Previous Page Next Page 
బొమ్మా - బొరుసూ పేజి 37


    "మర్చిపోలేదు బావా! దాన్ని గురించి అనుక్షణం నన్ను నేను నిందించుకుంటూనే ఉన్నాను. అంతటి తెలివితక్కువపని, ఎందుకుచేశానా అనీ, అంత అవనీతికరంగా ఎందుకు ప్రవర్తించానా అనీ నేను బాధపడని రోజులేదు......"
    "పశ్చాత్తాపపడినంత మాత్రాన ఆ కళంకం మాసిపోతుందా నాగూ? అదిమాసిపోవాలంటే, దాన్ని 'కళంకం' అని పిలువకుండా ఉండాలంటే మనం వివాహం చేసుకోవడం తప్ప వేరే మార్గంలేదు....."
    నాగమణి నవ్వింది. "అదీ ఆలోచించాను బావా! నా జీవితమంతా ఒంటరిదానిగానే ఉండిపోతాను! అప్పుడింక ఆ కళంకం నన్నేం చేస్తుందీ? దానివల్ల జరిగే నష్టం అదేగా! అంతకంటే ఎక్కువ అదేం చేయగలుగుతుందీ?"
    "అదంతా ఎందుకొచ్చిన ఆలోచన నాగూ?మనిద్దరం వివాహం చేసుకోవడానికి అవకాశం ఉన్నప్పుడు ఎందుకలా జరగాలి? నేను నిన్ను ఇంతగా కోరుకుంటున్నప్పుడు నువ్వెందుకు అలాంటి జీవితం గడపాలి?"
    "ఇంక నన్నేమీ అడగవద్దు బావా! మంచో చెడో నేనా నిర్ణయం తీసుకున్నాను. నాకు నిన్ను వివాహం చేసుకోవాలనిపించడం లేదు. నా మనసుకి వ్యతిరేకంగా వివాహంచేసుకున్నా ఆ జీవితం మనిద్దరికీ సుఖాన్నివ్వదు. దయచేసి నన్నిలావదిలెయ్!" ఖచ్చితంగా చెప్పేసిందామె.
    శ్రీనివాసరావ్ పూర్తిగా కృంగిపోయాడు.
    చాలాసేపు ఇద్దరూ మౌనంగా కూర్చుండిపోయారు. నాగమణి తనదారిన తను టైప్ చేసుకోసాగింది.
    ఇంకతను వెళ్ళడంమంచిదన్న అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేస్తున్నట్లనిపించసాగిందతనికి.
    అంతలో ఏవో ఫైల్సు తీసుకుని చంద్రం వచ్చాడు వారి దగ్గరకు "ఇవిగోండి ఈ రెండు ఫైల్సు మీవి!" అంటూ చేతిలోని రెండు ఫైళ్ళు ఆమె టేబుల్ మీదుంచేడు.
    శ్రీనివాసరావ్ వేపు చూసి వెంటనే గుర్తుపట్టాడతను.
    "హలో! శ్రీనివాసరావ్ గారా! నమస్కారం!" అన్నాడు చిరునవ్వుతో.
    "నమస్తే!" సీరియస్ గా అన్నాడు శ్రీనివాసరావ్.
    "నాగమణి గారిని చూడ్డానికొచ్చారా?ఆవిడ హాయిగానే ఉన్నారులెండి!" అన్నాడతను. శ్రీనివాసరావ్ మాట్లాడలేదు.
    "ఓకే! నేను వెళ్తానండీ!" అనేసి నాగమణి వేపు తిరిగి.
    "నాగమణిగారూ! త్వరగా కట్టేయండి దుకాణం! ఇవాళయినా పెందలాడే గూళ్ళకు చేరుకుందాం!" అంటూ వెళ్ళిపోయాడతను.
    శ్రీనివాసరావ్ కి ఆ మాటలు వింటూనే భగ్గుమంది. రోజూ నాగమణికి ఆఫీసునుంచి ఇంటివరకూ కంపెనీ ఇచ్చే ఫ్రెండు ఇతనేనన్నమాట! ఇద్దరికీ ఇంతటిస్నేహం ఎలా కలిసిపోయిందో! ఒకేచోట పనిచేసినంతమాత్రాన ఇంత చనువుఏర్పడుతుందా? ఒకవేళ నాగమణి అతనివలలో పడిందా? అందుకే తనను చేసుకోడానికి నిరాకరిస్తోందా? అనుమానంరగులుకొందతన్లో!
    అవును అదే నిజమయి వుంటుంది లేకపోతే అతని విషయం నాగమణి తన దగ్గర ఎందుకుదాచినట్లు? మరో అమ్మాయితో కలిసి ఇంటికివెళుతున్నానంటూ ఎందుకు అబద్దం చెప్పినట్లు? తప్పకుండా వీరిద్దరి మధ్య సంబంధం ఏర్పడే ఉంటుంది. అది చూసుకునే ఆమెకు తనంటే నిర్లక్ష్యం ఏర్పడింది. తన ప్రేమతో అందిస్తున్న చేతిని తోసి వేస్తోంది! తనను వివాహం చేసుకోడానికి నిరాకరిస్తోంది.
