Previous Page Next Page 
ఈ దేశంలో ఒక భాగమిది పేజి 3

  

     అతను వెంటనే ప్రభావతిని తట్టి లేపుతూ 'ప్రభా! లేలే! మల్లిబాబు ఇక్కడికి వచ్చేశాడు. పోయి వాడి ప్రక్కలో పడుకోబెట్టు' అన్నాడు.
   
    ప్రభావతి లేచింది విసుక్కుంటూ "ఛీఛీ! ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో గానీ కరువుతీరా నిద్రపోవడానిక్కూడా ప్రాప్తంలేదీ కొంపలో" అని మల్లిబాబును రెక్క పుచ్చుకుని లాక్కువెళ్ళి వాడి మంచంమీద కూలవేసి, ప్రక్కన తనూ పడుకుంది.
   
    వాడు కుయ్ కయ్ మనకుండా పడుకున్నాడు.
   
    కుమార్ కు ఎందుకనో, ఎవరిమీదో తెలియని కసిలాంటిది వచ్చింది. కళ్ళు మూసుకుని నిద్రపోయే ప్రయత్నం చేస్తున్నాడు.
   
    ఇంతలో ప్రక్కమీద మళ్ళీ బరువుగా ఏదో ప్రాకినట్లయింది. కళ్ళు తెరచి చూసేసరికి పెద్దవాడు మురళి తనని ఆనుకుని పడుకుని అటూఇటూ కదులుతున్నాడు.
   
    ఇహ వాడిని అక్కడ్నుంచి లేపటం బ్రహ్మకైనా తరంకాదు.
   
    పొర్లుతున్నాడు, కుమ్ముతున్నాడు, కాసేపు దుప్పటి మీదకు లాక్కుంటున్నాడు. మళ్ళీ దుప్పటి క్రిందకు తోసేస్తున్నాడు. నానా భీభత్సం చేసేస్తున్నాడు.
   
    నిద్రరావటం, ఉలికిపడి లేవటం, నిద్ర రాకపోవటం, నిద్రపోలేకపోవటం, ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో వుండిపోవటం. ఈ అవస్థలతో మెల్లిగా రాత్రి గడిచిపోయింది.
   
                                       * * *
   
    తెల్లవారాక పెళ్ళాంపిల్లలు నిద్రలేచి క్రిందికి వెళ్ళిపోయాక, ఏడు గంటల దాకా ప్రక్కమీదే పడుకుని, బద్ధకం తీర్చుకున్నాడు. కుమార్ లేచి పైన బాత్ రూంలో వాష్ బేసిన్ దగ్గర ముఖం కడుక్కుని క్రిందికి వస్తుంటే ఆ ఇంటి చుట్టుప్రక్కల పరిస్థితి ఇలావుంది.
   
