అయితే నా యీ చిలిపి చేష్టలు ప్రతినిత్యం గమనించి ఆనందించే ప్రాణి ఒకటుందని నాకు తెలీదు. ఒకనాడు ఎవరో నవ్వినట్టి - వెనక్కి చూసి నా మొహం ఎర్రబడింది. నే నటు కోపంగా చూసిన నా అతడక్కడి నుండి కదలక పోవడం, పైగా నవ్వడం నా కతని పై సదభిప్రాయం కలగకుండా చేశాయి. అతడలా గుచ్చి గుచ్చి చూడటం నాకు చిరాకనిపించింది. అన్నయ్యతో చెబుదామని ఉండేది కాని మళ్ళీ ఎందుకూ లేనిపోని గొదవలు నే నటువైపు చూడక పొతే సరి అని సరిపెట్టుకుని వూరుకునేదాన్ని. తరువాత ఆ విషయమే మరచి పోయాను. అన్నయ్య నాకు సంబంధాలు వెతుకుతున్నట్టు తెలిసి ఎవరి ద్వారానో తను సిద్దంగా ఉన్నట్టు కబురంపించాడుట. 'ఆ అబ్బాయి కేం తక్కువా?' అని మధ్యవర్తి అడుగుతే ' ఎక్కువేమీ లేక పోవడమే' అని అన్నయ్య జవాబు చెప్పేడుట. 'హరిగోపాల్ కి నిన్ను చేసుకోవాలని చాలా ఉండేదే మంజూ. ఇటు చదువు గాని అటు ఉద్యోగం గాని సరిగా లేని వాడికి చూసిచూసి నీన్నేలా ఇవ్వను? అన్నాడు అన్నయ్య.
'మీరు హరిగోపాల్ కదూ?' అన్నాను రైల్లో ఆయన్ని చూశాక. మనిషి బాగా మారిపోయాడు. సంసార భారంతో క్రుంగి పోయిన మనిషిలా కనిపించాడు. భార్యను పురిటికి పుట్టింటికి దిగబెట్టి వస్తున్నాడట. ఈ పిల్లల్ని సాకడానికి అతని తల్లి ఉందిట.
అతని మాటతీరు చూస్తె అతనా విధంగా తయారు కావడానికి నేనే కారణమై నట్టు ధ్వనించింది. మీ కంటికి మేం అనామా అనీ, ఏదో పలకరించారు అంతే చాలు అనీఅతను మాటాడుతుంటే నాకు చాలా అసహ్యమని పించింది. అయన ఉద్యోగం గురించి అడిగాడు. చెప్పెను. అతనూ అదే డిపార్టుమెంటు లో పని చేస్తున్నట్ట. కాని ఏం లాభం? అయన నిచ్చెన పై మెట్టు మీద ఉంటె తను కింద మెట్టు మీద ఉన్నాడట. అలాంటి వాడితో సంభాషణ పొడిగించడం నాకే మాత్రం ఇష్టం లేకపోయినా అసలే ఏడుస్తున్న అతనితో బొత్తిగా మాట కలపకపోతే బాగుండదని అన్నాను.
'మీ ఆవిడ ఏం చదువుకున్నారు?'
'మీ దయ వల్ల అక్షరజ్ఞానం లేందెం కాదులెండి. స్కూలు ఫైనలు దాకా వెలిగించింది. మీరప్పుడు ఇంటర్ కి కట్టేరు కదూ, పెళ్ళయాక అపెసేరనుకుంటా.' భేద వేసి వూరుకున్నాను ఇంకేం చెప్పడం ఇష్టం లేక. కాని అతడు నన్ను వూరుకోనీయ లేదు. ఎం.ఏ ప్రీవియస్ అయిందని చెప్పగానే తనదేదో పోయినంటగా ముకుళించుకు పోయింది అ మొహం. కొంత సేపటికి ఏదో షాక్ నుంచి తెరుకున్నట్టు తేరుకుని 'పిల్లల్ని చూడ్డానికి ఎవరో పెద్దవాళ్ళో, లేకపోతె దండిగా నౌకర్లూ, చాకర్లూ ఉన్నారు కాబోలు. లేక మీ ఆయనే అడిస్తారో. లేక పొతే ఇంతవరకు ఎలా సాగించగలరు లెండి!' అన్నాడు అదోలా వెకిలి నవ్వు నవ్వుతూ.
