శకుంతల ఆగిపోయింది.
"నీవు నన్ను చంపాలనుకుంటున్నావు కదా-నేను ఆడదాన్ని చంపను. కాబట్టి తీరుబడిగా ఆలోచించుకుని నన్నెలా చంపాలో పథకం వేసుకో-దేవుడు నీ పక్షానవుంటే నీ కోరిక తీర్తుంది. ప్రస్తుతానికి నేను వచ్చినపని అయిపోయింది....." అంటూ ఆమెను పక్కనేవున్న గదిలోకి నడిపించి తలుపువేశాడు.
చందూకిప్పుడెంతో ఉత్సాహంగా వుంది. నాయుడు తన శక్తిని శంకించాడు. తను గోపీని అవలీలగా చంపేశాడు. వెంటనే ఈ విషయం బాస్ కు చెప్పాలి.
చందూ చకచకా ఆ యింట్లోంచి బయటపడి-ఒక మైదాన ప్రాంతానికి వెళ్ళి ట్రాన్స్మిటర్
తీశాడు- "బాస్-పని పూర్తయింది. నేనే స్వయంగా వాణ్ణి చంపేశాను-" అన్నాడు.
నాయుడు అతడిని రెండుమూడుప్రశ్నలు వేశాడు. గోపీ చచ్చాడన్న విషయం రూఢి కాగానే-"శభాష్!" అన్నాడు.
అంతే-పెద్ద ప్రేలుడు.....చందూ శరీరం ముక్కలు ముక్కలుగా గాలిలోకి ఎగిరిపోయింది.
ఇక్కడ శకుంతల ఇంట్లో-చందూ ఇంటిపొలిమేర దాటగానే-గోపీ చటుక్కునలేచి కూర్చుని-గదిలోని శకుంతలను బయటకు రప్పించాడు.
"నువ్వు.....నువ్వు.....చావలేదూ?" అన్నది శకుంతల ఆశ్చర్యంగా.
"అప్పుడే ఎలా చస్తాను? నాపనింకా పూర్తికాలేదు కదా-" అన్నాడు గోపీ.
"మరి-ఎలా బ్రతికావు?"
"ఆ చందూ ఉత్త వెర్రి వెధవ. వాడికింతా అంతా కనరాని బలమున్నది. తెలివితేటలూ ఉన్నాయి కానీ నాముందు చాలడంలేదు. వాణ్ణి చంపడం నాకిష్టంలేదు. ముందు ముందు దేశానికుపయోగపడతాడని నా ఆశ...." అన్నాడు గోపీ.
కానీ అప్పటికే చందూ పని అయిపోయిందని గోపీకి తెలియదు.
"కానీ-నువ్వెలా బ్రతికావు?"
"ట్రిక్....ట్రిక్......ట్రిక్....అంతే!" అన్నాడు గోపీ.
"అంటే....?"
"ఇదేట్రిక్ గతంలో ఒక్కసారి విశాలమీద ప్రయోగించాను...."
శకుంతల ఉలిక్కిపడి- "విశాల ఎవరు?" అన్నది.
"అన్నట్లు నీకు నా ప్రియురాలి పేరు చెప్పలేదు కదూ?" అన్నాడు గోపీ.
"విశాల.....విశాల...." అనుకున్నది శకుంతల.
"విశాల నీకు తెలుసా?" అన్నాడు గోపీ.
"ఏమో-ఏం చెప్పగలను? నాకూ ఓ విశాల తెలుసు. ఒకసారి నీ ప్రియురాలిని చూడొచ్చా?" అన్నది శకుంతల.
"తప్పకుండా-ఇప్పుడే రాకూడదూ?" అన్నాడు గోపీ.
శకుంతల వెంటనే ఒప్పుకున్నది. ఇద్దరూ కలిసి గోపీ ఇల్లు చేరుకున్నారు. శకుంతల విషయాలను చూడ్డానికి ఆత్రపడింది. ఆమె కోరిక తీరడానికి ఎంతోసేపు పట్టలేదు.
