'ఈ మాత్రం ఆలోచన నాకు రాలేదనా నీ అభిప్రాయం?'
'ఎంత మాత్రమూ కాదు సార్!'
'ఐతే సరే వాళ్ళని అప్పటికప్పుడే లాక్కొచ్చి నాలుగు ఉతికితే నిజం కక్కేవారు కదా. వాళ్ళు నన్ను అంతేసి మాటలు....
'అన్నారు సార్! అన్నారు అననీయండి. వెధవల్ని పట్టుకోలేమా, తన్నలేమా! ఇంతకు అంత బదులు తీర్చుకుందురు గాని, వాళ్ళకి నేను జోస్యం చెప్పాను అది మీరు విన్నారు కదా."
'విన్నాను.'
'ఏమని చెప్పానో గుర్తుంది కదా సార్.'
'ఉంది.'
'ఐతే అదేమిటో చెప్పండి సార్.'
'మళ్ళీ మధ్యలో ఇదొకటా! అదేదో నువ్వే కానియ్యి.
"అలాగే సార్! ఈ వచ్చిన ముగ్గురూ పరమేశ్వరీదేవి దర్శనార్థం వచ్చిన భక్తులు కాదు. తాగటం, పేకాడటం ఎక్కడైనా చేయొచ్చు. ఎవరెస్టు శిఖరం ఎక్కి తాగి తందనాలు ఆడినా పేకాడినా ఎవరూ అభ్యంతరం పెట్టరు అవునా సార్!"
"మధ్యలో శంకలు కుశంకులు అనవసరం. సాంతం చెప్పెయ్యి.నేను విని నిర్ణయం తీసుకుంటాను."
"మంచిది సార్! అలాగే చెయ్యండి. డబ్బు చేజారిపోయింది. మనిషి చేజారి పోయాడు. కసికసిగా వున్నావు లాంటి మాటలు చెపితే విని ఆడించాడు. అంటే ఇక్కడ పగ ప్రతీకారం లాంటివి చోటుచేసుకున్నాయన్న మాట....! తాగటం కోసం పేకాడటం కోసంఇక్కడిదాకా ఎవరూ రానక్కరలేదు. ఈ లెక్కన వాళ్ళు ఎవరినో తరుముతూ ఇక్కడిదాకా వచ్చి ఉంటారు. లేక వీళ్ళనే ఎవరో తరుముతుంటే ఇక్కడికి వచ్చి దాక్కుని ఉంటారు, కనుక వీళ్ళు....
అహోబిలం చెపుతుంటే ఇన్ స్పెక్టరు కళ్ళు మెరిశాయి. "ఆ విషయం నేను ముందే గ్రహించాను." అన్నాడు తెచ్చి పెట్టుకున్న గాంభీర్యంతో.
"ఆ....ఆ....గ్రహించాల్సిందే గాడిద గుడ్డు కంకరపీచూను. అన్నింటికీ తొందర వకటి వచ్చు, నీనెత్తిన కాకీ టోపీ ఉంది నా నెత్తిన ఎర్ర టోపీ ఉంది. నీవు ఇన్ స్పెక్టర్ వి, నేను కానిస్టేబుల్ ని. కష్టం నాదయినా నీముందు నాది సానిబతుకే-" అనుకున్న అహోబిలం చాలా తెలివిగా "మీకు గ్రహించకపోతే ఇన్ స్పెక్టర్ ఎలా అవుతారు సార్! ఇంక చెప్పండి ఏం చేద్దామో!" పైకి వినయంగా అన్నాడు.
"నాలుగు రోజులపాటు ఇదే మారువేషాలతో మనం ఆ చుట్టుపక్కల వాళ్ళ పక్కన వేట కుక్కల్లాగా తిరుగుదాము. ఏదైనా ఆ భారం అందంగానే. లటుక్కున పట్టేసుకుని చటుక్కున సంకెళ్ళు వేసిపారేద్దాం" ఉషారుగా అన్నాడు ఇన్ స్పెక్టరు!
"మీరు చెప్పినట్లే చేద్దాము సార్!" తెచ్చి పెట్టుకున్న వుషారుతో తనూ అన్నాడు అహోబిలం.
కోయవాళ్ల వేషాలతో వెళ్ళి వాళ్ల ముగ్గురికీ జాతకం చెప్పి ఇవతలికి వచ్చింతరువాత మరో చోటుకి జోస్యం చెప్పటానికి వెళ్ళలేదు. దూరంగా నడిచి వెళ్లి జన సందోహం లేని చోటుగా చూసి కూర్చున్నారు.
