'ఫర్వాలేదు, బాగానే చెపుతున్నావు' అన్నాడు నాగు అనేవాడు.
'నాగూ! నువ్వుండు' అన్నాడు కామేశం.
'నువ్వొక పనిచేశావు దొర. అందుకే ఇక్కడిదాకా వచ్చావు, డబ్బు చేజారిపోయింది, మనిషి చేజారిపోయాడు. కసికసిగా ఉన్నావు, కత్తిపట్టి కదనరంగానికి ఉరకాలన్న ఆవేశంలో ఉన్నావు, ఔ దొర?" కామేశం ముఖంలోకి జాగ్రత్తగా పరికించి చూస్తూ అడిగాడు అహోబిలం.
'పనవుతుందా, డబ్బు వస్తుందా? వాడు చిక్కుతాడా?' కామేశం ఆతృతగా అడిగాడు.
అహోబిలం పోలీసు బుర్ర వేగంగా పనిచేసింది. 'నీవు అనుకున్న పని కాకుండా ఎప్పుడన్నా పోయిందా దొర! ఇప్పుడే కదా! నీ టైము బాగుండలా. నాలుగురోజులు మిన్నికుండు. అన్నీ మంచిగ కలిసొస్తాయి. నీమీద ఓ మగమనిషి పాములా బుస్సుబస్సు మంటున్నడు దొరా! వాడి కస్సు బస్సు నీముందు చివరికి తుస్సు, వాడు చావాలా నీవు బాగుపడాలి....
"ఎప్పుడు ఎప్పుడు జరుగుతుందది?"
"నీకంత తొందరెక్కువ దొర. తొందరపడె ఓ పెద్ద చిక్కులో చిక్కుకున్నావు. ఇక్కడకొచ్చి అగినాతవాసం చేస్తుండవు. రెండు నెలలు మిన్నకుంటివి పో అంతా నీకు మంచే జరుగుద్ది పో. ఇంక నీకు తిరుగుండదు మరుగుండదు..."
అహోబిలం పోలీసు బుర్ర ఉపయోగించి జోస్యం చెప్పాడు.
కానిస్టేబుల్ చెప్పింది కామేశానికే కాదు అక్కడ వున్న యిద్దరికీ నచ్చింది. 'మా చెయ్యి కూడా చూసి చెప్పు" అన్నారు.
"రోజూ ఆడకూనల చేతులైతే పది చూసి చెప్పొచ్చు. మగపోతు మీసాల పోతుకయితే ఒక పోతుకే చెప్పాలి. ఇది మా ఆనకాదు కొండదేవర ఆన. కావాలంటే రేపొచ్చి చెపుతాను." అన్నాడు అహోబిలం.
"రేపు తప్పకుండా రా! అవును మీ బాస్ అదే మీ పెద్దదొర ఈయనగారు ఉలుకు పలుకు లేకుండా కూర్చున్నారేంటి!' నాగు అనేవాడు అడిగాడు?
'నా దొర ఎక్కువ మాటాడడు. యంత్రాలు కడటం మంత్రాలు వేయటం చేస్తడు. తేలు మంత్రము, పాము మంత్రం, ఎండ్రగబ్బమంత్రం, మండ్రగబ్బమంత్రము, గభేలుమంత్రము, ధబేలుమంత్రము వేస్తారు" అహోబిలం తెలివిగా చెప్పాడు.
'తేలు మంత్రము తెలుసు, పాము మంత్రము తెలుసు, గుభేలుమంత్రమేమిటి? ధబేలుమంత్రమేమిటి?"
"ఏవన్నా చూసి దడుసుచుకొని గుండె గుభేలు మంటది చూశారా! దానికి గుభేలు మంత్రం వేస్తడులటుకులటుకుమనే గుండెకాయ లటుక్కున ఆగిపోద్ది. ఎవరన్నా ధబేల్ మని ఎక్కడినుంచయినా పడి దడుచుకుని చచ్చాడే అనుకోండి, ధబేల్ మనే దడుపుమంత్రం వేస్తడు!" అహోబిలం చెప్పాడు.
వాళ్ళు ముగ్గురు
అహోబిలం మాటలు విని పడిపడి నవ్వారు. ఆ తర్వాత నీళ్ళు అడగకముందే మూడురూపాయలు ఇచ్చి రేపు రండనిచెప్పారు.
