Previous Page Next Page 
సంపెంగలూ - సన్నజాజులూ పేజి 39

 

    'చెప్పాడని కేమీ లేదు, దీన్ని బట్టి మనం నేర్చుకోవలసింది ఎంతయినా ఉంది. ఎక్కడ వాళ్ళను అక్కడుంచడానికి మొదట్నుంచీ తగిన కట్టుదిట్టాలు చేసుకోవాలి. పుట్టింటి వారి రాకపోకలు వీలైనంత వరకు తగ్గించడానికి ప్రయత్నించాలి. ముఖ్యంగా ఏ పరిస్థితుల్లోనూ ఆడదాని చేతికి పెత్తనం ఇవ్వకూడదు. అందులో చదువుకున్నదైతే మరింత మెలకువతో ఎప్పుడూ వో కంటితో కనిపెట్టి ఉండడం అన్ని విధాల శ్రేయస్కరం. నాకు తోచిన మాట చెప్పేశాను. ఎవరేమనుకున్నా సరే.'
    'బావకి వీడెక్కడ దొరికాడక్కా, స్త్రీ జాతిని దూషించడానికి పుట్టిన ప్రబద్దుడిలా ఉన్నాడూ.' అంది సరళ వాళ్ళు భోజనాలై వెళ్ళిపోయాక.
    'ఎవడో ఒక చరిత్రహీనుడు! లోకంలోని భయంకర రోగాల్లో భయంకరమైన అసూయా వ్యాధి పీడితుడు! వీళ్ళని కాదు , వీళ్ళను ఆహ్వానించి ఆలకించిన వాళ్ళని అనాలి!' అన్నాను.

                            *    *    *    *

    పొద్దుటి పోస్టులో ఉత్తరం వచ్చింది. పై ముద్ర చూడగానే వేళ్ళు ఒణికాయి. అది వచ్చింది బెనారస్ నుంచి. అక్కడ నా నెంబరు రెండొందల పందొమ్మిదని చెప్పి మరీ వచ్చెను, రిజల్టు బహిరంగ పరచగానే తెలియజెయ్యమని. నేను సెకండ్ క్లాసులో ప్యాసయ్యానుట పడిన శ్రమకు సత్ఫలితం కలిగిందన్న సంతోషంతో కలిగిన ఉద్రేకొత్సాహలతో కొంతసేపు ఆనందించాను. అంతలోనే అప్రయత్నంగా నా కళ్ళలోకి నీళ్ళు వచ్చాయి. ఎక్కువ సుఖమైన దుఃఖమైనా పంచుకోడానికి ఆప్తులు కావాలి. అయన చూస్తె ఈ మాదిరిగా ఉన్నారు. అన్నయ్య దగ్గిర్నించి జవాబు కైనా నోచుకోలేదు. మధురిమను ఎత్తుకుని ముద్దు పెట్టుకుని "నేను సెకండు క్లాసులో ప్యాసయానుటే మధూ!' అని చెప్పుకునే దాకా నాకు ఉండబట్టలేదు. దాని ఆనందం చూస్తె నా బాధంతా చేత్తో తీసేసినట్లయి పోయింది. అది ఇంచుమించు డ్యాన్స్ చేసింది. చప్పట్లు కొట్టి గెంతింది. 'మా అమ్మ పరీక్ష ప్యాసయిందొచ్చి! మా అమ్మ ఎం.ఎ తెలుసా?' అని తన ఫ్రండ్స్ తో మా రంగి తోనూ, పోతురాజుతోనూ, సరళతోనూ అందరితోనూ చెప్పి వచ్చింది. అయినా దానికి సంతుష్టి కలిగినట్టు లేదు. వారి దగ్గిర కెళ్ళి నాన్నా, నాన్నా, అమ్మ పరీక్ష పాసయిందట తెలుసా? అలా ఇలా కాదు , సెకండు క్లాసులో!' అని అంటే ' అలాగా సంతోషం. ఆ కబురు తనే వచ్చి చెబితే సంతోశంచే వాళ్ళంగా!' అన్నారు. నాకు వినపడేలాగ. సరే అదేంత ముచ్చటగా ఉందొ అని నేనే వెళ్ళెను.