    వారిద్దరిమీద ఈర్ష్య రగులుకొందతనికి. తనకు నాగమణిని కాకుండా చేస్తున్న చంద్రం మీద ద్వేషం కలుగసాగింది. వారిద్దరూ వివాహం చేసుకునేత్లయిథెఆ వివాహం ఎలా చెడగొట్టాలో తనకు తెలుసు. వివాహం చెడగొట్టి నాగమణిని తనదానిని చేసుకోవడం కూడా అసాధ్యమేమీ కాదు.
    టైప్ చేయడం ముగించింది నాగమణి.
    కాగితాలన్నీ సర్ధసాగిందామె.
    ఇంకతను బయల్దేరడం మంచిదనిపించింది శ్రీనివాసరావుకి!
    "సరే నాగమణి! నేను వెళతాను! కానీ మరోసారి ఆలోచించుకో! నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకునివచ్చాను. నన్ను నిరాశపరచడం నీకు న్యాయంకాదు!" లేచి నిలబడుతూఅన్నాడతను.
    "సారీ బావా! అయామ్ హెల్ప్ లెస్!"
    "సరేవస్తాను!" బయటకునడిచాడతను.
    బస్ స్టాప్ కి కొద్దిదూరంలో నిలబడి ఆఫీసు వేపు చూడసాగాడు.  తన అనుమానం నిజం కాదా అని ఇప్పుడే ఋజువు చేసుకోవాలి. అతడూహించినట్లే ఆఫీసు ముగిశాక నాగమణి ఆమెతోపాటు చంద్రం ఆఫీసునుంచి బయటికొచ్చి నవ్వుతూ మాట్లాడుకుంటూ బస్ కోసం ఎదురు చూడసాగారు.
    శ్రీనివాసరావ్ ముఖం పాలిపోయింది. నాగమణి తనను ఘోరంగా అవమానించినట్లు అనిపించసాగింది. మనసంతా ఆమె మీద ప్రతీకార వాంఛతో రగిలిపోయింది.
    హేమకూ, శ్రీనివాసరావుకీ సమావేశం ఏర్పాటు చేశారు న్యాయవాది.
    "మనదేశ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించడానికే ఈ మీ సమావేశం ఏర్పాటు చేశాను. మరొక్కసారి మీరు జరిగిన సంఘటనలను పీడకలగా మర్చిపోయి రాజీకి రాగలరేమో ప్రయత్నించండి. వివాహాన్ని రద్దుచేయడం తేలికే! కాని నిలబెట్టడంకష్టం అందుకే మీరిద్దరూకొద్ది సేపు మాట్లాడుకుని ఒక అవగాహన ఏర్పరచుకోగలరేమోనన్న ఆశతో మిమ్మల్ని ఇక్కడకు రప్పించాను......" ఇద్దరికీ చెప్పి బయటకువెళ్ళిపోయారాయన.
    హేమ తలెత్తి శ్రీనివాసరావ్ వంక చూసింది. అతను ఆమెని గమనించనట్లే సిగరెట్ వెలిగించుకుని కిటికీలో నుంచి బయటకు చూడసాగాడు. ఆమె మనసుకి తెలుస్తూనే వుంది. ఇది వృధా ప్రయత్నం. అతనికి చేసిన తప్పులకు పశ్చాత్తాపం అనేది కలగదు. అసలు అతను చేస్తుందే సబబన్న అభిప్రాయం అతనికుంది. ఇక తన విషయమూ అంతే! ఒకవేళ అతనికిప్పుడు పశ్చాత్తాపం కలిగినా అతనిని అంగీకరించలేని పరిస్థితి తనది. అసలు తన మనసు పూర్తిగా విరిగిపోయింది. ఒంటరిగా జీవితం గడిపితేతనకు లభించే ప్రశాంతత శ్రీనివాసరావ్ పక్కన తనకు లభించదు.
    "ఆయనచెప్పింది విన్నానా?" వెటకారంగా అడిగాడతను.
    "విన్నాను!"
    "ఏమంటావ్ మరి?"
    "నేనేమీ అనడం లేదు."
    "ఇదిగో! నీ సంసారం నిలబెట్టుకోవాలంటే నేను చెప్పినట్లు చేయాలి. లేకపోతే అనుభవించు".
    "ఏం చేయాలి?"
