Previous Page Next Page 
న్యాయానికి అటూ-ఇటూ పేజి 3

 

       కేవలం ఒక్క నిముషంక్రితం ఎంతో కాంక్షతో తనను కోరుకున్న భర్త...శ్వేతబిందు అతని ముఖంలోకి ఆశ్చర్యంగా చూసింది. తన వృత్తిమీదేకాదు, బయటివారి వృత్తిమీద, వారిమీద అతనికున్న అచంచలమైన విశ్వాసం ఆమెని అప్రతిభురాల్ని చేసింది. ఆ క్షణంలో ఆమెకతన్ని దగ్గరగా తీసుకుని గుండె కదుముకోవాలనిపించింది.
   
    కాని యింతలో తండ్రి రఘురామయ్య "ఏవమ్మా! తెములుతున్నారా?" అంటూ కేక వెయ్యడంతో ఉలిక్కిపది ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది.
   
                                     2
   
    శ్వేతబిందు ఊరికి వెళ్ళి వారంరోజులుపైగా అయింది. ప్రదీప్ కు యీ అనుభవం కొత్తగావుంది. అతనికి గుర్తున్నంతవరకూ పేళ్ళయ్యాక నాలుగయిదు రోజులకన్నా ఎప్పుడూ ఆమెను విడిచిపెట్టి వుండలేదు. ఆ అవకాశం యివ్వలేదు.
   
    ఆమె లేకపోతే ఏర్పడిన సూన్యం భరించలేనంతగా వుంది ఫోన్ చేద్దామంటే మావగారి ఇంట్లో ఫోన్ లేదు. రోజుకో ఉత్తరం చొప్పున రాస్తూనే వున్నాడు. ఆమెకూడా జవాబు రాస్తూనే వుంది.
   
    చేతినిండా పని వుండటంవల్ల తోచక పోవటమనే ప్రశ్నేలేదు. అనవసరంగా వాయిదాలు కోరటం, కారణం లేకుండా కేసులు నడిపించటంలో జాప్యం చెయ్యటం అతనికెప్పుడూ అలవాటులేదు. అవతలి లాయరు అలా చేస్తునప్పుడు అతను మేజిస్ట్రేటు ముందు తీవ్రంగానే ఖండిస్తూ వుండేవాడు. కేసు అనుకూలంగా లేకపోతే కోర్టు ట్రాన్స్ ఫర్ కు అప్పీల్ చెయ్యటం, ఏవో వంకలు పెట్టి కాలయాపన చెయ్యటం అతనెప్పుడూ చేసేవాడు కాదు.
   
    రాత్రి పది పదకొండువరకూ లా బుక్స్, లా జర్నల్స్ చాలాశ్రద్దగా తిరగేస్తూ వుండేవాడు.
   
    అతనికి సహజంగా ఎక్కువమంది స్నేహితులు లేరు. స్నేహంమీద ఎలర్జీ, విముఖత్వం వున్నాయని కాదు. ఆఫీసర్స్ క్లబ్, ఎక్కువ స్నేహాలు, యీ ఫార్మాలిటీస్ అన్నీ పెట్టుకుంటే, తనకు తెలీకుండానే కాలం వృధా అవుతూ వుంటుందని, అది డైలీ రొటీన్ కు అడ్డుపడ్తుందని అతని నమ్మకం.
   
    ఒకరోజు శ్రీలక్ష్మీ హాస్పిటల్ నుంచి మొదటి వార్షికోత్సవానికి అతనికి ఆహ్వానం వచ్చింది.
   
