Previous Page Next Page 
ఎండమావులు పేజి 3

                                 

 

                                     3

    సాయంత్రం ఆరు గంటలు దాటింది. చీకట్లు ఇళ్ళల్లోనేగాక వీధుల్లో కూడా బాగా వ్యాపించినయ్యి. అందులోనూ సీతాకాలం కావటం చేత ఆరు గంటలకే కారు చీకటి తారులా వ్యాపించింది. చలిగాలి వీస్తోంది.
    మెల్లిగా లేచి లేని ఓపిక తెచ్చుకుని వెతుక్కుంటూ వెళ్ళి స్విచ్చి వేశాడు కృష్ణమూర్తి. ఒక్కసారి తెల్లని కాంతి నిస్తూ లైటు వెలిగింది. లైటు వెలగంగానే "దీపం జ్యోతి పరబ్రహ్మ" శ్లోకం చదువుకుని కళ్ళు మూసుకు నమస్కరించి కళ్ళు తెరచి నవ్వుకున్నాడు.
    "ఈ కాస్త పడగ్గదిలో వంద క్యాండిల్సు బల్బు ఎందుకండీ" అనేది స్వాతి.
    "ఎందు కేమిటి స్వాతీ. నీ సౌందర్యం ఈ గదిలో నలు దిక్కులా ప్రవేశిస్తుంటే ఈ కళ్ళతో చూసి ఆనందించటానికి" అనేవాడు తను.
    "అయితే సౌందర్యం చూసి ఆనందించటం వరకే నన్నమాట" అంటూ చిలిపిగా నవ్వేది స్వాతి.
    "అమ్మ దొంగా" అంటూ స్వాతిని తన బాహువల్లరిలోకి తీసుకునేవాడు.
    ఇదే మాటలు మొట్టమొదటిసారిగా మాట్లాడుకుని పదేళ్ళయింది.
    పూర్వ స్మృతులను తల్చుకుంటూ మెల్లిగా పక్కమీద పడుకున్నాడు కృష్ణమూర్తి. అప్పటికి స్వాతి ఇంకా యింటికి రాలేదు. అప్పుడే ఎట్లా వస్తుంది. ఆఖరి ట్యూషను ఎనిమిదింటికిగాని కాదు.
    ఆలోచిస్తూ పడుకున్నాడు. అతని హృదయంలో పొంగులెత్తుతున్న వేడి రక్తం మీద స్వాతి మాటలు మంచు గడ్డలా పనిచేసినా ఎక్కడో దాగిఉన్న అభిజాత్యం అతనిలో ఎప్పుడూ కలక వేస్తూనే ఉండేది. ఆ స్థితిలో తన మనస్సు ఆరాట పడుతుంటే తన రెండు అరచేతుల్లోనూ అతని ముఖాన్ని స్వాతి పొదివి పట్టుకుని లాలనగా మాట్లాడుతుంటే, విహ్వలనేత్రాలలా ఆమె ముఖంలోకి చూస్తూ ఉండిపోయేవాడు తను. ఆ స్థితిలో ముఫ్ఫై అయిదేళ్ళ కృష్ణమూర్తి అయిదేళ్ళ బాలుడిలా అయి తన జీవిత ఘట్టాల నన్నింటిని మర్చిపోయి పసిపిల్లవాడిలో ఆమె ముఖంలోకి చూసేవాడు.
    "ఆనంద కిశోరుడు ఆ రాధకు ఎంత ఇష్టమో, ఈ చిన్నికృష్ణుడు ఈ రాధకూ అంతే ఇష్టము. కాని, ఒక్కటే తేడా. ఆ రాధా మాధవుల ప్రేమ సూర్యచంద్రు లున్నంతవరకూ పురాణ కావ్యవస్తువయింది. కాని, ఈ రాధా మాధవుల ప్రేమ ఎవ్వరూ హర్షించనిది" అంటూ కళ్ళొత్తుకునేది స్వాతి.
