Previous Page Next Page 
ప్రేమించండి ప్లీజ్ పేజి 4


    వినయ్ కి ప్రతి విషయంమీదా అంత అవగాహన వుంది. కానీ తనకంత విషయ పరిజ్ఞానం లేదు అంత విశ్లేషణాశక్తి లేదు. తనంటే ఏమిటో తెలుసుకోవడానికి భయపడే తనలాంటివాడు ప్రపంచాన్ని ఏం విశ్లేషించగలుగుతాడు!
    "అసలు మీరు ఇంగ్లీషులో ఫ్లూయంట్ గా మాట్లాడటం అయినా నేర్చుకోండి. ఇంగ్లీషు గ్లామరున్న ఏ ఆడపిల్లో మిమ్మల్ని ప్రేమిస్తుంది. ఎంచక్కా ఆమెను పెళ్ళిచేసుకుని కోపం వచ్చినప్పుడు ఇంగ్లీషులో తిట్టొచ్చు. ఆమె కర్ధంగాదుకనుక మీ సంసారం బ్రేక్ అయ్యే అవకాశం ఎప్పటికీ వుండదు."
    వినయ్ ఎప్పుడూ అలానే మాట్లాడతాడు.
    అలాంటప్పుడు తను ఎలా ఫీలవుతాడో గుర్తించింది ఆంజనేయులుకు.
    సిగ్గుతో తల కిందకు వాలిపోతుంది. తన పేదరికానికి ఏడు పోస్తుంది. తన ఆకారం మీద తనకే అసహ్యమేస్తుంది. రోషమొస్తుంది. తన దురదృష్టానికీ బాధేస్తుంది.
    సంధ్య తన పక్కన వుండడాన్ని వినయ్ చూస్తే బావుండునని పించింది ఆంజనేయులుకు. వినయ్ కళ్ళల్లో తన పట్ల ఈర్ష్య లాంటిది కలిగితే చూడాలనిపించింది అతనికి.
    కానీ వినయ్ ఇటురాడు. వచ్చిన తన ఈ ఆనందోత్సాహాన్ని చూడడు. తన బతుకెప్పుడూ ఇంతే.
    ఇలాంటి ఛాన్స్ మళ్ళీ ఎప్పుడూ రాదు. అందుకే ఇంకొంచెం సేపు వెయిట్ చేయాలి. ఎరావైనా ఒక్కరు చూస్తేచాలు. ఈజీవితం ధన్యమైపోతుంది.
    తన ముఫ్ఫై ఏళ్ల చరిత్రలో ఇలాంటి అనుభవం ఎప్పుడూ కలగలేదు. తనతోపాటు ఏ ఆడపిల్లా సినిమాకు రాలేదు. ఏలేడీ విజిటరూ తనను వెదుక్కుంటూ ఆఫీసుకు రాలేదు. ఏ జీవీ తానున్నానంటూ ఫోన్ చేయలేదు. ఏ మగువా తనకింతవరకు ప్రేమలేఖ రాయలేదు.
    అయితే తన కొలీగ్ వినయ్ కి ఎన్ని ఫోన్ కాల్స్ ..... ఎంతమంది లేడీ విజిటర్స్!!..... ఎన్ని ప్రేమలేఖలు!!!
    తనకెప్పుడైనా ఉత్తరం వచ్చిందా? రాలేదు. తమ సెక్షన్ లో వుంచిన లెటర్ బాక్స్ లో తన పేరుమీదున్న ఉత్తరం ఇప్పటివరకూ చూడలేదు. డ్యూటీకి రాగానే అందరూ తమ ఉత్తరాలకోసం ఆ బాక్స్ దగ్గరకు వెళతారు. తమకు వచ్చిన ఉత్తరాలను కలెక్ట్ చేసుకుంటారు. కానీతను వెళ్ళడు. అక్కడ తనకోసం ఉత్తరం ఉండదనితెలుసు. అందువల్లే ఆలెటర్ బాక్స్ కూడా ఎంతో పరాయిదిగా కనిపిస్తుంది.
