శబ్దంతోపాటు దూసుకొస్తున్న ఇంజన్ హెడ్ లైట్ కాంతి సుదూరంలో చుక్కలా తోచింది.
అతని ముఖంలో క్షణంలో సగంపాటు హాసరేఖలు మెరిశాయి.
వెంటనే ఎయిర్ బ్యాగ్ ను ఓపెన్ చేసి, అందులోంచి నల్లని ఎయిర్ జాకెట్ ను తీసి తొడిగి గొంతువరకూ జిప్ ను లాగి లాక్ చేశాడు.
రైలు చప్పుడు దగ్గరవుతున్నది. మరికొన్ని క్షణాలకే ట్రయిన్ సమీపించింది.
ఆ శబ్దాన్ని బట్టి అది గూడ్సు ట్రయిన్ గా నిర్ధారించుకుని భారంగా విశ్వసించాడు.
అప్పుడు తెరిచాడు-ఆ రెండు ట్రంకు పెట్టెల్ని. వాటినుంచి తనకు కావలసిన పరికరాలను తీసి చకచకా వంటికి తగిలించుకున్నాడు.
ఖాళీగా వున్న ఆ ట్రంక్ పెట్టెలను జాగ్రత్తగా ఎవ్వరికీ కనిపించకుండా వుండేట్టు పిచ్చిచెట్ల గుబుర్లలోకి నెట్టివేశాడు. ఎయిర్ బ్యాగ్స్ ను మాత్రం భుజానికి తగిలించుకున్నాడు.
గూడ్సు ట్రెయిన్ దగ్గరవుతుందనడానికి నిదర్శనంగా శబ్దం పెరుగుతున్నది.
ఒక్కసారి భారంగా శ్వాస తీసి మెరుపులా ట్రాక్ వేపుకు కదిలాడు.
పాస్ త్రూ సిగ్నల్ ఇచ్చినందువల్లనేమో గూడ్సు ట్రెయిన్ వేగం తగ్గలేదు.
తన పథకం ప్రకారం అది ఇక్కడ ఆగకపోతే...?
నో నెవ్వర్! అతని అంతరాత్మ ససేమిరా అందుకు ఒప్పుకోడం లేదు.
ఎట్టి పరిస్థితుల్లోనూ తన అంచనా తప్పిపోవడానికి వీల్లేదు!
అప్పటి వరకూ పాస్ త్రూ ఇచ్చిన సిగ్నల్ పచ్చలైట్ కాస్తా డేంజర్ లైట్ లోకి వచ్చింది. అప్పుడు విచ్చుకున్నాయి అతని పెదవులు చిరు మందహాసంగా!
గూడ్సు ట్రయిన్ కీచుమని శబ్దం చేస్తూ ఆగిపోయింది.
అంతే....
అ గూడ్సు ట్రయిన్ ప్రతి బోగీలోనూ ఆటోమాటిక్ రైఫిల్స్ తో కావలి వున్న సెక్యూరిటీ సిబ్బంది అంతా క్షణాలమీద రెడ్ అలర్టు అయ్యారు. చేతుల్లోని సెర్చ్ లైట్ల ను ఆ బోగీలకు నలువైపులా ఫోకస్ చేశారు.
ఆ ఒక్క క్షణమే తనకు చాలన్నట్టు.....అది స్లోమోషన్ లో వుండగానే అతను తనకు కావలసిన బోగీ కప్లింగ్ లోకి దూసుకుపోయాడు.
ఇన్ సెక్యూరిటీ వారికి అతని కదలికను గమనించే అవకాశమే లేకపోయింది.
వెంటనే గ్రీన్ సిగ్నల్ పడడంతో గూడ్సు ట్రయిన్ కదిలింది.
ఎలక్ట్రిక్ ట్రాక్షన్ కావడంతో మరికొద్ది క్షణాలలోనే అది వేగం పుంజుకుంది.
అతను పెన్ టార్చ్ ఫోకస్ చేసి టైమ్ లో అప్పుడే ఐదు నిముషాలు జరిగిపోయాయి. తిరిగిరాని ఆ కాలాన్ని కాంపెన్ సేట్ చేయడానికి తన పనిని మరింత వేగంగా ప్రారంభించాడు.
