అంత ధైర్యవంతురాలూ జావగారిపోయింది. భయంగా, దూరంగా జరిగింది.
ఇక్కడ జరిగింది అంతమాత్రమే.
కానీ అది గమనించాడో వ్యక్తి సమీపంలో కిటికీ దగ్గర నిలబడి.
అతను సుధాకర్.... సావేరి అన్నయ్య రవికి ఫ్రెండు మాత్రమే కాదు....
రాజేందర్ చేత నియమింపబడిన స్పై కూడా....
అంతే....
క్షణాల్లో ఆ విషయం రాజేందర్ కి తెలియచేయబడింది ఫోన్ ద్వారా.
* * * * *
"ఏమిటి అదోలా వున్నావు?" పక్కనే కూర్చుని ఏదో ఆలోచిస్తున్న రాజేందర్ ని అడిగింది రజని.
పద్దెనిమిదేళ్ళ రజనీ పూర్వాశ్రమంలో ఓ ఏడాదిపాటు క్లబ్ లో డేన్సరుగా వుంటూ ఈమధ్యనే రాజమండ్రి నుంచి రాజేందర్ తో....లేచి వచ్చేసింది....అనకాపల్లిలో అతడితో కాపురం వుంటూంది.
యువసేనకి నాయకుడైన రాజేందర్ కి శృంగారంలో ఎంతగా సహకరిస్తుండీ అంటే ఆడదంటే యిలా వుండాలీ అని కలిసిన ప్రతిసారీ కొత్తవూపుతో అతడ్ని కర్కశంగా ఆకట్టుకుంటూ వుంటుంది.
రాజేందర్ తనను కట్టుకుంటాడన్న నమ్మకం లేదు....కానీ అతడితోనే నమ్మకంగా వుండటం అలవాటు చేసుకుంది. రేపో మాపో ఓ లక్షాధికారికి అల్లుడైతే 'కీప్' గానైనా తన పొజిషన్ సుఖంగా సాగిపోతుందన్న నమ్మకం గలది.
"నిన్నే" ఈసారి రాజేందర్ ని తనపైకి లాక్కుంటూ అతడు చూస్తుండగానే బ్లౌజ్ హుక్స్ లాగేసింది.
అతడిలో ఇంకా చలనం లేదు.
అర నిమిషంలో పూర్తిగా నగ్నంగా మారిపోయింది.
విద్యుద్దీపపు కాంతిలో నగ్నంగా జరిగే తన శరీరాన్ని చూస్తూ రాజేందర్ ఎంత రక్షసుడయ్యేదీ ఆమెకి తెలీనిది కాదు.
"ఏమైంది నీకు?" యిప్పుడు అతడి బట్టల్నూడబెరకటంలో నిమగ్నురాలైంది.
క్షణంపాటు వాస్తవంలోకి వచ్చిన రాజేందర్ అయిదునిమిషాల పాటు ఆమెను ఊపిరాదకుండా చేశాడు.
బాధతో మెలి తిరిగిపోయింది.
అదికూడా కాదు రెజిలింగ్ బెట్ లో ఎముకలు విరిగినట్టు నీరసంగా వుండిపోయింది.
"ఏమైంది నీకు?" నిస్త్రాణగా అడిగింది. "ఈ రోజు నీలో కనిపించింది కాంక్షకాదు రాజా....కసి ....ఒళ్ళంతా నుగ్గుచేశావు...."
"అవును....పగ...ప్రతీకారం...."
"ఎవరిమీదా....?"
"సావేరి...."
ఆమెవరో రజనీకి తెలుసు. "ప్రతాపం చూస్తుంటే అనిపించింది"
"ఏమని?"
"నువ్వు నాకు బదులు మరెవర్నో వూహించుకుని కలియబడ్డావని" సన్నగా ఆమె గొంతులో అసూయ ధ్వనించింది. "రేపు నువ్వు సావేరికి మొగుడివైతే మొదటి రాత్రి మనిషి చచ్చి వూరుకుంటుంది."
"అవకాశం సన్నగిల్లి పోతూంది రజనీ....సావేరి చేజారిపోతుంది."
"అదేం?"
శంకూ గురించి చెప్పాడు.
ఎగతాళిగా నవ్వింది. "మొదటిసారనుకుంటాను!"
"ఏమిటి?"
"మరో ప్రత్యర్ధిగురించి అదీ కాలేజీలో ఇంటర్ చదువుకునే ఓ పసివాడిని గురించి ఆలోచించడం...."
"మన బంగారం మంచిదైతే నా కదలిక మరోలా వుండేది" క్షణం ఆలోచించాడు. "సావేరీ వాడ్ని అసహ్యించుకోవాలి....ఆ తర్వాత వాడి శాల్తీని గల్లంతు చేసినా గొడవుండదు. ఓ పనిచేస్తావా?" సాలోచనగా అన్నాడు.
