Read more!
 Previous Page Next Page 
ప్రేమించండి ప్లీజ్ పేజి 3


    "బావున్నా?" అంటూ జవాబు కోసం చూడకుండా మెకానిక్ వెళ్ళిపోయాడు.
    మెకానిక్ తమ పక్కన ఓఅమ్మాయి వుండడాన్ని గమనించాడా అతని ముఖకవళికల్ని గమనించినట్టు లేదు.
    ఇంత ప్రయాసపడి సంధ్యను ఇక్కడ దించడం నిష్ప్రయోజనం అయిపోతుందా! స్వామీ! వెంకటేశ్వర్లు తాలూకా! తెలిసిన ఒక వ్యక్తి ఇలా వచ్చేట్టు చేయి స్వామీ! వచ్చి నాపక్కనా ఓ అమ్మాయి వుందని గమనించేటట్టు చేయి స్వామీ! ఇంకెప్పుడూ ఏమీ కోరను తండ్రీ...
    ఆంజనేయులు ముక్కుకుంటూనే వున్నాడు.
    దేవుడు ఆంజనేయులు ప్రార్ధన మన్నించలేదు. ఎవరూ తెలిసిన వాళ్ళు రాలేదు.
    ఆంజనేయులు కళ్ళు అటూ ఇటూ వెదుకుతున్నాయి.
    దూరంగా మిఠాయి అంగడి దగ్గరున్న గురునాధం కనిపించాడు. ఒక్కసారిగా ఉత్సాహం తన్ను కొచ్చింది. పిలుద్దామనుకున్నాడు. కానీ నోరు పెగలలేదు గురునాధాన్ని ఇప్పుడు పిలిస్తే ఇవ్వవలసిన అప్పు అడుగుతాడు. అతను ఆఫీసులో మేనేజర్ వడ్డీకి అప్పులిస్తుంటాడు. ఆ అప్పు అడుగుతాడనే భయం నోరు నొక్కేసింది.
    లేకుంటే ఈ పాటికి ఏదో మిష మీద గురునాధాన్ని పిలిచి తన పక్కనా ఓ అమ్మాయి వుందని చూపించేవాడు. రేపు ఉదయానికల్లా ఈ విషయం ఆఫీసులో తెలిసిపోయేది. ఇక దానిపై ఎన్ని కామెంట్లు వచ్చేవో వూహించాడు ఆంజనేయులు.
    "కంగ్రాజు లేషన్స్ ఆంజనేయులుగారూ! ఎవరో ఓ అమ్మాయిని పట్టేశారట కదా. బ్రహ్మాండంగా వుందని చెప్పాడు. గురునాధం మీకేమి టండీ బాబూ! ఓ ఆడతోడుంది బాధలూ సుఖాలూ పంచుకోవడానికి."
    "ఇంతకీ ఎవరండీ కాస్త చెబుదురూ....."
    ఇలా అందరూ తను చుట్టుముట్టేస్తారు. ప్రశంశలతో అభినందనలతో ముంచేస్తారు. తనతో పని చేస్తారు. తను గర్వంగా చిరుమందహాసంతో గ్రీట్ చేస్తాడు. తన కొలీగ్స్ వైపు హుందాగా నడుచుకుంటూ వెళతాడువాళ ప్రశ్నలకు జవాబు చెప్పకుండా గంభీరంగా నవ్వుతాడు.
    ఇంతకాలంగా ఓ ప్రత్యేకత వస్తుంది తనకు అందరూ తనను గౌరవంగా చూస్తారు. అభిమానంతో పలుకరిస్తారు. తననూ ఓ మనిషిగా గుర్తిస్తారు.
    కానీ ఇపుడా అవకాశం లేదు. గురునాధం ఇటురాడు. తను పిలవలేదు. రెండు వందల రూపాయలు అర్ధాక్షిణ్యంగా తన ఆనందాన్ని లాక్కుంది. ఛీఛీ....వెధవ డబ్బు అని ఆంజనేయులు అసహ్యించుకున్నాడు.
    "పనేదోవుందని అన్నావుగా వెళ్ళిచూసుకురా తిరుపతి వెళదాం. లేటయిందంటే బస్సులు దొరకవు. సంధ్య అతని పక్కకి మరింతగా జరిగి చెప్పింది.
