Previous Page Next Page 
లీడర్ పేజి 4

    "నాన్నగారూ! ఆయన్నేమీ అనకండి. నాకిష్టమైతేనే రమ్మన్నారు. నాకిష్టం కాబట్టే వెళుతున్నాను" అంది.    
    తల్లి ఎంత ఏడ్చినా, తండ్రి మందలించినా ఆమె వినదలుచుకోలేదు. ఇప్పుడు కనుక తనెళ్ళకపోతే, భర్త తిరిగి వస్తాడన్న నమ్మకం ఆమెకి లేదు. అందుకే అతనివెంట నడవటానికి సిద్దమయింది.    
    "సీతాదేవి అంటే నీకిష్టం కదమ్మా! అందుకే ఆ తల్లి అడుగు జాడల్లోనే నడుద్దామనుకుంటున్నాను" అంది నవ్వుతూ.    
    సీతమ్మగారు కళ్ళొత్తుకుంది ఏమీ చెయ్యలేక.    
    లక్నో అన్నది ఎక్కడ వుందో రమణకి తెలియదు. ఎంతకాలం ప్రయాణించాలో? మార్గం ఎలా వుంటుందో? ఎన్ని ఇబ్బందులు పడాలో అన్న విషయాల మీద అవగాహన లేదు. కేవలం భర్త రమ్మన్నాడు కాబట్టి అనుసరించాలి అనే మొండి ధైర్యం తప్ప ఏమీ తెలియని అజ్ఞానం. ముందు ముందు ఎన్ని ఇబ్బందులు పడనున్నదో ఆ సమయంలో ఆమెకి తెలియదు.    
    లక్నో మజిలీలు:    
    1935 నవంబర్ 3న వారి బృందం బెజవాడనుంచి కాలినడకన బయల్దేరింది. శ్రీహరిరావు నాయకత్వం వహించి, తన బృందానికి ఆన్ ఫూట్ బ్యాచ్ అని పేరు పెట్టాడు. ఆ బృందంలో మిగతా సభ్యులు :    
    1) పోకల సత్యనారాయణ - ఆయన హిందుస్థానీ సేవాదళం నాయకులు
    2) జి. కోటయ్య-విద్యార్ధి    
    3) వెంకటరత్నం-విద్యార్ధి
    4) గంజి సుబ్రహ్మణ్యం-విద్యార్ధి
    5) నాగేశ్వరరావు-విద్యార్ధి
    6) రాజు-విద్యార్ధి
    7) తనికెళ్ళ సత్యనారాయణ గుప్తా        -    ఔత్సాహికుడైన వ్యాపారస్తుడు.    
    వీరుకాక శ్రీహరిరావు, భార్యా, పిల్లా.    
    ఈలోగా ఓ సంఘటన జరిగింది.    
    శ్రీహరిరావు ఉపన్యాసమిస్తుండగా, ఒక విద్యార్ధి చిన్న చీటీ తెచ్చి అయన చేతికిచ్చాడు. అయన విప్పి చదివారు. "నన్ను వెంటనే వచ్చి కలుసుకోవలసింది-రాజేంద్రప్రసాద్" అని వుంది. డా|| రాజేంద్రప్రసాద్ ఆంధ్రాకొస్తున్నారని విని వున్నాడు. కాని తనని కలవాలనుకోవడం చాలా ఆశ్చర్యంగా అనిపించింది.    
    ఆరోజే కలిశారు. ఆయనెంతో ఆదరంగా ఇంగ్లీషులో మాట్లాడారు, శ్రీహరిరావు ఆంగ్లభాషా పరిజ్ఞానానికి ఆశ్చర్యపోయారు. ప్రసంగవశాత్తూ, తమ 'లక్నోయాత్ర' గురించి ఆయనతో చెప్పడం జరిగింది. అందుకాయన ఎంతో సంతోషించి, "నా తిరుగుప్రయాణంలో మీరొస్తున్నట్లుగా ప్రతి కాంగ్రెస్ ఆఫీసులోనూ తెలియబరుస్తాను. మీకు వసతికీ, భోజనాదుల విషయంలోనూ ఇబ్బందిలేకుండా చూస్తాను" అని హామీ ఇచ్చారు. అంతేకాక అన్ని వార్తాపత్రికల్లోనూ "శ్రీహరిరావు బృందం 'లక్నో పాదయాత్ర' అని ప్రచురించారు. బృందానికి దారి ఖర్చులకి గాను కొంత పైకం కూడా పార్టీ ఫండ్ నుండి ఇచ్చారు.    
