'థ్యాంక్స్!' మరిచిపోకుండా ఫోన్ చేసి మరీ పిలిపించి కంగ్రాచ్యులేషన్స్ చెబుతున్నావు, చాలా కృతజ్ఞుడిని. అందుకనే ఈ ఒకనాటి ఆంధ్ర రాజధానిలో నీకిష్టమయిన కృష్ణాస్వీట్స్ నే తెచ్చియిచ్చాను.
"సారీ మురళీ! నేనే స్వయంగా వద్దామనుకున్నాను కాని తెలుసుకదా నర్శింగు అవర్సులో బయటికి ప్రాణంపోతున్నా రావటమంటూ ఈ జన్మలో జరగదని. ఏది ఏమయినా డ్యూటీ డ్యూటీయే బ్రదర్. దాన్ని మరచిపొమ్మంటావా?"
కళ్ళు నిశితంగా చేసి చూస్తూ అన్నాడు "డ్యూటీ వదిలెయ్యమని నేను చెప్పను. అది నాచేతకాదు, అలా చెప్పలేను. చెప్పిననాడు నేను నీ మిత్రుడినేకాదు. నీ ప్రాణస్నేహితుడని ఊరికే డబ్బాలు కొట్టుకునే వెధవనవుతాను. నేను లాయర్ని వేణు. అంతా లాజికల్ గా లాయర్ గా ఉండాలి. మనిషన్న తర్వాత అన్ని రంగాల్లో ఉండాలి. కాదనను కాని డ్యూటీని మరిచిపోకూడదు. ఏదయినా నాటకంలో అంగిరసంకన్నా అంగరసానికి ప్రాధాన్యతయిస్తే ఎంత రసాభాసంగా ఉంటుందో అలా అవుతుంది. తన డ్యూటీ కాదని మరోదాన్ని పట్టుకుని వేలాడితే!"
వేదం వల్లించినట్టు కావ్యం బాధించినట్టు మాట్లాడుతాడు మురళి. సహజంగా లాయర్ అంతేకాక సాహితీవేత్త గుణదోష నిపుణుడు.
వేదం వల్లించినట్టు కావ్యం బాధించినట్టు మాట్లాడుతాడు మురళి. సహజంగా లాయర్ అంతేకాక సాహితీవేత్త గుణదోష నిపుణుడు.
"ఎప్పుడూ నీలాంటివాళ్ళు ఉండబట్టే నావంటివాళ్ళీ ప్రపంచంలో నెగ్గుకుని రాగలుగుతున్నారు. లేకపోతే ఎప్పుడూ నావంటివారు బురదలో పడ్డ ముత్యంలా కూరుకునిపోతారు. మనస్సు బావున్నప్పుడు సంతోషాన్ని సగపాలు చేసుకున్నట్టే దుఃఖసమయాల్లో కష్టసమయాల్లో విషాదాన్ని విభజించుకోవటానికి ప్రతివాడికీ నీలాంటివాడొకడు తోడుండాలి."
నవ్వుతూ అన్నాడు "భలే బావుంది వేణూ! మరి నీవన్న ఆ స్థితి నాలాంటివాడికే సంభవిస్తే?"
ఆశ్చర్యంగా చూసి అన్నాడు "ఏమిటి నీలాంటివాళ్ళకి అలాంటి స్థితా? అసంభవం మురళీ! అది ఎప్పుడూ సంభవించదు. ప్రతివిషయాన్ని లాజికల్ గా సెంటిమెంటల్ గా అంటూ స్తనశల్య పరీక్షచేసే మీలాంటి వారికి దుఃఖమా? అదేంమాట మురళీ అది మీ చాయలకుకూడా రాదు."
