"నువ్వు గోపీవికాదా-గోపి ఎక్కడుంటాడో తెలుసా?" ఆత్రుతగాఅడిగాడు అన్వర్.
"అన్నీ చెబుతాను. కానీ ముందు నువ్వు నేను చెప్పేవన్నీ వినాలి...."
అన్వర్ కు చిరాగ్గా ఉంది. తను తప్పు ఇంట్లో అడుగుపెట్టినట్లు అతడూహించాడు. పొరపాటెలా జరిగిందో తెలుసుకోవాలన్నా - ముందు ఇతడు చెప్పేది వినాల్సిఉంది.
"చెప్పు...." అన్నాడు అన్వర్.
"అప్పులున్నాయని నీ ప్రియురాలు వదిలిపెట్టిందా అని అడుగు.....అప్పుడు చెబుతాను-" అన్నాడు గోపీ.
మనసులో విసుక్కుంటూ అలాగే అడిగాడు అన్వర్.
"నా ప్రియురాలికి నా అప్పులగురించి బాధలేదు. తాగుడుకోసం నేనింకా అప్పులు చేస్తున్నానని బెంగ......నువ్వేచెప్పు డబ్బులేదు. ఉద్యోగం లేదు. అప్పులున్నాయి. ఈ బెంగనుంచి తప్పించుకోవాలంటే తాగుడుతప్ప ఇంకేమైనా మార్గముందా?"
అతడిలో అంగీకరించడమే మేలనుకుని-"నిజమేనని-" అన్నాడు అన్వర్.
"నువ్వేకాదు. ఈ విషయం నా ప్రియురాలూ ఒప్పుకుంది. అయినా నన్నెందుకు వదిలిందీ అని అడుగు...." అన్నాడు గోపీ.
అన్వర్ కి అడక్క తప్పలేదు.
"నేను నేరస్తుడిగా మారానని. ఎవ్వరూ నాకు అప్పులివ్వకపోతే డబ్బుకోసం నేరాలు చేయకేంచేస్తాను?...."
"అవును...."
"ఆ విషయంకూడా నా ప్రియురాలు ఒప్పుకుంది....."
గోపీ ఏదోఅనేలోగానే-"అయినా ఆమెనిన్నెందుకు వదులుకుందీ?" అనితనే అడిగేశాడు అన్వర్.
"వెరీగుడ్-నువ్వు నాకునచ్చావు-" అని మెచ్చుకుని-"నా ప్రియురాలికి నేను దొంగతనం చేశానని కోపంవచ్చింది. అప్పుడామె నాతోఅన్నది-"రమేష్ నాచుట్టూ తిరుగుతున్నాడు. నేనింక అతన్నే పెళ్ళిచేసుకుంటాను. నువ్వు చేసినపనికి వేరేదారిలేదు-"
"నీ దొంగతనానికీ రమేష్ తో పెళ్ళికీ సంబంధం ఏమిటి?"
"నేను దొంగిలించినవి ఆమెనగలే-అవి రమేష్ కొనిపెడతానన్నాడామెకు"
"ఓరిదౌర్భాగ్యుడా-" అనుకున్నాడు అన్వర్ - "నీమీదనాకు చాలాజాలిగా ఉన్నది. గోపీ ఎక్కడుంటాడో చెబితే నేను నిన్నుపొడిచి వెళ్ళిపోతాను-" అన్నాడు పైకి.
"ఇప్పుడు గోపీ తన ప్రియురాలింటికి పోతాడు....." అన్నాడు గోపీ "నేను రోజూ గోపీని తాగుడుకోసం అప్పడగడానికి వస్తాను. వాడిదగ్గర తీసుకుని-నువ్విక్కడే కాసేపుంటే నేనువచ్చి నీకు డబ్బిస్తాను......అంటాడు. ఒకోసారి గంట-ఒకోసారి రెండుగంటలూ ఒకోసారిపూట అలా కుక్కలాకాపలాకాయాల్సిందేనేను. వాడిగొప్పేంటోకానీ-నేనుండగా ఎందరోవచ్చి వాడిగురించి అడిగిపోతూంటారు. వాడెక్కడుంటాడంటే...." అని ఆలోచించి ఓ అడ్రసు చెప్పి-"తీరికూర్చుని నీ కత్తికి పనెందుకు చెబుతావు? నాకోపదిరూపాయలిచ్చావంటే- ఈకుక్కకాపలా తపించుకుంటాను-" అన్నాడు.
అన్వర్ కి ఏమనిపించిందో ఓ పదిరూపాయలనోటు తీశాడు.
