Previous Page Next Page 
లేడీస్ హాస్టల్ పేజి 3

   

   "మరి మీరు?"
   
    "నేనా- నిజం చెప్పనా-"
   
    "ఊఁ...."
   
    "ఏ రాయి అయితేనేం పళ్ళూడగొట్టుకోవటానికి అనుకున్నాను."
   
    ఆ వాక్యం పూర్తికాకముందే అతడు పెత్తన కేక కేచుమని ఆ గదిలో ప్రతిధ్వనించింది. అతడి చేతిమీద ఆమె గోరుముద్ర ఎర్రగా పడింది. అతడు ఉఫ్ ఉఫ్ మని ఊదుకుంటున్నాడు. తనున్ చేసిన పని అర్ధమవగానే ఆమెకి చాలా ఆశ్చర్యమేసింది. ఇంత చొరవ ఎలా వచ్చింది తనకి? అతడికి సారీ చెప్పికూడా ఆమె ఇదే ఆలోచిస్తూ వుంది. పేరెంట్ - ఆడల్టు- చైల్డు - అనాలిసిస్ కి అతీతమైన చొరవ అది.
   
    అంతలో అతడు అన్నాడు. "నిన్ను ఏమని పిలవను? నీ పూర్తి పేరు చాలా పెద్దదిగా వుంది."
   
    "కిరణ్."
   
    "ఉహూ. బహుశ ఇంట్లో అందరూ నిన్ను అలాగే పిలుస్తూ వుండివుంటారు. నేనూ అదే అయితే బాగోదు. ఇంకేదైనా మంచిది ఆలోచించాలి."
   
    ఆమె మాట్లాడలేదు. అతడి సెన్స్ ఆఫ్ బిలాంగిగ్ నెస్ గురించి మాత్రం కొద్దిగా ఆశ్చర్యపోయింది. అతనన్నాడు- "నీ పేరులో అక్షరాలే అయితే సరిగ్గా కుదరదేమో- కిర్రూ అంటే మరీ మంచం చాపుడులా వుంటుంది. 'మరణ్' వినేవాళ్ళకి తిడుతున్నట్టు వుంటుంది...."
   
    .... ఆమె వినటం లేదు. అతడు తనని డామినేట్ చేయటం ఆమెకి సంతోషంగా వుంది. ఆమెకి కోపం రాలేదు. అతడికి తన చదువుపట్ల ఏ విధమైన కాంప్లెక్సూ లేదు. అధీ సంతోషం. ఎప్పుడూ సంతోషంగా వుండగలిగే మొగవాళ్ళు అరుదు. ఆ కొద్దిమందిలో అతడొక్కడు. అది తేలిపోయింది.
   
    'నువ్వు ఉద్యోగం చేస్తావా? నాకిష్టంలేదు-' అని గానీ, లేక 'ఇంత చదువు చదివి ఉద్యోగం చేయకపోతే ఎలా? చదువుకున్న ఆమ్మాయిని నేను చేసుకోవాలనుకున్నది అందుకే....' లాంటి తన అభిప్రాయాలు మొదటిరోజే తన మీద రుద్దలేదు. నీ అభిమాన హీరో ఎవరు? ఏ వారపత్రికలు చదువుతావు? లాటి చచ్చు సంభాషణలతో కలం గడపటంలేదు. హ్యూమరు సృష్టించాలంటే స్పాంటీనియటీ కావాలి. సంభాషణ బావుండాలి. అంటే అవతలి వ్యక్తిలో తెలివితేటలుండాలి. క్రితం అరగంట సంభాషణలోనూ అతడిలో ఆ గుణాన్ని కనిపెట్టిందామె. తొందరగా చొచ్చుకుపోగల గుణాన్ని.
   
    "మీరు సిగరెట్లు తాగుతారా?"
   
    "తాగుతాను. ఏం?"
   
    ఆమె కొద్దిగా తటపటాయించి, "నాకు సిగరెట్ అంటే పడదు" అంది.
   
    "ఈ క్షణం నుంచీ సిగరెట్ తాగను. ప్రమాణం చేస్తున్నాను" అన్నాడు.
   
    ఆమె తెల్లబోయి తలెత్తింది. అతడు నవ్వుతున్నాడు. నవ్వుతూనే అన్నాడు.
   
    ".....అన్లేదు. సారీ. నీకు తాగటం పడదా? పొగపడదా?"
   