తృప్తిగా అన్నాడు. మురళి అతనికి తనపై గల ప్రేమకి చలించిపోతూ. "థ్యాంక్స్! అయినా వేణూ! ఈ విశాలమయిన ప్రపంచంలో నాలాంటివాళ్ళేగాదు నన్నుమించిన వాళ్ళు ఎందరో ఉన్నారు. అయినా అలాంటి వాళ్ళకికూడా దుఃఖం తప్పటంలేదు. నా మిత్రుడి తల్లిదండ్రులు మనుషులకి అలా వదలి క్రిమికీటకాదులకికూడా కష్టం కలుగనివ్వరు. సహాయం సానుభూతి పంచిఇవ్వటం తప్ప వాళ్ళు మరొకర్ని ఎందుకైనా కష్టపెట్టటం అంటూ నేను చూడలేదు. హిందూ ధర్మ నీతినియమాలు వాళ్ళింట్లో నిలయం ఏర్పరుచుకున్నాయి. అదొక ధర్మసంస్థ. కారుణ్యలక్ష్మి నిలయం. అయినా వాళ్ళకి దాదాపు ఏభైఏళ్ళ వయసులో గర్భశోకం సంభవించింది. ముద్దులకూతురు సుగుణాలప్రోవు వితరణ గుణజ్ఞాని గృహలక్ష్మి అయిన కూతుర్ని పోగొట్టుకున్నారు. దీనికేమంటాం? అయినా సుఖమూ దుఃఖమూ అనేది ఏమిటి బ్రదర్? మనం కల్పించుకునేవి. నిజంగా సుఖానికి కష్టానికి మధ్య తెర చాలాచిన్నది. ఆలోచిస్తే సుఖంకాని కష్టంలేదు. కష్టంలేని సుఖంలేదు. దుఃఖాన్ని విడదీసిచూస్తే సంతోషంకూడా వుంటుంది. సంతోషం చాటునకూడా దుఃఖచాయలు ఉండనే ఉంటాయి. అయినా ఇలాంటివాటికి అన్నిటికీ అతీతులుంటారు ఎవరో చెప్పనా?"
నిట్టూర్చి అన్నాడు "అక్కర్లేదు. నేనే చెబుతాను. యోగులు సర్వసంగ పరిత్యాగులు వాళ్ళయినా హృదయాలకి పైపై రంగులు వేసుకుంటారే గానీ నిజమయిన రంగుని బయట పడనివ్వరు. ఈ ప్రపంచమంతా కృత్రిమాలకీ బూటకాలకీ నిలయం మురళీ. నా చిన్నప్పుడు ఊళ్ళోజరిగిన సంఘటన చెబుతావిను. పదోఏట ఒకతను సన్యసించి దేశాలపై పోయాడట. తిరగని దేశమూ చూడని స్థలమూ మిగల్చకుండాచేసి చివరకు విసుగొచ్చి యాభయ్యోయేట మావూరికి తిరిగొచ్చి ఓ విథవని పెళ్ళి చేసుకున్నాడు. ఇప్పుడాయనకి డెబ్బయ్యేళ్ళు రాయిలా ఉన్నాడు. ముగ్గురు కొడుకులూ తనూ భార్య సుఖంగా జీవిస్తున్నారు. సన్యాసాశ్రమంలో అతను కూడబెట్టింది జ్ఞానధనమే కాదు మూలధనంకూడా ఉంది. ఆయన ఇప్పుడూ అంటూ వుంటాడు దూరపుకొండలు ఎప్పుడూ నున్నగా వుంటాయ్ నాయనా. ఏ ఆశ్రమంలోనైనా మంచి మనసుతో బ్రతకటం ఒక్కటే కావలసింది అంటాడు."
