"అచ్చం కుంతిలాగే భయపడ్డాను నేను. పుట్టిన బిడ్డను వెంటనే మేడమీదినుండి పగిలిపోయిన అద్దాల కిటికీలోంచి అవతలికి పారేశాను!" గీతాభవాని ముఖంనిండా సన్నగా స్వేదబిందువులు అలుముకొన్నాయి.
"మేడమీదినుండి విసిరివేశావా? జ్యోతినా?" విభ్రాంతిగా అడిగాడు.
"జ్యోతికాదు! పెళ్ళికాకముందు నాకు పుట్టిన బిడ్డను! ఆ పిల్ల పేరు ప్రేమికారాణి. ఆ పేరు అసలు దానికి సరిపోదు. 'పిడుగురాణి' అనాలి. కోడెత్రాచులా బుస కొడుతుంది. కోరలు లేవుగాని నన్ను కాటువేసి చంపేసిందే!"
"నువ్వు చెప్పేదంతా నిజమేనా, గీతత్తా? ఆ పిల్ల బ్రతికే ఉందా?" విశాల్ ముఖం కొంచెం పాలిపోయినట్టుగా అయింది.
"ఇరవయ్యేళ్ళ పడుచుపిల్లలా సొగసులు చిమ్ముతూంది. అచ్చం నా పోలికలో నా నోట్లోంచి ఊడిపడ్డట్టుగా ఉంటుంది. జ్యోతికీ, స్వాతికీ కళ్ళు, నుదురు నావి వచ్చినా కాస్త ముక్కు మూతి కొంచెం ఎత్తుగా వాళ్ళ నాన్న పోలికలు వచ్చాయి. కాని, ప్రేమిక మాత్రం అచ్చం నాలాగే ఉంటుంది. రెండు పెద్ద పెద్ద జడలు! కళ్ళలో తీక్షణత, ముఖంలో గంభీరమూ నరకాసురున్ని వధించేప్పుడు సత్యభామ అలా ఉండేదేమో అనిపిస్తుంది."
"ఎక్కడ ఉంది? నువ్వెప్పుడు చూశావు?"
"ఎప్పుడు చూశానో తరువాత చెబుతాను. ముందు నేను చెప్పేపార్వతికథ విను!" అంటూ మొదలు పెట్టింది గీతాభవాని. "ఇది విది రచించిన పార్వతికథ. ఇరుగుపొరుగునే ఉండేవి పార్వతీదేవదాసుల ఇళ్ళు. పార్వతి తన స్నేహితులతో గుజ్జనగూళ్ళు ఆడుకొంటూంటే దేవదాసు పిలువని పేరంటంలా వచ్చేవాడు. ఆడినట్టే ఆడి చివరికి అంతా రసాభాస చేసి పోయేవాడు. దేవదాసు తండ్రి జమీందారు కాదు. పురాణాలు చెప్పేవాడు. నోములూ, వ్రతాలూ చేయించేవాడు. బొటాబొటిగా సరిపోయే సంపాదన ఆయనది. పార్వతికి ఒక అన్నా, దేవదాసుకు ఒక చెల్లెలు మాత్రం ఉన్నారు. చెల్లెలికోసం పార్వతీ, అన్నకోసం దేవదాసూ ఒకరిళ్ళకు ఒకరు వచ్చేవాళ్ళు. దేవదాసుకీ, పార్వతి అన్నకీ పెద్ద పోటీ చదువులో. వాళ్ళకెప్పుడూ ప్రాణస్నేహం లేదు ఈర్ష్య, పోటీ తప్ప. కాని, పార్వతీ దేవదాసులమధ్య ఒక అనుబంధంలాంటిది ఏర్పడింది. చిన్ననాటి స్నేహం వయసు వచ్చాక ఆకర్షణగా మారింది. దేవదాసు అందమైనవాడు. తెలివైన వాడు. తన చూపులతో, మాటలతో అందమైన వలఅల్లి, ఆ వల్లోకి పార్వతిని లాగి, పెళ్ళికాకముందే ఆమెను గర్భవతిని చేశాడు..."
గీతాభవాని కథ చెప్పుకుపోతూంది.
కొయ్యబారినట్టుగా కూర్చొని వింటున్నాడు విశాల్.
14
గేటు తీసిన చప్పుడు విని మంచం మీదినుండి ముందుకు వంగి చూశాడు సుందరయ్య. గేటు దగ్గర అపరిచితుడైన యువకుడు ఆగి ఉన్నాడు, సంకోచపడుతున్నట్టుగా.