    'ఏమండీ, ఇప్పుడే ఉత్తరం వచ్చింది. భగవంతుడి దయ వల్ల ఏదో గట్టేక్కేను. మీరు కూడా వచ్చి పరీక్ష ప్యాసై ఉంటె నాకు మరింత నిండుగా ఉండి ఉందును. ఈ ఏడాది ప్రీవియస్ పేపర్లు చాలా సుళువుగా ఉన్నాయిట కూడా'! అన్నాను. 'నువ్వు పాసయావని చెబితే తీరిపోలేడూ , దాంతో నన్ను కూడా జోడించి కించపరచి నీ ఆధిక్యం బయట పెట్టుకుంటే గాని నీకు సంతుష్టి ఉండదనుకుంటాను!' నా సంతోషమంతా ఒక్కసారిగా చప్పగా చల్లారి పోయింది. మొహం ముడుచుకు పోయింది. ఇక అక్కడ ఉండ బుద్ది పుట్టలేదు. తగిన జవాబు చెబుదామని నోటి దాకా వచ్చింది గాని పూర్వానుభవం నన్ను మారు మాటాడ నియ్యలేదు.
    ఆ తరువాత ఒకవారం రోజుల పాటు నాకు వచ్చే పోస్టు అభినందన పరంపర తో నిండిపోయింది. ముఖ్యంగా రుక్మిణమ్మ గారూ, మధురా నన్ను అభినందిస్తూ రాసిన ఉత్తరాలు మరచి పోలేనివి. మధుర ప్రీవియస్ లో పాసయిందిట. అలా యిలా కాదు యాభై పర్సంటు మార్కులతో! నాకు ఆనందం ఆశ్చర్యం ఒక్కసారే కలిగాయి. ముప్పాద్దులా ముస్తాబవడంతో గడిపేసే ఆ అమ్మాయి రాత్రయ్యే సరికల్లా బుద్దిగా చదవడం, మంచి మార్కులతో పాసవడం ఎంత వింతగానైనా ఉంది. వెంటనే ఆ కేశవరావు కూడా జ్ఞాపకానికి వచ్చాడు. పైకి ఎంత మంచివాడులా కనిపించేవాడు , నిజానికి ఎంత దుర్మార్గుడు! 'మా ఇంట్లో అందరూ మీకు తమ హృదయ'పూర్వక అభినందనలు తెలియజేయమన్నారు. ఎక్కడికైనా ఆఫ్లై చేస్తున్నారా?' అని రాసిన మధుర ఆఖరి మాటలు విని త్రుళ్ళిపడ్డాను. ఇంకా రిజల్ట్స్ తెలిసి పదిరోజులు కూడా అవలేదు. మార్కుల లిస్టు వచ్చి రెండ్రోజులు దాటలేదు. అప్పుడే ఉద్యోగమా? నేను చదువుకున్నదెందుకు? ఉద్యోగం    చెయ్యడానికేనా?
    ఏమనుకున్నారో ఏమో ఆయనకే తెలియాలి. ఈమాధ్య నాలుగైదు రోజులై పేకాట మకాం క్లబ్బు నుంచి మా మేడ మీదకి మార్చేశారు. ఇది హరిగోపాల్ గారి అమూల్యమైన సలహా అనుకుంటాను. అతగాడు కూడా ఈయన్ని క్షణం వదిలేవాడు కాదు. అయితే భోజనం మాత్రం ఏ హోటల్లోనో చేసి వచ్చేవాడు. ఆఫీసు బాయ్ ని రాత్రి కిక్కడ ఉంచేసి వాడి చేత కావలసినన్ని సార్లు కాఫీలు, టీలూ సిగరెట్లూ తెప్పించుకునేవారు.
    అలా వూరూ వాడా ఎగిరి పోయేటట్లు వారు మేడ మీద గోల చేస్తుంటే రాత్రివేళ క్రింద పడుకున్న నాకు నిద్రెలా పడుతుందీ? అదృష్టవశాత్తు నారాయణ వాళ్ళ అఫీసరుతో క్యాంపు కు వెడితే ఆ నాలుగు రోజులూ సరళ నా దగ్గరికి వచ్చి సాయంగా పడుకునేది. సరళ ఒక మంచం మీదా, నేనూ మధురిమా మరొక మంచం మీద పక్కపక్కన పక్కలు వేసుకుని పడుకునే వాళ్ళం. మధురిమ వెంటనే పడుకునేది. మరో అరగంటకి ఆ కబురూ ఈ కబురూ చేబుతూ సరళ నిద్రపోయేది. ఇక మిగిలింది మెడమీది రాత్రించరులు వాళ్ళూ క్రింద   నిశా పిశాచిని నేను!