"పొరబడ్డావ్ వేణూ! నేను అలాంటివారిని గురించి అనలేదు. నాకు తెలుసు సన్యాసులుగా ఎవరు ఎందుకు ఎలా మారతారో, చివరికి వాళ్ళే కఠోరమయిన భయంకరమయిన వృద్ధాప్యంలో దేన్నో పోగొట్టుకున్నట్టు ఎంతగా బాధ పడతారో ఆ బాధని వెలిబుచ్చలేక ఎంతగా కుళ్ళుకుంటారో నేనెరుగుదును. లాలనగా సుఖవంతమూ అయిన కాలాన్ని వ్యర్ధం చేసుకుని ఉన్నదాన్ని పోగొట్టుకుని కనిపించనిదానికై జీవితాన్ని వ్యర్ధం చేసుకున్నామే అని వాళ్ళ హృదయాలు ఎంతగా మండుతుంటాయో ఆ భగవానుడికే ఎరుక. అందుకే వ్యక్తిగతంగా వాళ్ళంటే నాకు గౌరవం ఉన్నా ఆ ఆశ్రమ జీవితం అంటే అంత విసుగు. అయినా నేను అన్నది ఎవర్ని గురించో తెలుసుకోలేకపోయావే వేణూ! అడుగు కదపని వాళ్ళు మంచు కురుస్తున్నా మెదలనివాళ్ళు కొండ మీద దొర్లుకుంటూ వస్తున్నా, సముద్రం పైపైకి ఉప్పొంగి వస్తున్నా చలించనివాళ్ళూ ఉన్నారు. వాళ్ళు ఎవరో నీకు తెలుసు వేణూ! జీవితంలో ఒక్కర్నైనా ఎరుగుదువు. తెలియదా మరిచావా వేణూ.... విరజ...."
"వి....ర....జా...."
"అవును అంతగా ఆశ్చర్య పోతున్నావేం?"
".... .... ...."
"విరజ వేణూ! ఆమె మనస్సు ఎంత నిశ్చలమో ఎంతటి గట్టి గుండెనో నీకు తెలియదా వేణూ!
నిట్టూర్చాడు వేణు. ఆ నిట్టూర్పులోనే విరజ జీవితమంతా ప్రతి ఫలించింది.
"లేదు మురళీ! ఆమెకూడా అంతే. నీకు తెలియదు మురళీ! దుఃఖం అనేది ప్రతివారికీ సామాన్యం. అయితే కొందరు బయట పడతారు. మరికొందరు దాన్ని కుత్తుకలోనే దాచుకుంటారు. అలాగే అక్కడే అణిచేసుకుంటారు. విరజ కూడా అంతే."
"పొరపాటు వేణూ! ఆమె మనస్సుని నీవు కనుక్కోలేదు విరజకి. దుఃఖం ఆగలేదు."
అతని మాటని మధ్యలోనే ఆపేస్తూ నవ్వి అన్నాడు.
"చాలా విచిత్రంగా ఉంది. నేను ఆమె మనస్సుని కనుక్కోలేనా? అద్దంగా తన ప్రతిబింబం చూచుకునేవాడిని. నీ ముఖం విషయం నీకు తెలియదులే అంటే ఎలా ఉంటుంది? చెప్పు? విరజ ఆమెలో అణువణువూ తెలుసు నాకు. ప్రతి రక్తపు చుక్కలో అంతర్గతంగా ప్రవహిస్తున్న ఆమె హృదయం తెలుసు. ఆమె ఏమిటో నాకంటే మరెవరికీ తెలియదు. నీవు చిత్రంగా నాకు తెలియదంటావేం మురళీ!"
"అనుభవం కావాలి వేణూ! అనుబంధం అయిననాడు నీవే ఒప్పుకుంటావు. ఇంతకీ ఆమె కలపించలేదేం ఈవేళ."