    ఆమె చిరుకోపంతో "చూడటం పడదు. పొగకూడా" అంది. అతడో క్షణం ఆలోచించి- "సరే అయితే ఒక అగ్రిమెంట్ కి వద్దాం! నీ ముందు నేను తాగను. అసలు తాగుతున్నట్టు కనపడను. అలాగే-నీ దగ్గిరకు వచ్చేముందు క్లోజప్ టూత్ పేస్ట్ తో మొహం కడుక్కుని వస్తాను. ఈ రెండూ అమలుపరుస్తే ఇక నీకు ఏ అభ్యంతరమూ ఉండదు కదా!"
   
    ఆమెకేం అభ్యంతరమూ కనపడలేదు. 'సరే' అంది.
   
    అతడు తేలిగ్గా ఊపిరి పీలుస్తూ "థాంక్స్. మన సంసారం చాలా హాయిగా జరిగిపోతుందని నాకు నమ్మకం కలుగుతూంది" అన్నాడు.
   
    "ఎందుకో" అంది ఓరగా చూస్తూ ఆమెకు మొదట వున్న బెరుకు చాలావరకూ పోయి అతనంటే అదో రకమైన  చొరవా ఇష్టమూ కలుగుతున్నాయి. అసలు కొత్తే అనిపించటం లేదు.
   
    "సాధారణంగా ఇంకెవరయినా అమ్మాయి అయితే, 'నా గురించి మానెయ్యలేరా' అనేది. ఈ మొదటి రాత్రిని అఆదారంగా తీసుకుని నన్ను ఇన్ఫ్లుయెన్సు చేయటానికి ప్రయత్నం చేసేది."
   
    'అలాంటి ఇన్ఫ్లుయెన్సులు ఎవర్నీ ఎక్కువకాలం ఆపి వుంచలేవు."
   
    "నేను చెప్పేది అదే! ఇద్దరిమధ్య అలాంటి అవగాహన కావాలంటే అవతలివారిని ఇబ్బంది పెట్టకుండా తర్కంగా ఆలోచించి ఒక పాయింట్ దగ్గర రాజీకి రావటం కావాలి! ఇది మొదటి విషయం! ఇక రెండోది- క్రికెట్ గురించి ప్రసక్తి వచ్చినప్పుడు "నేనూ దాని గురించి తెలుసుకుంటాను" అన్నావు గుర్తుందా! ఎంతమందికి తమ జీవిత భాగస్వాములకి ప్రవేశంవున్న రంగాల గురించి పెళ్ళయిన తరువాత ఆసక్తి చూపించాలన్న జ్ఞానం వుంటుంది? ఎంతోమంది ఆడవాళ్ళు కేవలం భర్తలనుంచి ప్రోత్సాహం లేక పెళ్ళయిన వెంటనే సంగీతం చిత్రలేఖనం లాంటివి మూలాన పెట్టెయ్యటం నేనెరుగుదును అన్నట్టు అడగటం మర్చిపోయాను. నీకు ఉత్సాహం వున్న రంగం ఏది?"
   
    చదువుతప్ప ఏమీలేదు ఆమెకు. అందులోనూ సైకాలజీ ఇప్పుడిక్కడ చక్కగా ఇంటిని సరిదిద్దుకోవటం. అంతే ఈ ఇంట్లోంచి, ఈ ఇరుకు మనుష్యుల నుంచీ, వీలైనంత తొందర్లో వెళ్ళిపోవాలని ఆమె కోరుకొంటోంది. ఆ విషయమే చెప్పింది. అతడు నవ్వేసేడు.
   
    ఆమె కొద్దిగా తటపటాయించి, "నేనో విషయం చెప్పనా?" అంది.
   
    "చెప్పు ఏమిటి?"
   
    "నేను చాలా భయపడ్డాను. నిజానికిది చెప్పకూడదు కానీ నిజంగా భయపడ్డాను. ఏవేవో అర్ధంలేని అనుమానాలు నన్ను వేధించాయి. ఎలాంటి ఒడుదుడుకులు వస్తాయో, ఎలా సర్దుకుపోగలనో, ఏమౌతుందో ఏమో అని చాలా భయపడ్డాను. నేను..... నేను చాలా అదృష్టవంతురాల్ని."
   
    "నేనో విషయం చెప్పనా" అన్నాడతను.
   
    "ఏమిటి?"
   
    "పెళ్ళయిన మొదటి రాత్రి మొదటి గంట అయిన తరువాత ప్రతీ ఆడపిల్లా అలాగే అనుకుంటుంది."
   
    23. 32. 34 Hrs.
   
