Previous Page Next Page 
బొమ్మా - బొరుసూ పేజి 38


    హేమను చూస్తూంటే చంద్రకాంత్ కి గుండెలు పిండేసినట్లుబాధ కలిగేది. ఆమెకు అండగా నిలబడి ఆమెకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రతిఘటించాలనిఅనుకునేవాడు. కానీ నిజానికి తను చేయగలిగిందేమీ లేదని గుర్తుకొచ్చినిరాశతో కృంగిపోయేవాడు.
    ఆమె విడాకులు మంజూరయాయని తెలుసుకున్న రోజూ అతని ఆనందానికి అవధులు లేకపోయినయ్ ఆలస్యంగానయినా ఆమె ఆ నరకం నుంచి బయటపడింది. ఆమె శ్రీనివాసరావ్ క్రూరత్వానికీ, దుర్మార్గానికీ తల ఒగ్గి తన వ్యక్తిత్వాన్నీ తన ఆదర్శాలనూ ఎక్కడ బలిచేస్తుందోనని ఆందోళన పడ్డాడు తను. హేమ లాంటిస్త్రీ ఓడిపోకూడదు. ఆమెలాంటి యువతులకు పరాజయం లభిస్తే 'స్త్రీ' పరిస్థితి మరింత అధ్వాన్నమయిపోతుంది. విడాకులు పొందినందుకు అభినందనలు తెలుపుతూ ఆమెకి ఉత్తరం రాశాడతను.
    ఆమెకొద్ది రోజులు హైద్రాబాద్ వచ్చి తమ ఇంట్లో గడుపుతే బావుంటుందని కూడా రాశాడు.
     అయితే ఇప్పట్లో తను ఎక్కడికీ రాదల్చుకోలేదని ఆమె జవాబు వ్రాయడంతోనే తనే ఆమె దగ్గరకెళ్ళేందుకు ప్రయాణమయ్యాడు. హఠాత్తుగా వచ్చిన తనను చూస్తూనే ఎంతో ఆనందంకలిగిందామెకు.
    "నువ్వయినా, వసుంధరయినా వస్తే బావుండునని అనుకుంటున్నాను. అలాగే వచ్చేశావ్" అందామె.
    ఆమెనుచూస్తుంటే ఎంతో సంతృప్తి కలిగింది చంద్రకాంత్ కి. ఆమె మొఖంలో అదివరకు కమ్ముకున్న ఆవేదన, ఆందోళనా అన్నీ ఇప్పుడుమాయమయినాయ్. వాటిస్థానంలో ప్రశాంతత కనిపిస్తోంది.
    "నాకిప్పుడు ఎంతో ఆనందంగా వుంది హేమగారూ శాశ్వతంగా నాకు విముక్తి లభించింది".
    "నిజమే! ఆ ఇడియట్ ఏమన్నాడోతెలుసా? మొగుడువదిలేసిన ఆడదానిగతి అధోగతేనట! కానీ పెళ్ళాన్ని వదిలేసినమగాడిని మాత్రం అందరూ గౌరవంగా చూస్తారట! కాళ్ళుకడిగి కన్యాదానం చేస్తారట బోలెడుమంది. తను దర్జాగామరో పెళ్ళి చేసుకుని సుఖంగా ఉంటాడట" చెప్పిందామె.
    "పోనీండి! ఇంక అతని గురించి మాట్లాడుకోవడంకూడా టైమ్ వేస్టే! అయిష్టంగా అన్నాడు చంద్రకాంత్ కొద్దిసేపు ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు."
    "హేమగారూ! కొద్ది రోజులు మాఇంటికి వచ్చి ఉండగూడదూ! మిమ్మల్ని తప్పకరమ్మని మరీ మరీ చెప్పింది వసుంధర".
    "వస్తాను చంద్రా! కానీ ఇప్పుడేకాదు. ఈ పీడకలను పూర్తిగా మర్చిపోవడానికి ఇకొంతకాలం పడుతుంది."
    "మీరిలా ఏ వ్యాపకమూ లేకుండా ఆలోచిస్తూ కూర్చోవడంమంచిది కాదు".