                                     18
    పొద్దుటే మేడ తుడిచిన రంగి "అమ్మగోరూ బుట్టెడు సిగరెట్టూ పీకలెత్తి పారబోస్తున్నాను. రాత్రి తెల్లార్లూ జాగారం కూకుంటే బాబుగోరి ఆరోగ్యం దెబ్బతిన్దా? అరెలాగా తొందర మనుసులు తమరేనా సెప్పరెంటండి సిత్రం!' అనేది. సరళ కూడా బొత్తిగా ఊరుకునేది కాదు. 'ఆ కామేశ్వరి  వెళ్ళి పోయిందంటే ఈ హరిగోపాల్ ఎక్కడ దాపురించాడక్కా బావకు! చెరపడానికి చేటసెయ్యి చాలని, ఆవేళకి ఎవరో ఒకరు. ఇంతకీ వినేవాళ్ళ కుండాలి! ఏమైనా బావను నువ్వుయిలా వదిలెయ్యడం ఏం బాగులేదమ్మా' వీళ్ళకు నేనేమని జవాబు చెప్పేది? రెండు పూట్లా భోజనానికి రావడం, గబగబా రెండు మెతుకులు కొరికి వెళ్ళిపోడం , ఏదైనా మాటాడించబోతే ప్రతీ మాటనూ తిప్పి కొట్టడం, ఇంకా అక్కడే ఉంటె ఏ మధురిమతోనో మాటాడుతూ నామీదకే దెబ్బ తీయడం -- నేననుకున్నది ఒకటే ఒకటి. ఇలా ఎన్నాళ్ళు సాగుతుందో , కానియ్యి చూద్దాం. కాలమే అన్నింటికీ క్రమంగా పరిష్కరిస్తుందంటారు. అదేదో చూద్దాం. ఇక నేను ప్రయత్నం చెయ్యడం అయన వినడం ఆ స్టేజి దాటిపోయింది. అదీగాక ఇంతకంటే ముఖ్యమైన ప్రశ్న నన్ను వేధించి నాకు దేని మీదా మనసు లేకుండా చేస్తోంది. అన్నయ్యకు ఎలా ఉంది, ఎందుకు జవాబు రాయరు? మొదటి సారి నేను పరీక్ష ప్యాసైనప్పుడు నన్నంతగా అభినందించిన అన్నయ్య రిజల్డ్స్ విని సంతోషించానని ఒక్క ముక్క రాయలేదెం?
    అన్నిటినీ మించి ఈ అనర్ధాలన్నింటికి మూల కారణం ఈచడువే అనిపించింది. మానసిక బలహీనతతో మనకు లోకువగా దొరికినదే దోషిగా కనిపించడం సహజం. పోనీ అనర్ధాలమాట అటుంచి చదువు వల్ల నాకు కలిగిన లాభమేమిటి అని ప్రశ్నించుకున్నాను.
    విద్య మనో వికాసానికి తోడ్పడుతుందంటారు. సాహిత్యం మనస్సుకు ఉదారతనూ సామ్యదృష్టినీ సౌకుమార్యాన్ని ఇస్తుందంటారు. నేను చదివిన యిటీవల పరీక్ష నాకివి ఎంతవరకు యిచ్చింది? నేను ఏనాడూ ఊరూ పేరు ఎరుగని ఆంగ్ల రచయితల అమూల్యగ్రంధాన్ని కొంతవరకూ పరిశీలించే అదృష్టం కలిగింది. అత్యానందాన్నిచ్చే అందాలతో అంతర్లీనమైపొతే పరిమితమైన పరీక్షా విధానం లోని కొలత బద్దలకు నిలబదలేమని రుజువు చేసుకున్నాను. ఒక మహారచయిత రాసిన అనేక గ్రంధాలలోని ఒక పుస్తకంలో కొన్ని పేజీల్లో కొంత తెలుసుకుంటే రచయిత హృదయాల్ని ఎంతవరకు అర్ధం చేసుకున్నట్టు? పాండిత్యమూ, భాషాపటిమా వేరు, పరీక్షలు ప్యాసు కావటం వేరు. ఇది ఏడో క్లాసు లో అయినా సరే ఎమ్మే లో అయినా సరే. పరీక్షలు వేరు. జ్ఞానముపార్జన వేరు. అని స్పష్టంగా తెలుస్తున్నప్పుడు ఇంట్లో కూచుని కావలసిన మంచి పుస్తకాలు ఎందుకు తెప్పించుకుని చదువు కోకూడదు? పరీక్షలని పేరు పెడితే గాని పట్టుబట్టి చదవమనా?