    రైలుగేటు ఒకవేపు మూసేసి రెండోవేపు మూసేటంతలో తొందరపడి లోపలకు జొరబడిన రిక్షావాడు గేటువాడిని "బాబ్బాబ"ని బ్రతిమాలుతున్నాడు. గేటువాడు తన ఆధిక్యత నిరూపించుకునే సమయాన్ని వృధా పోనియ్యకుండా నాలుగు మాటలు దులిపి, విసుగుతోకూడిన ముఖంతో కనికరంకూడా జతపరుస్తూ, గేటు తీశాడు. ఈ అవకాశాన్ని వృధాపోనివ్వకుండా అటువేపు నుంచి లోపలకు దూసుకువచ్చిన అందమైన చిన్నకారులో అందవికారంగా, భీకరంగా కూర్చున్న సూటుమనిషిని చూసి ఏమనలేక తనలో తాను గొణుక్కుంటూ మళ్ళీ మొదటిగేటు తెరిచాడు.....ఎదురుగా వున్న కోమటింట్లో, పెళ్ళయినప్పటి నుంచీ అక్కడే స్థిరపడి క్రమక్రమంగా తను ఇల్లరికపుటల్లుడి నని నలుగురికీ తెలిసేటట్లు చేస్తున్న ఆ ఇంటిఅల్లుడు కుర్రాడు ఆ ఇంటి డ్రాయింగురూమ్ కమ్ బియ్యపుకొట్టు అయిన కొట్టు తలుపు తెరిచి లోపల్నుండి రేట్లు వగైరాలు తెలిపే బోర్డులు తెచ్చి మేకులకు తగిలించి గోడలకు అమర్చి ఒక చిన్న కర్రకు అమర్చివున్న గుడ్డతో ఆ కర్రని అటూ ఇటూ కదిలిస్తూ కుర్చీలూ, బల్లలూ దులుపుతూ తెరిచివున్న బస్తాలమీదికి వురుకుతున్న పిచ్చుకలను అదిలిస్తూ, లోపల్నుంచి వచ్చి గుమ్మందగ్గర నల్లగా, కానీ వయ్యారంగా నిలబడ్డ కొత్త పెళ్ళాంతో మధ్యమధ్య కులుకుతూ తను మాట్లాడటం అందరూ చూస్తున్నారా లేదా అని అటూఇటూ చూస్తూ మాట్లాడుతున్నాడు.... అదే ఇంట్లో ఇదివరకు యీ ఆస్తంతా సంపాదించి పెట్టి, ఇప్పుడు అందరికంటే ముసలాడైపోయి ఎవరికీ అక్కర్లేదు అనే దశలో వున్న ఒకప్పటి ఇంటి యజమాని తన బాత్ రూమ్ ని పాయిఖానాగా ఉపయోగిస్తున్నాడు. ఇంట్లోనిది తనని వాడనివ్వరు కాబట్టి... ప్రక్కింట్లో మేడమీద వాటాల్లో ఒకదాంట్లో అద్దెకుంటూన్న అన్నదమ్ముల్లో పెద్దాయన అప్పటికి రెండోసారి కాఫీత్రాగి వసారాలోకి వచ్చి అటూ యిటూ పచార్లు చేస్తున్నాడు. అలా చేయకపోతే కాలకృత్యం తీరే అలవాటు లేకపోవటం వల్ల..... అదే ఇంట్లో క్రిందిభాగాల్లో అద్దెకుంటున్న నాలుగయిదు వాటాలవాళ్ళు వున్న రెండు కామన్ లెట్రిన్స్ నూ వంతుల తరబడి వాడుకుంటూ ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలూ, వృద్ధులూ, అందమైన అమ్మాయిలూ క్యూ సిస్టాన్ని అమలుపరుస్తున్నారు. మరీ చిన్నపిల్లల్ని వాళ్ళ ఇంటిముందుకు కాకుండా ప్రక్క ఇళ్ళవైపు తోలేస్తున్నారు. ఆ పిల్లలు కర్రలు చేత్తో పట్టుకుని కూర్చుని పందులు మీదకు వస్తే లోపలకు పారిపోయి వచ్చేస్తున్నారు. అదే యింట్లో ఇంటియజమాని కాంతయ్యగారి కుటుంబం మాత్రం తమకోసం కేటాయించుకున్న లెట్రిన్ కు తాళంవేసి వుంచుకుని, అవసరం వచ్చినప్పుడల్లా ఒక్కొక్కరూ వెళ్ళి తాళంతీసి వాడుకొని, అవసరం తీరాక భద్రంగా తాళంవేసి ఇంటి యజమానుల్లాగా తమకున్న హక్కుని యదేచ్చగా, గర్వంగా అనుభవిస్తున్నారు.
   
    అదే యింట్లో ఇంటి యజమాని పిచ్చివాడైన ఏడేళ్ళ ఆఖరి కొడుకును, నూటయాభై రూపాయల సంపాదనా పరుడైన, మొన్ననే పెళ్ళయిన అతని అన్నగారు గొడ్డును బాదినట్లు బాదేస్తున్నాడు.... ఎదురింట్లో శాండిలెట్రిన్స్లో ఓ పంది యదేచ్చగా విహరించి, పురపాలక సంఘానికి పని తగ్గించి బరువుగా తిరిగివస్తోంది. తను వాకిట వున్నానని తెలియచేసేటట్టుగా ఆ ఇంటివారి కోడలు ఓ చాప, మరచెంబు వగైరాలతో వసారాలో కూర్చుండిపోయి అనన్య ప్రచారం కల ఒక పాత వారపత్రిక తిరగేస్తూ అదోరకంగా కనిపించింది. కోమట్ల ఇంటికి, మా ఇంటికి మధ్య ఉన్నదాంట్లో కొట్టు పెట్టుకున్న టైలరు అర్జంటుగా కుట్టుపని మొదలుపెట్టాడు.....ఎడంవైపు రోడ్డుకవతలగా, రైలుపట్టాలకివతలగా వున్న ఖాళీస్థలంలో పాకలేసుకుని వుంటున్న వారిలో ఓ చిన్నపాకలో వుంటూన్న మొగుడొదిలేసిన ఎలిమెంటరీ స్కూలు పంతులమ్మ వట్టి నేలమీద కూర్చుని బడికి వేళయిందన్న హడావుడితో జుట్టు దువ్వుకుని ముడివేసుకుంటుంది. అదే పాకలో ఆమెమీద ఆధారపడి బ్రతుకుతూన్న ఆమెతండ్రి ఓ పింగాణీ కంచంలో చద్దన్నం, గొడ్డుకారం వేసుకుని అన్నంకోసం పుట్టినట్లుగా ఆవురావురుమని తినేస్తున్నాడు.....ప్రక్క పాకలో రంగమ్మ గేదెలకోసం తను పెట్టుకున్న గడ్డిమోపులోంచి ఎవరో గడ్డి ఎత్తుకుపోయారని పెద్ద పెట్టున అరుస్తూ బూతులు తిడుతోంది.
   