విశాలను చూస్తూనే- "అబ్బే-ఈమె నా విశాలకాదు...." అనుకున్నది శకుంతల. ఆమె కనులముందు తను అప్పట్లో చూసిన ఆరేళ్ళ పాప రూపం మెదుల్తున్నది.
విశాల గోపీని చూస్తూనే-"నిన్ను చూడగానే ప్రాణం లేచివస్తుంది నువ్వు బయటకు వెళ్ళావంటేచాలు-నీకేమైపోతుందోనని నాబెంగ...."అని శకుంతలను గమనించి-"ఈమె ఎవరు?" అనడిగింది.
"నా స్నేహితురాలు. పేరు శకుంతల-"
"శకుంతలా-ఈ పేరెక్కడో విన్నట్లుందే?"
"సరిగ్గా ఆమెకూడా ఇలాగే అన్నది-" అన్నాడు గోపీ ఆశ్చర్యంగా.
"ఈ ఊరు కొత్తగా వచ్చినట్లున్నావు...." అన్నది శకుంతల విశాలని.
విశాల తన గురించి చెప్పింది.
"మీది గోపాలపురమా? అంటే మీ అమ్మగారిపేరు పార్వతమ్మ కదూ?" అన్నది శకుంతల.
"అవును-నీకెలా తెలుసు?"
"చెబుతాను. ఇప్పుడు మీ అమ్మ ఎక్కడుంది?"
విశాల తల్లి వివరాలు చెప్పింది.
"అయ్యో-నీకింక అన్నలూ, అక్కలూ ఎవ్వరూ లేరా?"
"ఓ అక్క ఉండేది. అక్కను వదిలి ఒక్క క్షణంకూడా ఉండలేక పోయేదాన్ని. ఆ అక్క నదిలో ప్రమాదవశాత్తూ మునిగి చచ్చిపోయిందిట...."
"ఎవరు చెప్పారు?"
"అమ్మ....."
శకుంతల వెంటనే ఏమీ మాట్లాడలేదు. తల్లి తను చనిపోయినట్లు విశాలకు ఎందుకు చెప్పింది? తను చేసిన పనికి అసహ్యం వేసిందా-లేక....చెల్లెలికింకేం చెప్పాలో దారి తోచలేదా?
"నీ గురించికూడా చెప్పు...." అన్నది విశాల.
"నేనెవరిని చెప్పను. నన్ను నీ అక్కగా భావించు...."
"అంటే నిన్ను నేను అక్కా అని పిలవ్వచ్చా?"
"ఎందుకని?"
"అలా పిలవడం నాకెంతో ఇష్టం...."
"అయితే మీ అక్క చెల్లెళ్ళిద్దరూ కాసేపు మాట్లాడుకుంటూ ఉండండి-" అంటూ లోపలకు వెళ్ళాడు గోపీ.
శకుంతల విశాలవంక ఆప్యాయంగా చూస్తూ-"ఈరోజు ఎంత మంచిరోజు-నాకు చెల్లాయి దొరికింది!" అన్నది.
"అక్కా!" అన్నది విశాల.
"అక్కా అని అంతదూరం నుంచి పిలవకూడదు-" అన్నది శకుంతల.
విశాల ఆమెను దగ్గ్గరగా వచ్చింది. ఇదరూ ఒకరినొకరు కౌగలించుకున్నారు. కాసేపు ఇద్దరికీ మాటలు రాలేదు.
"నువ్వు అతడిని ప్రేమిస్తున్నావా?" అన్నది శకుంతల కాసేపాగి.
విశాల తల ఊపింది.
"ప్రేమిస్తే ప్రేమించావు కానీ జాగ్రత్తగా ఉండు. మగవాళ్ళను అంత సులభంగా నమ్మకూడదు...."
"గోపీ అందరు మగవాళ్ళలాంటి వాడు కాదు....."