    ఈ మాటలకు తను బెంబేలు పడిపోయినట్లు తెల్సుకోగానే అంతలోనే తన ముఖంలోని విషాదాన్ని "మనమీద మనుష్యులకు మర్యాదకరమైన, మానవ సహజమైన సానుభూతి లేకపోయినందున ప్రేమ విఘ్నం కాదు." అంటూ తన చెంపల్ని వెచ్చగా ముద్దు పెట్టుకునేది స్వాతి.
    ఇవన్నీ తల్చుకుంటుంటే కృష్ణమూర్తికి కళ్ళంట నీళ్ళు తిరిగి చెంప వెంట కారిదిండంతా తడిసిపోయింది.
    స్వాతి వానకు ముత్యపు చిప్పవలె ఎదురు చూస్తూ పడుకున్నాడు కృష్ణమూర్తి.
    సైరను కూసింది. ఎనిమి దయింది. నిమిషాలు గంటలుగా భావిస్తున్నాడు కృష్ణమూర్తి. తొమ్మి దయింది. స్వాతి రాలేదు. చెప్పకుండా ఇంతవరకూ ఎప్పుడూ సినిమాకు వెళ్ళలేదు. పదయింది. స్వాతి వచ్చింది. ఆలస్యంగా వచ్చిందనే కోపంతో భీష్మించుకుని చూసి కూడా పలకరించలేదు. స్వాతి మెల్లిగా మంచంమీద కూర్చుంది. నవ్వుతూ అతని ముంగురులు సరిచేసి,
    "ఆలస్య మయిందని కోపం వచ్చింది కదూ" అన్నది నవ్వు ముఖంతో.
    "కాదు. కోపం వచ్చేంత ఆలస్యం చేశావు" అన్నాడు కృష్ణమూర్తి.
    "అంత కోప మయితే నా ఆలస్యానికి కారణం మీ కెట్లా తెలుస్తుంది. ఆలస్యమయినా అమృతం లాంటి సంఘటన జరిగింది. వింటే మీరూ నాతో పాటుగానే ఆ ఆనందాన్ని పంచుకుంటారు" అన్నది స్వాతి.
    మెల్లిగా మంచంమీద లేచి కూర్చున్నాడు. కృష్ణమూర్తి స్వాతి చెప్పే మాటలు వినక ముందే అతనికోసం నీళ్ళుకారిపోయింది. ఆ సంగతులేమిటో తేల్చుకోవాలనే ఆదుర్దా మాత్రమే అప్పుడతనిలో మిగిలింది.
    "నేను చెప్పే ఆఖరి ట్యూషను ఎవరింట్లోనో చెప్పుకోండి చూద్దాం."
    "తాసీల్దారుగారింట్లో."
    "అవునుకదా. తాసిల్దారిగారి చెల్లెలు సుభద్రమ్మగారు పోయింది. వారమ్మాయి జ్యోతి స్కూలు ఫైనలు చదువుతున్నది. అంటే తాసీల్దారు గారమ్మాయి. అమ్మాయికి మేనత్త సుభద్రమ్మగా రంటే ఎంతో గౌరవమూ, ప్రేమ. తల్లికన్న కూడా మేనత్తతోనే ఎక్కువ చక్కగా, చనువుగా మాట్లాడుతుంది. జ్యోతి మనస్సు తల్లికన్న సుభద్రమ్మగారికే ఎక్కువ తెల్సు. అలాంటి మేనత్త పోయిందనే విచారంతో అమ్మాయి మంచమెక్కింది." అంటూ ఆగింది స్వాతి.
    "పాపం. వెర్రిపిల్ల. మేనత్తంటే అంత ప్రేమ, ఆదరాభిమానాలూ నన్నమాట. జ్వరం ఎక్కువయిందా" అన్నాడు కృష్ణమూర్తి.
