"నీకు మరీ అంతగా పెళ్ళిచేసుకోవాలనుంటే అదెంతసేపు? మంచి సంబంధం చూసి అన్ని ఏర్పాట్లూ రేపే చేయిస్తాను" అన్నాడు రాయుడు.
"అలాకాదు, నా వివాహం నేను కోరిన సుహాసినితో జరగాలి!" శంకర్.
"సరే, ప్రయత్నిస్తాను" అన్నాడు రాయుడు ఏదో ఆలోచిస్తూ ఆయన బుర్రలో చాలా పెద్ద పథకం తయారవుతోంది.
2
"అదిగో సుహాసిని!" అన్నాడు శంకర్.
రాయుడు ఆతృతగా అటుచూసి, కళ్ళు నులుముకుని మళ్ళీ చూశాడు. మొదటిసారి చూడగానే ఆయన కళ్ళు జిగేల్ మన్నాయి.
"బాప్ రే! మా సినిమావాళ్ళెవ్వరూ ఈమె కాలిగోటికి పోలరు. మేకప్ లేకుండానే అప్సరసలా ఉంది" అన్నాడు రాయుడు.
"నా సెలక్షనంటే నీ సినిమాల్లో హీరోయిన్ సెలక్షననుకున్నావా మామయ్యా!" అని నవ్వాడు శంకర్.
రాయుడు శంకర్ వంక చురుగ్గా చూసి, "కథనుబట్టి హీరోయిన్ని సెలక్ట్ చేస్తాను నేను. పాత్రలఎన్నికలో నాకు నేను సాటి అని చెప్పుకుంటారు ఫీల్డులో. ఇంతకాలం నేను ఏ జంటనెన్నుకుంటే ఆ జంట హిట్టయింది. ఇప్పుడు కూడా పొరపాటు చెయ్యను. అందుకే నిజం చెప్పక తప్పడంలేదు. ఈ అమ్మాయి పక్కన హీరోగా నువ్వు తగవు. నీకు మీ అమ్మ పోలికలు వచ్చి ఉంటే బాగుండేది. మీ నాన్న పోలికలు రావడం నీ దురదృష్టం సుహాసిని గురించి మరిచిపోయి, నీకు తగ్గ అమ్మాయిని నువ్వు వెతుక్కో!" అన్నాడు.
శంకర్ మొహం మాడిపోయింది. అతను దిగులుగా రాయుడివంక చూసి, "అలా అనొద్దు మామయ్యా! ఎలాగో అలా ఈ పెళ్ళి జరిపించు నీ ఋణం ఈ జన్మలోనే తీర్చుకుంటాను" అన్నాడు.
"చూస్తూ చూస్తూ కాకి ముక్కుకు దొండపండునెలా కట్టబెడతాను? ఆ అమ్మాయికిలాంటి అన్యాయం నేను తలపెట్టలేను" అన్నాడు రాయుడు.
"ఏమిటి మామయ్యా! ప్రొడ్యూసర్ రాయుడి మేనల్లుడంటే అంత తక్కువనుకున్నావా? అయినా ఆ సుహాసిని మరీ నీ కూతురైనట్లు మాట్లాడతావేమిటి? చేతకాకపోతే చేతకాదని చెప్పు. అంతే కానీ, నన్ను తక్కువ చేయకు."
రాయుడు నిదానంగానె నవ్వి, "ఆ అమ్మాయిని నా కూతురిలా ఎప్పటికీ భావించలేను. ఆ హామీ నీకిస్తున్నాను. వీలుంటే ఆమెను నా రాబోవు చిత్రంలో బుక్ చేద్దామనుకుంటున్నాను. నువ్వింక ఆమెను పెళ్ళాడే ఆలోచన వదిలిపెట్టడం మంచిది" అన్నాడు.
"ఇంతకూ ఆమెకు నేను తగననేకదా నీ అభిప్రాయం. అయితే అసలు సంగతి చెబుతున్నాను విను. సుహాసినికి చిన్నతనంలోనే పెళ్ళి నిశ్చయమైంది. ఆమె బావ ప్రభాకరం కూడా ఈ ఊళ్ళోనే ఉంటున్నాడు. కొద్ది నెలల్లో వారికి వివాహమవుతుందన్న వార్త నాదాకా వచ్చింది. అందుకే బెంగపెట్టుకుని చిక్కిపోయాను" అన్నాడు శంకర్.
