Previous Page Next Page 
రెండోమనసు పేజి 3


    ఇంటర్వ్యు కెళ్ళినప్పుడూ చూశాడది . అక్కడికి చేరుకొనేసరికి సాయంత్రం నాలుగయిపోయింది. గుమస్తాలని తనని తనే పరిచయం చేసుకొన్నాడు చలపతి. అందరూ అతని చుట్టూ మూగారు. అతను హోటల్లో దిగిన విషయం తెలుసుకొని అందరూ అతనికో చిన్న ఇల్లు వెతికి పెడతామని హామీ ఇచ్చారు. ఇన్ చార్జిగా  వ్యవహరిస్తున్న శ్రీధరం అతనికి మేనేజర్ గదిలోకి తీసుకెళ్ళి పరిచయం చేశాడు.
    "ఎప్పుడు జాయినవుతున్నారు?" అడిగాడు మేనేజరు.
    "రేపెనండీ!" అంటూ వినయంగా సమాధానం యిచ్చాడు చలపతి.
    కొద్దిసేపు అవీ ఇవీ మాట్లాడి ఫ్యాక్టరీ నుంచి బయట పడ్డాడతను. తరువాత కార్యక్రమం ఏమిటా అన్నది తెలీలేదు. తనతో బాటు బి.కామ్ చదివిన స్నేహితులిద్దరూ , ముగ్గురు హైదరాబాద్ లోనే పని చేస్తున్నట్టు తనకు తెలుసు. అయితే వాళ్ళ అడ్రస్ లు తెలీవు.
    రమణ ఇన్ కమ్ టాక్స్ లో గుమస్తా అట! శ్రీరామ్మూర్తికి రైల్వేలో ఏదో ఉద్యోగం ప్రసాద్ కూడా ఇక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. వీళ్ళందరూ ఒకెత్తు! తన ప్రాణ స్నేహితుడు శ్రీకాంత్ ఒక్కడూ ఒకెత్తు.
    కాలేజీలో తామిద్దరూ ఒకరిని విడిచి ఒకరు వుండేవారు కాదు. కాలేజీ ఎగ్గొడితే ఇద్దరూ కలిసే ఎగ్గోట్టేవారు. తామిద్దరినీ 'అపూర్వసహొదరులు" అని అంటుండే వాళ్ళు క్లాసులో సరదాగా. తనకి శ్రీకాంత్ ఏంతో సహాయం కూడా చేశాడు.
    అత్తయ్య కి తను డిగ్రీ చేయడం ఇష్టం లేదు. అందుకే ఫీజులు కట్టడానికి నిరాకరించేది. రెండుసార్లు తన పేరు ఆ కారణంగా కొట్టి వేయబడటం, శ్రీకాంత్ సమయానికి ఫీజు కట్టడం వల్ల తను గట్టెక్కడం జరిగింది.
    అంతేకాదు ! మూడేళ్ళ పాటు తన కాఫీ హోటల్ ఖర్చులన్నీ శ్రీకాంత్ భరించాడు. ఫైనలియర్లో చిరిగిపోయిన తన బట్టలు చూసి, తనెంత వారిస్తున్నా వినకుండా మూడొందలు పెట్టి బట్టలు కుట్టించాడు. ఒకటేమిటి ఇలాంటివెన్నో ---
    ఎన్నని గుర్తుంచుకోగలడు తను? ఇంచు మించుగా ఇద్దరిదీ ఒకటే ప్రాణంలా మసిలాము. శ్రీకాంత్ తండ్రి కొబ్బరికాయల వ్యాపారం చేసేవాడు. అందులో రెండు మూడు లక్షల సంపాదించాడని అంటుంటేవాడు శ్రీకాంత్. శ్రీకాంత్ ని ఓ పెద్ద ప్రభుత్వద్యోగిలా చూడాలని అయన ఆశయం.
    అందుకే తను బి.కామ్ తో ఆగిపోయినా శ్రీకాంత్ పై చదువుల కోసం వైజాగ్ వెళ్ళిపోయాడు. వెళ్ళిన తరువాత అప్పుడప్పుడు ఉత్తరాలు రాశాడు గానీ తరవాత చాలా పెద్ద గాప్ వచ్చేసింది. ఇప్పుడు అతను ఎక్కడ వున్నాడో, ఏం చేస్తున్నాడో కూడా తనకు తెలియదు. బహుశా తెలిస్తే శ్రీరామ్మూర్తికి తెలిసి ఉండాలి. ఎంచేతంటే వాడు కొన్ని రోజులు 'లా' చదువుతానని వైజాగ్ లో వున్నాడు.
