Previous Page Next Page 
జీవన సంగీతం పేజి 3

                                 

    


    మాధవరావు కూతురు విరిబాల బారసాల తరవాత మాధవరావు అక్కగారు మహాలక్ష్మి మేనకోడల్ని చూచి పోవడానికి వచ్చింది.
    తల్లి పక్కన పొత్తిలి గుడ్డలలో పడుకొని ఉన్న విరిబాలను చూచి చిరునవ్వుతో "నా కృష్ణుడికి పుట్టిందమ్మా" అంది మురిసిపోతూ మహాలక్ష్మి.
    "ఏడాది మాత్రమే తేడా అవుతుంది దీనికీ, నీ కొడుక్కీ." సందేహం వెలిబుచ్చింది విరిబాలతల్లి.
    "కృష్ణుడికంటే రాధే పెద్దదికదా? రాముడికంటే సీత పెద్దది. మన కృష్ణుడికీ, దీనికీ ఏడాది తేడా ఉన్నప్పుడు ఏమౌతుంది? ఏమైనా ఇది నా కొడుక్కి పెళ్ళాం కావలిసిందే" అంది ఆడబిడ్డ అధికారం ప్రకటిస్తూ.
    "నీకు అభ్యంతరం లేనప్పుడు మాకు మాత్రం ఎందుకు ఉంటుంది. వదినా?" నవ్వేసింది మరదలు.
    మహాలక్ష్మి కృష్ణభక్తురాలు. ఆమె భర్త ఏడు కొండలవాడికి పరమ భక్తుడు. కృష్ణప్రియ తరవాత పుట్టిన పిల్లవాడికి ఆ స్వామిమీది తన భక్తి ప్రపత్తులకు నిదర్శనంగా కల్యాణచక్రవర్తి అని నామకరణం చేశాడు. మహలక్ష్మి మాత్రం కృష్ణచంద్రుడని ముద్దుగా పిలుచుకొనేది. ఇంట్లో తల్లిపెట్టినపేరే స్థిరమైంది. తండ్రి మినహా అందరూ "కృష్ణా" అని ముద్దుగా పిలుచుకొనేవారు.
    ఓ పల్లెటూల్లో పాడిపంటలకు లోటులేని ఇల్లు మహాలక్ష్మిది. ముగ్గురు తమ్ముల అభిమానానురాగాలకు పాత్రురాలయిన ఆడపడచు మహాలక్ష్మి. ప్రేమగా చూచుకొనే భర్త, ముత్యాలవంటి బిడ్డలు, అటువంటి అదృష్టవతి కుటుంబంపై నిధి శీతకన్ను పడింది.
    కళ్యాణ్ తరవాత తిరిగి గర్భందాల్చిన మహాలక్ష్మి కాన్పుతో పక్షవాతంవల్ల తల్లి, పుట్టిన బిడ్డ దాటుకొన్నారు. మహాలక్ష్మి చనిపోయే సమయంలో పెద్ద తమ్ముడు మాధవరావు దగ్గిరే ఉన్నాడు.
    "నీ పిల్లల్లా చూచుకొని పెంచి పెద్దచెయ్యి, మాధవా, కృష్ణుడికి రాధనిచ్చి పెళ్ళిచెయ్యి. పిల్లలను ఒక ఇంటివాళ్ళను చెయ్యి" అంటూ, పిల్లలనిద్ధరినీ తమ్ముడి చేతిలోపెట్టి కన్నుమూసింది మహాలక్ష్మి.
    భార్యావియోగంతో విరక్తుడై దేశాంతరగతుడైన కళ్యాణ్ తండ్రి కొన్నాళ్ళకే తిరిగి వచ్చాడు రోగగ్రస్తుడై. తన ఆస్తికి సంరక్షకుడుగా మాధవరావును నియమించి, కళ్యాణ్ ను పెంచి పెద్దవాన్ని చేసి అతడికి ఆస్తి సురక్షితంగా అప్పగించమని చెప్పి నిశ్చింతగా ఇహలోకయాత్ర చాలించాడు.
    పిల్లల నిద్ధరినీ తల్లితండ్రుల లోటు కనిపించనీయకుండా ఆదరంగా చూచుకొంటున్నారు మాధవరావు దంపతులు. మాధవరావు కుటుంబం చాలా పెద్దది. ఇద్దరు తమ్ముళ్ళూ, వారి భార్యలూ పిల్లలూ, ఇల్లంతా మందితో కలకలలాడుతూంటుంది. ఇంచుమించు ఆ ఇంటిలోని వ్యక్తులందరూ విద్యాధికులే. మంచి స్థితి పరులు.
