నెమ్మదిగా కనులమీద కలలతో నిద్రపట్టేసిందనికి.
* * *
మర్నాడు ఉదయం, సరిగ్గా, పదకొండు గంటలకు దేవరాజ్ అడ్స్ రోడ్ లోని షోరూంలోంచి బయటికొచ్చాడు మైత్రేయ.
గత వారంరోజుల్లో మూడు కొత్త కార్లు సేల్ అయ్యాయి అందులో రెండు కార్లు బ్లూ కలర్ వి. ఆ రెండు అడ్రసుల్లో ఒకటి సిద్ధార్థ లే అవుట్ ఏరియాలో వుంది. రాజేంద్రకుమార్ ఎవరు? మోహిత భర్తా? వెంటనే ఉత్సాహంగా ఆటో ఎక్కాడు మైత్రేయ. ఇరవై నిమిషాల తర్వాత ఆటో కంఠీరవ అపార్టుమెంట్స్ ముందు ఆగింది.
లిప్ట్ లో సెకండ్ ఫ్లోర్లో కెళ్ళాడు మైత్రేయ.
ఫ్లాట్ నెం : 204 వరండా నిశ్శబ్దంగా వుంది. మరికొద్ది నిమిషాల్లో తను మొహితను చూడబోతున్నాననే సంతోషంలో వున్నాడతను.
ఇంత సులభంగా మోహిత తనకు కన్పిస్తుందనుకోలేదతను.
ప్లాట్ డోర్ ముందు నిలబడి, కాలింగ్ బెల్ నొక్కాడు. బెల్ మోగలేదు.
నెమ్మదిగా తలుపు తట్టి, డోర్ ని ముందుకు తోసాడు. నెమ్మదిగా తెరుచుకుంది.
"మోహితగారూ....." పిలుస్తూ డ్రాయింగ్ రూంలోకి అడుగుపెట్టాడు మైత్రేయ.
డ్రాయింగ్ రూంలో పల్చటి వెల్తురులో విశాలమయిన కేన్ చైర్స్ ఒక సోఫా.... మరొక పక్క నిలువెత్తు కేన్ హేంగింగ్ బల్బ్ స్టాండ్.... ఆ వెనుక గోడమీద మహావర్ణ శిల్పి వడ్డాది పాపయ్య, 'గోపికా స్వాంతనం' మందహాసాలు చిందిస్తున్న నీలిమేఘ కృష్టుడు..... మరొకవేపు డెకరేటివ్ పీసెస్..... ఒక్క పక్క టీపాయ్ మీద ఫోన్.....
నెమ్మదిగా ముందుకు అడుగు వేసాడతను.
ఎదురెదురుగా రెండు బెడ్ రూమ్స్. తలుపులు దగ్గరగా వేస్తున్నాయి.
కుడివేపు బెడ్ రూమ్ వేపు నడిచి, డోర్ ని ముందుకు నెట్టాడు.
లోపలికి చూశాడు....
డబుల్ బెడ్, ఆ బెడ్ మీద చిందర వందరగా కొన్ని పుస్తకాలు.
ఒకవేపు గోద్రెజ్ బీరువా.....
మనిషిగానీ, చప్పుడుగానీ లేదు. ఎడమవేపు నున్న బెడ్ రూమ్ వేపు నడిచాడు.
నెమ్మదిగా డోర్ తెరిచిన మైత్రేయ, ఎందురుగా కన్పించిన దృశ్యానికి నిశ్చేష్టుడైపోయాడు. అతని వంటి మీద రోమాలు నిటారుగా ఒక్కసారిగా నిలబడిపోయాయి. వళ్ళంతా చెమటలు పట్టేశాయి. గుండెలనిండా ఒక్కసారిగా ఆక్రమించిన భయం.....
మైత్రేయ ఒక్కసారి భయంతో కెవ్వున కేకవేశాడు.
ఎదురుగా బెడ్ మీద, అరవై ఏళ్ళ మగవ్యక్తి, నగ్నంగా, వళ్ళంతా కత్తిపోట్లు, తల మొండెం తెగిపోయి వుంది. తోడభాగం గాట్లుగా వుంది.
రక్తం.... బెడ్ షీట్ నిండా రక్తం.... గదినిండా రక్తం....
ఊహించని దృశ్యానికి మైత్రేయకి అయోమయంగా వుంది. మరొక్క నిముషం ఆలస్యం చెయ్యకుండా, పరుగు పరుగున డ్రాయింగ్ రూమ్ లో కొచ్చాడు.
మెయిన్ డోర్ దగ్గరికొచ్చి తలుపు లాగాడు.
అది వెనక్కి రాలేదు.
వంటినిండా ముచ్చెమటలు పట్టాయి.
ఎవరో డోర్ బయటినుండి లాక్ చేశారన్న విషయం అతనికి అర్థమయి పోయింది.
అంటే.... ట్రాప్.... ట్రాప్.... ట్రాప్....
తనని మోహిత మర్డర్ ట్రాప్ లో చాలా జాగ్రత్తగా ఇరికించిందన్న మాట.