"గురూ-నువ్వు దానకర్ణుడివి. నీ పేరు శాశ్వతంగా ఉండిపోతుంది. కాస్త దానిమీద సంతకంకూడా పెట్టివ్వు. బుడ్డికొట్టేదాకాముద్దుపెట్టుకుంటాను-" అన్నాడు గోపీ.
అన్వర్ తనలో తను నవ్వుకుంటూ గోపీకి తనుసంతకంపెట్టిచ్చిన పదిరూపాయలనోటు అందించాడు. గోపీవాడిఎదుటే ఆనోటును అదేపనిగా ముద్దులాడాడు. అన్వర్ నవ్వుకుంటూ అక్కన్నించి వెళ్ళిపోయాడు-గోపీ చెప్పిన అడ్రసునే మననం చేసుకుంటూ. ఆ అడ్రసు పట్టుకునేందుకు అతడికి కాసేపు పట్టింది.
అది ఒక చిన్నగది.
తలుపు తట్టేముందు అన్వర్ కాసేపు ఆలోచించాడు. ఆ గదిలోగోపి ప్రియురాలితో ఉంటాడు. అతడిని ఏకాంతంలో చంపడమే తనఅభిమతం ఏమిటిచేయడం?
బాగా ఆలోచించితలుపుతీసీ తీయగానే-ఆతీసింది పురుషుడే అయితే మరో ఆలోచనలేకుండా వెంటనే గుండెల్లో కత్తిదింపి పారిపోవడమే! తను హత్యచేస్తూండగా మరోవ్యక్తి తనను చూడడాన్ని చందూహర్షించడు.
అన్వర్ ఆగదితలుపు తట్టాడు. తలుపులు నెమ్మదిగా తెరుచుకుంటున్నాయి. తీస్తున్నది పురుషుడేనని గ్రహించాడు అన్వర్. అతడు సిద్దంగా ఉన్నాడు. తలుపులుతెరువబడేసరికి అతడిచేయి గాలిలోకి లేచింది. కానీ ఆ మనిషిని చూస్తూనే అతడిచేయి క్రిందకుదిగలేదు. ఆశ్చర్యంగా "సార్-మీరా?" అన్నాడు.
చందూ గంభీరంగా- "లోపలకు రా-" అన్నాడు.
అన్వర్ లోపలకు వచ్చాడు. చందూతలుపులు వేసిజరిగింది చెప్పాడు.
అతడిదగ్గరకు ఓ మనిషివచ్చాడు అన్వర్ పంపాడంటూ. గుర్తుగా సంతకంచేసిన పదిరూపాయలనోటు చూపి-అన్వర్ మిమ్మల్ని ఫలానా చోటుకు రమ్మంటున్నాడు. చందూఇక్కడకు వచ్చాడు. ఇక్కడహెచ్చరికగా ఓ చీటీ ఉన్నది.
"అన్వర్ ని నమ్మకు. మనస్నేహాన్ని పురస్కరించుకుని నీకు నేనీ ఉపకారంచేస్తున్నాను. వాడు నేనిచ్చే అదనపు డబ్బుకు ఆశపడి నిన్ను చంపడానికి వస్తున్నాడు-"
చందూ ఆ చీటీ చదువుకున్నాడు. తనజాగ్రత్తలో ఉన్నాడు.
"నువ్వు నా మీద కత్తి ఎత్తావు!" అన్నాడు చందూ.
"నేను చెప్పేది కూడా వినండి సార్...."
"వినను....." అన్నాడు చందూ-"దీన్ని బట్టి నాకు రెండే రెండువిషయాలు స్పష్టమవుతున్నాయి. గోపీ నిన్ను తెలివిగా ట్రిక్ చేసాడు. లేదా నువ్వే డబ్బుకు ఆశపడి నన్ను చంపాలనుకున్నావు. మొదటిది నీ అసమర్ధతను తెలియజేస్తే-రెండవది నీ నమ్మక ద్రోహాన్ని తెలియజేస్తుంది. ఏ నేరమూ క్షమించదగినది కాదు-"
అతడు మాటలు పూర్తిచేస్తూనే జేబులోంచి రివాల్వర్ తీశాడు. మరుక్షణంలో అన్వర్ రక్తపు మడుగులో నేలమీద పడిఉన్నాడు.
21
"నేను ముందే చెప్పాను. ఈ పని నీ వల్ల కాదని-" అన్నాడు నాయుడు.
"చందూ అంటే ఏమిటో నాకు తెలుస్తుంది. రెండు సార్లు వాడిని ఉపేక్షించాను. ఇక లాభంలేదు. నేనే స్వయంగా వాడి అంతు చూస్తాను."