ఒక్కోసారి సతీష్ షా సరిత మాటలలో పడితే కొద్దినిముషాలు పరిసరాలు మరచిపోతారు.
ఇద్దరూ మూడునిముషాలు ఇంగ్లీషులో మాట్లాడుకుంటూ వుండిపోయారు.
అన్నపూర్ణమ్మ మౌనంగా చూస్తూ వుండిపోయింది!
శ్రీశైలం వాళ్ళిద్దరినీ చూస్తూ వుండిపోయాడు!
'జనం బాగా తగ్గారు క్యూ తగ్గింది' వెళ్ళి నుంచుందామా అన్నపూర్ణమ్మ అడిగింది.
'పోదాం పోదాం" అంటూ శ్రీశైలం లేచి నుంచున్నాడు.
'మీరుకూడా వస్తారా?' అన్నపూర్ణమ్మ అడిగింది.
"ఉహు మీరెళ్ళండి. ఇంక గుళ్లో తిరిగే ఓపిక నాకు లేదుబాబూ!" అని విసుగ్గా ముఖంపెట్టి అంది.
'నాకు ఓపిక వుంది. రాణీగారు రానంది కాబట్టి నేనూ రాను" సతీష్ షా నవ్వుతూ అన్నాడు.
ఆ తర్వాత వాళ్ళు విడిపోయేముందు
"మీరెక్కడ వుంటున్నారు" అన్నపూర్ణమ్మ అడిగింది.
హోటల్లో దిగాము! బస్తీలో ఉన్నంత గొప్పగా లేకపోయినా హోటల్ కూడా ఫరవాలేదు. తమిళయన్స్ హోటల్స్ పెడితే కీకరారడవుల్లో కూడా హాయిగా ఉండొచ్చు" సతీష్ షా అన్నాడు.
అన్నపూర్ణమ్మ నవ్వీ నవ్వనట్లు నవ్వి హోటల్ పేరు అడిగింది.
సరిత హోటల్ పేరు చెప్పి వాళ్ళు ఎక్కడ దిగింది అడిగింది!
అన్నపూర్ణమ్మ చెప్పింది. అయిదో నెంబరు రూమ్ లో దిగినట్లు!
ఆ తర్వాత ఇరువురు చెరో దారి పట్టారు.
క్యూ చాలా తక్కువగానే వుంది. దానికితోడు జనం ముందుకు కదులుతున్నారు.
అన్నపూర్ణమ్మ, శ్రీశైలం క్యూలో నుంచున్నారు. భక్తులతోపాటు ముందుకు సాగుతున్నారు!
సరిత అక్కడే నిలబడి ఏదో చూపిస్తుంటే దాన్ని ఫోటో తియ్యడానికి ప్రయత్నం చేస్తూ లెన్స్ సరిచూసుకుంటున్నాడు సతీష్ షా.
పది నిముషాల తర్వాత
క్యూలోంచి పక్కకు తిరిగి చూసింది అన్నపూర్ణమ్మ.
సరీగా అప్పుడే సరిత వెనుతిరిగి ఆమెని చూసింది.
చటుక్కున.
ఇరువురు
కంగారు కంగారుగా మొఖాలు తిప్పేసుకున్నారు.
ప్రప్రధమంగా
వారిరువురిలో
అనుమాన బీజం మొలకెత్తింది.
25
"గడ్డం తీసేస్తే సరీగా సరిపోయింది సార్" అన్నాడు అహోబిలం.
"మీసం ఉంచావా తీసేశావా?" వర్ధనరావు అడిగాడు.
"అదీ తీసేశాను సార్!"
అయితే నా ముఖం మీద ఒక్క వెంట్రుక పూచ లేకుండా గొరిగేశావన్నమాట....మా చెడ్డ వుషారుతో కుర్చీలో వూగిపోతూ సరదాగా అడిగాడు ఇన్ స్పెక్టరు.
