అన్నపూర్ణమ్మ చిలకాకుపచ్చ సన్నటి జరీ వున్న పట్టుచీర కట్టుకొని ఉంది. బర్మా ముడిచుట్టూ పూలమాల పెట్టుకున్నది. ఆమె అసలే పెద్ద బొట్టు పెట్టుకుంటుంది.ఈరోజు ఆ బొట్టుసైజు ఇంకొంచెం పెరిగింది. చేతిలో పూలసజ్జ దానిలో టెంకాయ, పూలు, పళ్ళు పూజాసామాగ్రి ఉన్నాయి.
రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు శ్రీశైలం పొట్టినిక్కరు అటు బుష్ కోటు, ఇటు షర్టు కాని ఆకారంలో ఉన్న షర్టు ధరించి ఉన్నాడు. ఇప్పుడు ముదురునీలం పాంటు దాని ఆకారం డబ్బాలా ఉన్నది వేసుకుని ఉన్నాడు. టక్ చేసిన లక్షణం ఎగుడు దిగుడుగా చొక్కా పాంటులోకి దూరి ఉంది, అరవై డెబ్బై రూపాయలికివచ్చే వాచీ చేతికి తగిలించి ఉంది, ముఖాన తిలకంతో పెట్టుకున్న నలుపుబొట్టు ఉంది, దానిక్రింద అడ్డంగా విభూతి పెట్టుకున్నాడు. దానిమీద మళ్ళీ చిన్న కుంకంబొట్టు. కొద్ది సమ్మర్ క్రాఫ్ ఉన్న తలకి బాగా నూనె పట్టించి ముందుకి దువ్వుకున్నాడు. అచ్చం తిరణాలకొచ్చిన కోతిపిల్లలాగా ఉన్నాడు, అప్పటివరకూ నోట్లోవున్న జీడీ తనడం అయిపోయినట్టుంది. 'ఆయ్' అన్నాడు.
'మావాడు ఇప్పుడిప్పుడే మనుష్యుల్లో పడుతున్నాడు' అంది అన్నపూర్ణమ్మ.
'ఇంకానయం బురదగుంటలో పడలేదు' అనుకుంది సరిత.
"అమ్మవారి దర్శనం బాగా అయిందా?" మరోసారి అడిగింది అన్నపూర్ణమ్మ.
ఆమె అడిగింది సరితని, కానీ వెంటనే జవాబిచ్చింది సతీష్ షా.
"మేము ఇంతకుముందే కొండపైకి వచ్చాము, క్యూ తరుగుతుందేమో అని గుడిచుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాము. ఈ జనంలో పడి మా రాణీగారు లోపలికి వెళ్ళరు, నేను ఎంత 'షా' ని అయినా రాణిగారిమాట వినాల్సిందేకదా!
'ఓ....ఓహ్ సతీష్! నువ్వు నన్ను మరీ ఇదిగా అంటే నాకు కోపం వస్తుంది" ముద్దుగా అంది సరిత.
ఈలోపల శ్రీశైలం సతీష్ షా లాల్చీ పట్టుకుని దాని నునుపుదనం చూస్తూ 'అమ్మీ' అన్నాడు.
"ఏంటిరా నాన్నా!' అంది అన్నపూర్ణమ్మ.
"అమ్మీ! ఇది బావుందే. ఇలాంటి చొక్కాయి నాకూ కావాలి" అన్నాడు శ్రీశైలం.
'అలాగే' అంది అన్నపూర్ణమ్మ.
"మీ ఫోటో" తియ్యమంటారా?" సతీష్ షా అడిగాడు.
"వద్దు. వద్దు ఇలాంటిని మాకు భయం బాబూ" అంది అన్నపూర్ణమ్మ.
గుళ్ళో ఏదో అర్చన చేస్తున్నట్లున్నారు. కొద్దిసేపు క్యూని ఆపేశారు' దాంతో నలుగురూ ఇవతల ఎత్తయిన అరుగు వుంటే దానిమీద కూర్చున్నారు. వాళ్ళమధ్య ఎన్నో కబుర్లు సాగిపోయాయి.
"నాకు ఈ వూరు ఈ కొండ ఇక్కడ ప్రకృతి బాగా వచ్చాయి. ఈ గుడి ఎప్పుడు ఏర్పడింది? ఎవరు కట్టించారు? ఏ రకమైన వివరాలు కానీ చరిత్రకానీ, ఏ పూజారిని అడిగినా చెప్పలేకపోయారు. ఎందరినో అడిగి చూశాను. లాభంలేకపోయింది. ఇంత పెద్ద గుడిని కొండంత వెడల్పున నిర్మిస్తే వాళ్ళు ఎవరన్నదీ ఏ చిన్న ఆధారమూ దొరకలేదు....