"అయితే నువ్వింకో అమ్మాయిని కూడా ప్రేమించి ఫెయిలైపో! అలా ఒకరిద్దరమ్మాయిల్ని ప్రేమించి ఫెయిలైతే తప్ప నాజూగ్గా తయారవ్వవు" అన్నాడు రాయుడు.
"బాగుంది మామయ్యా! నేను లావేంకాదు, కాస్త పుష్టిగా ఉంటానంతే! అయినా తెలుగు సినిమాల్లో హీరోలూ హీరోయిన్లూ కూడా పుష్టిగా ఉంటారు కదా! అదీకాక ప్రేమించడం నావల్ల నవుతుంది కానీ, ఫెయిలవడం నా చేతుల్లో లేదుకదా, ఒకవేళ సన్నబడదామని అనుకున్నా!" అన్నాడు శంకర్.
"నువ్వు ఎవర్నయినా ప్రేమించు - ఫెయిలవుతావని నేను గ్యారంటీ యిస్తాను."
"అయితే నాకూ, సుహాసినికీ పెళ్ళి చెయ్యనంటావ్?" అన్నాడు శంకర్.
"చెప్పానుగా! చూస్తూ చూస్తూ ఆ పిల్లను నీకివ్వలేను" అన్నాడు రాయుడు - "అందులోనూ ఆ పిల్లకు సంబంధం కూడా కుదిరి ఉందంటున్నావ్!"
"సుహాసిని బావ ప్రభాకరాన్ని చూడలేదు నువ్వు ప్రభాకరం నాకంటే లావుగా, నాకంటే నల్లగా, నాకంటే అందవికారంగా..." అని ఏదో అనబోతూండగా రాయుడు మధ్యలో కలగజేసుకుని - "ఏమన్నావ్? నీ కంటే అందవికారంగానా? అయితే ఆ పెళ్ళి కూడా ఆపవలసిందే!" అన్నాడు.
"నేనసలు సుహాసినిని ఈ కష్టంనుంచి రక్షించాలనే ప్రేమించాను. అయితే ఆమె నా సదుద్దేశ్యాన్ని అర్ధం చేసుకోలేదు" అన్నాడు శంకర్.
"రాయుడు రంగంలోకి దిగాడుగా! మీ యిద్దరి బారి నుంచీ ఆమెను రక్షిస్తాడు" అన్నాడు రాయుడు. శంకర్ ఈ మాటలను వేళాకాలంగా తీసుకుని నవ్వబోయాడు. కానీ రాయుడేదో తీవ్రాలోచనలో ఉన్నాడని గ్రహించి ఆగిపోయాడు. అప్పుడతను అటు చూశాడు.
పార్కులో దూరంగా కూర్చుని ఉన్న సుహాసిని అప్పుడే లేచి నిలబడింది.
3
మర్నాడు రాయుడు సుహాసిని బావ ప్రభాకరాన్ని కలుసుకున్నాడు. ప్రభాకరానికి ఆ ఊళ్ళో మూడు షాపులున్నాయి. అందులో ఒకటి బట్టల దుకాణం. అందులో ఎయిర్ కండిషన్దు షో రూంలో ప్రభాకరాన్ని కలుసుకున్నాడు రాయుడు.
ప్రభాకరం కౌంటర్ కి కాస్త వెనుకగా కూర్చున్నాడు షాపులోకి వచ్చేపోయే ఆడవాళ్ళను చూస్తున్నాడతను. అంతకుమించి అతడికి వేరేపని ఏమీ ఉన్నట్లులేదు. మనిషి శంకరం వర్ణించిన కంటే అందవికారంగా ఉన్నాడు. అతడి కురూపితనమే రాయుడికి గుర్తుపట్టడానికి సహకరించింది. ఆ రూం మొత్తం మీద అందవికారంగా ఉన్నది అతనే!
"బట్టలు మావాళ్ళు చూపిస్తారు" అన్నాడు ప్రభాకరం తనను సమీపిస్తున్న రాయున్ని చూసి.
"నేను మీతో మాట్లాడాలనే వచ్చాను" అన్నాడు రాయుడు.
"నాతోనా! ఎవరు మీరు?" అనడిగాడు ప్రభాకరం.
"అన్నీ చెబుతాను. కాస్త ఏకాంతంగా మాట్లాడాలి!" అన్నాడు రాయుడు.
ప్రభాకరం రాయున్ని తీసుకుని పక్కనే ఉన్న చిన్న గదిలోకి తీసుకువెళ్ళాడు. చిన్నదైనా ఆ గది చాలా బాగుంది.