    "ఊహు! నేను నా మనసునిప్పుడు పూర్తిగా రచనల మీదే కేంద్రీకరిస్తూన్నాను అదీగాకుండా మళ్ళీచురుకుగా విమన్స్ ఆర్గనైజేషన్ లో పార్టిసిపేట్ చేద్దామని కూడా ఆలోచన ఉంది. ఈ సమయాన్ని అవకాశాన్ని వృధా మాత్రం చేయబోవటంలేదు!" నిశ్చయంతో అందామె. ఆ మర్నాడే తిరిగి వచ్చేశాడతను.
    ఆమెతోమాట్లాడి వచ్చిన దగ్గర్నుంచీ అతని మనసంతా ఏదో తెలీని కలవరంతో నిండిపోయింది. ఉండుండి హేమమాటలే గుర్తుకొచ్చిమనశ్శాంతిని కరువు చేయసాగినయ్." ఆ ఇడియట్ ఏమన్నాడో తెలుసా? మొగుడువదిలేసిన ఆడదానిగతి అధోగతేనట! కానీ పెళ్ళాన్ని వదిలేసినమగాడిని అందరూ గౌరవవిస్తారట కాళ్ళుకడిగి కన్యాదానం చేసేందుకు ఎంతోమంది సిద్దంగా ఉంటారట".
    ఆ విషయం కొంతవరకు నిజమే! భార్యను వదిలేసినమగాడికయితే ఎవరోకరు పిల్లనిస్తారు గానీ భర్తవదిలేసిన స్త్రీని మళ్ళీ ఎవరయినా వివాహంచేసుకుంటారా? ఊహు! అసాధారణ మయిన విషయం అది. అంతటి విశాలహృదయంకల యువకులెవరుంటారు? శ్రీనివాసరావ్ లాంటివాళ్ళకు బుద్దిచెప్పాలంటే హేమ మరో వివాహంచేసుకోవాలి.
    తన ఆలోచనలకు తనకే నవ్వు వచ్చిందతనికి. అయినా ఇంత రభస జరిగాక ఆమె మళ్ళీ వివాహం ఎలా చేసుకుంటుంది? అసలీ వైవాహికవ్యవస్థమీదే ఆమెకు ఏవగింపు కలిగివుంటుంది! కానీ అందరూ శ్రీనివాసరావులే ఉండరు కదా! నూటికి కోటికి ఆడదాన్ని గౌరవించేమగాడు ఒక్కడు కూడా ఉండడూ?"
    హఠాత్తుగా అతనిలో ఆలోచన ఊగించివేసింది. అతనిగుండెలు వేగంగా కొట్టుకున్నాయి. తన ఆలోచనసమంజసమయినదే.
    తనుతొందరపడడం లేదుకదా! హేమ మీద జాలితో అలా అనుకోవడంలేదుకదా! ఊహు! ఇందులో తొందరపాటుకూడదు. తాపీగా ఆలోచించాలి మంచి చెడులన్నీ చూడాలి. లేచి ఫాన్ వేశాడు చంద్రకాంత్ చెమటలుపట్టిన శరీరాన్ని చల్లనిగాలి ఆహ్లాదంగా తాకసాగింది.
                
                                                            * * * * * *
    
    "ఇవాళ నా బర్త్ డే! మీకు తెలుసా?" సాయంత్రం ఆఫీస్ నుంచి బయటికొస్తూ నాగమణి అడిగాడు చంద్రం.
    "అరె! మరి ఉదయమే చెప్పలేదేం?" ఆశ్చర్యంగా అందామె.
    "బావుంది! అసలు నా బర్త్ డే ఎప్పుడో నాకు గుర్తుండేడిస్తేకదా!"
    "అందరూ బర్త్ డే నాడు శెలవుపెట్టిపండగలా జరుపుకొంటుంటే మీరు మామూలుగా ఆఫీస్ కొచ్చిపనిచేస్తూ కూర్చున్నారా?"