    "నేనుకట్నం తీసుకోలేదు కాబట్టి ఇప్పుడు పదివేలు నాకివ్వాలి అంతేకాదు. ఇకముందునోరెత్తకుండా పడివుండాలింట్లో. కథలూ కాకర కాయలూ పేరెత్తకూడదు. అడ్డమయినవాడూ నీకోసం రాకూడదు. నువ్వు ఎవడితోనూ మాట్లాడకూడదు. నా అనుమతిలేనిదే ఇంట్లోనుంచి బయటకు కదలడానికి వీల్లేదు. మీ అమ్మా నాన్నలకు ఉత్తరాలు రాయకూడదు. వాళ్ళు నీ సంగతి పట్టించుకోకూడదు. మనింటికి రాకూడదు. ఇంటి చాకిరీ అంతా నువ్వేచేయాలి పనిమనిషీ, చాకలీ ఎవ్వరూ ఉండరు. నీ ఇష్టమంటూ ఏమీ ఉండదు. అంతా నాయిష్టప్రకారం జరగాల్సిందే! వీటన్నిటికీ ఇష్టమయితే అప్పుడు నేను ఆలోచిస్తాను."
    "ఇంతేనా, ఇంకేమయినా ఉన్నాయా?" కోపం అణుచుకుంటూ అడిగిందామె.
    "ఏం ఎందుకు?" ఆమె గొంతులోని హేళన గమనించాడతను.
    "నీలో మూర్ఖత్వం ఇంకెంత ఉందో చూద్దామని....." శ్రీనివాసరావ్ కి ఉద్రేకం పొంగుకొచ్చింది.
    "అతిగావాగకు. నే నడిగినదానికిసమాధానం చెప్పు" కోపం బలవంతంగా అణచుకున్నాడతను.
    కానీ ఆమె అదృష్టం పెద్దలమధ్య ఉన్నదన్న ధీమాతోనే అలామాట్లాడగలుగుతోంది.
    "మరో మనిషితో ఎలా మాట్లాడాలో ఇప్పటికయినా తెలుసుకున్నావేమో చూద్దామని ఈ సమావేశానికి అంగీకరించాను. ఈ జన్మంతా తపస్సు చేసినా నీకు ఆడదాన్ని తోటిమనిషిగా చూడడంచేతకాదని తెలిసింది. నాకు నీతో సంసారానికి అంగీకరించడంకంటే ఎక్కడయినా కూలి పని చేసుకున్నా నాకు ఎక్కువ సంతృప్తీ, గౌరవం, మనసుకి ప్రశాంతత లభిస్తాయ్....." అందామె లేచి బయటకు నడువబోతూ.
    "ఒక్కమాట విను! మొగుడుని వదిలేసిన ఆడదాని గతేమవుతుందో నీకు తెలీదు. అందరూ ఎంత హీనంగా చూస్తారో నీ కనుభవమయినప్పుడు గాని అర్ధం కాదు. నిన్ను అందరూ అసహ్యించుకునేవారే! అందరూ వెలివేస్తారు. ఆఖరికి మీ అమ్మా, నాన్నా కూడా! కానీ నా సంగతలాకాదు. నేను దర్జాగా మరోపెళ్ళి చేసుకుంటాను. నేను చెప్పినట్లుపడుండే అమ్మాయినినాకాళ్ళుకడిగి నాకిచ్చి వివాహంచేస్తారెవరయినా! తెల్సిందా! నీ బ్రతుక్కి నా బ్రతుక్కీ తేడా ఇది ఇంకా వెళ్ళు!" క్రూరంగా నవ్వుతూ అన్నాడతను.
    ఆమె నవ్వింది." నువ్వు బావిలో ఉన్న కప్ప. బయట ప్రపంచ ఎన్ని మార్పులు చెందిందీ, నీకు తెలీదు. ఈనాటి ఆడది కూడా ఇంకా మీ అమ్మమ్మల కాలంనాటి ఆడదేనన్నభ్రమలో వున్నావ్ నువ్వు! నీలాంటి నీచ స్వభావం గలవాళ్ళు గతి ముందుముందు ఏమవుతుందో నువ్వే అనుభవపూర్వకంగా తెలుసుకుంటావ్...." అనేసి బయటకు వచ్చేసిందామె.
    విడాకులు మంజూరు అయింది. హృదయం మీద నుంచీ పెద్దభారం తొంగిపోయినట్లనిపించింది హేమకు. ప్రశాంతత చేకూరింది. శాశ్వతంగా తనకు లభించింది. ఇప్పుడామెకి వేరే వ్యాపకమే లేదు. రోజులో చాలా భాగంరాసుకుంటూ కూర్చోవడమే. ఎప్పుడయినాతన పాప గుర్తుకొచ్చినప్పుడు మాత్రం మనసు గిలగిల లాడుతుంది. ఒక్కసారి పాపను చూడాలన్న కోరిక కొద్దిసేపు కదిలించివేస్తుంది పాపను తనకిమ్మని అడిగినా అతను అంగీకరిస్తాడన్ననమ్మకం లేదు.

 Previous Page Next Page