    ఎప్పుడైనా ఒకప్పుడు తను ముందుగా ఆఫీసుకెళితే తన కొలీగ్స్ అప్పటికి రాకపోతే లెటర్ బాక్స్ దగ్గరికి వెళతాడు. చేయిపెట్టి కెలుకుతాడు. తన పేరుమీదున్న ఉత్తరం ఒక్కటీ వుండదు. ఎంతో నీరసంగా వెనుతిరుగుతాడు.
    'లెటర్స్ ఏమీ లేవా సార్? అయినా మీకెవరు రాస్తారు లెండు గుర్నాధం ఎక్కడినుంచి గమనిస్తాడో ఏమో ఎదురుపడి ఠక్కున అంటాడు.
    తను అప్పుడు జీవంలేని నవ్వు నవ్వుతాడు. తన ముఖం లాగే ఆనవ్వూ తెల్లగా పాలిపోయి వుంటుంది.
    "ఎప్పుడైనా ఓ రోజు లెటర్ రాకపోతే ఏదో వెలితిగా వుంటుంది. మనకు ఉత్తరాలు లేని ఈ లెటర్ బాక్స్ చూస్తేనే జీవితంమీద సగం ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది" అంటాడు వినయ్.
    ఎప్పుడో ఒకరోజు లెటర్ రాకపోతే వినయ్ లాంటివాడే గిలగిల్లాడిపోతాడు. మరి తనలాంటివాడు ఎంత-? ఆప్ట్రాల్.
    "టైమ్ ఎంతైంది?" సంధ్య అడిగేసరికి ఉలిక్కిపడ్డాడు ఆంజనేయులు. అటూ ఇటూ చూశాడు. వాచ్ కట్టుకున్న వ్యక్తిలేడు.
    "ఒంటిగంట దాటిందనుకుంటా" నసిగాడు.
    ఆమె కూడాపాదం బొటన వేలుతో కిందగీస్తూ వుండిపోయింది.
    గడియారం కొనుక్కునే స్థోమత కూడాలేని తనంటే ఓరకమైన కసి కలిగింది ఆంజనేయులుకు. ఎప్పటినుంచో ఓ వాచ్ కొనుక్కోవాలనుకుంటున్నాడు. కానీ కుదరడంలేదు. ఏ నెలకానెల వాయిదా వేస్తున్నాడు. వాచ్ కొనాలన్నా ఈ ఆశకు దాదాపు పదిహేను సంవత్సరాలుంటాయి.
    ఆంజనేయులు తన ఎడమచేతి మణికట్టును చూసుకున్నాడు. అక్కడ గుండ్రంగా కాల్చిన గుర్తు అచ్చుగడియారం ముద్రలా వుంది చిన్నప్పుడు తనకు పచ్చరికలు వస్తే ఓ నాటు వైద్యుడి దగ్గర నాన్న కాల్పించాడు. అది అలానే వుండిపోయింది. చిన్నప్పుడంతా తనను అందరూ "గడియారం వోడా" అని పిలిచేవాళ్ళు. చేతికి అలా కాల్చుకోవడంవల్ల ఆ నిక్ నేమ్ వచ్చింది. అదేకాదు తనకు చాలా నిక్ నేమ్ లుండేవి. "బక్కోడా.....గజ్జోడా.....గడియారం వోడా..... కళ్ళపిసోడా...." ఇలా సీజన్ చొప్పున తనకు పెట్టుడు పేర్లుండేవి. ఆ పేర్లతోనే పిలవడం వల్ల తన అసలు పేరేమిటో చాలా రోజుల వరకు తెలిసిరాలేదు.