అప్పుడు మొదలుపెట్టాడు ఇన్ స్పెక్టరు తిట్ల వర్షం! అసలే కోరి దాని కాల్లో ముల్లు విరిగింది, కంట్లో నలక పడింది అన్న తీరులో కుప్పిగంతులు వేయకుండానే వేసినంత పనిచేశాడు!
వర్ధనరావుని కాకాపడితే చాలా పనులు అవుతాయని అనుభవం మీద తెలుసుకుని కాకతీయంతో బ్రతుకుతున్న అహోబిలం ఇప్పుడు అదే పని చేశాడు!
వర్ధనరావు పూర్తిగా చల్లబడి 'అయితే ఇప్పుడేం చేద్దాము" అన్నాడు.
'బాగా అలసిపోయాము కదా సార్! ఈ పూటకి ఇంటికి వెళదాం' అన్నాడు అహోబిలం.
'సరే పద" అంటూ లేచాడు వర్ధనరావు.
లోలోపల ఆనందిస్తూ అహోబిలం కూడా లేచాడు.
ఇరువురు మౌనంగా బయలుదేరారు.
24
సాయంత్రం....
ఆరునలభై ఆరు నిమిషాలు
గుడికి వెళ్లి అమ్మవారు పరమేశ్వరీదేవిని దర్శించి కొండ దిగేవారు కొందరు కొండ ఎక్కేవారు మరికొందరు.
సరిత సితీష్ షా కొండ దిగబోతూండగా అన్నపూర్ణమ్మ శ్రీశైలం ఎదురుపడ్డారు.
"అరె మీరు?"
"అరె మీకా?"
అలా ఇరువురూ ఆశ్చర్యపోయారు.
ఆరోజు రైలు దిగింతర్వాత అన్నపూర్ణమ్మ శ్రీశైలం ఇటు సరిత సతీష్ షా స్టేషన్ లోనే వీడ్కోలు చెప్పుకొని విడిపోయారు, చెరో రిక్షా ఎక్కి ఎవరిదోవన వాళ్ళు బయలుదేరారు.
ఇది జరిగి అయిదురోజులు అయింది.
మళ్ళీ వాళ్ళు వకరికొకరు తారసపడలేదు.
ఇప్పుడు
ఇక్కడ
ఇలా కలుసుకున్నారు.
'అమ్మవారి దర్శనం బాగా అయిందా?" అన్నపూర్ణమ్మ ఆత్రుతగా అడిగింది. ఆరోజు మంగళవారం అందువల్ల క్యూ పెద్దగానే వుంది. శుక్రవారం అయితే చెప్పే పనేలేదు. భక్తులంతా అక్కడే ఉంటారు.
'అమ్మవారి దర్శనమా!" అంటూ నవ్వింది సరిత.
"ఇష్" అన్నాడు సతీష్ షా.
అన్నపూర్ణమ్మ ఓసారి ముఖం చిట్లించి మళ్ళీ మామూలు మనిషి అయింది.
సరిత పంజాబీ డ్రస్ లో ఉంది. కళ్ళకి పెద్ద సైజు లేత నీలం అద్దాలున్న గాగుల్స్ పెట్టుకొంది. ఒక చేతికి వాచీ రెండోచెయ్యి బోసిగాను ఉంది. పేరుకైనా ఒక్కగాజు కూడా వేసుకోలేదు. అమ్మవారి దర్శనానికి వస్తూ బొట్టు కూడా పెట్టుకోలేదు. పోనీ టైల్ కట్టుకుని ఇప్పుడు కొత్తగా వస్తున్న పెద్ద సైజు రంగుల పిన్నుని పెట్టుకుంది. చేతిలో వ్యానిటీ బ్యాగ్ ఉన్నది.
సతీష్ షా గోల్డు కలర్ పైజమా లాల్చీ వేసుకొన్నాడు. గుండీలు పెట్టుకోకపోవటం వల్ల మెడలో వున్న సన్నటి గోల్డు చైన్ కనిపిస్తున్నది. ఖరీదైన పెద్ద డయల్ వున్న వాచ్ పెట్టుకున్నాడు, మరోచేతికి సన్నటి రాగి కడియం ఉంది, కెమేరా మెడలో వ్రేలాడుతున్నది, రైల్లో ఉన్నప్పుడు మాట్లతో ఉన్నాడు. ఇప్పుడు పల్చటి నల్లటి ఆకుచెప్పులు ధరించి ఉన్నాడు. చంకలో పువ్వులతో అందంగా పెయింటు చేయబడిన గుడ్డ సంచి ఉంది. సంచీలోంచి ఒక పేపరు ఒక నోట్ బుక్ కనిపిస్తున్నాయి.