ఇలా మేమిద్దరం మాట్లాడుతూ ఉంటె వాళ్ళ చంటి పిల్ల మూడేళ్ళది అలా పాకుతూ వెళ్ళి చెరుకు పిప్పి ఏరి నోట్లో పెట్టుకోబోయింది. 'వెధవలు తిన్నగా ఉండరు" అని దాన్ని ఒక్కటి వేశాడు. అది ఏడుపుకి లంకించుకుంటే 'నోరు మూస్తావా ముయ్యవా' అని మరొకటి వెయ్యబోతే నేను వారించాను. నేను బుట్టలో బిస్కట్ల పొట్లాం విప్పి పెడుతుంటే తక్కిన పిల్లలిద్దరూ నాకో నాకో అని చెయ్యి జాపేరు. 'వాసిరిగొట్టు వెధవలు అక్కడికి బిస్కెట్ మొహం ఎరగనట్టు' అని అతగాడు విసుక్కున్నాడు. మధురిమ నవ్వుతూ ఇవన్నీ చూస్తూ కూచుంది, మధ్య మధ్య పైకి చూస్తూ.
'నేనిందాకా అన్నదానికి సమాధానం చెప్పేరు కాదు.'
'చెప్పడానికేం లేదు. మాకు ఈపాప ఒక్కతే' ఈసారి హరిగోపాల్ మొహం మరీ మాదిపోవడం స్పష్టంగా చూశాను.
'నాలాంటి దురదృష్టవంతుల్ని బాగుచేసేవారూ, మీలాంటి అదృష్టవంతుల్ని చెరిపే వారూ లేరను కుంటాను' అలా మొహం మీదే అంటుంటే ఒక వూరుకోలేక పోయాను.
'లేరు. కాని బాగుపడ్డ వాళ్ళను చూసి ఎడ్చేవాళ్ళూ చెడిపోయిన వాళ్ళని చూసి నవ్వుకునే వాళ్ళూ ఎక్కడ పడితే అక్కడే ఉన్నారు!'
ఈమాట - అతని నాషాళానికి అంటిందనుకుంటాను. నావైపు తెరిపారచూశాడు. విషాదమూ, క్రోదమూ కలిసి ఉంది ఆ చూపులో.అంతే . తరువాత రెండు మూడు గంటలు కలిసి ప్రయాణం చేసినా అతను నాతొ మాటాడలేదు. అసలే ఇన్ఫీరియరిటీ కాంప్లెక్స్ తో బాధపడుతున్నట్టు న్నాడు. అతన్నెందుకు ఇంకా బాధించినట్టు? ఆని నా మనసే నన్ను నిలదీసింది. అది అక్కడితో అయిపోయిందనుకున్నాను.
అయన వెనక కాళ్ళు కడుక్కుని భోజనానికి వస్తున్న హరిగోపాల్ ని తలెత్తిచూశాను. సరిగ్గా అదే సమయంలో అతడూ నా వైపు చూశాడు. అసూయా క్రోధాలతో వింతగా ముడుచుకుని ఉన్న ఆ కళ్ళనూ వక్రంగా మలచబడిన ఆ కను బొమ్మలనూ చూస్తుంటే భయం వేసింది. అదృష్టవశాత్తూ ఆవేళకు సరళ వాళ్ళింట్లో భోజనాలయి నాతొ మాటాడుదామని వచ్చింది.
'చెల్లి సమయానికి వచ్చావు. ఎవరో అయన స్నేహితుడు కూడా వచ్చాడు బోజనానికి. వంటేమో ఎలాగో చేసేశాను. తల ఎగిరిపోతోంది. కాస్త వడ్డించి పెడుదూ" అన్నాను బతిమాలుతున్నట్టు.
'అయ్యో ఈమాత్రం సాయానికి కొత్తదానిలా అంతగా నాకు చెప్పాలా అక్కా, ఉపకారమంటే వూర్లోంచి పారిపోలెం గద' అని సరళ పమిట చెంగు దోపుకుని వడ్డనను ప్రారంభిస్తే నా పోయిన ప్రాణం లేచొచ్చింది.