    పెద్దయ్యాక ఇలాంటి నిక్ నేమ్స్ తప్పినా అంతకుమించిన ఆదరణ ఎప్పుడూ లభించలేదు. తనకెలాంటి స్పెషల్ అట్రాక్షన్ లేకపోవడం వల్లే ఎవరూ పట్టించుకోరేమో. తన కొలిగ్స్ వినయ్, రాహుల్, జీవన్ అభినయ్ లకు చాలా క్వాలిటీస్ వున్నాయి. అభినయ్ బాగా డబ్బున్న ఫ్యామిలీనుంచి వచ్చాడు. డబ్బు తెచ్చిన కాన్ఫిడెన్స్ అతని ప్రతి కదలికలోనూ కనిపిస్తుంటుంది. తనలాగా అర్ధంపర్ధంలేని కాంప్లెక్సులు లేవు. ఆఫీస్ కొస్తూనే అందరికీ కాఫీలు ఇప్పిస్తాడు. సిగరెట్లు పంచుతాడు. అందుకే అతను రాగానే అందరూ అతనికి ఎంతో అభిమానంతో విష్ చేస్తారు.
    ఇక జీవన్ క్రికెట్ ప్లేయర్. ఎప్పుడూ హుందాగా, తెల్లటి బట్టల్లో మల్లెపూవులా కనిపిస్తాడు.
    వినయ్ విషయం చెప్పక్కర్లేదు. అతని చొరవ మనుషులను మరింత దగ్గరికి చేరుస్తుంది. ఎవరినైనా ఇట్టే ఆకర్షించగలడు.
    తనకైతే కొత్తవాళ్ళు అనిపిస్తే చాలు నాలుక పిడచకట్టుకుపోతుంది. మాతృభాషనే మరిచిపోతుంటాడు. బాగా పరిచయమున్న వాళ్ళతో అయితే కొంత బెటర్ అయిదు నిముషాలకైనా ఓ మాట మాట్లాడగలడు.
    ఆంజనేయులకు వాళ్ళతోపాటు తన ఆఫీసులోనే పనిచేసే మహాలింగం గుర్తొచ్చాడు. అతనూ తనలాగే ముతగ్గా, పేదగా వుంటాడు. అయితే తనలాగా న్యూనతా భావంతో గింజుకుపోడు. అందరిమీదా దుమ్మెత్తి పోస్తుంటాడు. తనకు నచ్చిన రీతిలో చాలా పరుషంగా వాళ్ళను అటాక్ చేస్తుంటాడు.
    "వాళ్ళకేమండీ పెట్టిపుట్టినోళ్ళు. ఈ వినయ్, అభినయ్..... వీళ్ళున్నారు చూశారూ! మిగిలినవాళ్ళ బతుకులను కూడా వాళ్ళ బతుకుల్లో కలిపేసుకుని జల్సా చేస్తున్నారండీ. వాళ్ళు ఎక్కితిరిగే స్కూటర్లు వాళ్ళవికావు- వాళ్ళు చూసే వీడియోలు వాళ్ళవికావు - వాళ్ళు వుండే ఏసీ గదులు వాళ్ళవికావు కడకు వాళ్ళు మాట్లాడే ఆ నాలుగు ఇంగ్లీషు ముక్కలూ వాళ్ళవికావు. మనలాంటి సవాలక్షమంది చదువు మానేస్తే వాళ్ళు చదువుకోగలిగారు. మనం ఇలా పేదవాళ్ళుగా వున్నాం కనుకే వాళ్ళు అలా డబ్బున్నవాళ్ళుగా తయారయ్యారు మన సుఖసంతోషాలను వాళ్ళు లాక్కుని, వాళ్ళ దుఃఖాలు మనకు ఇచ్చేశారండీ- బాస్టర్స్...."
    మహాలింగం ఇలా భావావేశాలను ఎప్పటికప్పుడు వ్యక్తం చేస్తుంటాడు. కనుకనే తనలా కుంగిపోడు.
    తన కొలీగ్స్ పేర్లే ఎంతో రొమాంటిక్ గా వుంటాయి. రాహుల్, వినయ్, జీవన్. ఎంత అందమైన పేర్లు. తన పేరులో ఎంతో పాతదనం వుంది నడవని తల్లిదండ్రులు పెట్టిన పేరు. తనది ఫరవాలేదు మహాలింగంది మరీ ఘోరం ఏదో వికారం ఆ పేరులో.

 Previous Page Next Page