Previous Page Next Page 
వెలుగుబాట పేజి 3


    
    "థేంక్యూ థేంక్యూ వెరీమచ్. అసలు నేనింతకు తెగించే వాడినికాదు. కానీ, నేను మరిచిపోలేదు. అందుకే ఇలా....."
    ఫరవాలేదులెండి. విడాకుల అనుమతి వ్రాసి ముందుగానే ఇచ్చారుగా."
    తల దించుకొనే వీలుగా అతని ముఖంలోకి చూసింది. అతని ముఖం కొద్దిగా ముడుచుకుపోయింది. నిష్కారణంగా రుమాలుతీసి ముఖం తుడుచుకున్నాడు. "అఫ్ కోర్స్...అన్నాడు గొణుగుతున్నట్లు...
     ఆ రోజు....కుమార్ చెప్పిన ఆ రోజు ఝన్సీకి కూడా బాగా గుర్తుంది.
    అందరూ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు వ్రాశారు. పాసయిన వాళ్ళందరికీ ఉద్యోగాలు రావనీ తమ సీనియర్సే ఎందరో ఉద్యోగాలు లేకుండా వున్నారనీ వాళ్ళందరికీ  ఉద్యోగాలు వచ్చి తమ వంతు వచ్చేసరికి బహుశః తమకు వయసు మీరిపోవచ్చుననీ, ఏదైనా  అడ్డదారి తొక్కితే తప్ప ఉద్యోగంమీద ఆశ వదులుకో వలసిందేననీ విద్యార్థులంతా గోలగా  చెప్పుకుంటున్నారు. ఎంతో కష్టపడి  మెడిసిన్ లో సీటు సంపాదించి అంతకంటే కష్టపడి అయిదేళ్ళు చదివి డాక్టర్ డిగ్రీ తెచ్చుకున్న ఆ యువతీ  యువకుల మొహాలలో నిరాశానిస్పృహలు తాండవమాడుతున్నాయి. కొందరు ఉద్యోగం లేకుండా వుండలేక ప్రైవేట్ ప్రాక్టీస్  చేస్తున్నా పేరున్న డాక్టర్ల దగ్గర అసిస్టెంట్లుగా చేరిపోయారు. "ఛ!" నాలుగొందలు జీతం. చెప్పుకోటానికే డాక్టర్ కాని, లెక్చరర్ కన్న అన్యాయం?" అని ఒకరూ, "ఆఁ! ఆ లెక్చరర్ ఉద్యోగాలు మాత్రం  అందరికీ దొరుకుతున్నాయంటావా?" అని మరొకరూ, రకరకాలుగా తమ ఆవేదనను ప్రకటించుకొంటున్నారు. శక్తి సామర్థ్యాలున్న వారు విదేశాలకు పోతున్నారు.
    "లక్ష్మి మెటర్నిటి నర్సింగ్ హొమ్" లో అసిస్టెంటుగా చేరిపోయింది ఝాన్సీ. డాక్టర్ లక్ష్మి చాలా పెద్దపేరు సంపాదించుకొంది. ఆ నర్సింగ్ హొమ్ కి ప్రవాహంలా వస్తుంటారు ఆడ పేషెంట్లు. శ్రమ అంతా అసిస్టెంట్లున్నారు. ముగ్గురికీ నెలకు  నాలుగువందలు జీతం మాత్రం ఇస్తుంది. లక్ష్మిదేవి. మరే సదుపాయాలూ లేవు. ఆవిడ ఆదేశాల ప్రకారమే వాళ్ళు  వైద్యం చెయ్యాలి. స్వతంత్రించకూడదు. కనీసం అనుభవమైనా  వస్తుందని  కనపడ్డ ఉద్యోగానికల్లా అప్లయిచేస్తూనే అక్కడ పనిచేస్తోంది ఝాన్సీ. ఝాన్సీ సంపాదించి తెచ్చే ఆ నాలుగువందలే కుంటుబానికంతకూ ఆధారం. తాను ఇంత వరకు ఎలా చదవగాలిగిందో తలచుకొంటే, ఆమెకే ఒక పరమాద్భుతంలాగ వుంటుంది.
