వర్షం రహస్యంగా తనతో గుస, గుసలు చెబుతున్నట్లనిపించి సిగ్గుతో తలవంచుకొంది.
ఆమెకు తెలియదు - ఊహకందని సంఘటనలు జరగబోతున్నాయని, ఆమెని వెతుక్కుంటూ ఓ వ్యక్తి వస్తున్నాడని.
* * *
స్థలం : బొంబాయి.
సమయం : రాత్రి రెండు గంటలు.
ఆ సమయంలో వీధులన్నీ నిర్మానుష్యంగా వున్నాయి. నగరంలో జుహు బీచ్ దగ్గరలో వున్న ఫైవ్ స్టార్ హోటలది.
ఆ హోటల్ లోని ఓ రూమ్ లో మాత్రం ఇంకా లైట్లు వెలిగే వున్నాయి.
రూమ్ లో వున్న అలెక్స్ కి అసహనంగా వుంది. కళ్ళ ముందు అప్పగించిన అస్సైన్ మెంట్ మెదులుతోంది. బలరాజ్ పదే పదే గుర్తుకు వచ్చి తనని పట్టుకోమని సవాల్ విసురుతున్నట్లు, పరిహసిస్తున్నట్లనిపించింది. ఇప్పటికి తనకి త్రివేది పని అప్పచెప్పి నాలుగు రోజులు కావస్తుంది. తనకింకా రెండు రోజులు మాత్రమే గడువుంది. ఈ నాలుగు రోజులు చాలా హ్యాపీగా గడిపేశాడు.
ఈ నాలుగు రోజులు కళ్ళు చెదిరే కాల్ గర్ల్ నీతా అందం తననెక్కడికి కదలనివ్వలేదు. ఆమె తనతో ... ఇంకా రెండు రోజులు గడపబోతోంది.
ఈ రెండు రోజులు ఆమెకు దూరంగా వుండగలిగితే చాలు.
నీతా గుర్తుకు వచ్చి తల ప్రక్కకి తిప్పి చూశాడు. ఆమె నిద్రపోతుంది. నిద్రలో కూడా ఎర్రటి ఆమె పెదవులు అందంగా మెరుస్తున్నాయ్ నిద్రలో కూడా ఆమె ఒక చేతితో అలెక్స్ నడుముని చుట్టేసింది. ఇంతలో శబ్దం చేస్తూ ఫోన్ మ్రోగింది.
ఎందుకో ఆ క్షణంలో ఫోన్ మ్రోగడం అపశృతిలా అనిపించింది - అలెక్స్ కి.
ఈ టైమ్ లో తనిక్కడుంటాడని ఎవరికి తెలుసు అని అనుకొని ఫోనెత్తాడు అలెక్స్.
అవతల నుంచి త్రివేది పర్సనల్ సెక్రటరీ కంఠం వినిపించడంతో ఒకసారి ఎలర్ట్ అయ్యాడు.
"హలో ... ఐయామ్ మిస్ పర్వీన్ స్పీకింగ్.
బాస్ వాంట్స్ టు టాక్ టు యు పర్సనల్లీ. ప్లీజ్ కమ్ ఓవర్ హియర్ ఇమిడియట్లీ." పర్వీన్ కంఠం తీయగా పలికింది అవతల నుంచి.
అలెక్స్ కి ఇంత రాత్రిలో తనని త్రివేది ఎందుకు రమ్మంటున్నాడో అర్ధం అయింది. ఒక్క క్షణం ఆగి సమాధానం చెప్పాడు.
"ఓ కె. ఐ విల్ బి దేర్ విత్ ఇన్ టెన్ మినిట్స్"
అలెక్స్ త్రివేదితో మాట్లాడవలసిన విషయం గురించి రెండు నిముషాలు ఆలోచించి హడావిడిగా తయారయి బయలుదేరాడు త్రివేదిని కలుసుకోవటానికి, అతను వెళుతున్నట్లు నిద్రపోతున్న నిద్రపోతున్న నీతాకి కూడా చెప్పకుండానే.
సరిగ్గా పది నిముషాల తరువాత అతను త్రివేది ముందున్నాడు.
అది ఒక పెద్ద రూమ్. అవతలి వాళ్ళ ఆలోచనలు చెదరగోడుతున్నట్లు అడ్డంగా నిలువుగా అమర్చిన టైల్స్ వున్నాయి ఆ రూమ్ లో. త్రివేది రివాల్వింగ్ చైర్ లో కళ్ళు మూసుకొని నెమ్మదిగా వినిపిస్తున్న అనూప్ జలోటా గజల్స్ వింటున్నాడు. ఆ క్షణంలో అతన్ని చూస్తే అతను ఎంతో టెన్షన్ అనుభవిస్తున్నాడని ఎవరూ అనుకోరు.
వచ్చినట్లు తెలియటం కోసం చిన్నగా దగ్గాడు అలెక్స్ త్రివేది ధ్యాన ముద్రలో మార్పులేదు.
"సార్ ... పిలిచారట ... " అన్నాడు తటపటాయిస్తూ.
త్రివేది వెనక్కి తిరిగి కళ్ళు తెరిచాడు ... అతని చూపుల్లో ఏ భావము కనిపించలేదు ... చూపుల్లోనే కాదు మొహంలో కూడా ... అదీ అతని ప్రత్యేకత. అతని పెద్ద కొడుకుని రామ్ నారాయణ మనుషులు దారుణంగా హత్య చేసారని తెలిసినప్పుడు కూడా అతని మొహంలో ఎటువంటి భావాలు లేవు. ఆక్షరికి తన కుడి భుజంగా చెప్పబడే బలరాజ్ మాయమయ్యాడని తెలిసినప్పుడు కూడా అంతే.
"యస్ ... ఇంత రాత్రి వేళలో ఎందుకు పిలిపించాననేది నీకర్ధమై వుంటుంది. నీకు ఎస్సైన్ మెంట్ అప్పచెప్పి సరిగ్గా నాలుగు రోజులు కావస్తుంది. అంటే తొంబై ఆరు గంటలు కాని నువ్వింకా ఇక్కడే వున్నావ్ ... ? నీకు తెలుసా నేను రాత్రి పన్నెండు దాటాక మెలుకువగా వుండనని... !
దిసీజ్ ద ఫస్ట్ టైమ్ ... నేనెంతగా బలరాజ్ గురించి వర్రీ అవుతుంది నీకు తెలుసనుకుంటాను." త్రివేది కంఠం ఖంగుమని ప్రతి ధ్వనించింది ఆ హాల్ లో.
వెంటనే సమాధానం చెప్పడానికి భయపడ్డాడు అలెక్స్.
ఒక నిముషం తరువాత నోరు విప్పాడు.
"సారి. సర్......!"
బలరాజ్ ఎక్కడున్నాడన్నది సరిగ్గా ట్రేస్ చెయ్యలేకపోతున్నాను. అతని గురించిన వివరాలు తెలుసుకోవడం చాలా కష్టంగా వుంది. అయినా నాకో ఇన్ఫర్ మేషన్ తెలిసింది ... అతనికో కొడుకు వున్నాడని, అతన్నెక్కడో చదివిస్తున్నాడని ...
మీకు తెలిసిన వివరాలేమయినా ఇస్తే నా పని మరింత సులభమవుతుంది.