"ఏం కరిగిందండి?" అంది జాన్సి. కుమార్ సమాధానం చెప్పలేకపోతున్నాడు, బెంబేలుగా చూసాడు.
"ముందు ఆటోవాణ్ణి పంపించండి తర్వాత మాట్లాడుకుందాం" అంది విసుగ్గా.
"నా పేంట్ కి చిల్లు వున్నట్టుంది డబ్బులు పడిపోయాయి" అనలేక అనలేక అన్నాడు.
"అరె! ఎంతపని జరిగింది? పోనీ, పర్స్ కోటుజేబులో పెట్టుకున్నారేమో చూడండి" అతడి సూట్ కొత్తగా వుంది.
"నాకసలు పర్స్ లేదు" తలవంచుకుని నూతిలోంచి మాట్లాడుతున్నట్లు అన్నాడు.
"ముందు నా డబ్బులివ్వండి" ఆటోవాడు కసిరాడు. డబ్బులేని ప్రయనీకులని ఆటోవాడు కసిరాడు. డబ్బులేని ప్రయాణీకులని ఆటో డ్రైవర్లు అతి తేలిగ్గా కసరగలరు. ఝాన్సీ తన బేగ్ లోంచి డబ్బుతీసి ఇచ్చింది. ఆటో వెళ్ళిపోయింది ఇద్దరూ బస్ స్టాపువైపు నడవసాగారు.
"నాసంగతి సరే! మిగిలిన వాళ్ళంతా వస్తారుకదూ? నా దగ్గర పార్టీకి సరిపడినంత డబ్బులేదు" అంది ఝాన్సీ.
"మిగిలినవాళ్ళంతా ఎవరు?"
"ఎవరెవరిని పిలిచారు?"
"ఎవరినీ పిలవలేదు. మిమ్మల్నోక్కరినే...." నడుస్తున్నది ఆగిపోయింది ఆమె.
"నడవండి, ప్రమాదం తప్పిపోయింది." నవ్వును పెదవులు దాటి రానీయలేదు ఆమె.
"జీవితంలో అనుకున్నావి అనుకున్నట్లుగా జరగవు" వేదాంతిలా అన్నాడు.
"జరిగినవాటినే అనుకూలంగా మార్చుకుంటే సరి."
"ఎలా?" సింపుల్, నన్ను మీ ఇంటికి తీసికెళ్ళండి, పాలే ఇవ్వండి.
"మా ఇంటికే! వద్దు వద్దు."
"ఎందుకని? మీ ఇంటికి తీసికెళ్ళకపోతే మీతో మాట్లాడను"
అతను నిలబడిపోయాడు.
"ప్రమాదం ముందుంది నడవండి"
అతడు నవ్వుతూ "ఓ గాడ్!" అన్నాడు.
రెండు బస్ లు మారి కుమార్ వుండే ఇంటి ముందుకి వచ్చారు ఆ పరిసరాలు చూడగానే అతడు తన నెందుకు రావద్దన్నాడో అర్థమయిపోయింది ఆమెకి. ఇంటిముందే బట్టలుతుకుతున్నారు చుట్టుపక్కలవాళ్ళు. అ నీళ్ళన్ని చిన్న చిన్న ప్రవాహాలుగా ఇళ్ళ ముందుకే వస్తున్నాయి. మహానగరంలో సహితం డ్రైనేజ్ అంతగొప్పగా వుంది. కొందరు ఆడవాళ్ళు వీధి గుమ్మల్లో కూచుని పేలు చూసుకుంటున్నారు. అందరూ ఝాన్సీ కుమార్ లను విచిత్రంగా చూస్తున్నారు. ఒక రేకుల షెడ్ లాంటి దానుముందు ఆగి "రండి" అన్నాడు. అక్కడే నిలబడిపోయింది, "వెళ్ళండి" అన్నాడు. వంగి లోపలి వచ్చింది. ఇల్లు శుభ్రంగానే వుంది కాని చిన్నది, మంచంలో ఒక ఆడపిల్ల పదేళ్ళ వయసుంది పడుకుని వుంది.
"మా చెల్లెలికి సరయిన పోషకాహారం లేకపోవటం వల్ల లివర్ పాడయింది. నేను డాక్టర్నికదా! రోగం డయా గ్నైజ్ చెయ్యగలను. డబ్బులేదుగా కావలసిన కొని ఇవ్వలేను."
ఝాన్సీ మాట్లాడలేదు. మనసులో చాలా బాధగా వుంది. అక్కడున్న కర్ర కుర్చీలో కూర్చుంది. కూమార్ తన కోటు విప్పాడు. షర్టునిండా చిరుగులు. ఆ చిరుగులు చూస్తున్న ఆమెతో "ఈ సూట్ అద్దెకు తీసుకున్నాను. అందుకే పేంట్ కి చిల్లు వుందని తెలియలేదు వాడెవడో నాకంటే "పైన పటారం....బాపతులాగున్నాడు" అని నవ్వాడు. ఆ నావ్వును ఆశ్చర్యంతో, జాలితో, ప్రశంసతో చూసింది.