* * *
ఆ రైలు ట్రాక్ కు మరికొంచెం దూరంలో__
ఎప్పుడో రైల్వేవారు ఉపయోగించి వదిలివేసిన....శిధిలావస్థకు చేరుకుని వున్న గది మొండిగోడల చాటున నక్కివుంది ఓ పాతిక సంవత్సరాల యువతి.
లవెండర్ కలర్ త్రి-పీస్ డ్రస్ ఆమె అభిరుచిని చెప్పకే చెబుతోంది. చలిగాలికి మోమున ముసురుతున్న భుజాలు దాటిన జుట్టును మాటి మాటికీ వెనక్కు విసుతున్న తీరు ఆమె అసహనాన్ని, అనుభవిస్తున్న టెన్షన్ ను పట్టి ఇస్తోంది.
అంత నిశిరాత్రి....ఒంటరిగా....ఎంతో ధైర్యంతో, ఆమె అక్కడా వుంది!
తన మెడలో వ్రేలాడుతున్న బైనాక్యులర్సుతో నిశితంగా, పరీక్షగా చూస్తోందామె!
దూరంగా గూడ్సు ట్రెయిన్......ఓపెన్ గా వున్న గూడ్సు బోగీల్లో పేర్చివున్న ఇసుక బస్తాలు....
వాటిని చూడగానే ఆమె భ్రుకుటి ముడిపడింది. అంత చలిలోనూ నుదుట చిరుచెమట పట్టింది.
ఆ ఇసుక బస్తాల వెనుక తుపాకులతో సర్వసన్నద్దంగా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు సిబ్బంది పొంచి వున్నారని ఇట్టే గ్రహించింది.
ఇప్పుడామె మనస్సు కలవరం. అప్పటివరకూ ఆమెలో వున్న గాంభీర్యంకాస్తా సడలిపోయింది.
ఆమె పేరు.....సంజీవి.
* * *
అది గూడ్స్ ట్రయిన్.
ఇంజన్ తర్వాత రెండవ బోగీ ప్రత్యేకంగా సీలు వేసివుంది.
దానికి రెండు వైపులా వున్న ఓపెన్ బోగీలలో ఇసుక బస్తాల చాటున మాటువేసి వున్నారు పోలీసులు.
వేగాన్ని పుంజుకోగానే ఆ రెండు పెట్టెల మధ్య వున్న ఐరన్ లింకు మీదకు చేరాడు అతను.
ఎయిర్ బ్యాగ్ ను తెరచి నలుచదరంగా, మందంగా వున్న పరికరాన్నొక దాన్ని బయటకు తీశాడు. దానిచుట్టూ రాగి రంగుతో వున్న కవర్ తొడిగి వుంది.
ఆ పరికరానికి ఒక వైపున సుమారు పదిహేను అంగుళాల చుట్టుకొలత కలిగిన రాగి బద్ద గుండ్రంగా రింగులా మలచి వుంది.
ఆ రింగును తలకు తగిలించుకుని జారిపోకుండా సరిచేసుకున్నాడు. ఇప్పుడా పరికరం సరిగ్గా అతని నుదుటిపైకి వచ్చింది.
అలాగే మరి రెండు పరికరాలను బయటకు తీశాడు. వాటికికూడా రాగి బద్దలు రింగుల్లా వున్నాయి. కాళ్ళ చీలమండలం దగ్గర కడియాలుగా రెండు కాళ్ళకూ తొడిగాడు. పెన్ టార్చిని తీసి నోటితో కరచి పట్టుకున్నాడు.
ఎయిర్ బ్యాగ్ కిందపడిపోకుండా బోగీ కిందవున్న సన్నపాటి ఇనుప బద్దకు తగిలించాడు.
రిస్ట్ వాచీని చూసుకున్నాడు. తన పని పూర్తి చేయడానికి ఇక అట్టే టైం లేదు.
గూడ్సు బోగీ రెండు చక్కాలనూ కలిపే ఇరుసు క్రిందగా మెల్లగా తన కాళ్ళను పోనిచ్చి, బోగీ మధ్యగా ఆ వ్హివారి రెండు చక్రాల ఇరుసు వద్దకు వెళ్ళే బ్రేక్ రాడ్ ను నేర్పుగా కాళ్ళతో మెలిక వేశాడు.
