అతను కన్న కలలు చివరకు  ఫలించి, ఈ రాయబారంగా పరిణమించాయిట" కళ్ళు తిప్పుకుంటూ. ఉత్సాహంతో  చెప్పుకుపోతూంది  మల్లిక.

    "నోర్ముయ్!" అన్న గర్జన  వినపడేసరికి  ఒక్కసారిగా  ఉలికిపడి  ఆగిపోయింది. అప్పటికప్పుడు  ఎర్రబడిపోయింది  భారతి ముఖం.

    "ఇదెలా జరుగుతుందో  నేనూ చూస్తాను. పద" అంటూ భుజం వదిలి మల్లిక చేతిని  దొరకపుచ్చుకుని  బర బర  ఈడ్చుకుపోసాగింది.

    "అయ్యో! చెయ్యి నొచ్చుతోంది. నిన్ను  పిలుచుకుపోవటానికే  నేను వస్తా ఆగు. అంత తొందర పనికిరాదు" అని  మల్లిక గోల పెడుతున్నా  వినిపించుకోకుండా,  పట్టు వదలకుండా  అలాగే  లాక్కుపోతూంది  భారతి.

    కనుచీకటి పడటానికి  ఇంకా వ్యవధి  వుంది. దారిలో అక్కడక్కడ  చెదురుగా నడుస్తూన్న  మనుషులకూ. ఇంటి అరుగులమీద కూర్చుని  లోకాభిరామాయణాలు  ముచ్చటించుకుంటున్న  కుటుంబీకులకూ  చోద్యంగానే కనిపించిందీ  దృశ్యం. భారతి ఇంత విడ్డూరంగా ప్రవర్తించటం  వాళ్ళెప్పుడూ చూడలేదు  కొందరు స్త్రీలు  నోళ్ళు  వెళ్ళబెట్టారు.

    తనేం  చేస్తున్నదో  తెలియని  స్థితిలో  దూకుడుగా గుమ్మందాటి లోపలకు  ప్రవేశించిన  భారతి ఎదురుగా  కనబడిన నూతన వ్యక్తిని చూసి  గతుక్కుమని  నిలబడి పోయింది. కుర్చీలో కాలుమీద కాలు వేసుకుని, చేతికర్ర  ఊపుతూ ఠీవిగా కూర్చుని  ఉన్నాడా వ్యక్తి పచ్చని పసిమి, వత్తైన మీసాలు, ఖరీదైన తెల్లని పంచా, లాల్చీలో ఏవుగా పెరిగివుండి, యాభై అయిదేళ్ళ  వయసు  దాటిన భారీ విగ్రహం ఆ ఈడుకు సహజంగా  అమరిన  నెరిసిన  బట్టతల, ఎర్రని జీరలున్న ఆయన కళ్ళు అప్రయత్నంగా నిలబడిపోయిన  భారతి వంక గ్రుచ్చి గ్రుచ్చి చూశాయి. ఆయన చూపులు భారతికి నచ్చలేదు వాటిలో నిండుతనం కన్నా విమర్శనాగుణం, లాలిత్యం కన్నా కఠోరత్వం కనిపించాయి. అసహ్యంతో  ఆమె శరీరం రోమాంచితమైంది. తలవంచుకుంటూనే  త్రుటికాలం  తన దృక్కుల్ని  ప్రక్కలకు  ప్రసరించి  చూపింది. దగ్గరగా మరో కుర్చీలో కూర్చుని  ఉన్న  శుష్కదేహుడైన  తండ్రి, మధ్య గది తలుపాపల  కనిపించీ కనిపించనట్లు  నిలబడి ఉన్న పిన్నీ లీలగా కనిపించారు. ఆమె చెయ్యి మల్లికను ఎప్పుడో  వదిలేసింది.

    "మా అమ్మాయి భారతి అండీ....వీరు  రావుబహదూర్ గంగాధరరావు గారమ్మా. నూజివీడు నుండి  నిన్ను చూడటానికి  వచ్చారు....నమస్కారం చెయ్యి, తల్లీ;" తండ్రి గౌరీపతి కంఠం  ఎంతో అణుకువగా  వినిపించింది.

    వణుకుతున్న  చేతులను జోడించి  ఎలాగో  నమస్కరించిన  సంగతి భారతికి  సరిగ్గా తెలియదు. కాళ్ళ క్రింద  భూమిమాత్రం  కంపిస్తున్నది.

    ఆయనింకా  అలాగే ఎగాదిగా  చూస్తున్నాడు. ఆ చూపుల్ని  తట్టుకోలేక కళ్ళు తిరిగి, క్రింద పడిపోతానేమో  ననిపిస్తూంది  భారతికి.

    చివరకు  "ఇహ లోపలకు వెళ్ళు, తల్లీ" అన్న తండ్రి కంఠం  వినిపించేసరికి  బ్రతుకుజీవుడా  అని లోపలకు జారుకుంది. మల్లిక ఎప్పుడు, ఎలా వెళ్ళిపోయిందో  ఆమెకు తెలియనే  తెలియదు.

    లోపలికిపోయి  పిన్ని హృదయంమీద  వాలిపోయింది పసిపిల్లలా. బయట నుండి తండ్రీ. గంగాధరంగారు మాట్లాడుకుంటూన్న  మాటలు  అస్పష్టంగా  చెవుల్లోకి  సోకుతున్నాయి చాలాసేపటికి  ఆయన లేచిన చప్పుడూ, కారు స్టార్టయి వెళ్ళిపోయిన  శబ్దమూ  వినిపించాయి. కొంత సేపటికి  తండ్రి మెల్లగా లోపలకు వచ్చాడు.