    శ్రీలక్ష్మీ హాస్పిటల్ చాలా భారీఎత్తున క్రితం ఏడాదే ప్రారంభించబడింది. నగరంలోని ప్రముఖ పారిశ్రామికవేత్త ఉపేంద్ర కొన్నికోట్ల పెట్టుబడితో అత్యంతాధునికమైన పరికరాలతో ఆ హాస్పిటల్ ప్రారంభించాడు. ఆ హాస్పిటల్ కు ఎన్నో బాంకులు ఋణాలిచ్చాయి. ఎంతోమందికి షేర్లున్నాయి. జనరల్ మెడిసన్, నర్సరీ, ఆబ్ స్రైటిక్స్ అండ్ గైనకాలజీ, పిడియాట్రిక్స్, కార్డియాలజీ మొదలైన ముఖ్యమైన విభాగాలన్నీ ఆ హాస్పిటల్లో వున్నాయి. ప్రారంభించిన కొద్దిరోజుల్లోనే ఆ హాస్పిటల్ నగరంలో గొప్ప సంచలనం రేకెత్తించింది. అక్కడ ట్రీట్ మెంట్ అంత గొప్పగా వుంటుంది, యింతగొప్పగా వుంటుంది అని అందరూ ప్రశంసల వర్షం కురిపించారు. సమాజంలో వున్నత స్థాయి వ్యక్తులందర్నీ శ్రీలక్ష్మి హాస్పిటల్ బాగా ఆకర్షించింది. వాళ్ళ స్థాయికి, హోదాకి తగ్గ హాస్పిటల్ చివరకు హైదరాబాద్ లో స్థాపించబడిందనీ, యిహ బాంబే, ఢిల్లీ అంటూ పరుగులు  తీయవలసిన అవసరం లేదనీ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. అన్ని విభాగాల్లోనూ యింటెన్సివ్ కేర్ యూనిట్లున్నాయి. వివిధ మెడికల్ కాలేజీల్లో, జనరల్ హాస్పిటల్స్ లో ప్రొఫెసర్లుగా, ఫిజిషియన్స్ గా, సర్జన్స్ గా, గైనకాలజిస్టులుగా పనిచేసి రిటైరై పేరుపొందిన, దేశవ్యాప్తంగా ప్రఖ్యాతులైన డాక్టర్లు చాలామందిని అందులో అపాయింట్ చెయ్యటం జరిగింది. ఆ హాస్పిటల్ లో చెయ్యలేని టెస్ట్ అంటూ లేదు. అల్ట్రాసోనిక్ స్కానింగ్, ఏంజియోగ్రఫీ, ఎకోకార్డియో గ్రాఫీ, సి.ఎ.టి.స్కానింగ్, ట్రాన్స్ క్యుటేనియస్, హెపాటిక్ ఏంబియోగ్రఫీ, లింఫ్ ఏంజియోగ్రఫీ కార్డియాక్ కేథడ్రైజేషన్ కార్డియోనలేధడ్రైజేషన్ గాస్ట్రోస్కోప్, ఎండోస్కోప్-
   
    కరొనరీ బైపాస్ సర్జరీకోసం ధనికులూ, ప్రముఖులూ ఎగబడుతున్నారు. విదేశాల్లో ఎంత నైపుణ్యంతో నిర్వహిస్తున్నారో, యిక్కడకూడా అంతే నైపుణ్యంతో, ప్రతిభావంతంగా కరొనరీ బైపాస్ ఆపరేషన్లు నిర్వహించబడుతున్నాయని పేరు వచ్చింది. కిడ్నీ డయాలజిస్, ట్రాన్స్ ప్లాంటేషన్ అవలీలగా చేసిపారేస్తున్నారు. హాస్పిటల్ ప్రారంభించిన తొలిరోజుల్లోనే ఒకరిద్దరు మంత్రి వర్యులూ, యిద్దరు సూపర్ స్టార్ లకూ అక్కడ బైపాస్ సర్జరీ విజయవంతంగా జరగడంతో, శ్రీలక్ష్మి హాస్పిటల్ పేరు అందరినోళ్ళలో బాగా నలిగిపోయింది. ఆ సూపర్ స్టార్, మంత్రివర్యులూ హాస్పిటల్లో వున్నన్నిరోజులూ పరామర్శించటానికి వచ్చిపోయే ప్రముఖులు, ప్రతిరోజూ వారి ఆరోగ్యంగురించి, పొందుతున్న చికిత్సా విధానంగురించీ ప్రముఖ దినపత్రికల్లో బాక్స్ కట్టి ప్రచురించటం శ్రీలక్ష్మి హాస్పిటల్ ప్రాచుర్యానికి మరింత దోహదంచేసింది. అక్కడ వున్నందుకు, ట్రీట్ మెంట్ పొందినందుకు వేలకువేలు ఖర్చవుతుంది. అయినా లెక్కచెయ్యకుండా ట్రీట్ మెంట్ కోసం, అప్పుడప్పుడూ రెస్టు కోసం ఆ హాస్పిటల్ కు వెళ్ళటం పురప్రముఖులకూ, సినిమాతారలకూ, వాణిజ్యవేత్తలకూ క్రేజ్ అయింది. శ్రీలక్ష్మి హాస్పిటల్ లో చేరాననటం స్టేటస్ సింబల్ అయింది. ఆ హాస్పిటల్ కు పేరు రావడంతో - ఉపేంద్రకు నగరంలో గొప్ప క్రేజ్, అన్ని రంగాల్లో అతనికి ప్రతిష్టా ఏర్పడ్డాయి.
   