    ఆమె ఆ మాటలకి స్థబ్దురాలై అతడివైపు చూసింది. ఏమిటితను? తామెన్నో పుస్తకాలు చదివి ఎంతో 'అనాలిసిస్' అనుకున్నది చాలా మామూలుగా చెప్పేస్తున్నాడు! బహుశ చిన్నతనం నుంచి క్రికెట్ పేరిట చాలామంది వ్యక్తులతో తిరగటంవల్ల వచ్చిన నైపుణ్యం అయివుంటుంది. ఆమెకు ఆనందం వేసింది. విశాలమైన బావపరిధి వున్న మనిషి- అది స్త్రీ అయినా పురుషుడైనాసరే- అలాంటి వ్యక్తి కంటే కావల్సింది ఏముంది! అందులోనూ జీవితాంతం వరకూ ఉండబోయే కంపెనీ!!
   
    "ఇక అసలు విషయానికి వద్దామా?"
   
    ఆమె ఆలోచన్లలో మునిగివుండి, యధాలాపంగా 'ఏమిటి' అంది. ఆ మాటకోసమే వేచి వున్నట్లు అతడు దగ్గిరగావచ్చి "నువ్వు సైకాలజీయే తప్ప ఫిజియాలజీ గురించి ఆలోచించలేదా" అన్నాడు నవ్వుతూ నీలిమేఘం భూదేవిని నీటి చేతుల్తో స్పృశించబోయే ముందు చల్లగాలిని రాయబారిగా పంపినట్టు అతడి మీదనుంచి వచ్చే గాలి ఆమెఇ చుట్టుముట్టింది. అలాంటి వాసనను ఆస్వాదించే శక్తిగల నాళికలను స్త్రీలకు మాత్రమే పరిమితం చేయటం దేముడు వాళ్ళకిచ్చిన వరం!
   
    అతడు ఆమె చేతిని దగ్గిరగా తీసుకొని ముద్దుపెట్టుకుని అంతలో ఆమె తనలో తనే నవ్వుకోవటం చూసి "ఎందుకు నవ్వుతున్నావు" అని అడిగాడు.
   
    "ఏదో గుర్తొచ్చి."
   
    "ఏమిటి?"
   
    ఆమె తడబడి "ఏమీలేదు" అంది.
   
    "మొగుడు మొదటిసారి ముద్దుపెట్టుకాగానే భార్యలిలా నవ్వుకొంటే అతడికి చాలా అనుమానాలొస్తాయి సుమా...ఏ పాత జ్ఞాపకం తల్చుకుని నవ్వుకొంటూందో అని" అన్నాడు. ఆమె చప్పున తలెత్తి అతడిలో సీరియస్ నెస్ లేకపోవటం చూసి, తనుకూడా హాయిగా నవ్వేస్తూ "నేను నవ్వింది అందుకోసం కాదు" అంది.
   
    "నువ్వు చెప్పకపోతే నేను అపార్ధం చేస్డుకోవాల్సి వస్తుంది."
   
    "నాతో చెప్పించటం కోసమే కదూ ఇదంతా" చిరుకోపంతో అంది.
   
    "నువ్వేమయినా అనుకో-"
   
    "ప్లేబోయ్ లో వ్రాసిన కొటేషన్ ఒకటి గుర్తొచ్చి."
   
    "ఏమిటది?"
   
    "kiss is an application for Better position."
   
    "అప్పుడే బెటర్ పొజిషన్ వద్దు. ఇంకో అరగంటపోనీ-' అని కెవ్వున అరచి "నీకు గిల్లటం బాగా అలవాటుళా వుందే" అన్నాడు.
   
    ఆమె తేలిగ్గా నవ్వేసి "తగ్గించుకుంటాన్లెండి" అంది. ఆమె మనసు ఒక ఇరుకుగది (అది తన ఇల్లు) లోంచి బయటకొచ్చి, స్వేచ్చాలోకంలోకి విహంగంలా ఎగిరిపోతున్నట్టుంది.
   
    అప్పటికామె ఆ గదిలో అడుగుపెట్టి గంట దాటింది. మాటలకు చేతులు జోడై, మోమాటపెట్టే మరో చేతుల్ని బ్రతిమాలుతున్నాయి. చేతి మీద తొలిముద్దు చెరిపేసే సరిహద్దు. చెంపమీద ముద్దు- ముత్యాలదుద్దు. పెదవిమీద ముద్దు- లెక్కకందని పద్దు. మెడక్రింద ముద్దు - ఇక వివరాలు వద్దు.

 Previous Page Next Page