"ఎవరు కావాలి?"
అతడు పరిసరాలను ఒకక్షణం పరిశీలనగా చూసి ముందుకు రెండడుగులువేసి, "సుందరయ్య మీరే కదూ?" అన్నాడు.
"అవును."
అతడు ఇంట్లోకి వచ్చాడు. "గీతత్త పంపించింది నన్ను. నా పేరు విశాల్" అని పరిచయం చేసుకొన్నాడు. లోపలి గదివైపు కోతూహలంగా చూడసాగాడు, ఆ అమ్మాయి కనిపిస్తుందేమోనని.
"కూర్చోండి!"
సుందరయ్య చూపిన కుర్చీలో కూర్చోకుండా వెళ్ళి సుందరయ్య మంచంమీద కూర్చొన్నాడు. "మీ ఆరోగ్యం ఎలా ఉంది?"
అతడి గొంతులో వినిపిస్తున్న ఆత్మీయతకు, మన్ననకు ఆశ్చర్యపోతున్నట్టుగా చూశాడు సుందరయ్య. "నిన్న డాక్టరు పరీక్షచేసి హాస్పిటల్లో అడ్మిట్ కమ్మన్నాడు. నేను వెళ్ళి హాస్పిటల్లోవుంటే ఇక్కడ పాప ఒంటరిదైపోతుందని ఆలోచిస్తున్నాను. 'నాకేం భయం?' అంటుంది పాప. ఆమెకేం భయంలేదు. ఉన్న భయమంతా నాకే."
"ఏం సుందరయ్యా? పిల్లని మగరాయుడల్లే తయారుచేసి ఊరిమీద ఉసిగొల్పావు!" ఎవరో ఒకాయన వీధిలోంచే అరుస్తూ వచ్చాడు. "ఆ పిల్ల నన్ను పట్టుకొని ఎంత మాటందో చూశావా? 'మీ మామ మళ్ళీ పెళ్ళిచేసుకొంటాడట పిల్లలకోసం' అంది నా భార్య. 'అవునా, మామా? లోపం నీ దగ్గర ఉందేమో! ఓసారి డాక్టరుచేత పరీక్ష చేయించుకో. లోపం నీ దగ్గరే ఉంటే అత్తకి మళ్ళీ పెళ్ళిచేసి పంపు, నువ్వు ఇంకో పెళ్ళాన్ని కొనాలను కొంటున్న డబ్బుతో. తనకు పుట్టిన పిల్లలకు నీ పేరు పెట్టుకు గూట్లో దీపంపెట్టి మ్రొక్కుతుంది' అంది. చూశావా ఆ పిల్లమాట. లోపం నా దగ్గరేఉంటే ఆ వచ్చింది నా ప్రాణానికిపడి ఏడుస్తుందట. కాస్త తెలివైంది అయితే మరొకన్ని చూచుకొని లేచిపోతుందట. మళ్ళీ పెళ్ళి చేసుకోవద్దని సలహా ఇచ్చింది. బాగుంది. నా భార్యకు మళ్ళీ పెళ్ళి చేసి పంపమనడం బాగుందా?"
"పాప అందరితోనూ చనువుగా ఉంటుంది. ఏదో పరాచికానికి అని ఉంటుంది లెద్దూ."
"పరాచికమా? ఈ మాటలు పరాచికమా?" అతడు ఉడుక్కొన్నాడు. "ఉందా లోపల?" గొంతు తగ్గించి అడిగాడు. ఆ అడగడంలోనే ఆ పిల్ల అంటే అతడికి ఎంత హడలో తెలిసిపోతూంది.
"లేదు, బయటికి వెళ్ళింది."
నిర్భయంగా విజ్రుంభించాడు రమణయ్య. "ఆడపిల్ల! ఎదిగినపిల్ల! ఇల్లిల్లు తిరగనివ్వడం ఏం మర్యాద? రాజ్యలక్ష్మి ఉంటే ఎంత జాగ్రత్త పడేదో? మగాడివి! నీకేం తెలియదు!"
"ఈపేట వాళ్ళంతా పాపకి బంధువులే! అత్తలూ, మామలూ, అన్నలూ, అక్కలూ! అందరినీ ఓ చుట్టు పరామర్శించి రానిదే పాపకి నిద్రపట్టదు."
"ఇదిగో. నీ వత్తాసు ఇలా ఉండబట్టే ఆ పిల్ల బరితెగించి పోయినట్టుగా అయింది. రేపు ఏదైనా ముంచుకువస్తే చూచుకోడానికి తల్లికూడా లేదుకదా?"