వాళ్ళ దగ్గర శలవు తీసుకుని లేపొస్తామనిచెప్పి వర్ధనరావు అహోబిలం అక్కడనుంచి బైలుదేరి వచ్చేశారు.
23
"నన్ను చూస్తుంటే నీకు ఆటలాటగా వుందా?"
"లేదు సార్!"
'పరాచికాలు ఆడుతున్నావా?'
'కాదు సార్!'
"కాదు సార్! లేదు సార్! ఇంతకుమించి నీ నోట్లోంచి మాట రాదా. ఆ వెధవలు... ఆ కుంకలు నన్నంతటి వాడిని పట్టుకుని పొగచూరు గొట్టం ముఖం. తుమ్ముల్లో ప్రొద్దు పొడిచిన ముఖం అదీ యిదీ అని తిడుతుంటే నీకు చీమ కుట్టినట్లుగా కూడా లేదా, నా పదవి ఎలాంటిది....! నేనెలాంటివాడిని....! ఆ.... నా అంతటి వాడిని పట్టుకుని....అంతేసి మాటలు అంటుంటే నీకు మా చెడ్డ ఉషారుగా వుందా!" ఇన్ స్పెక్టరు వర్ధనరావు చిందులు తొక్కుతూ అన్నాడు.
"అదికాదు సార్!" అంటూ మళ్ళీ ఏదో చెప్పబోయాడు అహోబిలం.
'అదికాదు సార్ ఇదికాదు సార్ అంటే సరిపోతుందా?'
"పోదు సార్, ముందు నన్ను మాట్లాడనివ్వండి."
'సరే మాట్లాడు.'
"మాట్లాడేముందు కొన్ని ప్రశ్నలు!"
'మళ్ళీ యిదొకటా నా ప్రాణానికి! సరే కానియ్యి." విసుక్కుంటూ అన్నాడు వర్ధనరావు.
"వాళ్ళ ముగ్గురినీ చూస్తే మీకేమనిపించింది సార్!
'పక్కా దొంగ వెధవలు....పక్కా లుచ్చా వెధవలు....పక్కా...'
'చాలు సార్! చాలు మీరు యీ విషయం ఒక్కసారితో కనిపెట్టేశారు. నాకంతే చాలు సార్, వాళ్ళ గదిలోకి చూపు సారించారా?"
'ఆ....నా రెండు కళ్ళకీ పని కల్పించి ఎక్స్ రే చూపులు సారించి....చూపులతోనే శోధించి సాధించి పారేశాను.'
'నాకు తెలుసు సార్! మీరు చూసిరమ్మంటే కాల్చిపారేసి వస్తారని తెలుసు సార్. ఇంతకీ మీరాగదిని మీ ఎక్స్ రే చూపులతో శోధించి సాధించి పారేశారు కదా ఏం కనిపెట్టారు?'
'వీళ్ళ వేష భాషలు మాటతీరు ఆ గదిలో పరిచిన పేక ముక్కలు ఖాళీగా వున్న విస్కీ వగైరాలు చూస్తుంటే పక్కా రౌడీ నా కొడుకుల్లాగా వున్నారు. వీళ్లు అంతర్జాతీయ దొంగల ముఠాలోని చిల్లర దొంగల్లా వున్నారు. వీళ్ళకి భక్తేమిటి! వీళ్ళ బొంద. నిజంగా అమ్మవారి దర్శనానికి వచ్చినవాళ్ళు అయితే భక్తి శ్రద్ధలతో తగలడాల్సింది పోయి పేకాడుతూ మందుకొడుతూ ఇక్కడ వాళ్ళకి పనేమిటి?" ఆవేశంగా అన్నాడు వర్ధనరావు.
"వచ్చారు సార్! అసలు పాయింటుకి వచ్చారు. మీరు వీరాభిమన్యుడు లాంటివారు సార్! ఆవేశంగా ముందుకు దూసుకెళ్ళటమే గాని వెనుతిరిగి చూసుకోరు. వాళ్లు నిజంగా దొంగ వెధవలు ఆ విషయం మీరూ గ్రహించారు, నేనూ గ్రహించాను. ఆ వెధవలు ఎలాంటివాళ్లో పూర్తిగా తెలుసుకోకుండా మనం ముందుకు దూకి అరెస్ట్ చేశామే అనుకోండి వాళ్ళసలు యీ వూరు ఎందుకు వచ్చింది, ఏం చేద్దామనుకుంటున్నది....