    ఆంజనేయులు తలతిప్పి చూశాడు. తన కన్నా రెండు అంగుళాల ఎక్కువ పొడవు వుంది సంధ్య. తనకంటే లావుగా వుంది. అంత దగ్గరగా వుంటే తనను ఆమె తమ్ముడుగా అనుకునే ప్రమాదం వుందని వెంటనే స్ఫురించింది అతనికి.
    అందుకే షాక్ తగిలినట్లు కొద్దిగా జరిగి "వెళ్ళిపోదాం సంధ్యా!" అన్నాడు తడబడుతూ.
    ఆమె తలతిప్పి ఎటో చూస్తోంది. ఆంజనేయులు తన శరీరం వంక చూసుకున్నాడు.
    ఒక్కగా- పొట్టిగా వున్న తనను చూసుకొని తనే అసహ్యించుకున్నాడు. తన కొలీగ్ వినయ్ అన్నమాటలు గుర్తొచ్చాయి అతనికి.
    "అసలు మీ ఫజిక్కే అప్పీలింగ్ గా వుందండీ ఆంజనేయులుగారూ అందుకే మిమ్మల్ని ఎవరూ పట్టించుకోరు. పై పెచ్చు ఏదో చిన ఆచూపుతో మాట్లాడతారు, ఇక ఆడ పిల్లలు మీ వైపు కన్నెత్తికూడా చూడరు దీన్ని అధిగమించి మీరు ఆడపిల్లల సాన్నిహిత్యం. సంపాదించాలంటే మరేదో ప్రత్యేకతను సాధించు కోవాలి. పెద్ద స్పోర్ట్స్ మనో, ఆర్టిస్టోకవో అయిపోవాలి. లేదూ ఆడపిల్లలతో అద్భుతంగా మాట్లాడే చాకచక్యం అయినా నేర్చుకోవాలి."
    వినయ్.....వినయ్.....వినయ్.....
    అతను చక్కగా వుంటాడు పొడవుగా, ఎర్రగా, బలిష్టంగా వుంటాడు. ఎప్పుడూ హాయిగా, సరదాగా కనిపిస్తాడు.
    జీతంకాక మరో మూడు నాలుగువేలు ఖర్చుపెట్టుకోగల అతని స్తోమత ఆక్వలిటీస్ ని అతని కిచ్చాయా?
    ఆంజనేయులకు అది నిజమనిపించింది డబ్బు తెచ్చి పెట్టిన ఛార్మ్, జీవితంపట్ల ఎనలేని మమకారం, కళ్ళల్లో తొంగిచూసే అల్లరి ఇవేమీ తనకు లేవు తనకు జీవితమంటే భయం.
    వారానికోమారు పెద్ద చెల్లెలు మీద వాలే మోహినీ పిశాచంటే భయం. ఎప్పుడూ సిగ్గుతో, ఏ బట్టలమూట మాటునో, ఏ బట్టలచాటునో గువ్వలా ఒదుక్కునే చిన్న చెల్లెలంటే భయం. ఎప్పుడూ గొప్పలు చెప్పుకుంటూ లేని స్టేటస్ ను ఉన్నట్టు చెప్పుకునే పెద్ద తమ్ముడంటే భయం, చిరంజీవి మీద అభిమానంతో ఎప్పుడూ ఆ ధ్యాసలోనే గడిపే చిన్న తమ్ముడంటే భయం. చావు కోసం సంతోషంగా ఎదురుచూస్తున్న పిన్ని అంటే మరీ భయం. చావు ఆశ చచ్చి పోయినట్లు నులకమంచం మీద అతుక్కుపోయిన నాన్న అంటే చచ్చేంత భయం.
    ఇన్ని భయాలమధ్య బతుకుతున్న కూడా తనకు చాలా భయం. "భయం, వినయం దారిద్ర్య లక్షణాలు- దరిద్ర దేవతకి అవి రెండూ కవలపిల్లలు. డబ్బు ల్లేకుంటే దుర్లక్షణాలు మనకు అంటుకుంటాయి డబ్బుంటే అవన్నీ అంటే అవన్నీ మనల్నీ అంటుకోవు."
    వినయ్ ఎప్పుడో ఈ విషయాలన్నింటినీ విశ్లేషించి చెప్పాడు.
    "మనిషికి అతి ముఖ్యమైనది ఆత్మ విశ్వాసం. అది డబ్బుఇస్తుంది. ఆత్మవిశ్వాసం లేనప్పుడు బతుకులోని రుచిని పోగొట్టుకుంటాం.

 Previous Page Next Page