"ఏయ్ ! గవర్నమెంట్ ఎంప్లాయ్ ని ఏమయినా అన్నావంటే మర్యాదగా వుండదు......జాగ్రత్త!" కోపం నటిస్తూ అన్నాడు.
"నటరాజ్! ఇంట్లోకి సరుకులు తెమ్మని లిస్టు రాసి పంపించాను కదా! ఎవని?" అంది సీత.
నటరాజ్ కేం చెప్పాలో తెలీలేదు. బుర్ర గోక్కుంటూ రామచంద్రమూర్తి వేపు చూశాడు.
రామచంద్రమూర్తి చటుక్కున అతని సహాయానికి కొచ్చాడు.
"అది సరేగాని సీతా! పొద్దుట్నుంచి బుర్ర బద్దలు కొట్టుకుంటున్నా తట్టడం లేదు. నువ్వేమయినా చెప్పగలవేమో చూడు...స్త్రీలకు ఇవి ఎక్కువ అందానిస్తాయి.......నగలు లేక వగలు ఏది కరెక్టంటావ్ ?"
సీత ఓ క్షణం ఆలోచించింది.
"నగలే కరెక్ట్."
"వగలు కాదా?"
"ఎందుకని?"
"వగలు అందరికీ అందం ఇవ్వవు, అన్ని సమయాల్లోనూ ఇవ్వవు కనుక....."
'ఆహా! అద్భుతంగా చెప్పావ్! ఇంకోటి కూడా నువ్వే చప్పు మరి!క్ అనందమకరమైన సంసారానికి మధ్య మధ్యలో ఇది వుండాలి...సరసం --విరసం---ఏది కరెక్ట్.......?"
సీత ఆలోచనలో పడింది.
"విరసం కరెక్టండీ!" తను అందుకున్ను నటరాజ్.
సీతకు వళ్ళు మండిపోయింది.
"సరసం కరెక్ట్...."
"కాదండీ విరసమే!" మొండికేశాడు నటరాజ్.
"ఎందుకంటావ్?" నటరాజ్ ని అడిగాడు రామచంద్రమూర్తి.
"ఎప్పుడూ సరసాలాడుకుంటూ కూర్చున్నరనుకొండి ....దాంతో అది సాధారణమయిన వ్యవహారం అయిపోతుందండీ. అదే చిన్న తగువు పడ్డారనుకొండి ఆ తర్వాత మళ్ళీ ఒకటయిపోయినప్పుడు కలిగే అనందం వుంది చూశారా, భలే మోతగా వుంటుందండీ! మనాళ్ళు పాటలు కూడా రాశారు కదండీ......విరహము కూడా సుఖమే కాదా......"
"నోర్మూసుకో! నువ్వు చెప్పేదానికి నువ్విచ్చిన ఉదాహరణకూ అసలు సంబంధం లేదు. సంసారిలో అనందం వుండాలంటే అప్పుడప్పుడూ సరసాలుండాలి! అదే కరెక్ట్" కోపంగా అంది సీత.
'అది ఆ సంసారం చేసే వాళ్ళను బట్టి ఆధారపడి వుంటుందండీ! మీరన్నరనుకొండి! ఎప్పుడూ రుసరుసలాడుతూనే వుంటారు. కదండీ! అయినా మరి సంసారం ఆనందంగానే సాగుతోంది కదా!"
"నటరాజ్! నీ వాదనలో 'పస' కనిపించడంలేదోయ్, అందుకని సీత చెప్పిందే ఓ.కె. చేసేస్తున్నాను."
"పెళ్లమంటే బెల్లమూ, తల్లీ, తండ్రి అల్లమూ అని సినిమా పాట వూరికే రాయలేదండీ! ఇలా పక్షపాతం చూపించబట్టే రాశారు" అనేసి అక్కడి నుంచి జారుకోబోయాడతను.
"ఇలాంటి తలతిక్క మాటలు మాట్లాడితేనే వళ్ళు మండేది" కోపంగా అందామె. తనూ కిచెన్ లోకి వెళ్ళబోయి టక్కున సరకుల విషయం గుర్తుకొచ్చేసరికి ఆగిపోయింది.
"ఇంతకూ ఆ సరుకులేందుకు తేలేదంటే జవాబు చెప్పవేం?" రామచంద్రమూర్తి మళ్ళీ టాపిక్ డైవర్ట్ చేయడానికి ప్రయత్నించాడు."
"ఆపద్భాందవుడు సినిమా ఎందుకు దెబ్బ తిందంటావోయ్ నటరాజూ?"
:కలెక్షన్స్ లేకపోవటం వల్లనేనండీ"
"కలెక్షన్స్ ఎందుకు లేవంటావు?"
"సినిమా దెబ్బ తినడం వ్లలనండీ"
సీతకు వాళ్ళ విషయం అనుమానం కలిగించింది.
"నేనడిగేదేమిటి? మీరు చర్చించేదేమిటి?" గదమాయింపుగా అడిగింది.
"సంగతేమీటంటేనండీ! ఆ దుకాణం ప్రోప్రయిటర్ ముజిబూర్ రహమాన్ కీ, వాళ్ళ తమ్ముడు అబ్దుల్ రహామాన్ కీ, ఇంకో తమ్ముడు నూరుల్లాఖాన్ కీ దుకాణం విషయంలో గొడవయిందండీ! ఆ గొడవల్లో ముజిబూర్ రహామాన్ ఫ్రెండ్ సజ్జార్ హుస్సేన్, వాళ్ళ ఫ్రెండ్ మహ్మద్ రఫీజ్ కలిసి అబ్దుల్ రహామాన్ ఫ్రెండ్ పిరాజుద్దీన్ , అజ్మతుల్లాని పిలిచి నూరుల్లా ఖాన్ ఫ్రెండ్ అజీరుద్దీన్, యూనపుద్దీన్ తో లాలుచీ పడి కరీముల్లా , నూరుల్ హసన్ ని పిలుచుకొచ్చి ....."
సీతకు సహనం నశించింది.
"నటరాజ్! నీ అతి తెలివి నా దగ్గర చూపించకు! దుకాణాని కెళ్ళకుండా రాత్రి క్లోజింగ్ ఫిగర్ ఏమొచ్చిందో బ్రాకెట్ షాపుకెళ్ళి కనుక్కోచ్చావ్ ! అంతేనా?"
రామచంద్రమూర్తి ఇంకా లాభం లేదని తను జోక్యం చేసుకున్నాడు.
"సంగతేమిటంటే దుకాణం వాడు సాయంత్రం రమ్మన్నాడట."
"ఆ! అవునండీ! సాయంత్రం రమ్మన్నాడు."
"సాయంత్రం రమ్మనటమేమిటి? సరుకులు కావలసినప్పుడెందుకు యివ్వడు?"
"మనం అందరిలాగా కాదుగదండీ! కొంచెం స్పెషల్ గా యివ్వాలిగా మనకు, మంచి సరుకులు సాయంత్రమోస్తాయనీ......"