ఇప్పుడేం చెయ్యాలి....?
కిటికీలు తెరవడానికి ప్రయత్నించాడు.
ఐరన్ గ్రిల్స్, వెనకనుంచి దూకడానికి ప్రయత్నించాడు. దూకలేక పోయాడు.
ఇన్నేళ్ళ జీవితంలో ఎప్పుడూ మర్డర్ ని గానీ, శవాన్నిగానీ చూడలేదు మైత్రేయ.
అంతా అయోమయంగా వుంది.
సిగరెట్ తీసి, అగ్గిపెట్టె కోసం జేబుల్ని వెతుక్కున్నాడు. అగ్గిపెట్టె కోసం కిచెన్ రూంలోకెళ్ళాడు. అక్కడా అగ్గిపెట్టె లేదు. కుడివేపు బెడ్ రూమ్ లో కెళ్లాడు.
గాడ్రేజ్ బీరువా పక్కన, విండో గోడమీద అగ్గిపెట్టె, పక్కన ఖాళీ గ్రీన్ లేబిల్ బాటిల్ వున్నాయి.
గబగబా అగ్గిపెట్టెలోంచి పుల్లను తీసి, సిగరెట్ వెలిగించుకుని రెండు దమ్ములు పీల్చి, బెడ్ మీద పుస్తకాలు పక్కన కన్పించిన బ్లాక్ కలర్ బ్రా వేపు, ఆ పక్కన పడివున్న విజిటింగ్ కార్డువేపు చూశాడు. వెంటనే విజిటింగ్ కార్డును అందుకొని, దానిమీదున్న పేరు వేపు చూశాడు.
రాజేంద్రకుమార్.... ఫారెస్ట్ కాంట్రాక్టర్...... ముదుమలై....
పక్కన ఫోన్ నెంబర్ వుంది.
చనిపోయిన వ్యక్తిపేరు రాజేంద్రకుమారేనా?
ఆ బ్రాని, విజిటింగ్ కార్డుని జేబులో పెట్టుకుని, డ్రాయింగ్ రూంలో కొచ్చాడు మైత్రేయ.
అప్పుడే టెలీఫోన్ మోగింది. రిసీవర్ అందుకోబోయి, మెయిన్ డోర్ చప్పుడు విన్పించడంతో ఆగిపోయాడు. రెండు సెకండ్లలో మెయిన్ డోర్ తలుపు తెరచుకుంది. ఎదురుగా ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్. ఆ పక్కన నలుగురు పోలీసులు. వాళ్ళను చూడగానే బిత్తరపోయిన మైత్రేయ కళ్ళు చెమ్మగిల్లాయి.
మైత్రేయను పోలీసులు అరెస్ట్ చేశారు.
* * *
లక్ష్మీ ప్యాలెస్ పరిధిలోని పోలీస్ స్టేషన్....
మైత్రేయ చెప్పినదంతా విన్నాడు సర్కిల్ ఇన్ స్పెక్టర్ చంద్రప్ప.
"అయితే నువ్వు మర్డర్ చెయ్యలేదంటావ్...." సాలోచనగా అడిగాడాయన.
"రెస్టారెంట్లో బేరర్ నీ, మారుతీ షోరూమ్ మేనేజర్నీ అడగండి."
"మెడికల్ కాన్ఫరెన్స్ కు వచ్చి, ఆ కాన్ఫరెన్స్ కు ఎందుకు వెళ్లలేదు.....?"
ఆ ప్రశ్నకు జవాబు చెప్పలేకపోయాడు మైత్రేయ.
"మోహితతో ఎన్నాళ్ళనుంచి నీకు పరిచయం.....?" అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ప్రశ్నించాడు చంద్రప్ప.
"ఆ మోహిత అనే ఆవిడతో నాకసలు పరిచయం లేదు.... ఆవిడ ఎలా వుంటుందో నాకు తెలీదు.... నన్నొక ట్రాప్ లో ఇరికించారు.
"ఎవరు... "
"ఆ మోహిత...."
"మరి ఆవిడతో పరిచయం అసలు లేదంటున్నావ్...."
"లేదు సార్ .... నన్ను నమ్మండి...."
"ప్రతి నేరస్తుడూ అనే మొదటిమాట ఇదే..."
"నేను నేరస్తుడ్ని కాదు...."
"ఆ చనిపోయిన వ్యక్తి ఎవరో తెలుసా..."
"తెలీదు..."
"అధికార పార్టీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్" ఆ మాటకు విస్తుపోయాడు మైత్రేయ.
"ఆ మోహితను పట్టుకుంటే, నిందితులు మీకు దొరుకుతారు...."
"స్పాట్ లో నువ్వు దొరికావ్, నిన్ను రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. నువ్వు చెప్పుకోవాల్సింది కోర్టులో చెప్పుకో....." అంటూ లేవబోయిన సర్కిల్ ఇన్ స్పెక్టర్ తో ఇలా అన్నాడు మైత్రేయ.
"ఇక్కడ మర్డర్ అయిందని మీకెవరు చెప్పారు?"
"బయటినుంచి పోనొచ్చింది."