సతీష్ షా చెబుతూంటే మధ్యలో సరిత అందుకుని అంది.
"ఎవరు నిర్మిస్తే ఏమిటి? కొండమీద గుడి వుంది. కొండ క్రింద వూరు వుంది. గుళ్ళో దేవుడున్నాడు. వూళ్ళో ప్రజలు వున్నారు. గుడికి వచ్చిపోయేవాళ్ళు సవాలక్ష మంది వున్నారు. ఎవరు నిర్మిస్తే ఏమిటి? చూడటానికి వచ్చాము. చూడటం అయిపోయింది. తిరిగి వెళ్ళిపోతే సరిపోయేదానికి ఈ గోలంతా దేనికి?"
"ఎవరికైనా తెలుసుకోవాలని వుంటుంది కదా అమ్మాయ్! ఇంత పెద్ద పుణ్యక్షేత్రం గురించి పూజారులైనా వివరం ఇవ్వకపోతే ఎలా?" అని అన్నపూర్ణమ్మ తిరిగి అడిగింది. "మీరింక వుంటారా? లేక వెళుతున్నారా?" అని.
"నేనయితే వెళదామనే అంటున్నాను" సరిత వెంటనే అంది.
"నేను మాత్రం ఇంకా వుండాలనే అనుకుంటున్నాను. ఇంత పెద్ద ఆలయం గురించి పూర్తి వివరాలు తెలియకపోవడమేమిటి? ఈ గుడిని పరిశోధించి కొన్ని ఫోటోలు తీసి ఇంకా ఎవరికైనా ఏదన్నా తెలుసునేమో కనుగొని దీనిపై ఓ ఆర్టికల్ రాసి 'ఫేమస్' మాగజైన్ కి పంపిద్దామనుకుంటున్నాను' సతీష్ షా అన్నాడు.
"ఏం పనిలేకపోతే సరి' వెంటనే అంది సరిత.
'ఇదీ పనేనోయ్!' అన్నాడు చిరునవ్వుతో సతీష్ షా.
ఆచార్య భర్తల మాటల వల్ల వాళ్ళిక్కడే వారం పదిరోజులు వుండవచ్చునని అనుకుంది అన్నపూర్ణమ్మ.
"మీరు వుంటున్నారా?వెళుతున్నారా?" అడిగింది సరిత.
'ఆ....కొద్దిరోజులు వుంటాను.వచ్చిన నాలుగురోజులలోనే అమ్మవారి దయవల్ల మావాడిలో కాస్త మార్పు వచ్చింది' దాంతో అమ్మవారిమీద చాలా నమ్మకం ఏర్పడింది. ఎలాంటి మొక్కులైతే మంచివా అని పెద్ద పూజారిగారితో సంప్రదించాను. ఇరవై ఒక్కరోజు ఇరవై ఒక్కరకాల పూజలు చేస్తే సంపూర్ణ ఫలితం వుంటుందని అయ్యవారు చెప్పారు. కాస్త ఖర్చుతో కూడిన పనే అయినా మా శ్రీశైలానికి తగ్గటం కావాలి గాని, ఖర్చుదేముందిలే. నిన్ననే ఆయన వచ్చివెళ్ళారు మమ్మల్ని ఇక్కడే వుండమన్నారు. నాలుగురోజుల్లో ఆయన వస్తారు. రాగానే నిత్యపూజలు మొదలుపెడతాం" అని చెప్పింది అన్నపూర్ణమ్మ.
"నిత్యపూజలంటే?" అంది సరిత వెంటనే.
"నాకూ సరీగా తెలియదమ్మా!రోజుకొకరకం పూజ అమ్మవారికి చేయాలి. పసుపు నీళ్ళతో పాలతో కొబ్బరినీళ్ళతో గుడి అంతా ప్రక్షాళన చేసి....ఏమిటో అయ్యవారు చాలానే చెప్పారు. నా చేతులతో నేను ఆయనగారి చేతులతో ఆయన పిల్లవాడి చేతులతోను....ఏమిటేమిటో అయ్యవారు చెప్పింది నాకు పూర్తిగా అర్థంకాలేదు. ఆయన వస్తారు కదా అన్నీ ఆయనే చూసుకుంటారు" అంది అన్నపూర్ణమ్మ.
'ఇలాంటివన్నీ చేయటానికి మీకు విసుగు పుట్టదాండి!' సరిత ఆముదం తాగిన ముఖం పెట్టి అడిగింది.
"నీకు నవలలు చదవటానిక్ విసుగు పుడుతున్నదా?" సతీష్ షా అడిగాడు.
'అదీ ఇదీ ఒకటా?"
'కాదనుకో!'
"కనుకనే నీవూ అనుకో ఎవరిపని వాళ్ళకి విసుగుపుట్టదని."