    ప్రక్కనే వున్న కల్లుపాకలో కల్లు అమ్మకం ప్రారంభమైంది. రాత్రి తాగి డబ్బులివ్వకుండా ఎగేసి వెళ్ళిపోయిన కూరలవాడ్ని పట్టుకుని కల్లుషాపు యజమాని చొక్కా విప్పమని బెదిరిస్తున్నాడు. కూరలవాడూ అంతకు తక్కువ కాకుండా కలియబడుతున్నాడు. ఆ చుట్టుప్రక్కల పాకల్లోనే వుంటూ ఓ కళ్ళడాక్టరు దగ్గిర నర్సుగా పనిచేస్తూన్న ఆమె తన టేస్టుని ప్రదర్శించడానికని అందరూ చూసేలా టూత్ పేస్ట్ తో ముఖం కడుక్కొని ఆ నాలుగు తాటాకులు చుట్టూ పేర్చి బాత్ రూమ్ గా నిర్మించుకున్న దాంట్లో దూరి 'అభ్యంగన స్నానం' మొదలెట్టేసరికి బయటికి వచ్చిన నీళ్ళు యెటు వెళ్ళటానికీ చోటు లేక అక్కడే మడుగుగా యేర్పడి మళ్ళీ ఇంట్లోకి చొరబడుతున్నాయి. బయట నులకమంచం మీద కూలబడి బీడీ తగలేస్తూ ఆరోజు కాటన్ మార్కెట్టులో నంబర్లగురించి ఆలోచిస్తున్న ఆమెను యేమీ అనలేని ఆమె మొగుడు, యీ విషయం గమనించికూడా, యేమీ తెలియనట్లు నటిస్తున్నాడు.
   
    మరోపాకలో వుండే గాజులవాడు కారణం లేకుండానే అలవాటు ప్రకారం పెళ్ళాన్ని పిచ్చిగా తంతున్నాడు. ఆ ఆడది వీరవనితలా దెబ్బలు భరిస్తోంది.....ఇంటివెనుకగా వున్న పంపుదగ్గర జనం బిందెలతో గుంపుగా చేరి నీళ్ళకోసం త్రొక్కిసలాడుతున్నారు. అప్పుడే ఓ అరవామెకూ, మరొక ముస్లిం స్త్రీకి మధ్య యుద్ధంకూడా చెలరేగింది. 'ఒసే అరవదానా!' అని ఒకరంటే, "యేమిటే తురకదానా' అని మరొకరు అరుస్తూ జుట్టూ జుట్టూ పట్టుకుని జాకెట్లుకూడా చింపుకునే స్థితికి వచ్చారు. వాకిట్లోకి వచ్చి చోద్యం చూస్తూన్న ఆ పంపుకి ఎదురుగా వుండే అడితీవాళ్ళు, తమ సంస్కారం గొప్పదనీ, తాము వాళ్ళలా చౌకబారువాళ్ళం కాదనీ అందరికీ కనబడేలా వుండటానికి ప్రయత్నం చేస్తున్నారు.... సిటీ బస్సులు ఆ ఇంటిముందున్న వీధిగుండా 'ఈవేళ ఇద్దర్నో ముగ్గుర్నో బలి తీసుకోక మానము' అని శపధం చేసినట్లుగా విజయవిహారం చేస్తున్నాయి. ఇంటిముందు అందమైన కందకంలా ప్రవహిస్తున్న నల్లటి మురుగుకాలవ పురపాలక సంఘంవాళ్ళు తమ విద్యుక్తధర్మాన్ని సక్రమంగా నిర్వహిస్తున్నారనటానికి చిహ్నంగా మందంగా, బరువుగా, కదల్లేనట్లుగా తయారై అందులోని మృదుసుగంధాన్ని నలువైపులా వ్యాపింపచేస్తూ సుఖపడదామని ఆశపడేవాళ్ళకు సుఖం లేకుండా చేస్తోంది. రాత్రంతా నాటుసారాలో మునిగి తెల్లవారాక బయటకు తేలిన భారతీయ పౌరుడొకడు ఇంటికి తిరిగివస్తూ వళ్ళు తెలియని స్థితిలో ఎప్పుడు పడ్డాడోగాని, ఆ మురుగు కాలవలో ఓ పందిలా మునిగివున్నాడు. ఆ దారిన పోతున్న రిక్షావాడొకడు ఈ తాగుబోతువాడు కుళ్ళునీళ్ళు తాగి చస్తే దేశానికి బరువు తగ్గుతుందని భయపడి తలమాత్రం ఇవతలకి వచ్చేలా ఈడ్చి మిగతా శరీరం జోలికి పోకుండా ఆ మురుగులో అలానే వుంచి తనదార్ని పోయాడు. దారినపోయేవాళ్ళకి ఈ దృశ్యం వినోదంగా పరిణమించింది.   

 Previous Page Next Page