Previous Page Next Page 
న్యాయానికి అటూ-ఇటూ పేజి 38

   

     ప్రదీప్ మనసులో తీవ్రమైన విరక్తి భావంలాంటిది కలిగింది.
   
    ఇదంతా యీ పోరాటమంతా ఎవరికోసం? తన స్వార్ధంకోసమా?
   
    ప్రక్కనున్న ఫోన్ మ్రోగింది. రిసీవర్ చేతిలోకి తీసుకున్నాడు. మాలతి.
   
    "ప్రదీప్ ఏం చేస్తున్నావు?"
   
    "నన్ను నేను మరిచిపోయే ప్రయత్నంలో వున్నాను."
   
    మాలతి నవ్వింది. "ప్రదీప్! నిన్ను నీవు మరిచిపోయి ఏంచేస్తావు?"
   
    "అలసట తెలియని విశ్రాంతి... నాకు కావాలి మాలతీ!"
   
    "ప్రదీప్! నువ్వు అమాయకుడివి. లాయరు ప్రొఫెషన్ లో వుంటూ కూడా కొన్ని జీవితసత్యాలని అర్ధంచేసుకోలేక పోతున్నావు. ఈ ప్రపంచం చాల కఠినమైనది ప్రదీప్! చాలా కఠినమైనది. నిజాయితీగా పోయేవాడికి అడుగడుక్కీ ఆటంకాలెదురవుతూ వుంటాయి."
   
    "అందుకని నేను ఓడిపోతానా? పరాజితుడ్నయిపోతానా?" గట్టిగా అరిచాడు.
   
    "ఓడిపోవు ప్రదీప్! అంతిమ విజయం నీదే."
   
    "నమ్మకంలేదు. నామీద నాకు విశ్వాసం సడలిపోయింది."
   
    "అదే కూడదు ప్రదీప్! ఒక న్యాయంకోసం, ధర్మంకోసం నువ్వు పోరాడుతున్నావు. అప్సెట్ అయిపోతే నీమీద నీకు విశ్వాసం చెదిరిపోతే యీ వ్యవస్థకే అన్యాయం చేసినవాడవు అవుతావు ప్రదీప్!"
   
    మాలతి ఫోన్ పెట్టేసింది.
   
    న్యాయం!
   
    ప్రదీప్ లో రక్తం మరుగుతుంది.
   
    నిజంలో వుందా?
   
    లాయర్ల వాదనలో వుందా?
   
    న్యాయం!
   
    నిజంకన్నా వాదన బలీయమైనది. వాదన ముందు నిజం తలవంచుతుంది.
   
    న్యాయం!
   
    వక్రమైన తెలివితేటలముందు, పటాటోపంముందు హృదయవిదారకంగా నిజం గొంతు మూగపోతుంది.
   
    అణిగి, మణిగి, పిరికిగా, అసమర్ధంగా, వొదిగి వొదిగి దాక్కునే నిజాన్ని వెలికితీయగల సత్తా లేకపోతే న్యాయం కనబడదు న్యాయం వినబడదు. న్యాయం కదలదు.
   
                                  * * *
   

    అమెరికాలోని 'ది లైట్' అనే వారపత్రిక జూలీ పంపిన సినాప్సిస్ చదివి ఆమె నవల సీరియల్ గా ప్రచురించటానికి అంగీకరించి స్క్రిప్ట్ తొందరగా పంపమని కోరుతూ వ్రాసింది. ఆ పత్రిక జూలీ నవలలు కొన్ని ఇదివరకు ప్రచురించి వుంది. ఆమె రచనాశక్తిమీద అపారమైన నమ్మకముంది.
   
    జూలీ తన రచనా కార్యక్రమాన్ని వేగంగా పూర్తి చేయవచ్చింది. దురదృష్ట వంతురాలూ ఆమె అంధురాలు. తన భావాలను అక్షరరూపంలో తర్జుమా చెయ్యటానికి తప్పనిసరిగా ఇంకొకరి మీద ఆధారపడాలి.
   
    భర్త డాక్టర్ అశోక్ ఎందుకో ఈమధ్య మూడ్స్ లో వుండటంలేదు. అతను మునుపటికన్నా ఎక్కువగా డ్రింక్ చేస్తున్నట్లు తెలుస్తూనే వుంది. తాను హఠాత్తుగా చూపు పోగొట్టుకున్న యువతి పడే హృదయావేదన, ఆమె ఎదుర్కొన్న గుండెల్ని కరిగించే సమస్యలు డిక్టేట్ చేస్తున్నప్పుడు టైపుకొడుతున్న అతని వ్రేళ్ళు వున్నట్లుండి ఆగిపోయేవి.
   
    "అశోక్! అశోక్!" అని ఒకటికి రెండుసార్లు పిలిచాక గానీ, మళ్ళీ టైపు చప్పుడు వినిపించేదికాదు.
   