    ఇతరులను అర్ధం చేసుకునే విశాల దృష్టి కావాలంటే చదువుకోవాలంటారు. ఈమధ్య మా యిద్దరికీ జరిగిన వాగ్యుద్దాలూ, మనో వ్యధా, ఈర్ష్యా ద్వేషాలూ , ఇంచుమించు మాటలు మానేసే వరకూ రావడం యివన్నీ విద్య వల్ల నాకు కలిగిన చిలవలూ పలవలూనా? సహనమూ, సంతృప్తీ సానుభూతీ ఈ మూడింటితో కూడిన సహజీవన సౌందర్యానికి తోడ్పడే విద్య నా విషయంలో మరొక విధంగా ఎందుకు చేసింది? సంఘసేవలో గాని చక్కని భవిష్యత్తు నిర్మించుకోవడంలోగాని నాకు విద్య యిచ్చిన వికాశం ఎటువంటిది?
    ఇటువంటి ఆలోచనల వల్ల ముఖ్యమైన విషయాలు రెండు నాకు ప్రస్పుటంగా కనిపించాయి. మొదటిది నన్ను ఉదాహరణగా తీసుకుని విద్య గురించి యిలా ఆలోచించడం కేవలం అవివేకమని. రెండవది అన్నయ్య ప్రోత్సాహం చేతనైతేనేం, అయన వద్దన్నారని పట్టుదల చేతనైతేనేం పరీక్షలకు కట్టి సాధించాను కాని ఇది కేవలం ఉద్దేశ రహితమని!
    ఏమయితేనేం , నేనిప్పుడు ఎం.ఏ ,ని. లిటరేచరు సెకండు క్లాసులో పాసయినదాన్ని. ఏ కాలేజీలో యింగ్లీషు లెక్చరర్ గా పనిచేసినా నా విలువ ప్రస్తుతం నెలకి రెండొందలు!
    ఈ రెండ్రోజులూ యిల్లు నిద్దరోతున్నట్టుంది, ఈయన కూడా క్యాంపు కి వెళ్ళిపోవడం చేత. పెకాడుతుంటే పెద్ద పెద్ద కేకలు వేస్తుంటే అలాగైనా ఆయన స్వరం విన్నట్టుండేది. అయన లేనప్పుడు కూడా యధావిధిగా పేకాట సాగేటట్లు అనుమతినివ్వనందుకు హరికి మనసులో నమస్కరించాను.
    ఒకనాడు పగటి వేలనేనేనూ మధురిమా భోజనాలు చేశాక సరళ మా యింటికి వచ్చింది.
    'అక్కా నువ్వేమీ ఉద్రేకపడవనీ తొందర పడవనీ మాటయిస్తే నేనో కబురు చెప్తాను' అంది.
    'ఏమిటీ చెల్లి అదీ?' పెదవులు ఒణుకుతుండగా అడిగాను.
    'మీ అన్నయ్యకు ఒంట్లో ఏమీ బాగుండలేదట!'
    నా తలపై పిడుగు పడ్డట్టు అయింది! మాట యివతలికి రాక నాలుక పిడచ కట్టినట్టయి పోయింది. ఎలాగో అతి కష్టం మీద అడిగెను.
    'ఎవరు చెప్పేరు? ఎలా తెలిసింది?'
    సరళ చెప్పింది -- నారాయణ క్యాంపు కి వెళ్ళిన పల్లెటూరికి మావూరు  రెండు మైళ్ళుట. అందుకని నారాయణ ఓనాడు సైకులు మీద వెళ్ళి అన్నయ్యను చూసి వచ్చేడుట. వీలయితే చూసి రమ్మని వెళ్ళేటప్పుడు సరళ చెప్పిందిట -- అందుకు అతని చేత నిర్మల చీటీ పంపిందిట.
    'మంజుల గారూ, మీ ఉత్తరం ఆనాడే అందింది. ఆ ఉత్తరం మా నాన్నగారు చూసి, నగ విషయం లో మీకు తోడ్పడ్డానని, అక్కర్లేని విషయాల్లో కలుగజేసుకుంటే పళ్ళు రాల గోడతానని ఏవేవో అన్నారు. మీరు పంపిన కవరు కూడా చింపేశారు. మీరు వెళ్ళిందగ్గిర్నుంచి మీ అన్నగారికి రోజురోజుకీ ఎక్కువై పోయిందనుకుంటాను. మీ అన్నయ్యను మీరు కళ్ళతో చూసుకోవాలంటే వెంటనే రావలసింది. నేనిలా రాసినట్టు ఎవరికీ తెలియజేయకండి. ఆలస్యం చేసినందుకు క్షమించండి.
                                                                                        -- నిర్మల

 Previous Page Next Page