కాళ్ళను కొద్ది కొద్దిగా దూరం జరుపుతూ తర్వతః నడుము, ఆ తర్వాత తల అలా శరీరాన్ని పూర్తిగా పట్టాల మధ్యగా....గూడ్సు బోగీ క్రిందుగా పోనిచ్చి....బ్రేక్ రాడ్ పై తలను ఆధారంగా వుంచి భారంగా ఊపిరి పీల్చి వదిలాడు.
తిరిగి పెన్ టార్చితో ఫోకస్ చేసి టైమ్ చూసుకున్నాడు.
కాలం ఎంత విలువైనదో గుర్తుకురావడంతో....ఒక కాలుకు అంటిపెట్టుకుని వున్న పరికరం పై తొడుగును తొలగించాడు. మరుక్షణం అయస్కాంతం ఆకర్షించినట్టు వేగంగా పోయి గూడ్సు బోగీ బేస్ మెంట్ కెళ్ళి అతుక్కుంది ఆ పరికరం. అలానే రెండవ కాలుకి వున్న పరికరం తొడుగును తీసివేశాడు. అదికూడా బేస్ మెంట్ కి అతుక్కుపోయిది.చివరగా నుదుటిపై వున్న దాని తొడుగుని కూడా తొలగించడంతో...ఇప్పుడు ఎ ఆధారం లేకపోయినా ఆ పెట్టెకింద బల్లిలా అతుక్కుపోయివున్నాడు.
ఏమాత్రం బాలెన్స్ తప్పినా కింద పడిపోకుండా వుండడానికి తలవైపు ఎంత బరువుందో అదే బరువు రెండుకాళ్ళ దగ్గర వుండడం వల్ల సమతూకం ఏర్పడింది.
అతని శరీరాన్ని పట్టి వుంచగల బలం ఆ అయస్కాంతపు ముద్దలకు వుంది. అయితే, అంతకు మించిన బరువు ఏదయినా కలిస్తే క్రిందకు జారిపోయే ప్రమాదం లేకపోలేదు. ఇప్పుడు తనేంచేయాలో దూరాన్ని కళ్ళతోనే లెక్కకట్టాడు.
ఎయిర్ జాకెట్ లో నుంచి గ్యాస్ కట్టర్ ను తీసి ఆవైపు అమర్చుకున్న మినీ గ్యాస్ సిలెండర్ కు కనెక్షన్ ఇచ్చి స్విచ్ నొక్కాడు. మరుక్షణం ఛక్ మంటూ తెల్లటి మంట వెలిగింది.
తను లెక్కవేసిన ప్రకారం బేస్ మెంట్ క్రింద చాక్ పీస్ తో గీత గీచినంతవరకు గ్యాస్ కట్టర్ తో ఐరన్ షీట్ ను మెల్ట్ చేయడానికి ఉద్యుక్తుడయ్యాడతను.
మంట తగిలినంత మేరకు ఐరన్ షీట్ మెత్తబడింది.
గ్యాస్ కట్టర్ ను అలానే బేస్ మెంట్ చుట్టూ గుండ్రంగా తిప్పేసరికి ఠపీమని ఐరన్ ప్లేట్ ఊడి అతని చాతీమీద పడింది.
ఊహించని దానికి ఖిన్నుడయ్యాడతను. అది అంత తొందరగా కరుగుతుందని అతను ఊహించలేదు.
ఎయిర్ జాకెట్ వుండడం వల్ల, ఆ ప్లేట్ పడినంతవరకు ఎయిర్ జాకెట్ కాలిపోయింది. దానిని వెంటనే పక్కకు తోసి ప్రమాదం నుంచి తప్పించుకుని భారంగా శ్వాస పీల్చాడతను!
బోగీ బేస్ మెంట్ కట్ అయినచోట ఐరన్ సేఫ్ బేస్ మెంట్ కనిపిస్తోంది.
అంటే, తన అంచనా తప్పలేదు. తన ప్లాన్ గ్రాండ్ సక్సెస్ కాబోతోంది.
తిరిగి గ్యాస్ కట్టర్ స్విచ్ ఆన్ చేశాడు. ఇప్పుడది ఐరన్ సేఫ్ బేస్ మెంట్ ని తొలుస్తోంది.
అతను వాచీవంక చూశాడు. అది వేగంగా పరుగెడుతున్నది.
అంతకంటే వేగంగా తన పని పూర్తిచేయాలి...
అతను ఆ పనిలోనే నిమగ్నమయ్యాడు.
* * *