"వాడు జిత్తులమారి. వాడి ముందు నువ్వాగలేవు-" నాయుడు చందూను బాగా రెచ్చగొట్టాడు.
"ఇంక కబుర్లొద్దు బాస్....అంతా చేసి చూపిస్తాను...."
"నువ్వొక్క విషయం గుర్తుంచుకోవాలి. అన్వర్ గురించి నిన్ను హెచ్చరించాడు గోపి. అంటే అన్వర్ నీ మనిషని వాడికి తెలిసిపోయిందన్నమాట......మన విషయం వాడికెలా తెలిసింది?"
"దాందేముంది బాస్-ఆ అన్వర్ గాడు వాడితో చేతులు కలిపాడు కదా-ఫలానా చోటుకు నన్ను రమ్మంటానని వాడికి చెప్పి ఉంటాడు...."
"చందూ-అందుకే నీబలం వృధా అయిపోతుంది. నీ వాళ్ళను నువ్వు నమ్మకపోతే నీకు భవిష్యత్తుండదు. అన్వర్ తప్పేమీలేదు-ఆ గోపియే వాడినేదో ట్రిక్ చేసివుంటాడు. జరిగిందేమిటో అన్వర్ ని చెప్పనీయవలసింది నువ్వు-అనవసరంగా ఓ మంచి మనిషిని నీ తొందరపాటుతో చంపేశావు...."
"లేదు బాస్.....నేనెప్పుడూ పొరపాటు చెయ్యను...."
"అలాగే అనుకుని ఒకసారి గోపితో పోటీపడ్డావు. వాడేమో మా రక్షణలో నాలుగు రోజులు ప్రియురాలితో ప్రణయ విహారాలు చేసి చివరకు చౌదరి ముఠాలో చేరి-రెండున్నర కోట్ల సరుకును కొట్టేశాడు...." అన్నాడు నాయుడు.
"అయిందేదో అయిపోయింది. అవన్నీ ఇప్పుడు చెప్పొద్దు బాస్....."
నాయుడికి తృప్తి కలిగింది. చందూకు తగినంత ఆవేశం కలిగింది. అప్పుడతడు చందూకి ఓ చిన్న ట్రాన్సిష్టర్ వంటి వస్తువునిచ్చి - "పని పూర్తికాగానే ఆ విషయం నాకు చెప్పు. కానీ జాగ్రత్త... ఏ కారణం వల్లనో ఇంతవరకూ పని పూర్తిచేసిన వారెవ్వరూ తిరిగి నా వద్దకురాలేదు. చౌదరి చేతుల్లోనొ, పోలీసుల చేతుల్లోనే హతమై పోయారు-" అన్నాడు.
"చందూ ఈజ్ డిఫరెంట్..." అన్నాడు చందు. అతడు చిన్నగా గోపీ ఇంటికి వెళ్ళాడు. గోపీ ఇంట్లో లేడనీ శకుంతల ఇంటికి వెళ్ళాడనీ తెలిసింది. చందూ వివరాలు పట్టుకుని శకుంతల ఇంటికి వచ్చాడు. ఇంటిముందు కాపలావాడిని అవలీలగా స్పృహ తప్పించి లోపల అడుగుపెట్టాడు.
అతడప్పుడు వేటకోసం బయల్దేరిన మృగరాజులా ఉన్నాడు.
ఇంటి తలుపులు తెరిచే ఉన్నాయి.
ఒక హాలు....శకుంతల, గోపీ కూర్చుని ఉన్నారు. వాళ్ళు చందూని చూడలేదు. ఇద్దరూ ఉత్సాహంగా కబుర్లు చెప్పుకుంటున్నారు.
"నీ యింటికి బోలెడు రక్షణ ఉన్నది కదా-జమా జెట్టీల్లాంటి కాపలా వాళ్ళున్నారు కదా- నువ్వు ఒంటరిగా వాడితో ఎందుకు మాట్లాడావు?" అన్నది శకుంతల.
గోపీ నవ్వి- "హడావుడి సింహాల్ని పట్టడానికే గానీ-గుంట నక్కల కోసం కాదు గదా - అలాంటి నక్కలను ట్రిక్ చేసి ఆడుకొనడం నాకు సరదా-" అన్నాడు.
"గుంటనక్క దెబ్బ తిన్నాక - దాన్ని పంపిన సింహం ఊరుకుంటుందా?"
"ఊరుకోదు-"అంటూ చందూ లోపల ప్రవేశించాడు.
"ఎవర్నువ్వు?" అంటూ శకుంతల కంగారుగా లేచి నిలబడింది.