    భారతి పిన్నిని వదలి  కొంచెం దూరంగా  జరిగి  నిలబడింది.

    "ఇవాళ  చాలా  చాలా శుభదినం. నువ్వు ఎంతో అదృష్టవంతురావలవు. భారతీ గంగాధరరావుగారివంటి  దశ పురుషుడు  మన సంబంధాన్ని వెతుక్కుంటూ వచ్చాడంటే మాటలా? ఆయనకు  నువ్వు నచ్చినట్లే  కనిపిస్తోంది రేపు నూజివీడు  వస్తే, సిద్ధాంతిగార్ని  పిలిపించి, ముహూర్తం కూడా నిశ్చయం చేద్దామన్నారు." ఎంతో ఉత్సాహంగా చెబుతున్నాడు గోడకు  ఆనుకుని.

    పిన్ని  మూగది ఆమె మాట్లాడలేదు. అందుకని  ఆనందాన్నంతా  కళ్ళలో నింపుకుని చూస్తుంది.

    తండ్రి మాటలు పూర్తి కాగానే  భారతి  ఎర్రబడ్డ ముఖాన్నెత్తి  ఆయన వంక తీక్షణంగా  చూసింది.

    "నే నీ సంబంధం  చేసుకోను, నాన్నా. ఈ సంబంధమే కాదు, అసలు పెళ్ళే చేసుకోను. నాలో ఏం ఉందో  తెలుసుకదా  నీకు. నన్ను  తీసుకువెళ్ళి ఏ అదృష్టహీనునికో  ఎలా అంటగడదా మనుకున్నావు?"
 
    పుట్టి బుద్దెరిగాక  భారతి నిక్కచ్చిగా ఎప్పుడూ మాట్లాడింది లేదు. గౌరీపతిగారు  కూడా నిశేష్టుడై పోయాడు. వెనువెంటనే  అవ్యక్తమైన అనురాగంతో  మనసంతా  నిండిపోగా, దగ్గరకు  వచ్చి కూతురి తల నిమరసాగాడు.

    "బాల్యంనుంచీ  ఎంత సున్నిత మనిస్తత్వంతో  నువ్వు పెరిగావో నాకు తెలుసు, భారతీ! ఈ పది రోజులుగా  నువ్వనుభవిస్తూన్న  రంపపు  కోతా నాకు తెలుసు. నీకంటే  అధికంగా నేనూ కుమిలిపోతున్నాను. ఇలా మనం నరక యాతన  అనుభవిస్తూన్న  సమయంలో  దేముడు  వరమిచ్చినట్లు  ఈ సంబంధం  మనల్ని కోరి వస్తే, సుకుమార భావాలను మనసులో పెట్టుకుని చేజేతులా  ఈ అదృష్టాన్ని  కాలదన్నుకుంటావా, అమ్మా?" ఆయన గొంతు దగ్గుత్తితో  వణికింది.

    శుష్కించి, బొమికలతో  నిండి, కఠినంగా  తగులుతూన్న  ఆయన హృదయంలో భారతి బాధగా  తలదాచుకుంది. నెమలి కన్నుల వంటి  ఆమె నీలి కన్నుల నుండి  కన్నీళ్ళు బొటబొటా  కారాయి.

    భారతి పిన్ని రాధమ్మ గుమ్మం దాటి  ఇవతలకు వచ్చి దీనంగా  చూస్తూ  నిలబడింది.

    గుండెమీది తడి షర్టులోంచి  తెలిసి, ఆయన  మరింత  క్రుంగిపోయి, "ఏడుస్తున్నావా భారతి? మీ అమ్మ పోయినప్పట్నుంచీ  నిన్ను నా గుండెల్ల  గుండెగా పెంచుకున్నాను. ఎప్పుడూ నీ శుభాన్నే  కోరేవాడినేగాని, నీ దుఃఖాన్ని చూడలేనమ్మా!" అని ఆమెను మరింత దగ్గరగా  లాక్కుని, "నీ మనస్సుకు  వ్యతిరేకమైన  పనిని చేయమని నిర్భంధించటానికి  నేను మూర్ఖుణ్ణి కాదమ్మా. నేను నీకు కేవలం తండ్రినే అనుకోకు. తండ్రిగా నిన్ను ఎప్పుడైనా  శాసించటం చూశావా! ఒక ఉత్తమ స్నేహితుణ్ణి నీకు. చిత్తశుద్ధితో  కూడిన  శ్రేయోభిలాషిని. మనకు అమరినా అమరక పోయినా, నమ్మినా నమ్మకున్నా  కొన్ని సత్యాలను  అంగీకరించక తప్పదు. డయా  బిటస్ వచ్చాక  రాయిలాంటివాడిని  పీనుగులా  అయిపోయాను. దానికితోడు  బ్లడ్ ప్రెషర్ ఇన్సులిన్  ఇంజక్షన్ తో  టాబ్లెట్లతో  విసిగి, వ్యాధులతో  పోరాడి, అలిసిపోయి, శరీరం గుల్ల చేసుకుని  యీ స్థితికి  వచ్చాను చివరకు. ఇంక ఎక్కువ  రోజులు  బ్రతకడం సాధ్యం కాదేమోననిపిస్తుంది నా యీ ఒక్క బాధ్యతా  నిర్వర్తించుకుని  వెళ్ళిపోతే...."

 Previous Page Next Page