    "తల్లిని మించిన దైవము లేదని మనశాస్త్రాలు చెప్పుతున్నయ్యి. అట్లాగే స్త్రీకి పతియే దైవ మంటారు. అలాంటి స్థానంలో ఉన్న కొంతమంది వ్యక్తులు తమ కన్నబిడ్డలమీద కూడా మాతృప్రేమను మనసా, హృదయపూర్వకంగా చూపలేకపోతారు. భార్య సుగుణాలు, మనస్సు తెలియక మూఢునిలా ప్రవర్తించే భర్తలు లోకంలో లేకపోలేదు. కడుపున పుట్టిన బిడ్డల మనస్తత్వాలు తెలుసుకోలేని తల్లులు కూడ ఈ భూమ్మీద ఉన్నారంటే మీరు ఆశ్చర్యపోతారు. స్త్రీగా జన్మించినందువల్ల సృష్టి పరిణామరీత్యా వారు మాతృత్వాన్ని పొందగలిగారే కాని మాతృదేవి కుండవలసిన మాతృ ప్రేమ వారిలో మృగ్యంగానే ఉంటుంది. అలాంటి వ్యక్తుల్ని సర్వ సాధారణంగా మనం చూడబోము. ఈ తాసిల్దారుగారి భార్యలాంటివార్ని మన మెన్నడూ చూడబోము" అన్నది స్వాతి.
    మాతృప్రేమ, మాతృత్వమూ అనంగానే కృష్ణమూర్తికి కడుపులో దేవినట్లయింది. ఆ అమ్మ ఎన్నడూ తాసీల్దారుగారి భార్యలాంటి మనస్తత్వం కలదికాదు. మా అమ్మ కరుణామూర్తి. ప్రేమమూర్తి కొడుకులు చేసె తప్పిదాల్ని, క్షమించరాని నేరాల్ని, అసమర్ధతనీ కూడా హాలాహలంగా దిగమింగి ప్రతి చిన్న విషయంలోనూ మాతృప్రేమను వర్షిస్తూ కంటికి రెప్పలా కాపాడేది. ఎవరయినా తమని హీనంగా మాట్లాడితే వాళ్ళ మనస్సుకు నొప్పి కలుగకుండా సమాధానం చెప్పి తన కొడుకుల్ని వెనకేసుకు వచ్చేది. అలాంటి అమృతమూర్తియైన మాతృప్రేమకు చవి చూచిన తను, ఆమెకు తన ముఖం చూపలేక, ఆ మాతృ మూర్తిని మనస్సులోనే తల్చుకుని ఆరాధించుకుంటూ ఈ పదేళ్ళనుంచీ కాలం గడుపుతున్నాడు. అలాంటి సహృదయురాలైన మాతృ మూర్తి మనస్సుకు సంక్షోభం తెచ్చిపెట్టటం చేతనే ఈనాడు కన్నతల్లికి తన ముఖం చూపించలేక పోతున్నాడు. కారణం తనే అనుకుని తెల్సుకున్నప్పుడు నాలుగు కన్నీటి బొట్లతో మనస్సులోనే. ఆమెకు అభిషేకం చెయ్యటం మినహా ఇంకేమీ చేయలేకపోతున్నాడు.
    "ఏమి టాలోచిస్తున్నారు" అన్న స్వాతి మాట లతో ఈ లోకంలోకి వచ్చాడు కృష్ణమూర్తి.
    "ఆ. ఇంతకీ ఆ తాసీల్దారుగారి భార్యకు కూతురు మీద ప్రేమ లేదంటావా" అన్నాడు కళ్ళు తుడుచుకుంటూ.
    కృష్ణమూర్తి ముఖ కవళికల్ని గమనించి మునిపళ్ళతో కింది పెదవిని కొరుక్కుంటూ, బొటన వ్రేలితో నేలమీద అర్ధచంద్రాకారంగా రాస్తూ కూర్చుంది స్వాతి.