చందూ నవ్వుతూ- "గోపీ జింక అయితే నేను సింహాన్ని,. మనిషి అయితే మృత్యువును-" అన్నాడు.
"లోపలకు ఎలా వచ్చావు?"
"కాపలావాడికి స్పృహ తప్పించి...."
"కంగారుపడకు మిస్ శకుంతలా! మన వాడొస్తే స్పృహ తప్పి పడిపోమని నేనే కాపలావాడికి చెప్పాను-" అని- వాట్ మిస్టర్ చందూ-చిరకాల దర్శనం-" అన్నాడు గోపీ.
"నా పేరు చందూ కాదు. మృత్యువు...."
"మృత్యువుకు నేను భయపడను. ఎందుకంటే జాతకం ప్రకారం నాకింకా యాభై ఏళ్ల ఆయుష్షున్నది-" అన్నాడు గోపీ.
"అయితే నీ జాతకం ఓసారి చూడాలి-"
"ఎందుకు?"
చందూ వెటకారంగా-"నీ పెళ్ళిచేద్దామని!" అన్నాడు.
గోపీ ఆశ్చర్యంగా-"మిస్టర్ చందూ-నీకు ఈడొచ్చిన చెల్లెలున్నదని నాకెప్పుడూ చెప్పలేదే!" అన్నాడు.
"షటప్!" అంటూ చందూ గోపీని సమీపించాడు.
అప్పుడు శకుంతల మెరుపు వేగంతో గోపీ భుజంమీద ఆనుకుని చందూను నుదుటిమీద తన్నింది. చందూకు తల తిరిగినట్లయి పోయింది. అతడి చేతిలోని పిస్టల్ దూరంగా ఎక్కడో పడిపోయింది. చందూ నేల మీద పడిపోయాడు.
"ఎంతపని చేశావుశకుంతలా-ముందు కాసిని నీళ్ళు తీసుకునిరా-" అన్నాడు గోపీ. శకుంతల నీళ్ళుతేగానే అతడు పడిపోయిన చందూ ముఖం మీద చిలకరించాడు. గోపి ఎడమచేతిలో పిస్టల్ ఉన్నది.
చందూ నెమ్మదిగా కళ్ళు తెరిచాడు.
"హమ్మయ్య నా స్నేహితుడు కళ్ళుతెరిచాడు-"అని-"చందూ నేను సింహాలతో తప్ప తలపడను. నువ్వు గుంటనక్కవనుకుని ఆమె నిన్ను పడగొట్టింది. నువ్వు నా స్నేహితుడివి గదా-ఒక ఆడదాని చేతిలో భంగపడినంత మాత్రాన గుంటనక్క వెలాగౌతావు? ఆమెచేత నీకు క్షమార్పణ చెప్పిస్తాన్లే-" అన్నాడు గోపీ.
చందూ ఒకసారి బుర్ర అటూ యిటూ తిప్పి అక్కడి వాతావరణాన్ని గమనించి- "నీ సహాయానికి థాంక్స్ -" అన్నాడు.
"నీ బుద్ధి తిన్నగా ఉండాలికానీ నా సహాయం నీకెప్పుడూ ఉంటుంది-"
చందూ ఈ మాటలు వింటూనే మెరుపువేగంతో లేచి గోపీ చేతిలోని పిస్టల్ లాక్కుని రెండడుగులు వెనక్కు వేసి- "నువ్వు నిజంగానే జిత్తులమారివి. నిన్ను ప్రాణాలతో ఉండనివ్వకూడదు. ఒక్కక్షణం కూడా ఉపేక్షించకూడదు-" అంటూ అతడికి పిస్టల్ గురి పెట్టాడు.
గోపీ కంగారుగా-"చందూ!" అన్నాడు.
చందూ చేతిలోని పిస్టల్ రెండుసార్లు పేలింది. గోపీ ఛాతీలోంచి రక్తం చిమ్మింది. అతడు గిలగిలా తన్నుకుంటూ పడిపోయాడు.
చందూ గోపీని సమీపించి నాడి, శ్వాస పరీక్షించి-"హీరో పని అయిపోయింది-" అన్నాడు.
అంతవరకూ మ్రాన్పడి ఆ దృశ్యాన్ని చూస్తున్న శకుంతల-"నీ పనీ అవుతుంది. నేను నిన్ను ప్రాణాలతో వదలను-" అంటూ ముందడుగు వేసింది.
చందూ ఆమెవైపు పిస్టల్ ఝుళిపించి- "అక్కడే ఆగు..." అన్నాడు.