    కృష్ణప్రియకు పదహారేళ్ళు రాగానే మంచి సంబంధం విచారించి తన ఖర్చుమీదే వైభవంగా వివాహం జరిపించాడు మాధవరావు. అయిదేళ్ళు సుఖసంసారం సాగించిదోలేదో నొసటికుంకుమ చెరుపుకొని కూర్చుంది. కృష్ణప్రియ ఇంటికి పెద్ద దిక్కుఅయిన ఆమె అత్తగారు కూడా కొన్నాళ్ళకి దాటిపోయింది. కల్యాణ్ ఆస్తి సంరక్షణతోపాటు కృష్ణప్రియ ఇంటివ్యవహారాలు చూడడంకూడా మాధవరావు భుజాల మీదనే పడింది. ఊరికే ఉండడం ఎందుకని స్కూల్ ఫైనల్ తో ఆగిపోయిన చదువు తిరిగి సాగించి, బి.ఎ. పాసయింది కృష్ణప్రియ.
    కళ్యాణ్, విరిబాలలు ఒకే చోట పెరగడంవల్ల, పెద్దల అభిమతం కూడా వారిద్దరిని దంపతులను చెయ్యాలని కావడంవల్ల పసినాడే వారిలో అనురాగబీజం పడి, వయస్సుతోపాటు వారి ప్రేమలూ విరిసి, పరస్పరం బద్దానురాగులైనారు.
    కళ్యాణ్, విరిబాల ఎమ్. బి. బి. ఎస్. ఫైనల్ లోకి వచ్చారు. వివాహానంతరం దంపతులను ఉన్నతవిద్యకై విదేశాలకు పంపించాలన్న సంకల్పంతో పరీక్షలు అవుతూనే ముహూర్తం నిశ్చయించారు విరిబాల తలిదండ్రులు.
    శుభలేఖలు అందరికీ వంచటం అయింది. పెళ్ళికి బ్రహ్మాండమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముహూర్తం మూడురోజులే ఉంది.
    శాంతినికేతన్ లో విద్యాభ్యాసం చేస్తూన్న ఒక మిత్రున్ని కలియడానికి వారం రోజులనాడు వెళ్ళిన కళ్యాణ్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు.
    సంధ్యవేళ డాబాపై కెక్కిన విరిబాల పినతండ్రి కూతురు అనూరాధ, వాకిట్లో రిక్షా ఆగడం చూచి ఉత్సాహంగా కిందికి పరిగెత్తింది.
    "రాధక్కా, నీ పెళ్ళికొడుకు వచ్చాడు. నీ కృష్ణుడు వచ్చాడు" అంది విరిబాలను వేళాకోళం పట్టిస్తూ. సిగ్గుతో మొగ్గే అయిపోయింది విరిబాల.
    "ఇన్నాళ్ళుగా లేని సిగ్గు ఇప్పుడెందుకో?" ఉడికించింది.
    "పోవే, అనూ!" తలుపుచాటున నక్కింది.
    పిల్లలందరూ "బావా బావా పన్నీరూ, బావను పట్టుక తన్నేరూ" అంటూ కళ్యాణ్ కు స్వాగతం ఇవ్వడానికి బయలుదేరినవారు రిక్షాదిగి ఇంట్లోకి వస్తూన్న అతనిని చూచి బొమ్మల్లా నిల్చుండిపోయారు.
    చేతుల్లో కేర్ కేర్ మంటూన్న పాపాయిని సముదాయించలేక సతమతమై పోతూ ఇంట్లోకి అడుగుపెట్టిన కళ్యాణ్ ను అందరూ ఆశ్చర్యసంభ్రమాలతో చూడసాగారు.
    "ఎవరీ పిల్లాడు? ఎక్కడినుండి తెచ్చావు? తల్లి లేదా?" ఒక్కొక్కరినుండి ప్రశ్నలు వచ్చాయి. అప్పటికే బాగా అలిసిపోయి ఉన్న కళ్యాణ్ ఎవరికీ ఏమీ చెప్పలేదు. కృష్ణప్రియవంక తిరిగి, "ఉదయంనుండీ పాలులేవు పాపం! ఆకలికి తాళలేక గుక్కపట్టి ఏడుస్తున్నాడు. తొందరగా పాలుపట్టు, కృష్ణక్కా" అన్నాడు.