తల వంచుకుని అన్నాడు. "ఇక ఆమె ఇక్కడికి రావటానికి వీలుండదు మురళీ. పరిస్థితుల ప్రభావానికి లొంగిపోయి మనుషులుండరేమో? బహుశా కంటిలోని నలుసు, కాలులోని ముల్లు, చెవిలోని జోరీగ, ఇంటిలోని పోరు ఇవేవీ భరించలేనివి. సావిత్రి ఆమె పొడనికూడా భరించలేక పోతోంది మురళీ. ఆమె రాకను గర్హిస్తుంది. భరించలేకుండా వుంది. ఆమె తన యింటికివస్తే మా వంశ గౌరవానికి మచ్చట. అవమానమట. అది చూచిన తనకి మనశ్శాంతి ఉండదట. తనకే సుఖం వుండదట. నా పరువు పోతుందట. మర్యాదగా జీవించాలంటే ఆమెను ఇంటికి రానివ్వకూడదట. ఏం చెప్పను మురళీ? నా మనస్సు బండబారిపోయింది. ఎలా చెప్పాలి ఆమెతో? నా ఇంట్లో వుండు. నన్ననుగ్రహించు దేవతా! నీ సాన్నిధ్యం వెన్నెలవాడ నన్ను పాలించు అని ప్రార్ధించిన భక్తుడు దేవత అనుగ్రహించి తన ఇంటికి వస్తుంటే యిక నా యింటికి రావలసిన అవసరంలేదు_ నీ రాకవల్ల మా కుటుంబంలో కలహాలు రేకెత్తుతున్నాయి అనిచెప్పే దుస్థితి సంభవిస్తే ఎలా చెప్పగలడు? అసలు నోరు పెగులుతుందా? చెప్పవేం మురళీ!"
అతని మౌనాన్ని చూసి మరీ దుఃఖంగా అన్నాడు. "అవును నీవేమీ చెప్పలేవు, నాకు తెలుసు. నా బ్రతుకే అన్యాయమయిపోయింది. పుట్టిననాటినుంచి సుఖంగా బ్రతికాను. అదేం కర్మమో నాకు యవ్వనదశ ప్రారంభమయినప్పటినుంచీ ఒకే వేదన మనశ్శాంతిలేదు. సుఖం ఉన్నా సుఖానుభూతి లేదు. ఏంచేయను మురళీ! అది ఒక్కో జాతకుడి ఖర్మ. అంతేకదూ?"
"ఆమెని ఎలా రావద్దని చెప్పేది? పోనీ నీవు ఆమె ఇంటికివెళ్ళి ఈ మాట చెప్పిరాగలవా? నా మనసు తెలిసినవాడివి, మా మమతలెరిగిన వాడివి, మా అనుబంధం అర్ధం చేసుకున్నవాడివి, మా కధనంతా పూసగుచ్చినట్లు వినిపిస్తే విన్నవాడివి నీకుగాక ఇంకెవ్వరికి అప్పగించను మురళీ ఈ బాధ్యత? వెడతావా మురళీ?"
"వేణూ!" బాధగా అరిచాడు. అతని కళ్ళలో నీళ్ళు తిరిగాయ్.
"ఏమిటది వేణూ! ఏనాడు ఎందుకూ ఆమె ఇంటికి వెళ్ళనివాడిని ఈరోజున తగుదునమ్మా అని వెళ్ళి ఇకమీదట వాళ్ళింటికి వెళ్ళొద్దమ్మా అని చెప్పమంటావా? పరువు, మర్యాద, సంఘం, కట్టుబాట్లు, కుటుంబం, కాపురం ఇవన్నీ ఉపన్యసించి చల్లగా నీవల్ల సంసారం చెడిపోతోంది వెళ్ళొద్దు అని చెప్పమంటావా? ఇదేనా వేణూ! నన్నర్ధం చేసుకున్నది? అలాంటి దేవత ఇంటికి ఇందుకోసం ఈ విషయం చెప్పటంకోసం వెళ్ళమంటావా?" నిష్టూరంగా అన్నాడు.
"నన్ను మన్నించు మురళీ! నీవు వెళ్ళిరావాలి. నీవే చెప్పాలి. తప్పదు. లేకపోతే ఆమె మామూలుగా ఈరోజుకూడా మా యింటికి వెళ్ళిందా? సావిత్రి ఏమయినా అంటే రంపపుకోత అక్కర్లేదామె గుండెకి ఇక.... దానికంటే ఇదిమేలు కాదూ? ఆ దుర్భర పరిస్థితి కల్పించేకంటే ఈ మార్గం మంచిది కాదూ? నిన్ను బ్రతిమాలుకుంటాను మురళీ. నా మాట వినవూ?"