Previous Page Next Page 
అర్ధచంద్ర పేజి 38


    "వీలు చూసుకుని తప్పకుండా వస్తాను మీరు బాగా విశ్రాంతి తీసుకోండి. మీరు రెస్ట్ తీసుకునేందుకు ఇష్టపడరని చెప్పారు రాజాచంద్రగారు. నా కయితే మీ దగ్గర ఉండి సపర్యలు చెయ్యాలని ఉంది. మిమ్మల్నెప్పుడూ చూడకపోయినా మీరంటే చాలా అభిమానం."
    
    "థాంక్స్" అంది విశారద.
    
    "ఉంటానండీ" అని ఫోన్ పెట్టేసింది విజ్ఞత.
    
    విశారద ఓ నిమిషంపాటు స్తబ్దుగా నిలబడి, తరువాత ఏదో ఆలోచన తోచి రాజాచంద్ర ఆఫీసు నంబరుకు డయల్ చేసింది.
    
    "హలో" అంది రాజాచంద్ర గొంతు.
    
    "నేనే ఊరికినే చేశాను ఏమీ తోచక. ఇందాకట్నుంచీ ట్రై చేస్తున్నాను. ఫోన్ ఎంగేజ్డ్ లో ఉంది."
    
    "బాంబే నుంచి ఎస్.టి.డి. వస్తే మాట్లాడుతున్నాను. ఈ మధ్య ఆఫీస్ లో లేను కదా."
    
    "ఇంకెవరూ ఫోన్ చెయ్యలేదా?"
    
    "లేదే."
    
    విశారద ముఖం నల్లబడిపోయింది.
    
                                             12
    
    విశారద చాలాసేపు స్తబ్దుగా కూర్చుండిపోయింది.
    
    ఉన్నట్లుండి ఏవో దుష్టశక్తులు పన్నాగం పన్ని ముందుకు దూకుతున్నట్లున్నాయి.
    
    ఈ తారాచంద్ర ఎవరు?
    
    విజ్ఞత ఎవరు?
    
    ఇద్దరూ విడివిడిగా ఎందుకు తమ జీవితాల్లో కలవరం లేపుతున్నారు?
    
    పిల్లల్ని గురించిన కొన్ని ఒడుదుడుకులు తప్ప తమ జీవితాల్లో ఏ సమస్యలూ లేవు. ఇప్పుడు ఏదో తుఫాన్ రాబోతుంది.
    
    విశారద సోఫామీద అలసటగా, నిస్సహాయంగా కూర్చుంది.
    
                                           * * *
    
    దేవీప్రియ గ్రేప్ గార్డెన్ లో ఉన్న కాటేజ్ లో అతని ఒళ్ళో తల పెట్టుకుని పడుకుని ఉంది. పమిట పక్కకి తొలగి ఉంది.
    
    వారానికో, పదిరోజులకో అతనితో గడిపే ఈ అమృత క్షణాలు ఆమె జీవితంలో పన్నీటి జల్లులు ఈ అమృతానందం అతన్నుంచి జుర్రుకుని ఇంటికి వెళ్ళగానే అక్కడి వాతావరణం, క్రమశిక్షణా పేరుతో విరాజిల్లుతున్న డిప్లమస్- ఆమెకు భరించటానికి దుస్సహంగా ఉంటుంది. ఇంత శృంగారం, రమ్యత్వం- అన్నీ విడిచి అర్ధంలేని ఆంక్షలూ, వెధవ డిసిప్లీన్ ఇవన్నీ ఏమిటి? ఆమెకు తండ్రిమీద అసహ్యం పుట్టుకొస్తుంది.
    
    అతను కిందకు ఒంగి ఆమె పెదిమలమీద ముద్దు పెట్టుకున్నాడు.
    
    "ఈ సుఖంలోంచి... ఆ నరకంలోకి వెళ్ళాలంటే నావల్ల కావటం లేదు" అంది దేవీప్రియ.
    