* * * * *
ఉదయం తొమ్మిది గంటలవేళ.....
కాలేజీ ఆవరణ విధ్యార్ధులతో సందడిగా వుంది.
నెమ్మదిగా కుంటుకుంటూ నడుస్తున్న శంకూని చూస్తూ ఆవేశంతో ముందుకు దుమికాడు వెంకట్....ఈమధ్య కాలంలో చాలా కవితలు అశువుగా వాంతి చేయాలని వువ్విళ్ళూరాడు. కానీ అవసరానికి అంతా అదృశ్యమైపోతుంటే ఇప్పుడిలా శంకూ ఎదురయ్యాడు.
కుంటుతున్న శంకూ పాదాలకున్న బేండేజీనిబట్టి అతడంత సునాయాసంగా పారిపోలేడన్న నిర్ధారణకురాగానే అమాంతం చేరి "శంకూ...." అంటూ బలంగా చేతులు పట్టుకున్నాడు.
"నీ అడుగుల తడబడులు....ఓ పడతి ప్రేమజడులు.
నిజానికి నీవి పాదాలు కావు....పాదాలు కావు....పాదాలు కావు.
కానీ మరేమిటి?.....చెప్పనా నేస్తం....అవి కన్నె కవితల తొలిపదాలు.
నీది నడక కాదు....నడక కాదు....నడక కాదు....."
దీనంగా మొహం పెట్టాడు శంకూ తనను క్షమించి వదిలిపెట్టమని.
"చూశాను చూశాను నీ నడక...."
"ఇప్పుడు చూస్తున్నాను నీ కళ్ళలో...." అంత్యప్రాస అర్జెంటుగా రాక క్షణం సాలోచనగా నేత్రాలు అరమోడ్పులు చేసుకొనేసరికి ఇంచుమించు పరుగులాంటి నడకతో కారిడార్ ని సమీపించాడు శంకూ.
ఓ స్తంభం వారనుంచి చూస్తూంది సావేరి శంకూనే.
రహస్యంగా పలకరించాలనుకుంది. కానీ ఇంతలో ఆమె స్నేహితురాళ్ళు ఆమెను చుట్టుముట్టారు.
ఓ మూల నిలబడిన శంకూ వెంకట్ వస్తున్నాడేమో అనిరొప్పుతూ దిక్కులు పరికిస్తుంటే ఆవరణలో రావిచెట్టు కింద నిలబడ్డ రవి బృందం శంకూనే గమనిస్తున్నారు.
అప్పుడు కాలేజీ ద్వారాన్ని దాటి లోపలి వచ్చింది రజని.
రవితో రాత్రి మంతనాలు జరిపిన రాజేందర్ పథకం గురించి వివరించాడు తప్ప రజని తన మనిషిగా చెప్పలేదు.
రజని ఆగలేదు.
సరాసరి అమ్మాయిలున్న చోటుకే వెళ్ళింది.
సావేరి ఫోటో చూసివుండటంతో ఆమెను గుర్తించడం కష్టంకాలేదు అయినా సావేరీ మాట్లాడలేదు.
లావుగా వున్న లావణ్యనే గమనిస్తూ "ఇంటర్ మీడియట్ చదువు తాడే..." ఏదో బాధని అణగదొక్కుకుంటున్నట్టు తల వంచుకుంది. చీర చెరగుతో కళ్ళొత్తుకుంటూ ఫినిషింగ్ టచ్ కూడా యిచ్చింది.
లావణ్య చొరవ తీసుకుంది. "ఏమయింది?....మీరెవరు?....ఎవరు కావాలి?"
"ఎవరూ అంటే ఏం చెప్పను?"
ఈసారి సరాసరి వెక్కిపడుతూ అంది "నిన్ను ప్రేమిస్తున్నాను రజనీ! అన్నాడు కాబట్టి నా ప్రియుడననా?__పెళ్ళి చేసుకుంటానని మాట ఇచ్చి యిప్పుడు నెలతప్పాక మాటతప్పి దూరం జరిగినందుకు మోసగాడు అననా?"
క్షణంలో అక్కడి వాతావరణం టెన్షన్ తో నిండిపోయింది.
అమ్మాయిలు ఒకరి మొహాలొకరు చూసుకుంటుండగా రవి బృందముతో బాటు చాలామంది విద్యార్దులక్కడికి చేరుకున్నారు.
"అలా చేసిందెవరూ?" సానుభూతిగా లావణ్యే అడిగింది. ప్రేమించిన ఇంటర్ అప్పారావుమీద లావణ్య మనసుపడినా యిలాంటి సమస్య ఎదురయితే తన గతేమిటి అన్నట్టు తనూ ఆందోళన పడిపోతూంది. "ఏడవక చెప్పండి!"
"శంకూ!...."
అక్కడ బాంబుపడ్డట్టు అందరూ స్థబ్దులైపోయారు.