    ఝాన్సీ తండ్రి కొత్తపల్లెలోని వేణుగోపాలస్వామి ఆలయంలో అర్చకుడు. స్వామివారి ప్రసాదుల పుణ్యమా అని  ఆ కుటుంబానికేనాడూ తిండిని లోటువుండేదికాదు, దక్షిణలు కూడా బాగానే వచ్చేవి. అతి ఛాందస కుటుంబంలో పుట్టిన ఝాన్సీకి చిన్నతనంలోనే పెళ్ళి చేసెయ్యాలని ప్రయత్నాలు కూడా జరిగాయి. అంత చిన్నతనంలోనే ఆమె ఇంట్లోంచి పారిపోయి ఒక స్నేహితురాలి సహాయంతో తనంతట తను టౌన్ లో హైస్కూల్లో చేరిపోయింది. కూతురి సాహసానికి గుండె బాదుకున్నా చదివించక తప్పలేదు తండ్రికి. ఆమె హైస్కూల్  చదువు పూర్తయ్యేసరికి పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చింది. కూతురు చదువుకుని ఉద్యోగం చెయ్యవలసిన అవసరం తండ్రికే కనిపించింది. అతడే ఇంటర్ లో చేర్పించాడు. ఝాన్సీ కష్టపడి ఎమ్. బి.బి ఎస్. సీటు సంపాదించుకుని మొదటి సంవత్సరం చదువుతుండగానే తండ్రి పోయాడు అప్పటినుండీ, ఆమె  ఎంతకష్టపడిందో, ఇల్లు ఎలా  నడిపించిందో తమ్ముణ్ణి చెల్లెల్నీ ఎలా చదివించిందో భగవంతుడికే తెలియాలి. టైప్ పరీక్షలు పాసయి జాబ్  వస్క్స్ తీసుకొనేది. ఆలిచిప్పలతో, స్పాంజ్ తో రకరకాల బొమ్మలు తయారుచేసి తన స్నేహితులద్వారా గొప్పవాళ్ళ ఇళ్ళలో అమ్మించేది. తమ్ముడికీ చేల్లెలికీ కూడా కష్టపడి పనిచేస్తూ చదువుకోవటం అలవాటుచేసింది. తల్లిని కూడా ఊరికే కూచోనివ్వలేదు. సాంబారుపొడి, చారుపొడి మొదలైనవి తయారు చేయించి ఉద్యోగస్తులయిన ఆడవాళ్ళకు సరసమైన ధరలకు  అమ్మించేది. ఇలా ఇరవై తలలూ నలభై చేతులూ వున్న వ్యక్తిలా కుటుంబానికి ఆధారంగా నిలబడింది. తనకు డిగ్రీ వచ్చిన రోజున తన కష్టాలన్నీ గట్టెక్కి పోయాయని సంబర పడింది. కాని తనది భ్రమ అని అతి త్వరలో తేలిపోయింది. అతి భారంతో బ్రతుకుబండి లాగవలసిన దురదృష్టం పూర్తికాలేదు. వీటికి సాయం కొత్తగా వచ్చిపడింది మరో సమస్య. ఒకబిడ్డ తల్లిని అక్కను ఇంట్లోంచి వెళ్ళగొట్టాడు బావ. ఏడుస్తూ తమదగ్గరకు వచ్చింది. ఏం చెయ్యాలి! కోర్టుకి వెళ్ళటానికయినా డబ్బు కావాలిగా.
    రోగుల నందరినీ పరీక్షించి మందులు రాసిచ్చి, అలసటతో విశ్రాంతి గదిలోకి వచ్చింది ఝాన్సీ. అక్కడి తాన్ కోసం ఎదురుచూస్తున్న కుమార్ చూసి ఆశ్చర్యపోయింది.
    "నమస్కారం, మీకొక శుభవార్త చెప్పాలని  వచ్చాను. నాకు పోస్టింగ్స్ వచ్చాయి కొత్తపల్లెలో...." వెంటనే ఝాన్సీ ముఖం మీద ఒక నీడ  తెరలా కమ్మింది. అంతలో  తనను తను నిగ్రహించుకుని, నవ్వు తెచ్చిపెట్టుకుని "కంగ్రాట్చ్యులేషన్స్" అంది క్షణికంగా ఆమె ముఖం మీద కమ్మిన  నీడ కుమార్  అర్థం చేసుకున్నాడు. సిగ్గుపడుతున్నట్లు "మెరిట్ తో పాసయిన మీకు రాకుండా ఈ ఉద్యోగం నాకు రావటం అన్యాయమే అనుకోండి. కాని....." అంటూ ఏదో అనబోతుండగానే ఆమె త్వర త్వరగా "ఇందులో అన్యాయమేమీ లేదండీ. తరతరాలుగా వెనుకబడి ఉన్న జాతులను ఈనాటికైనా పైకి తీసుకురావలసిన బాధ్యత ప్రభుత్వానికి వుంది. మంచిపనే జరిగింది, హార్టీ కంగ్రాట్చ్యులేషన్స్" అంది.
    "ఇవాళ నేను పార్టీ ఇస్తున్నానుహొటల్ మయూరలో, వస్తారా?"
    "ఎన్ని గంటలకి?"
    "ఇప్పుడే మూడు గంటలకి, వెళ్దాం రండి" ఒక్క క్షణం తటపటాయించినా కాదనలేక బయలుదేరింది ఝాన్సి. ఇద్దరూ ఒక ఆటోలో కూచున్నారు. ఎం.బి.బి.ఎస్. చదివిన విద్యార్థినీ విద్యార్థులలో అనవసరపు సంకోచాలు చాలా వరకు తగ్గిపోతాయి. హొటల్ముందు ఆటో ఆగగానే దిగి ఆటోవాడికి డబ్బులివ్వటానికి జేబులో చెయ్యి పెట్టాడు కుమార్. "అరె" అన్నాడు గాభరాగా. అతని ముఖం పాలిపోయింది.

 Previous Page Next Page