    "శెలవుపెడితే నా కెంతనష్టమో మీకు తెలుసు కదా! అసలే పుట్టిన్రోజుకూడా గుర్తులేకుండానే గడిచిపోయేదే! కానీ ఈసారి పుట్టిన్రోజుకోసం ఓ పవిత్రమయిన కార్యాన్ని ఎప్పట్నుంచో పెండింగ్ లో ఉంచాను. అది ఈ రోజు నెరవేర్చుకోవాలి."
    "ఏమిటది?"
    "హఠాత్తుగా చెప్పేస్తే ఎలా? దానిక్కొంచెంసమయం, సందర్భం ఉండాలి. అది సరేగాని ఇవాళకాసేపు బారేజ్ దగ్గర కూర్చుని వద్దాం. దయచేసివస్తారా?"
    "బారేజ్ కెందుకూ?"
    "అక్కడకాసేపు పార్క్ లో కూర్చుని మాట్లాడుకోవచ్చని" నాగమణి అర్ధం కాలేదు. ఏమి మాట్లాడాలనుకుంటున్నాడతను? అతని ఇంటి విషయాలా? తన విషయాలా? లేకతామిద్దరి గురించి మళ్ళీ ఎవరయినా అతనిని ఎద్దేవా చేశారా? హఠాత్తుగా ఓ అనుమానం ప్రవేశించిందామె మనసులో.
    ఒకవేళ అతను తనను ప్రేమించడం లేదుకదా! ఆమె గుండెలు ఝల్లుమన్నాయి. అతని కలాంటి అభిప్రాయం ఉన్నట్లు తనకెప్పుడూఅనిపించలేదు మరి! అతనికా ఉద్దేశ్యం ఉన్నట్లయితే అతనికివాళ ఎంతో నిరుత్సాహంకలిగిస్తుంది తను! తను కళంకితురాలన్న విషయం అతనికి తెలియకుండాదాచడం ఎలా సాధ్యమవుతుంది? అది తెలిస్తే అతనెలా ప్రవర్తిస్తాడు? అదివరకటి గౌరవం తనమీద ఉంటుందా?
    "ప్లీజ్ పుట్టిన్రోజునాడు నేనడిగింది కాదనకండి" బ్రతిమాలుతూ అన్నాడతను!
    నాగమణి నవ్వింది. "పదండి! ఇప్పుడెవరు కాదన్నారని?"
    ఇద్దరూ బస్ లో బారేజ్ దగ్గరకు చేరుకొని ఫుట్ పాత్ మీద నెమ్మదిగా నడువసాగారు. చల్లనిగాలి ఉండుండి ఆహ్లాదంగా వీస్తోంది. కింద నిండుగా పొరలుతున్న కృష్ణానదికనులకింపుగా ఉంది. బారేజ్ మీద వరుసగా వేగంగా పోతూన్నయ్ వాహనాలు. ఓ చోటనిలబడి నీళ్ళలోకి తొంగిచూడసాగారిద్దరూ.
    "చెప్పండి! ఏమిటి మాట్లాడాలన్నారు?" అడిగింది నాగమణి.
    "మిమ్మల్ని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను నాగమణిగారూ! మీ కిష్టమేనా?"ఎలాంటిబెరుకూలేకుండా అడిగేశాడతను. అతని చొరవకు నాగమణివిస్తుపోయింది. అంత హఠాత్తుగా అల అడిగేసరికి ఏం మాట్లాడాలో తోచలేదు.
    "నాకు ప్రేమ వగైరాల మీదనమ్మకం లేదునాగమణిగారూ, మీరు అందంగా వున్నారు. అంతకన్నా మ్య్ఖ్యమయిందేమిటంటే మీరు ఉద్యోగం చస్తున్నారు. మనిద్దరికీ ఒకరంటే ఒకరికి అవగాహన ఉంది. మనం సౌత్ పోల్, నార్త్ పోల్ లాంటివాళ్ళం కాదు. అందుకని మిమ్మల్ని వివాహం చేసుకోవాలన్నకోరిక కలిగింది నాకు. అఫ్ కోర్స్ ఇందులో స్వార్ధం కూడావుందనుకోండి! నన్ను అర్ధం చేసుకుని మీరూ నాతో సహకరిస్తే మా కుటుంబం ఈ దరిద్రం నుంచి బయటపడుతుంది. నన్ను నరకయాతననుంచి రక్షించిన వారవుతారు.