'అదేమిటి నువ్వు వడ్డిస్తున్నావ్?' అన్నారు అయన సరళతో.
'అక్కయ్యకు తలకాయ నొప్పిగా ఉందిట.' 'బాగుంది వరస' అన్నారు అయన కటువుగా.
'ఇంట్లో వాళ్ళకి అసలే బాగులేనప్పుడు నన్ను కూడా తీసుకొచ్చి ఇబ్బంది పెట్టడం ఎందుకండీ మరీ అన్యాయం' అన్నాడు హరిగోపాల్ అన్నమూ మాట కలుపుతూ.
'ఇంట్లో వాళ్ళకి కులాసాగా ఎప్పుడుంటుందో , ఎప్పుడు చిరాగ్గా ఉంటుందో తెలుసుకోడం కూడా అంత సుళువైన విషయం కాదండీ హరిగారూ!' అన్నారాయన. మరందులో నవ్వడానికే ముందో గాని తెలీదు గాని ఇద్దరూ కలిసి ఇల్లెగరకొట్టేశారు.
అయితే తరువాత జరిగే హింసాకాండకు అది ప్రారంభోత్సవం మాత్రమే అని నేను తెలుసుకో లేకపోయాను. ఈ విషయంలో హరిగోపాల్ ప్రధాన పాత్ర తీసుకుని తనమీద నా మనసులో ఉన్న విషమూ, కసి అంతా కక్కేసినట్టు కనిపించింది. అసలే నామీద అక్రమంగా పగ బూనిన అయన యిందులో పాల్గొనడం నాకేమంత విచిత్ర మనిపించలేదు. ఈ విషయంలో పూర్వాపరాలు తెలియని సరళే అన్నివిధాలా బాధపడిందను కుంటాను. నిశ్శబ్దంగా భోజనాన్ని ముగించే అయన భోం చేస్తున్నంత సేపూ మాట్లాడ్డం మాత్రం కొత్తగా కనిపించింది. దూరంగా వంటగదిలో కూచున్నా వాళ్ళ ప్రతి అక్షరం నా చెవిలో పడుతూనే ఉన్నది.
'వీళ్ళు ఎంత చదువుకొనియ్యండి. వీళ్ళని మనం ఎంతగా చూడనియ్యండి. ఈ ఆడవాళ్ళ అభిమానం ఎప్పుడూ పుట్టింటి వారి మీదే ఉంటుంది. వాళ్ళకి మింగ మెతుకు లేకపోయినా సరే, చచ్చే పరిస్థితుల్లో ఉన్నా, వాళ్ళ దగ్గిర నుంచి నయా పైసా మనకి పుట్టకపోయినా సరే వాళ్ళనే ప్రాణ ప్రదంగా భావిస్తారు. మరి ఇందులో కీలకం ఏమిటో నాకు ఎంత ఆలోచించినా అర్ధం కాదు.'
అని మొదలు పెట్టాడు హరిగోపాల్. ఆ పరిస్థితిలో ఆ కబుర్లు, విస్తర్లో వడ్డించిన బూర్లు కన్న తియ్యగా ఉన్నాయను కుంటాను శ్రీవారికి. ఊరికే ఉండలేక రుచి ఎలా ఉందోనని పులిహోర ఇంత నోట్లో వేసుకుని పొరపాటున మిరపకాయ కొరికిన నాకు అంతకన్న కారంగా ఉన్నాయి అవే కబుర్లు!
'మా బాగా చెప్పేరు హరిగారూ!"
'మరేమను కున్నారు రామమోహనరావుగారు, అంతగా ఒళ్ళు మండిపోతుంటే అనుకోకేం చేస్తాం చెప్పండి. మా వెంకట రత్నమే ఉందా, పసుపు కుంకానికి. సంతోషమే ఖర్చు పెట్టుకోమనండి, ఎవడిక్కావాలి? అహోరాత్రులు కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకుని నేలయ్యేసరి కల్లా నేను తెచ్చి చేతిలో పోసే నూట యాభై దాని కంటికి ఆనవు. అవేవో చిల్ల పెంకులు అనుకుంటుంది కాబోలు. అదిగో వాళ్ళ బాబు అహోబిలం గారు పంపే ఆ పది రూపాయలే బిళ్ళ కుడుములు కాబోలు. తేడా గమనిస్తున్నారా? నన్ను మన్నిస్తే ఒకమాట అడుగుతాను. ఇలాంటివి అనుభవంలోనికి రాని అదృష్టవంతులేమో తమరు మరి!'