    కల్యాణ్ చేతులనుండి పిల్లాన్ని తీసుకుంది కృష్ణప్రియ. అసలే ఎర్రటిముఖం పిల్లాడిది, ఏడుపుతో మరింత ఎర్రబడిపోయింది. "పురిటి నీళ్ళయినా పోసుకున్నాడో లేదో? పాపం, ఉదయంనుండీ పాలులేవట. ఎలా ఉన్నాడో!" అని జాలిగా గుండెలకు హత్తుకోని లోనికి తీసుకుపోయింది.
    మాధవరావు వచ్చాడు, పిల్లవాణ్ణి గురించి ప్రశ్నించాడు.
    "రైల్లో దొరికాడు" అన్నాడు కళ్యాణ్.
    "పోగొట్టుకొని వెదుకుతున్నావా, దొరకడానికి?" అనుమానంగా చూశాడు మేనల్లుడికేసి. "అసలు సంగతి ఏమిటి, కృష్ణా?"
    విరిబాలతల్లి కల్పించుకొంది. "అదేమిటి? వస్తూనే అతడి చుట్టూ చేరి అల్లా విసిగిస్తున్నారు? దూరప్రయాణం. ముఖం అంతా ఎల్లా పీక్కుపోయిందో చూడండి. స్నానభోజనాలయ్యాక నిదానంగా చెబుతాడు. లే. లే, కృష్ణా. స్నానం భోజనం కానియ్యి."    
    కల్యాణ్ స్నానభోజనాలు కానిచ్చి, అలసిసొలసి ఉన్న మేను వాలుకుర్చీలో చేరవేశాడు. కృష్ణప్రియ పిల్లాడిని పాలు పట్టుకువచ్చి, మంచంమీద పొత్తిలి ఏర్పరిచి పడుకోబెట్టింది. నిద్రపోతోన్న పిల్లాడిచుట్టూ చేరారు పిల్లలూ, పెద్దలూ.
    "జుట్టు చూడు, రాధక్కా, ఒత్తుగా, నల్లగా!" విప్పారిన కన్నులతో చూస్తూంది అనూరాధ.
    "పిడికిలి ఎంత ముద్దువస్తూంది! పెసరకాయల్లా వేళ్ళు." పిడికిలి ముద్దుపెట్టుకుంది విరిబాల.
    విరిబాల చిన్నతమ్ముడు బాబు ముఖంమీద ముద్దు పెట్టుకొని. "తమ్ములా, అక్కా?" అని ప్రశ్నించాడు అమాయికంగా.
    "ఇంతకీ పిల్లాడిసంగతి చెప్పలేదు, కృష్ణా"అంది విరిబాల తల్లి.
    కుతూహలంగా కళ్యాణ్ చుట్టూ చేరారు అందరూ, మాధవరావు కూడా వచ్చాడు.
    కళ్యాణ్ చెప్పసాగాడు. "రాత్రిఅంతా పైన బెర్త్ మీద పడుకొని తెలతెలవారుతూండగా కిందికి దిగాను, తరవాతి స్టేషన్ లో ముఖం కడుక్కొని కాఫీ తాగుదామని. ఎదురు బెర్త్ మీద కూర్చున్న ఒక యువతి పలకరించింది చక్కని ఇంగ్లీషులో, ఎక్కడినుండి ఎంత దూరంనుండి వస్తున్నారంటూ, చెప్పాను. స్టేషన్ వచ్చేవరకూ ఆమెతో మాట్లాడుతూ కూర్చున్నాను. ఆమె పేరు రత్న అనీ, ఎమ్. ఎ. పాసైందనీ తెలిసింది. మాటల సందర్భంలో నా విద్యార్హతలూ అవీ తెలుసుకొంది. ఆమె ఒళ్ళో ఉన్న పిల్లాన్ని చూచి 'మీ పిల్లాడా?' అని ప్రశ్నించాను. తన పక్కన నిండా రగ్గు కప్పుకొని పడుకొన్న ఆమె వంక చూచి ఆమె కొడుకని చెప్పింది. వేగంతగ్గించి రైలు స్టేషన్ సమీపిస్తుండగా లేచాను.

 

                         

 Previous Page Next Page