    అబిడ్స్ చేరుకొని ఫుట్ పాత్ మీద నిలబడ్డాడు చలపతి. ఎటుచూసినా జనమే కిటకిటలాడి పోతున్నారు. రోడ్డు మీద ప్రవహిస్తోన్న నదిలా కార్లు, స్కూటర్లు, రిక్షాలు, సైకిళ్ళు.
    చీకట్లు పడకుండానే లైట్లు వెలిగించి సంధ్యని పారద్రోలుతున్నట్లుంది ఆ ప్రాంతం. వాళ్ళకి ఆ రణగొణ ధ్వనులూ , ఆ జన ప్రవాహం ఇవేమీ కనిపిస్తున్నట్లు లేదు. చేతులు పట్టుకుని, ఏదో పారవశ్యంతో మాట్లాడుకొంటూ ముందుకి సాగిపోతున్నారు.
    బహుశా తామెక్కడికి వెళ్ళాల్సింది కూడా మర్చిపోయి వుంటారు అనుకోన్నాడతను. వాళ్ళందరినీ చూస్తోంటే సావిత్రి గుర్తుకొచ్చింది చలపతికి. బహుశా ఈపాటికి వంటింట్లోనో, లేక గొడ్ల చావిదిలోనో పని చేస్తుండి వుంటుందామె.
    అతని మనసంతా బాధతో నిండిపోయింది. "ఇంకెన్నాళ్ళు నీకీ కష్టాలు ఉండవు సావిత్రీ. అతి తక్కువ రోజులు అంతే" అనుకొన్నాడు భారంగా.
    తనూ సాయంత్రాలు ఇలాగే సావిత్రీ చేయి పట్టుకొని పారవశ్యంతో కబుర్లు చెప్పుకుంటూ నడుస్తాడు. ఊహు! వీల్లేదు. సావిత్రి నడవకూడదు. తన దగ్గర సావిత్రికి కిచిత్తు శ్రమ కూడా పడటానికి వీల్లేదు. ఆటోల్లోనో,  టాక్సీలోనో తిరగాలి. లేకపోతే ఇల్లు కదలతానికే వీల్లేదు. ఇంటిలో కూడా ఆమె దాసీదానిలా పని చేయకూడదు. అన్నీ పనులూ చేయటానికి ఓ పనిపిల్లని ఏర్పాటు చెయ్యాలి. ఎన్నో చేయాలి. చేస్తాడు తను.
    ఓ హోటల్లో భోజనం చేసి హోటల్ గదికి చేరుకున్నాడు చలపతి. చాలా చిన్న గది అది. గోడల రంగు వేలిసిపోయింది. పైన బాగా దుమ్ముతో నిండిన ఫాను. తుప్పు పట్టిన ఓ బట్టల హంగర్. ముఖం సరిగా కనిపించని అద్దం! ఈ సౌఖర్యాల ఖరీదు రోజుకు పాతిక రూపాయలు!
    తన దగ్గర ఉన్నదే వంద రూపాయలు! ఇంత వరకూ అందులో నలబై రూపాయలు ఖర్చయిపోయింది. రేపే ఎంత చిన్న ఇల్లయినా వెతుక్కుని కొంత అడ్వాన్స్ గా ఇచ్చేస్తే గాని మనస్తిమితం ఉండదు. తరువాత మిగతా విషయాల గురించి ఆలోచించు కోవచ్చు. అంతకు ముందు రోజు రాత్రంతా ప్రయాణం చేయడం వల్ల నిద్ర లేక వెంటనే నిద్ర పట్టేసింది చలపతికి.
    ఉదయం మెలకువ వచ్చేసరికి టైము ఎనిమిదయిపోయింది. త్వరత్వరగా టాయ్ లేట్ అయి ఆఫీసుకి బయలుదేరాడు. బస్సులో అక్కడికి చేరుకునే సరికి తొమ్మిదిన్నర అయిపొయింది. సరిగా తొమ్మిదిన్నరకే ఆఫీసు కూడా! అతని కోసం ఓ కుర్చీ టేబులూ సిద్దంగా ఉన్నాయ్.
    "ఓ వారం రోజులు పాటు నర్సరాజు దగ్గర పని నేర్చుకోండి" అన్నాడు ఇన్ చార్జి.
    నర్సరాజు దగ్గరే కూర్చున్నాడు చలపతి. నర్సరాజు కూడా పెద్దగా అనుభవం లేదు. అతను ఆ  ఆపీసులో చేరి మహా అయితే ఓ సంవత్సరం అవుతుందిట. అయినా పనంతా క్షుణ్ణంగా నేర్చేసుకున్నాడు.