'బాగుంది ,అత్తారింటివారి బాధ అనుభవించని అల్లుడూ, వానకి తడవని నరుడూ ఉంటాడా?'
'మా బాగా శేలవిచ్చేరు. పైకి నీటుగా ముస్తాబై తిరుగుతున్న ప్రతి మనిషికీ యింతో అంతో చింత ఉండక మానదు మరి!'
ఈ రాయి పూర్తిగా నాకు తగలాలని విసిరింది. ఆనాడు రైల్లో నేనూ మధురిమా పరిశుభ్రంగా ఉండి మంచి బట్టలు కట్టుకుని ఉండడం అదో అపరాధం. నాలుగురోజుల క్రిందటనే చాకలాడికి వెయ్యవలసిన బట్టలు ధరించి, మొక్కుకి సరిపడే గెడ్డం పెంచి ఏడెనిమిదేళ్ళ పిల్లలకయినా ఓ లోపలి లాగులయినా లేకుండా రైలు ఎక్కించి, లోకంలో ఉన్న బాధా చీకటి ఎక్కువ చెయ్యడానికే మేం బయలుదేరాం అన్నట్టు హరిగోపాల్ , అయన కుటుంబం లాగ తయారవక'పోవడమే మేం చేసిన తప్పు. ఇంతకీ అతన్నేం లాభం, ఈయనింతగా దిగజారి పోయాక!
"ఒకసారి ఒళ్ళు మండిపోయి మా మామగారికి ఉత్తరం రాసి పడేశాను. 'అయ్యా అహోబిలం గారూ, మీ అమ్మాయి సంసారం చల్లగా ఉండాలంటే ఆ సొమ్ము మాత్రం పంపకండి. లేదూ, నేను కాళ్ళు జాపుకు కూచుంటాను. మీరే నెలకి ఏ రెండొందలో పంపుతూ ఉండండి. ఇటూ అటూ కాకుండా మాత్రం మా ప్రాణాలు తీయకండి' అని రాశాను. దాని కాయన జవాబు రాయలేదు గాని ఆ తరువాత్తరువాత మా వూరు వచ్చినపుడు అంటాడు? 'మా అమ్మాయికి నేనేదో పంపుకుంటే నీ కెందుకోయ్ మధ్య అంత ఇది?' ఆహా అలా ఉందా నీ వ్యవహారం అని మనసులో అనుకోని అక్కణ్ణించి అదెప్పుడు నన్ను కానీ అడిగినా సరే 'మధ్య నాకెందుకు అంత ఇది? మీ బాబున్నాడు, నువ్వున్నావు . కావలసింది రాసి తెప్పించుకో' అని దెప్పుతూ వచ్చాను. ఏమనుకుందో ఏమిటో ఇక సొమ్మేం పంపొద్దని తండ్రికి రాసేసింది. అదైనా ఎంత బ్రహ్మాండంగా రాసిందనుకున్నారు?' 'నాన్నా నువ్వు నీ ఖర్చులు మానుకుని నాకు సొమ్ము పంపడం దేనికి? నీకు డబ్బెక్కు వయిందా? ఇంతకీ నువ్వు వెర్రి అభిమానం పంపుతే ఏ నెల కానేల పెద్ద పులిలా మీద బడి లాక్కోడమే గాని నీ సొమ్ము నన్నాయన ఖర్చు పెట్టుకో నిచ్చిందెపుడు?' బాగుందాండి , ఇదీ వరస. ఇదీ మా వెంకట రత్నం నన్ను అర్ధం చేసుకున్నది ఏం చెప్పమంటారు?" అయన మాట్లాడలేదు. అత్యసక్తి తో వింటున్నాను. 'చెప్పండి చెప్పండి' అంటూ తనవి తీరలేదు కాబోలు పాపం!