"అలాగే నేను ఆ ప్లాట్లోంచి బయటకు రాకుండా ఎవరో బయట గొళ్ళెం పెట్టారు..... ఆ విషయం మీరు గమనించారా....."
ఆ మాటకు ఇన్ స్పెక్టర్ సూటిగా మైత్రేయ ముఖంలోనికి చూశాడు.
"ఈ మర్డర్లో మూడోవ్యక్తి ప్రమేయం వుందని మీరు భావించడం లేదా....?"
"భావించడాలు, అనుమానించడాలు అన్నీ తర్వాత...... యివాళ హాయిగా లాకప్ లో రెస్ట్ తీసుకో. రేపు కోర్టులో నువ్వు చెప్పాల్సింది చెప్పు.....తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం....." కానిస్టేబుల్స్ ని పిల్చి, చెప్పాల్సింది చెప్పి, బయటకు వెళ్ళిపోయాడు ఇన్ స్పెక్టర్.
* * *
గట్టి గరిచాడు మైత్రేయ.
అసహనంగా.... కోపం... క్రోథం.... కనిపిస్తే మొహితను మర్డర్ చేసేయాలన్న కసితో వున్నాడతను.
కానిస్టేబుల్ తెచ్చిన భోజనాన్ని గోడలకేసి విసిరికొట్టాడు.
రేపు కోర్టు తనని నమ్ముతుందా?
నమ్మదు. అయితే ఏం చెయ్యాలి?
ఎక్కడున్నా, మోహితను పట్టుకోవాలి. తనని మర్డర్ ట్రాప్ లోకి ఎందుకు ఇరికించిందో తెల్సుకోవాలి.
అవసరమైతే, ఆ మోహితను చంపి, తను జైలుకి వెళ్తాడు.
రాత్రి రెండు గంటలు దాటింది.
సిగరెట్ తీసి వెలిగిస్తూ ఆలోచిస్తున్నాడు.
ఒకటే ఆలోచన....
తను తప్పించుకోవాలి. మోహితను పట్టుకోవాలి.
ఆ ఆలోచన రాగానే అటూ యిటూ చూశాడతను. దూరంగా కానిస్టేబుల్ కాళ్లు జాపుకుని నిద్రపోతున్నాడు.
గట్టిగా చప్పుడు చేశాడు మైత్రేయ.
గబుక్కున మేల్కొన్న కానిస్టేబుల్ కంగారుగా సెల్ వైపు చూసి-
"ఏం కావాలి?" మత్తుగా అడిగాడు.
"టాయ్ లెట్ వెళ్లాలి....." చెప్పాడతను.
"ఇప్పుడు నిన్ను బయటకు ఎవడు తీసికెళతాడు కానీ.... ఆ మూలని కానిచ్చేయ్...." చికాగ్గా చెప్పాడు కానిస్టేబుల్.
లావెట్రీ కి వెళ్ళాలి...." గట్టిగా చెప్పాడు మైత్రేయ
"లావెట్రీకి టైమూ, సందర్భం వుండవా? యోగా చెయ్..... ఒక టైముకి అన్నీ జరుగుతాయి. చూడు ,రెండు మూడు నిమిషాల్లో వచ్చేయాలి" అంటూ సెల్ డోర్ ఓపెన్ చేశాడు కానిస్టేబుల్.
మైత్రేయ లావెట్రీలో కెళ్ళాక, గోడ కానుకుని గురక తీయడం ప్రారంభించాడు కానిస్టేబుల్.
స్టేషన్ లో ఒకే ఒక కానిస్టేబుల్ వున్నాడని మైత్రేయకి తెల్సు.
లావెట్రీలో కెళ్ళిన మైత్రేయ మూడునిమిషాల్లో బయటికొచ్చి అటూ, యిటూ చూసి గబగబా బయటికి వచ్చేసి, జేబులోంచి సిగరెట్ తీసుకుని, తాపీగా వెలిగించుకుని ఆటో ఎక్కాడు.
"రైల్వేస్టేషన్...." ఆటోడ్రైవర్ తో చెప్పాడు.
పది నిమిషాల తర్వాత ఆటో రైల్వేస్టేషన్ ముందు ఆగింది.
డబ్బులిచ్చి స్టేషన్లోంకి నడిచాడు మైత్రేయ.
* * *
ఎంక్వయిరీ కౌంటర్....
"మైసూర్ నుంచి ఊటీ వెళ్ళటానికి, వయా నంజెన్ గడ్ బస్సులే.... అటువైపు ట్రైన్స్ లేవు...." కౌంటర్ లోని వ్యక్తి చెప్పాడు మైత్రేయతో. చేతి వాచీవైపు చూసుకున్నాడతను.
రెండూ....నలభై నిమిషాలు.....
వెంటనే లక్ష్మీ ప్యాలెస్ హొటల్ కెళ్ళి, రూమ్ ఖాళీ చేసేసి తిరిగి రైల్వేస్టేషన్ కు వచ్చి, మాండ్యా వెళ్ళే ప్యాసింజర్ రైలు ఎక్కాడు.