Previous Page Next Page 
ప్రేమికారాణి పేజి 37

    కాని, చెప్పకపోతే ఎలా?

    తన మనసులో ఈ అగ్నిని ఎన్నాళ్ళు మోస్తుంది? తనకి సహాయం చేయగల ఓకే ఒక ఆశాకిరణం ఈ విశాల్. అతడు తనని అసహ్యించుకొంటాడేమోనని చెప్పకపోతే ఇంకెవరికీ చెప్పలేదు. కుమిలి కుమిలి తను అంతమవ్వాల్సిందే. అలా వీల్లేదు జీవితం ముగిసేలోగా ఒక్కసారైనా తన మొదటిబిడ్డతో 'అమ్మా! అని పిలిపించుకోవాలి. 'అమ్మా! నిన్ను క్షమించాను' అనిపించుకోవాలి.

    విశాల్ కి తనమీద ఆ గౌరవం ఉండబట్టే అతనికి తనకధ చెప్పి, అతడి సహాయం అడగబోతూంది గీతాభవానిలో కలిగిన ఈ ఆలోచనతో ఏదో క్రొత్తబలం వచ్చినట్టుగా ఉందామెకు.

    మరునాడు సాయంకాలం టీ త్రాగుతూనే తోటకు ప్రయాణమయ్యారు. ఎలా వెళ్ళాలన్న సమస్య బయల్దేరింది. "మైలు మైలున్నర దూరం నేను నడవలేను బాబూ." అంది గీతాభవాని.

    "నిన్ను నడిపిస్తానని ఎందుకనుకొన్నావు? నా స్కూటర్ వెనుక కూర్చో. నిన్ను నెమ్మదిగా తీసుకువెడతాను" అన్నాడు విశాల్.

    "బాగుంది. నేనెప్పుడైనా స్కూటర్ ఎక్కానా?" గాబరా పడింది.

    "అదో విద్యా? నేర్చుకోవాలా? ఫర్వాలేదు. కూర్చో, గీతత్తా. నేను జాగ్రత్తగా తీసుకువెడతాను. బండి తయారు చేసేవాడిని కాని, బండి కుదుపులకి నీకు ఆయాసంవస్తుంది.బండిలో కూర్చుంటే చక్కగా పొలాలు చూస్తూ వెళ్ళడం కుదరదు"

    "నే నెప్పుడూ స్కూటర్ ఎక్కలేదు. అదీగాక ఇది పల్లెటూరు!"

    "ఈ పల్లె జనానికి ఏ వినోదమూ లేక బోర్ కొట్టి చస్తుంటారు. కాస్త వాళ్ళని ఆనందించనీరాదూ?"

    "నీకంతా తమాషా! నెమ్మదిగా నడిచిపోదాం పద!"

    "అప్పుడే నీకంత శక్తి ఎలా వచ్చింది? నిన్న మొన్నటి దాకా మంచంమీద ఉన్నదానివి!"

    "ఈ పల్లెలో గాలి ప్రభావమేమో!"

    "నడవడం ఒంటికి మంచిదే. నువ్వు అలసిపోతావని నా భయం!"

    ఇద్దరూ నడవడం మొదలుపెట్టారు. తోటకి చేరేసరికి తోటకూర కాడలా వ్రేలాడిపోయింది గీతాభవాని. తోటలో అడుగు పెట్టాక అంత ఆయాసాన్నీ మరిచిపోయింది.

    పచ్చటి చెట్లు!

    చల్లటి నీడలు!

    మోటారు నుండి దుంకుతూన్న నీళ్ళు ఒక చిన్న జలపాతంలా గలగలా శబ్దం చేస్తూ చేల్లోకి పరుగులు తీస్తూంది. పక్షులు చేస్తున్న వింత వింత ధ్వనులు.

    ప్రకృతి మనుష్యుల్ని వింతగా పరవశింపజేస్తుంది.

    తోట మధ్య చిన్న పెంకుటిల్లు ఉంది. అందులో అంతా వ్యవసాయపు పనిముట్లు పడేసి ఉన్నాయి.

    "తోట మధ్య చిన్నగా, అందంగా ఇల్లు కట్టివ్వు, విశాల్. వేసవిలో ఇక్కడే కాపురముండొచ్చు చక్కగా." అంది గీతాభవాని.