    మీకు ఆజన్మాంతం రుణపడి ఉంటాను. మిమ్మల్ని నా దేవతగా భావించుకుంటాను."
    నాగమణి ఆలోచనలో పడింది తన మనసులో విషయాలు అతనికెలా చెప్పాలా అనేది తెలీటం లేదు. "మాట్లడవేం నాగమణిగారూ! నేనంటే మీ కిష్టంలేదా? మీరు మరెవరినయినా ప్రేమించారా? అలాగయితే పోనీండి! నేను చెప్పినదంతా మర్చిపోండి? మనిద్దరం స్నేహంగానే ఉండిపోదాం....." ఆత్రుతగా అన్నాడతను.
    "అదేమీకాదు చంద్రంగారూ! కానీ మిమ్మల్ని వివాహంచేసుకునే అర్హత నాకులేదు" అంది ఆమెగొంతు పెగల్చుకుని.
    "అదేమిటి? ఎందుకలా అంటున్నారు! ఆమాట అనాల్సిందినేను......"
    "ఊహు! కాదు! మీ గురించి కొంచెం తెలుసుకోవాలి? అప్పుడు వప్పుకుంటారు-నాకా అర్హతలేదని"
    "అదేమిటో దయచేసి చెప్పండి. నేను ఈ సస్పెన్స్ భరించలేను......" ఆందోలనగా అన్నాడతను.
    "పదండి అలా పార్క్ లో కూర్చుందాం" అందామె ఇద్దరు పార్క్ లో కూర్చున్నారు.
    "నేను మా బావను ప్రేమించాను చంద్రంగారూ! మా బావ మీకు తెలుసుకదా! శ్రీనివాసరావ్! అతని వివాహం కాకముందు మా బంధువుల వివాహంలో చూశాను. ఎందుకో అతనినే వివాహం చేసుకోవాలని పించింది. బహుశా అలా అనిపించడానికి కారణం అతను ఒక్కడే మా బంధువులందరిలోకి నాగరికంగా కనిపించడంవల్లననుకుంటాను. నేను సినిమాలెక్కువ చూసేదాన్ని. అందులోహీరోలా కనిపించాడతనునాకు. అందుకే అతనినే పెళ్ళిచేసుకుంటానని సిగ్గువిడిచి మా వాళ్ళకు చెప్పాను. మా వాళ్ళుకూడా అతనికిచ్చి చేస్తే బావుంటుందనే నిర్ణయించుకుని వాళ్ళను కలుసుకున్నారు. కానీ బావనాకు చదువులేదని నిరాకరించాడు. అది నా హృదయం మీద గట్టిగా తగిలినదెబ్బ. అతనిని వివాహం చేసుకొనే అవకాశాన్ని పోగొట్టిన ఈ నిర్లక్షరాస్యత మీద ఏవగింపుకలిగింది! పట్టుబట్టిచదవడం ప్రారంభించానారోజునుంచే.
    చివరకు పరీక్షలు ప్యాసయి ఈ ఉద్యోగానికికొచ్చాను. తీరా ఇక్కడికొచ్చాక బావ అతని భార్య తగూలాడుకుంటున్న తీరు చూసి భయంకలిగింది. ఆమె పుట్టింటికి వెళ్ళిపోయింది. ఉద్యోగంలో చేరడానికి వచ్చినసమయంలో నన్ను బలవంతం చేశాడు. ఏదో తెలీని అశక్తత నన్నతనికి లొంగిపోయేలాచేసింది. కానీ ఆ మర్నాటినుంచీ ఆవేదన ప్రారంభమయింది. అలా ఎందుకు ప్రవర్తించానా అని నా మీద నాకే అసహ్యంకలిగింది.
    తక్షణం మిమ్మల్నాశ్రయించి ఆ ఇంటినుంచి బయటపడ్డాను. క్రమేపీ బావ మీదున్న ఇష్టమంతా అయిష్టంగా మారిపోయింది. అతనిని చూడడానికి కూడా మనస్కరించలేదు....." కొద్దిక్షణాలాగిందామె.

 Previous Page Next Page