                                * * *
   
    సాయంత్రం కోర్టునుంచి ఎకాఎకి శ్రీలక్ష్మి హాస్పిటల్ యానివర్సరీకి బయల్దేరాడు ప్రదీప్.
   
    సభజరిగే ప్రదేశం చేరేసరికి అప్పటికే జనం కిక్కిరిసి వున్నారు. హాస్పిటల్ ముందువున్న విశాలమైన ప్రాంగణంలో సభాస్థలి ఏర్పాటు చేయబడింది. వేదిక అలంకరణ, ఆ ప్రాంగణమంతా అమర్చివున్న తోరణాలు, విద్యుత్ దీపాలు పూలమండపాలు ఏదో మహోత్సవం జరుగుతున్నంత కనుల పండువుగా వుంది.
   
    ఉపేంద్రకు నలభై అయిదేళ్ళుంటాయి. పచ్చని పసిమి, భారీవిగ్రహం, కుర్తా, పైజమా వేసుకుని అటూ ఇటూ చలాకీగా, హడావుడిగా తిరుగుతున్నాడు. హాస్పిటల్ సిస్టర్స్ అయివుండవచ్చు. చక్కగా అలంకరించుకుని వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకుంటున్నారు.
   
    సభ ప్రారంభమయింది. ముఖ్యమంత్రి అధ్యక్షత వహించారు. ఇంకా వేదికను ఆరోగ్యమంత్రి, ఒక సూపర్ స్టార్, యిద్దరు ప్రముఖ వాణిజ్యవేత్తలూ అలంకరించారు.
   
    తన ఉపన్యాసంలో శ్రీలక్ష్మి హాస్పిటల్ ని ముఖ్యమంత్రి పొగిడి "యిటువంటి అత్యంత ఆధునికమైన పరికరాలతో, చికిత్సా విధానాలతో వున్న హాస్పిటల్ నగరానికే గర్వకారణమనీ, తనకు బైపాస్ సర్జరీ అవరసమైతే విదేశాలకు వెళ్ళననీ, యిక్కడే చేయించుకుంటాననీ చెప్పి, హాస్పిటల్ ను సమర్ధవంతంగా నిర్వహిస్తున్న ఉపేంద్రను అభినందించారు. తర్వాత ఆరోగ్యమంత్రి, యితర ప్రముఖులూ కూడా హాస్పిటల్ నూ, ఉపేంద్రనూ ప్రశంసిస్తూ మాట్లాడారు.
   
    చివరకు ఉపేంద్ర ఉపన్యసించాడు. ఈ హాస్పిటల్ ప్రారంభించటానికి ముందు తను ఎదుర్కొన్న యిబ్బందులూ, అవి నిర్వహించడంలోని సాధక బాధకాలు, యిప్పుడు ఇన్ని వేలమంది ఇక్కడ చికిత్స పొందుతూ వుంటే తాననుభవిస్తున్న తృప్తీ కరతాళాలమధ్య వివరించి, హాస్పిటల్ లో ఇంతవరకూ నేత్రవిభాగం లేదనీ, దేశంలో సమర్ధులైన నేత్రవైద్య నిపుణులున్నా అత్యంతాధునికమైన పద్దతుల్లో చికిత్స నిర్వహించే డాక్టర్లు అందుబాటులో లేక ఇన్నాళ్ళు ఆగామనీ, ఆ కొరత కొద్దిరోజుల్లోనే తీరబోతుందనీ, నేత్రవైద్యంలో సూపర్ స్పెషలైజేషన్ పొంది నాలుగయిదేళ్ళుగా అమెరికాలో ఉన్నతశ్రేణి హాప్సిటల్ లో పనిచేస్తున్న డాక్టర్ అశోక్ చివరకు శ్రీలక్ష్మి హాస్పిటల్ లో పని చెయ్యడానికి అంగీకరించారనీ, ఆయన ఆధ్వర్యంలో వచ్చే నెలనుంచీ నేత్ర విభాగం పనిచేయడం ప్రారంభించబడుతుందనీ హర్షధ్వానాల మధ్య ఎనౌన్స్ చేశాడు.
   
    తర్వాత తన హాస్పిటల్ లో పనిచేస్తున్న చీఫ్ డాక్టర్లందరినీ వేదికమీద పరిచయంచేసి, వారిని సత్కరించాడు.
   
    ఆ తర్వాత సాంస్కృతిక కార్యక్రమం జరిగింది.

 Previous Page Next Page