    "నాకు భార్య వచ్చేసరికి కట్టించి ఉంచుతాను." కొంటెగా నవ్వాడు.

    జ్యోతి గురించి అడగడానికి పెళ్ళెప్పుడు చేసుకోదలిచావని అడగడానికి ఇది మంచి సందర్భం కాని, గీతాభవాని మనస్సంతా ప్రేమిక గురించే ఆలోచిస్తూంది.

    "నీకు చూపాల్సినవి చాలా ఉన్నాయి కాని, ఊరికే తిప్పితే అలసిపోతావు. కాస్సేపు బావి దగ్గర చెట్లక్రింద చల్లగా కూర్చుందాం, రా."

    వెళ్ళి కాలవ ప్రక్కన చతికిలబడింది గీతాభవాని. కాలవలో నీళ్ళు జడలు కట్టుకొని గలగల శబ్దం చేస్తూ ముందుకు వెళ్ళిపోతున్నాయి.

    దోరమాగిన జామపళ్ళు  నాలుగైదు చేతబట్టుకొని వచ్చాడు విశాల్. "నీ కూతుళ్ళు వస్తే ఈ తోటంతా ఆగం ఆగం చేస్తారు. కోతుల్లా చెట్లెక్కి కాయలు కోస్తారు. డిసెంబరు సెలవుల్లో వచ్చారు కదూ? ఈతరాదు బావా.' అంటూ నా ప్రాణం తీశారు."

    గీతాభవాని చేతిలో జామపండు త్రిప్పుతూ కాలవ నీటిని చూస్తూంది. "ఏమిటాలోచిస్తున్నావ్, గీతత్తా?" విశాల్ ఆమెకు సమీపంగా కూర్చొన్నాడు.

    "సారథ చెప్పని కథ ఒకటి నీకు చెబుతాను ఈరోజు. వింటావా?"

    "సారథ చెప్పని కథా?"

    "ఊ. ఆయన పార్వతీదేవదాసులకథ ఒక విధంగా చెప్పాడు. నేను మరోవిధంగా చెబుతాను!" మనస్సంతా తను చెప్పబోయే విషయంమీద కేంద్రీకరించినట్టుగా ఉన్న ఆమె ముఖంలోకి పరిశీలనగా చూస్తూ,

    "చెప్పత్తా!" అన్నాడు విశాల్. అత్తా అనారోగ్యానికి కారణం తెలుస్తుందన్నట్టుగా ఉంది.

    "నేనిది ఊరికే చెబుతున్నానని అనుకోవద్దు. నాకు నీ సహాయం కావాలి."

    "ముందు చెప్పు."

    "ఆ కథ విన్నాక నీకు సహాయం చేయాలనిపించకపోవచ్చు! అసలు నా గాలి కూడా సహించలేనంత దూరంగా పారిపోవచ్చు నువ్వు. అందుకే, నాకు ఇప్పుడే వాగ్దానం చెయ్యి నాకు సహాయం చేస్తానని."

    "నీ గాలికూడా సహించలేనంత దూరం పారిపోతానా? అంత పాపం ఏం చేశావ్ గీతత్తా!" చకితుడైనట్టుగా అడిగాడు.

    "భారతంలో కుంతికథ విన్నావుకదూ? పెళ్ళికాకముందు అతిధిగా వచ్చిన దుర్వాసుడికి సేవ చేస్తుంది కుంతి. ఆమె సేవలకు సంతుష్టుడైన ముని కుంతికి సూర్యమంత్రం ఉపదేశించిపోతాడు. కుంతిలో మంత్రమహిమ పరీక్షించాలన్న కుతూహలం రేగుతుంది. మంత్రం పఠిస్తుంది. ప్రకాశమానంగా సూర్యభగవానుడు ప్రత్యక్షమై ఆమెనుచేరి కొడుకును ప్రసాదించి పోతాడు. కుంతికి భయం వేస్తుంది. తను అవివాహిత! కాని, బిడ్డతల్లి అయింది. ఎవరైన ఈ బిడ్డతో తనని చూస్తే ఎలా? కుంతి కంగారుగా, భయంగా ఆ కొడుకుని పెట్టెలోపెట్టి నదీప్రవాహంలో వదులుతుంది. కర్ణుడే ఆ బిడ్డ అని గుర్తించడం తరువాత కథ అనుకో!

 Previous Page Next Page