    "రొటీన్ జాబ్ గురూ! కొంచెం ఇంగితం ఉపయోగిస్తే చాలు! తేలిక! మన ఫ్యాక్టరీ తయారు చేసే సిమెంట్ పైపులకి ఎక్కడెక్కడి నుంచో ఆర్డర్స్ వస్తాయ్! వాళ్ళతో కరస్పాండెన్స్ చేయడం, ఆఫీసు రికార్స్ మెయింటెయిన్ చేయడం, ఏముందిందులో!" నవ్వుతూ అన్నాడు నర్సరాజు.
    అతను బి,యే పాసయ్యేడట. నైట్ కాలేజీలో 'లా' కూడా పూర్తవుతోంది. ఆ తరువాత మరో మంచి ఉద్యోగం చూసుకోడమో లేక లాయర్ గా బోర్డు తగిలించడమో చేస్తాడ్డ!
    టైప్ చేసే అమ్మాయి పేరు గీత! మరాఠీ వాళ్ళు. అయితే తెలుగు , చాలామంది తెలుగువాళ్ళ కంటే బాగా మాట్లాడుతోంది . చాలా కలుపుగోలుతనం ఉంది. మొదటిరోజే చలపతి, విషయాన్ని అడిగి తెలుసుకుంది. అతను అడగక పోయినా తన గురించి వివరాలు చెప్పింది.
    తండ్రి రైల్వేలో పర్మినెంట్  వే ఇన్ స్పెక్టర్ గా పని చేసేవాడట. అయన రిటయిరయ్యేసరికి ఇంటి బాధ్యతంతా రెండో కూతురయిన తన మీద పడిందట. తనకి ఇంకా ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారట. విమల అనే చెల్లెలు కాలేజీలో చదువుతోందట.
    గీత వాళ్ళింటి దగ్గరే ఓ చిన్న ఇల్లు అద్దె కుందనీ , తను ఆ సాయంత్రం ఆమెతో వస్తే ఆ ఇల్లు చూపుతాననీ అందామె. ఆ ఇంటి యజమాని కూతురు గీత స్నేహితురాలేనట.
    చలపతి వుప్పొంగిపోయాడు. తన కలలన్నీ నిజమవుతున్నాయి. ఇల్లు అంతా కలిపి ఆరొందల పై చిలుకు వస్తుందట. అంటే ఇద్దరికీ ఎలాగోలా సరిపెట్టుకోవచ్చు. ఒకటి రెండు నెలల్లో అంతా సర్దుబాటు అయ్యాక తన ఊరు వెళ్ళి సావిత్రిని తీసుకోచ్చేయాలి. ఎన్ని అడ్డంకు లోచ్చినా సరే! సావిత్రి తన భార్య అవాలి అంతే. వాళ్ళ తల్లిదండ్రులు కిష్టమయినా, లేకపోయినా, తన అత్తా మామ కిష్టమయినా లేకపోయినా.
    సాయంత్రం గీతే తన సీట్ దగ్గర కొచ్చింది.
    "వెళదామా?" అంది చిరు నవ్వుతో.
    "ఓ!" అంటూ ఆమెతో పాటు బయలుదేరాడు.
    ఇద్దరూ బస్ స్టాప్ దగ్గరకొచ్చారు.
    "మీ ఇల్లు ఎక్కడ?" అడిగాడు చలపతి.
    "మలక్ పేట"
    "అంటే చాలా దూరమా?"
    "అవును" ఇక్కడికి ఇరవై కిలోమీటర్లుంటుంది."
    "అబ్బ! అంత దూరమా?"
    "సిటీలో ఆ దూరం పెద్ద దూరం కాదులెండి" నవ్వుతూ అందామె.
    బస్ లో ఇద్దరూ ఆమె ఇల్లు చేరేసరికి అరయిపోయింది.
    "నేనిప్పుడే డ్రస్ చేంజ్ చేసుకుని వస్తాను. ఈ మాగజైన్స్ చూస్తుండండి" అంటూ కొన్ని ఇంగ్లిష్ పత్రికలు అతని ముందుంచి లోపలి కెళ్ళింది.
    ఇల్లంతా ఒకసారి కలయజూసాడు చలపతి. చిన్న ఇరుకు గది. ఆ ఇరుకులోనే రెండు సోఫాలూ, ఓ టీపాయ్ ఉన్నాయి. గోడకు పాప్ సింగర్ పటాలున్నాయి. వాళ్ళ పెరులేమిటో తనకు తెలీదు.

 Previous Page Next Page