 

                          
    "మాట్లాడవేం స్వాతీ, జరిగిన విషయాలన్నీ చెప్పు. పోనీ, తరువాత చెపుదువు కానిలే. చాలా పొద్దుపోయింది. నువ్వు భోజనం చెయ్యి నాకు పాలు తెచ్చివ్వు. ఈ రొట్టె పాలల్లో ముంచుకు తింటాను." అన్నాడు కృష్ణమూర్తి.
    చైతన్య శూన్యమైన దృక్కులతో ఒకసారి కృష్ణమూర్తి వైపు చూసి వంటింట్లోకి వెళ్ళింది స్వాతి. ప్లాస్కులోని వేడివేడి పాలను గ్లాసులో పోసి, నాన్ రొట్టెను ముక్కలు ముక్కలుగా చాకుతో కోసి పళ్ళెంలో ఉంచింది. వాటిని స్టూలుమీద ఉంచి కృష్ణమూర్తి మంచం దగ్గర పెట్టింది. స్వాతి ముఖ కవళికల్ని గ్రహించిన కృష్ణమూర్తి ఆమెను పలుకరించలేకపోయాడు.
    ట్యూషన్లకు వెళ్ళబోయే ముందు వండిపెట్టిన అన్నపు గిన్నె అలాగే ఉంది. బెండకాయ కూర గిన్నె మీద మూతపెట్టిన పళ్ళెం పడద్రోసి ఎలుకలు ఆ కూర ముక్కల్ని క్రింద పారేసినయ్యి.
    వాటి నన్నింటిని అట్లాగే ఉంచి కొంచెం మజ్జిగ తాగి తలుపులు వేసింది స్వాతి.
    స్వామికి మనసారా నమస్కరించింది. సుప్రభాతపు వేళల్లో, తోమాల సేవల్లో, అర్చనల సమయాల్లో, పవళింపు సేవలో సర్వకాల సర్వావస్తలయందూ తన భక్తుల హృదయాల్లో సంచరించే ఆ స్వామి, తీక్షణ దృక్కులతో తనవైపే నిశితంగా చూసిన ట్లనిపించింది స్వాతికి. కళ్ళు మూసుకుని మనసారా స్వామిని తన మనస్సులో నిల్చుకుని "స్వామీ! నే నపవిత్రురాలనే. నా అపవిత్రతో పాలు పంచుకున్నవారికి ఏ శిక్షా వెయ్యకు. తల్లిదండ్రులకు దూరమయ్యారు. కన్నతల్లి ప్రేమకు కరువయ్యారు. నన్ను ఏం చేసినా నా తప్పిదంకు ఈ జన్మలో నాకు నిష్కృతి లేదు. నాకు ఎంత కఠినశిక్ష విధించినా అర్హురాలనే ఇనుముతో కూడా నిప్పుకు సమ్మెటపోటన్నట్లు, నా ఆరాధ్య దైవాన్ని మాత్రం ఏ విషయంలోనూ అన్యాయం చెయ్యకు" అన్నది స్వాతి.
    "భోజన మయిందా స్వాతీ అప్పుడే" అన్న కృష్ణ మూర్తి మాట విని కళ్ళు తెరిచింది.
    "ఆ. అంతగా ఆకల్లేదు." అంటూ కృష్ణ మూర్తి దగ్గర కొచ్చింది. అప్పటికి కృష్ణ మూర్తి రొట్టె తిని, పాలు తాగాడు.
    "పొద్దు పోయింది. పొద్దుట్నుంచీ పొట్ట తిప్పల కోసం నానా పాట్లూ పడుతున్నావు. విశ్రాంతి తీసుకో స్వాతీ, విశ్రాంతి తీసుకో నా జ్వరం అంత ప్రమాదకరమైంది కాదులే. నాలుగు రోజుల్లో తగ్గిపోతుంది. నీకు మాత్రం ఈ అవస్థలు ఈ జన్మలో తప్పవు" అన్నాడు.
    "అవస్థ లనేవీ, కష్టసుఖా లనేవీ మానవు లకు కాక మరెవ్వరి కొస్తయ్యండీ. సుఖలాల సత్వం కోసం జీవితపు ఉత్తమ విలువల్ని ఎప్పుడు పోగొట్టుకున్నామో, అప్పుడే ఆ కష్టాల తాలూకు నీడలు మనమీద పడ్డయ్యి." అన్నది స్వాతి.
    కళ్ళు మూసుకు పడుకున్నాడు కృష్ణమూర్తి. చలిగాలిగా ఉందని రగ్గు కప్పింది స్వాతి. మంచం పక్కనే నేలమీద కూర్చుంది. మోచెయ్యి మంచం పట్టెమీద పెట్టి అరచేతిలో చెంప ఆన్చి, కళ్ళు మూసుకు పడుకున్న కృష్ణమూర్తి ప్రశాంత వదనంలోకి చూస్తున్నది.

 Previous Page Next Page