    శ్రీహరిరావు 'మ్యాస్' దగ్గర పెట్టుకుని మొత్తం 280 మజిలీలకి 'ప్లాన్' చేసాడు. పదిమైళ్ళ కొక్క మజిలీ చొప్పున చిన్న చిన్న ఊళ్ళల్లో మజిలీలు చెయ్యాలని నిశ్చయించుకున్నారు.    
    బృందానికి కొన్ని కఠిన నియమ నిబంధన లేర్పరిచారు.    
    ఎవరికీ స్వంతధనం వుండకూడదు. తమ వద్దనున్నది నాయకుడి చేతిలో పార్టీ ఫండ్ గా ఇచ్చి వేయాలి. ఇద్దరు బట్టలు తప్ప దరించకూడదు. పాదరక్షలు వేసుకోకూడదు. (రమణమ్మకీ, గంజి సుబ్రహ్మణ్యానికీ ఈ నిబంధన ఎత్తివేసారు. ఆమె స్త్రీ కాబట్టి, ఆయనకి కాలిలో ఆనకాయలు వుండబట్టీనూ) సిగరెట్టూ, పొగాకూ మొదలగు అలవాట్లుండకూడదు. ప్రతి వారికీ చిన్న బిస్తరూ, ఒక ట్రంకుపెట్టె (చిన్నది) తప్ప ఎక్కువ సామానుండకూడదు. అందులో అద్దం, దువ్వెనా, ఒక గ్లాసూ, రెండు జతల బట్టలూ మాత్రమే వుండాలి.    
    ఈ నిబంధనలకి అందరూ ఒప్పుకుని తాము తెచ్చినది శ్రీహరిరావు గారికి ఇచ్చివేశారు. ఇంకా తిరుగు ప్రయాణం వరకూ వారి బాధ్యత ఆయనదే?    
    మొదటి మజిలీగా గుణదల చేరారు. గుణదలలో అఖండస్వాగతం లభించింది. శ్రీహరిరావు ఉపన్యాసానికి తండోపతండాలుగా జనం వచ్చారు. చందాల రూపేణా చాలా డబ్బు వచ్చింది. అక్కడో రెండు రోజులు గడిపి, ఉపన్యాసాలయ్యాక కొవ్వూరు బయల్దేరారు. బయల్దేరు తుండగా-        
    "శ్రీహరి రావెక్కడ?" అంటూ ఓ బుంగమీసాలాయన ధాటిగా వచ్చి అడిగాడు.    
    "నేనే" అన్నాడాయన.    
    "కొత్తగా పెళ్ళయిన పిల్లవాడిని, ఇలా ఇంటినీ, ఇల్లాలినీ పట్టించుకోకుండా దేశాలు పట్టిపొమ్మని చెప్తావటయ్యా! నువ్వేం పెద్దమనిషివి?" అని నోటికొచ్చినట్లు మాట్లాడసాగాడు.   
    ఇంతలో నాగేశ్వరరావొచ్చి "నాన్నగారూ, పంతులు తప్పేంలేదు" అని సర్ది చెప్పబోతే అయన వినకుండా చాలా దూకుడుగా మాట్లాడాడు.    
    మిగతా వాళ్ళంతా కలగజేసుకుని అసలు విషయమేమిటో రాబట్టారు. నాగేశ్వరరావు కొత్తగా పెళ్ళయిన కుర్రవాడు. శోభనానికి ముహూర్తం నిర్ణయించాక, "ఇప్పుడు కాదు, మా పంతులుగారితో కాంగ్రెసు సభలకెళ్ళాలి" అన్నాడు. ఇంట్లోవాళ్ళు "ససేమిరా" అనడంతో పారిపోయి వచ్చేశాడు. అదీ సంగతి.    
    అంతా విని శ్రీహరిరావు పగలబడి నవ్వారు. "పోనీ వెళ్ళిపోకూడదయ్యా!" అనడిగారు.    
    "మీరు కాదంటే, మా మిత్రుడితో కలిసి రంగూన్ వెళ్ళిపోతాను కానీ ఇంటికెళ్ళను, మీరొప్పుకుంటే, సభలయ్యాక తిరిగి ఇంటికెళ్ళి బుద్దిగా వుంటాను" అన్నాడా యువకుడు పట్టుదలగా.   
    "మహా అయితే మూడు, నాలుగు నెలలు ఎంతలోకి గడుస్తాయి? వదిలిపెట్టండి. లేకపోతే మొదటికే మోసం వచ్చేటట్లుంది" అన్నారు శ్రీహరిరావు.

 Previous Page Next Page