    "వెళ్ళొద్దు ఇక్కడే ఉండిపో" అన్నాడు నవ్వుతూ.
    
    "అమ్మో! మా నాన్న..."
    
    "ఏం చేస్తాడు?"
    
    "ఎప్పటికైనా ఈ విషయం తెలిస్తే చంపేస్తాడు."
    
    అతను చాలా తేలిగ్గా నవ్వాడు. "మీ నాన్నని నేను చంపేస్తాను."
    
    అతనలా మాట్లాడుతూంటే ఆమెకు కోపంగా లేదు. పైగా ఎంతో ముచ్చటగా అనిపించింది. అతని చేతిని గుండెమీదకు లాక్కుంది.
    
    "చూడూ! మన ఇద్దరి స్నేహం ఎల్లకాలం ఇలాగే సాగిపోవాలి."
    
    "తప్పకుండా."
    
    ఓ అరగంట తరువాత ఇద్దరూ లేచారు. గ్రేప్ గార్డెన్స్ దాటి కారు బయటకు వచ్చింది.
    
    కాసేపయ్యాక సిటీ లిమిట్స్ లోకి వచ్చి మెత్తగా, హాయిగా దూసుకుపోతోంది.
    
    దేవీప్రియ అతని భుజాని కానుకుని కూర్చుంది.
    
    ఉన్నట్టుండి ఓ కారు ఎదురుగా వచ్చింది. ఆ కారు డ్రైవ్ చేస్తున్న వ్యక్తి తన తండ్రిలా కనిపించాడు.
    
    "అమ్మో!" అంటూ కిందకు ఒరిగింది.
    
    "ఏమిటీ?" అన్నాడు.
    
    "మా నాన్న అనుకుంటాను."
    
    "నేను చూడలేదు. అయినా ఆ కారు దాటిపోయింది లే, మామూలుగా కూచో!"
    
    దేవీప్రియ మామూలుగా కూర్చుంది కాని గుండెలో అదురు ఇంకా తగ్గలేదు.
    
    ఆ కారు వాళ్ళదే డ్రైవ్ చేస్తోన్న వ్యక్తి అర్ధనారీశ్వరరావే. కాని అతని దృష్టి ఆమెమీద పడలేదు.
    
    ఒకవేళ పడినా ఆ రెప్పపాటు కాలంలో గుర్తుపట్టి ఉండడు.
    
    'నా పిల్లలా? ఇలాంటి పనులు చేసేది నా పిల్లలా?' అన్న అహం సత్యాన్ని అంత తొందరగా చూడనివ్వదు.
    
                                             * * *
    
    రాజాచంద్ర, విజ్ఞత కలిసి రెస్టారెంట్ లో కూర్చుని కూల్ డ్రింక్స్ త్రాగుతున్నారు.
    
    "నేను విశారదగారికి ఫోన్ చేశాను" అంది విజ్ఞత.
    
    రాజాచంద్ర మొహంలో చిన్న కలవరపాటు కనిపించింది.
    
    "అవునా?" అన్నాడు ఏమనాలో తోచక.
    
    "ఆమెగారి ఆపరేషన్ గురించి చెప్పాక మాట్లాడకుండా ఉండలేకపోయాను. అసలింటికి వెళ్ళి చూద్డామనుకున్నాను. కాని మీకు చెప్పే వెళదామనీ...." అన్నది విజ్ఞత.
    
    రాజాచంద్ర కొంచెమాగి- "నేనే తీసుకెడతాను వీలు చూసుకుని."
    
    ఆమె రాజాచంద్ర మొహంలోకి చూసి ఆ ప్రసక్తి మరి మానేసింది.
    
    "ఈవేళ మనం మీ ఫాదర్ని కలుసుకోబోతున్నాం" అన్నాడు రాజాచంద్ర కొంచెమాగి.

 Previous Page Next Page