కూమార్ తల్లి లోపలినుంచి వచ్చింది. శుభ్రంగానే వుంది. కానీ, ఎముకలగూడులా వుంది. తల ముగ్గుబుట్టలా అయిపోయింది. ఝాన్సీని చూడకుండానే "ఊరెళ్ళటానికి అయ్యీ ఇయ్యీ కొంటానన్నావు కొన్నావంట్రా?" అంది.
కుమార్ బాధగా నవ్వుతూ "ఇవాళ మీకు నా విశ్వరూపం చూపిస్తున్నాను" అన్నాడు.
"విశ్వరూపంలో నీ, నా , భేదాలుండవు. అందరివీ ఒకటే" సానుభూతితో అంది.
"అయ్యో! అమ్మాయుందా! చూడనేలేదు. ఆయన కట్ట మతిపోయింది, నా కిట్టా మతిపోతోంది."
తల్లి మాటలను కుమార్ వివరించాడు.
"మా నాన్నకు కొద్దిగా పొలం వుండేది. అప్పుల పాలయి అది పోగొట్టుకున్నాడు. రైతుకు భూమిమీద ఉండే ప్రేమకొద్దీ పిచ్చివాడయిపోయాడు. మా ఊళ్లోనే వున్నాడు. తమ్ముడు నాన్నదగ్గరే వున్నాడు. అక్కడెవరిదగ్గరో పాలేరుగా వున్నాడు. కుటుంబంలో ఒక్కరికే స్కాలర్షిప్ వస్తుంది. నేను మాత్రమే చదువుకోగలిగాను. ఇన్ని చికాకుల మధ్య మెరిట్ సంపాదించుకోలేక పోయాను."
"మీరు గర్వపడాలి పరిస్థితులకు ఎదురీదుతూ డాక్టర్ కాగలిగినందుకు..."
"అమ్మా ఈమెకు కొంచెం కాఫీ ఇయ్యి" ముసలావిడ లోపలికెళ్ళింది. ఉన్నవి రెండే గదులు కొంచెం సేపట్లో గాజుగ్లాసుతో కాఫీ తెచ్చింది. కాఫీ అందుకుని త్రాగింది ఝాన్సీ. కుమార్ కళ్ళలో సంతృప్తి, ఆరాధన, కాఫీకి లేని రుచి కల్పించాయి.
"వెళ్తాను" అని లేచింది. ఆమెతో బస స్టాప్ వరకు వచ్చాడు కుమార్. బస్ కోసం ఎదురు చూస్తున్నారు.
"నేను ఎల్లుండి వెళ్తున్నాను."
ఆమె మాట్లాడలేదు.
"గోదావరి ఎక్స్ ప్రెస్ లో , అది రాత్రి....." కుమారు మాటలు పూర్తికాకుండానే బస వచ్చింది. ఆమె హడావుడిగా బస ఎక్కేసి చెయ్యి ఊపింది. బస్ ముందుకు కింది.
* * *
ఝాన్సీ పశ్చాత్తాప పడసాగింది. కుమార్ తనకు పోస్టింగ్స్ వచ్చాయని చెప్పగానే మనసులో ఈర్ష్య చెలరేగింది. ఇద్దరూ కలిసి చదువుకున్నారు. ఆతనికంటే మంచి మార్కులతో పాసయింది. ఆర్థకంగా ఇద్దరూ హీనదశలోనే వున్నారు. అలాంటప్పుడు అతనికి ఉద్యోగం రావటం అన్యాయం అనుకొంది. అతని ఇంటికి వెళ్ళాక ఆ వాతావరణం చూసాక తనెంత పొరపాటుపడిందో తెలుస్తోంది. ఆర్థికంగా రెండు కుటుంబాలూ వెనుకబడి ఉన్నా, తన తమ్ముడు పాలేరుగాలేడు- చెల్లెలు ఆహార లోపం వల్ల మంచం పట్టలేదు. డబ్బులేకపోయినా తరతరాలుగా వచ్చిన సంస్కారం తమ కుటుంబంలో వుంది. వారాలు చేసుకొని అయినా తమ కుటుంబాల్లో పిల్లలు చదువుకొంటారు. చదువు విలువ వాళ్ళకు మరొకళ్ళు చెప్పక్కర్లేదు, చదువు తప్ప వాళ్ళు చెయ్యగలిగిన మరోపని లేదు. తమకు ఏమీ ఆస్థిలేకపోయినా , తండ్రి వున్నంతకాలం దేవుడి పేరుమీద హాయిగా బ్రతికారు. హారతిపళ్లెం చూపుతు తండ్రి దొంగచాటుగా జాపిన చేతిలో చిల్లరడబ్బులు గుట్టలుగా పడేవి. పాపం కుమార్ తండ్రికి పొలం వుంది, శ్రమజీవి. రాత్రింబగళ్ళు పాటుపడ్డాడు, దక్కిన ఫలితమేమిటి? అప్పులపాలయి ఉన్మాది కావటమేగా! కాదు, కేవలం ఆర్ధికమయిన విభేదం మాత్రమే కాదు. సాంఘికంగా ఎన్నో సంవత్సరాలుగా అణచబడ్డ ఈ జాతి అనేక విధాలుగా కృంగిపోయింది ఇంకా ఇంకా ఎంతో ప్రోత్సాహమూ, సహకారమూ లభిస్తేనేకాని ఈ జాతి ముందుకు రాలేదు.