'గుండు గూడా గీద్దామనుకున్నాను కాని వెధవకి ముందే గుండు వుండిపోయింది సార్!" నవ్వుతూ ఆ మాట చెప్పి అహోబిలం కొందరు నేరస్తుల ఫొటోలని విగ్గులు, మీసాలు, గడ్డాలు పలురకాలుగా కత్తిరింపు బొమ్మలని తీసుకొచ్చి వర్ధనరావు ముందున్న బల్లమీద పరిచి "ఇదిగో సార్! వీడికి గుండు వుంది మూతి చివర్ల నుంచి కిందకు జారిన మీసాలు కొంత భాగమే చిక్కగా వత్తుగా వున్న బుల్లి గడ్డము చూశారుగా?" అన్నాడు.\
"చూశాను వెధవని!" చాలా గంభీరంగా అన్నాడు వర్ధనరావు.
గుండుగాడి ఫొటో మీద మధ్య పాపిడితో ఎగదువ్విన క్రపును కత్తిరింపు విగ్గు కాగితాన్ని పెట్టి మీసాలు గడ్డాలు ఆకారం ఉంచిన కాగితం ముక్కలని తొలిగించి 'ఇప్పుడు చూడండి సార్! వెధవని!' అన్నాడు అహోబిలం.
'సరీగ సరిపోయింది వాడే వీడు వీడే వాడు!' హుషారుగా అని ఆ హుషారు పట్టలేక ఈల కూడా వేశాడు వర్ధనరావు.
కోయ దొరల వేషంలో నాలుగు రోజుల క్రితం ఇన్ స్పెక్టరు, అహోబిలం జోస్యం చెపుతామంటూ అద్దెలకిచ్చే రూమ్ ల దగ్గరకు వెళ్ళి ఓ రూమ్ తలుపు తట్టటం ఆ రూమ్ తలుపులు తెరుచుకుని ముగ్గురు బైటకి రావటంతో కొత్త కథకి నాంది పలికింది.
కామేశం అనే వాడికి అహోబిలం చేయి చూస్తూ చేతిలో రేఖలేమో గాని ముంచేతి మీదున్న పెద్ద గాటుని చూశాడు. ఆ గాటుని బట్టి అది కత్తితో కొస్తే గాటుగా అనిపించింది.
అనుమానం మొగుడికన్నా అనుమానం వచ్చింది, వూహించి ఏవేవో చెప్పాడు. చెప్పిన దానికి తగ్గట్టుగానే వాడి ముఖ కవళికలు వాళ్ళ మాటలు ఆ గదిలో వస్తువులు వున్నాయి.
మర్నాడు ఆ మర్నాడు
కోయ దొరల వేషంతో వెళ్ళి మళ్ళీ వాళ్ళ జాతకాలు చెప్పారు. మరో కానిస్టేబుల్ కనకారావుని వాళ్ళపై రాత్రింబవళ్ళు నిఘా పెట్టాడు ఇన్ స్పెక్టరు.
కొన్ని వార్తలు సేకరించుకు వచ్చాడు కనకారావు.
వాళ్ళు ముగ్గురూ నేరస్తులన్న అనుమానం వచ్చింది ఇన్ స్పెక్టరుకి. నేరస్తుల ఫోటోలు పాతవి, కొత్తవి తెప్పించాడు. వాటితోపాటు నేరస్తుల రూపురేఖలు మార్చి మార్చి చూసే మీసాలు గడ్డాలు రకరకాల క్రాఫుల కటింగ్సు కూడా తెప్పించి ఇప్పుడు ఆ నేరస్తుల ఫోటోలకి క్రాఫులు మీసాలు మార్చి చూశారు.
పాత నేరస్థుడు అమిత కోపిష్టి ఆవేశపరుడు అయిన కన్నాలాల్ యే ఈ కామేశం.
ఈ మధ్య ఓ అమ్మాయిని రేప్ చేసి పారిపోయాడు కన్నాలాల్, అంతకు క్రితం వాడిమీద ఓ హత్యా నేరం కూడా ఉంది. పోలీసు ఫైల్లోకి ఎక్కిన వ్యక్తి.
ఆ ఫోటో ద్వారా
కన్నాలాల్ యే కామేశం అని రూఢీ అయింది. అంటే ఇప్పుడు కామేశం పేరుతో ఉన్నతడు ఒక రేపిష్ట్, హంతకుడు వగైరా వగైరా.