    ఇదివరకు హాస్పిటలంటే అతనికి ప్రాణం. వెళ్ళటానికి ఒక్క నిముషం లేటయినా విలవిల్లాడిపోయేవాడు. ఇప్పుడసలు హాస్పిటల్ కి వెళుతున్నట్లే అనిపించటంలేదు. ఎప్పుడొస్తాడో, ఎప్పుడు వెళతాడో కూడా తెలియటంలేదు. అడిగితే ఏదో సమాధానం చెబుతాడు. ఆ సమాధానం సంతృప్తికరంగా వుండదు.
   
    ఎప్పుడూ ఎవరికో ఫోన్లుచేస్తూ వుంటాడు. యిదివరకైతే అతను ఎవరితో మాట్లాడుతున్నా బయటవాళ్ళకు వినిపిస్తూ వుండేది. ఇప్పుడు ప్రక్కకు వెళ్ళి నిల్చున్నా వినబడనంత నెమ్మదిగా మాట్లాడుతున్నాడు.
   
    ఏదో జరుగుతుంది అతన్లో ఏదో అలజడికి గురవుతున్నాడు.

    "అశోక్ డియర్!" అంది ఓ సాయంత్రం, అతని ప్రక్కకువచ్చి నిల్చుని.
   
    "ఏమిటి జూలీ?"
   
    "కారులో అలా బయటకు వెళ్ళివద్దాం, మనసేం బాగాలేదు."
   
    అశోక్ "అలాగే"నని ఓ పావుగంటలో రెడీ అయిపోయాడు. ఇద్దరూ కారులో బయలుదేరారు.
   
    "అశోక్."
   
    "ఊ"
   
    "నువ్వేమీ అనుకోకపోతే ఓ ప్రశ్న అడగనా?"
   
    "ఏమిటి జూలీ"
   
    "అశోక్! నాకు కళ్ళు కనిపించకపోయినా నిన్ను స్పష్టంగా చూడగలను. నువ్వు నిజంగా... నిజంగా దేన్నిగురించో బాధపడుతున్నావు"
   
    "లేదు నన్ను నమ్ము జూలీ! అలాంటిదేమీ లేదు."
   
    "అశోక్! నిన్ను గాయపరిచే సంఘటనేమయినా జరిగిందా?"
   
    "లేదు... లేదు..."
   
    "అశోక్" అంది అతనికి దగ్గరగా జరుగుతూ, చేతిని అతని భుజంమీద ఆనిస్తూ.
   
    "సర్వం... అంధకారబంధురమైపోయినా... జీవితంలో నాకే కాంతి కిరణమూ లేకపోయినా నీ వెలుగునే గుండెల్లో నింపుకుని, ఆ వెలుగు యిచ్చిన శక్తితోనే ముందుకు అడుగు వెయ్యగలుగుతున్నాను అశోక్. నీకేమైనా కష్టం కలిగితే నేను భరించలేను."
   
    అశోక్ ఎడమచేత్తో భుజంమీది ఆమెచేతిని తనచేతిలోకి తీసుకున్నాడు.
   
    "జూలీ! నాకే కష్టమూ రాలేదు. నన్నుగురించి లేనిపోనివన్నీ ఊహించుకుని నీ మనసు పాడుచేసుకోకు" అని మాటమారుద్దామని "అవునూ! నీ కథలో జోరాపాత్రను ఏం చేయబోతున్నావు?" అనడిగాడు.
   
    జూలీ ముఖంలో మార్పు వచ్చింది. ఆమె కళ్ళేగనుక భావప్రకటనా సామర్ధ్యం కలిగివుంటే యీ ప్రపంచాన్ని శపించేటంతటి రక్తారుణిమతో ప్రకాశించి వుండేవి.
   
    "ఆమె చూపుపోయినందుకు కారకులైన వారిమీద ప్రతీకారం తీర్చుకునేటట్లు చేస్తాను" అంది.
   
    అతని వొళ్ళు జలదరించినట్లయింది. "ఎలాగ?" అన్నాడు తడారిపోతున్న గొంతుకతో.
   
    "అదే! దానికే వ్యూహం తయారుచేస్తున్నాను" అని జూలీ ఏదో ఆలోచన వచ్చినట్లుగా "అశోక్! ఆ సాయంత్రం మనం ఓ చూపులేని పాపను కలుసుకున్నాం గుర్తుందా? ఆ ప్రాంతం నీకు తెలిసేవుంటుంది. ఇల్లు ఆ చుట్టుప్రక్కలే అని చెప్పింది నన్ను అటువైపు తీసుకెళ్ళవూ?"
   
    "దేనికి?"
   
    "నాకా పాపను చూడాలనివుంది."
   
    అశోక్ ఏమీ మాట్లాడకుండా కారుని దారి మళ్ళించాడు. ఓ పావుగంట గడిచింది.
   
    చల్లనిగాలి వీస్తుంది.
   
    "జూలీ! మనం పాపని కలుసుకున్న చోటుకు వచ్చాం" అన్నాడు కారు మెల్లగా పోనిస్తూ.

 Previous Page Next Page